ఈ బ్లాగును శోధించు

ఆదివారం, జూన్ 19, 2011

తండ్రీ! నీకు ఒక్క దినమేనా? నీకో దణ్ణం!


అమ్మను తలచుకోడానికి ఓ సందర్భం అంటూ అఖ్ఖర్లేదు. అది ఒక సహజమయిన, స్వాభావికమయిన ప్రవర్తనలో భాగం. సంతోషంలో(అమ్మో! ఎంత బాందో!) దుఃఖంలో(అమ్మోయ్!)—నొప్పిలో –( అమ్మో!)- భయంలో (అమ్మ బాబోయ్- ఇక్కడ నాన్న జత కలిశాడు) ఆశ్చర్యంలో (అమ్మోయ్) ఊరడింపులో (హమ్మయ్య- ఇక్కడ కూడా మళ్లి నాన్న)—ఇలా పుట్టినప్పటినుండి, ఊపిరి పిల్చుకున్నంత సహజంగానే  అమ్మను తలబోసుకుంటాం. పశు పక్ష్యాదులలో కూడా ఇదే గమనించవచ్చు.
నాన్నల సంగతి వేరు. ఊహ వచ్చాక పిల్లలకు నాన్న తలంపు పెరుగుతూ వస్తుంది.ముఖ్యంగా మన పితృస్వామ్య వ్యవస్థలో – పిల్లలకు నాన్నతో సాన్నిహిత్యం ఒక అవకాశంగా, ఒకింత గర్వంగా,హోదాగా, కొండొకచో అవసరార్ధంగా ఉంటుంది.ఇప్పటి పిల్లలు బాల్యం  దాటుతున్నప్పటి దశ నుండి, వాళ్ళ సాన్నిహిత్యం అమ్మనుండి నాన్నవైపుకు మళ్ళుతూ ఉండడంలోని ఆంతర్యం-- పై కారణాల వల్లే కావచ్చు. అమ్మ అయితే ఇంటిలో తనకు చాతనయినదే, చేసిపెట్టినదే  పిల్లలకు తిండి, అదే నాన్నయితే బయట కొత్త రకాలు, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులు వగైరా—తరువాత ఆట వస్తువులు, చదువులు, సినిమాలు వగైరా కోర్కెల చిట్టా నాన్నతోనే తీరడం ఈ ధోరణికి కారణం. అయితే నాన్నల-పిల్లల మధ్య స్నేహభావం పెరగుతుండడం ఈ సందర్భంగా గుర్తించాల్సిన మంచి పరిణామం. నాన్నలు ఇవేవీ పట్టించుకోని సంసారాల్లో తల్లులే ఈ ముచ్చట్లన్నీ  తీర్చే సందర్భాలూ పెరుగుతున్నాయనుకోండి. అది వేరే సంగతి.
మా నాన్నయితే మాకు ఊహ వచ్చినప్పటినుండి ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండే వారు.” తనకు ‘దినం’ చెయ్యొద్దని. ‘తద్దినం’ (అంటే ‘ఆ’ దినం లేదా మరణించిన రోజు అని అర్ధం) పెట్టొద్దని” నిష్కర్షగా చెప్పేవారు. బతికుండగా అమ్మా నాన్నలకు ముద్దపెట్టని సంతానం - చచ్చాక పేపర్లలో పెద్ద ప్రకటనలిచ్చి, పంతుళ్ళకి పొత్తర్లిచ్చి, ఘనంగా భోజనాలెట్టి, హంగామా చేసే వాళ్ళను చూస్తున్నామని—అదే సమయంలో-- కొన ఊపిరి ఉండగానే అమ్మనో/అబ్బనో  స్మశానానికి తరలిస్తుంటే ఇరుగు పోరుగులకో, కాటి కాపర్లకో దొరికిపోయిన సంతానం గురించి అవే పేపర్లలో వచ్చిన వార్తల్ని గురించి  చెప్పేవారు. అందుకే ఈ ‘దినాలు’ తతంగం వద్దని అంటుండేవారు. కాని మాకు అంత దమ్ము ధైర్యం లేక కొంచెం జరిపి, కొంచెం జరపక ‘దినాలు’ వెళ్ళబుచ్చుతూ ఉన్నాం.

నాన్న చెయ్యి పట్టుకొని ఊర్లోకి వెళుతున్నప్పుడు,  సైకిలుపై ముందు కడ్డికి మెత్తదనం కోసం  తువ్వాలు చుట్టి కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళినప్పుడు, తిరునాళ్ళలో నాకై నేనే కొనుక్కోడానికి చిల్లర డబ్బులిచ్చినప్పుడు--  నాలో తొణికిసలాడిన ఆ గర్వం ఇప్పటికీ కాలరెత్తుకునే ఉంది, ఎటొచ్చీ కళ్ళు నీటి పొరతో మసకలేస్తున్నాయి. నాన్న భుజాలకెక్కి లోకాన్ని  చూడ్డం లో దొరికిన రంగుల దృశ్యం—మళ్లి-- పిల్లలు చెయ్యి పట్టుకొని మాకు ఇష్టమయిన  ప్రదేశాలు చూపిస్తూ తిప్పుతున్నప్పుడు- ఇదిగో- ఇప్పుడు – మళ్లి – అదే రంగుల ఇంద్రధనస్సు దృశ్యం గోచరిస్తోంది. కాని, ఎటొచ్చీ కాస్త మసక వచ్చింది.

ఈ ‘నాన్నదినం’ సందర్భానికి గుర్తొచ్చిన/ గుర్తుగా జాగ్రత్త చేసుకున్న  ఒక కవి(చిన వీరభద్రుడు అనుకుంటాను) భావన ఇదిగో---

నాన్న వున్నప్పుడు నా బాల్యం బంతిపూల రథం
పార్కులో జారుడు బల్లపై

జారిపోవడం రోళ్ళు పగిలే రోహిణీ కార్తెలో

అమ్మ చేతుల అరటి ఆకుల్లో నిద్రించిన పసితనం

రావిచెట్టు ఉయ్యాల ఊపుల్లో నేను విన్న రాజకుమారుల ముచ్చట్లు

ఉప్పుమూట లా నాన్న మూపున వేలాడిన బాల్యం
తామర పూల చెరువులో ఈత నేర్చిన సంబరం

వయసును మరిపించే పసితనం మళ్ళీ గుర్తొస్తుంది

బాల్యమంటేనే నాన్న వున్నతనం కదా అనిపిస్తుంది

గంగిరెద్దు మేళం ఆడించిన ఆటలు

వాన వెలిసిన చినుకుల్లో కాగితం పడవల షికార్లు

నాన్న పక్కన నిలబడ్డ క్షణం ఎవరెస్టును ఎక్కినట్టుంది

చివరిసారిగా గట్టిగా పట్టుకున్న నాన్న చేతి బిగువుని భరిస్తూ

అంతకంటే ఎక్కువైన స్వేచ్ఛ కోల్పోయిన గుండెపగులుని మోస్తూ

దారివెంట పోతున్న కుక్క పిల్లను మురిపిస్తూ

మొదటిసారి స్కూల్లో అడుగెట్టిన గుర్తు వుంది

చదువులో వెనకపడినప్పుడు నా భుజాన్ని చుట్టిన చేయూత

ఉద్యోగానికి ఊరు దాటుతున్నప్పుడు
వీపు నిమిరిన ఆర్ద్రత
గుండె గొంతుకలో నానుతుంది

అమ్మాఅన్నమాటకు
కన్నా నేనున్నా అన్న జాడే లేదు

మొన్న మాట్లాడిందే మాట

నేడది గుండెలో తడిసి బరువైన మూట

తలుచుకుంటే చాలు

కళ్ళనిండా నీళ్ళు కన్న తండ్రికి ఆనవాళ్ళూ
(నాన్న నిత్యం గుర్తొస్తారు 'ఫాదర్స్ డే' ఒక సందర్భం మాత్రమే)
రాజా.

8 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

మీలోని ఉదాత్త భావాలకు అనుగుణంగా ఈ వ్యాసానికి శీర్షికను నిర్ణయించండి.

BANGaRAM చెప్పారు...

Nice post sir..... & i know father's day was yesterday. but today a small clash between me and my dad because of yesterday (daring) activities so..... అలా రాయలనిపించింది.

జ్యోతిర్మయి ప్రభాకర్ చెప్పారు...

baaga cheppaarandi!

కొత్త పాళీ చెప్పారు...

well said

naresh kumar చెప్పారు...

కళ్ళనిండా నీళ్ళు కన్న తండ్రికి ఆనవాళ్ళూ entha njam....! sir

రసజ్ఞ చెప్పారు...

చాలా చక్కగా చెప్పారు!

అజ్ఞాత చెప్పారు...

మీసాలు పెంచుకుని, "మగ" తనాన్ని చాటుకుంటూ, మీరు పితృ స్వామ్య వ్యవస్థ గురించి ప్రస్థావిస్తూ వుంటే, ఆశ్చర్యంగా వుంది.
నాన్న గురించి మాట్టాడాలంటే, అమ్మతో పోల్చి తీర వలసిందేనా? ప్రకృతికి సంబంధించిన విషయాలకీ, సమాజానికి సంబంధించిన విషయాలకీ తేడా తెలుసుకోనక్కర్లేదా?
అయినా, తండ్రితో కలిసి వున్న సందర్భాల్లో ఈ అర్థం పర్థం లేని "గర్వం" ఎందుకు? ఏ ముక్క దొరికితే, ఆ ముక్క వేరే ఆలోచన లేకుండా రాసెయ్యడమేనా?
ఈ పై వాక్యాల నించీ ఏమన్నా నేర్చుకోవాలనిపిస్తే, నేర్చుకోండి. లేదా తిట్టుకోండి, లేదా చెత్త బుట్టలో పారెయ్యండి.

G K S Raja చెప్పారు...

అజ్ఞాత గారూ! శ్రద్ధగా మీరిచ్చిన సూచనలకు సంతోషం. మాతృస్వామ్యం గురించి మాట్లాడ్డానికి జడలు, పితృస్వామ్యం గురించి మాట్లాడడానికి మీసాలు వగైరా కావాలని గాని, అడ్డం అనిగానీ, అమ్మ-నాన్న భావనకు ఉన్న సామీప్యం, పోలికకు సరిపోదని గానీ, ప్రకృతి నుండి సమాజాన్ని విడగొట్టేసి చూడడం గానీ --- మీరు చెప్పేవరకూ తోచలేదు సుమండీ! లేని అమ్మ గుర్తొస్తే కళ్ళు చెమ్మగిల్లడం, బాల్యంలో నాన్నతో గడిపిన రోజులు గుర్తొస్తే ఒకింత గర్వం కలగడం సహజంగానే కలుగుతాయి నాకు, దానికి వ్యవస్థలు, ఇజాలు –నాకు తెలియవు. ఇక ‘ఏది పడితే అది వ్రాసేయడమేనా’ అంటే మరి--- ఏదో మా పెరట్లో వేసుకొనే మొక్కలు మా ఇష్టమే కదండీ! మీ దొడ్లో జొరబడినప్పుడే కాస్త వెనక ముందు ఆలోచిస్తాం. వళ్ళు దగ్గర పెట్టుకుంటాం. అయినా మా అలాంటి వాళ్ళ అజ్ఞానపు చీకట్లు తొలగించే కార్యక్రమం పెట్టుకున్న మీలాంటి మేధావులు అజ్ఞాతంలో ఉంటే ఎలాగ చెప్పండి. ధన్యవాదాలు.