తెలుగు సంగతులు

సోమవారం, జూన్ 25, 2012

పరాయి పాలన నాడు-నేడు


                         పరాయి పాలన, నాడు-నేడు

పాలక, పాలిత వర్గాల మధ్య ఘర్షణను చిత్రీకరించిన రచనలు 20 వ శతాబ్ది తొలి అర్ధ భాగంలో చాలా వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ‘దొర’తనాన్ని కళ్ళకు గట్టే, వాటిని ఎదుర్కోవడంలో సామాన్యుల తెగింపు గురించిన  రచనలు, అదే సమయంలో నిజాం నిరంకుశ పాలనపై వెలువడిన కధలు, గేయాలు, నవలలు వగైరా సాహిత్యం చాలానే ఉంది. ఆ సమయంలోనే – 1937-38 కాలంనాటి తెలంగాణ పరిస్థితుల్ని ఒక పల్లెటూరి నేపధ్యంలో వాస్తవాలకు దగ్గరగా చిత్రీకరించిన నవల శ్రీ దాశరధి రంగాచార్యా గారి ‘చిల్లర దేవుళ్ళు’. ఈ రచయిత--- ఎన్నో సినీ గీతాల, మాటల రచనలు చేసిన సుప్రసిద్ధ కవి శ్రీ దాశరధి కృష్ణమాచార్యులవారికి సోదరుడు, వరంగల్లు జిల్లాకు చెందిన వారు.

‘చిల్లర దేవుళ్ళు’ నవల ఆసాంతం అప్పటి తెలంగాణ పల్లెలలో జరుగుతున్న దారుణమైన దోపిడీని, కుల/వర్ణ వ్యవస్థని అద్దం పట్టినట్టు చిత్రీకరించడం జరిగింది. తెలంగాణ మాండలీకంతో బాటు, అప్పటి నిజాం పాలనా ప్రభావం వల్ల తెలుగులో, తెలంగాణంలో జొరబడిన ‘ఉర్దూ’ వాడుకను యధాతధంగా ఆయా పాత్రలతో పలికించారు. ఉర్దూ పదాలకు మాత్రం కింది ఫుట్ నోట్స్ లో అర్ధాలు ఇచ్చారు. అక్కడక్కడా కధనంలో తెలంగాణా మాండలీకం ఇతర ప్రాంత పాఠకులకు కొంచెం అడ్డు తగిలినట్టనిపించినా, కధాగమనంలోని నిజాయితీ వల్ల, వాస్తవ చిత్రీకరణ వల్ల కొంతసేపటికి పూర్తిగా కధలోని జీవితాలలోకి ప్రవేశించేస్తాము. ఇక భాష అడ్డు రాదు.
అప్పటి తెలంగాణాలోని పరిస్థితులపై, ముఖ్యంగా--- కుల వ్యవస్థపై, వెట్టి చాకిరిపై, దొరతనపు దౌర్జన్యాలపై, స్త్రీల అణచివేతపై, గ్రామపెద్దల (పటేల్ పట్వారీ వ్యవస్థ) కుయుక్తులు—భూఆక్రమణలపై, నిజాం నిరంకుశత్వంపై, బలవంతపు మతమార్పిళ్ళపై ఎక్కుపెట్టిన అస్త్రం దాశరధి రంగాచార్య గారి ‘చిల్లర దేవుళ్ళు’.  అంతేకాకుండా తెలంగాణాలోని అప్పటి ఆర్ధిక, సామాజిక స్థితిగతులతో బాటు ఆనాటి రాజకీయ వ్యవస్థని కూడా మనకు కళ్ళకు కట్టింది ఈ నవల. నవలాప్రక్రియలో భాగంగానే పాత్రలు కల్పితాలే అయినా, వాటి స్వభావం వాస్తవానికి దగ్గరగా ఉండడం, అప్పటి యదార్ధ రాజకీయ సంఘటనల్ని, వ్యక్తుల్ని పాత్రలుగా చేర్చడం ద్వారా ‘చిల్లర దేవుళ్ళు’ చారిత్రక నవల స్థాయిని పొందింది.
అయినప్పటికీ నవల సౌందర్యం కోసమో, లేదా రచనా సరళి అదేనేమో గాని, సాధారణ నవలల్లో కనిపించే వర్ణనలు, ముఖ్యంగా నాయకీ నాయకుల ప్రేమ వ్యవహారాల్లో ఊహల్లో తేలడాలు, నాయకుని పట్ల చాలామంది యువతులు ఆకర్షితులవ్వడం, తీరా అతని నుంచి సానుకూల స్పందన కనిపించకపోయేసరికి – ఆకస్మాత్తుగా సోదర ప్రేమగా పరిణతి చెందిపోవడం వగైరా విషయ చిత్రీకరణలో సాధారణ నవలా ప్రక్రియ చట్రాన్ని అధిగమించలేకపోయారు రచయిత. ముఖ్యంగా కధాంతంలో – అప్పటి వరకూ ‘పంతులు’ గా వున్న పాణి (నాయకుడు), రెడ్డి గారి పుత్రిక ‘మంజరి’ని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి — కధలో గొప్ప మలుపు తిప్పేసి, నాటకీయ లేదా సినిమా ఫక్కీలో నాయకుడు చిన్నప్పుడు తప్పిపోయిన బావ వరుసవాడేనని ముఖ్యంగా ‘రెడ్డే’ నని తేల్చి వర్ణ సంకరం జరక్కుండా జాగ్రత్త పడిపోయినట్టు అనిపిస్తుంది రచయిత ఊహ. లేదా వర్ణాంతర వివాహం అప్పట్లో అసాధ్యం అనుకొని ఎందుకు ఎదురీత అని సరిపెట్టారో తెలియదు గాని, నవలలోని అభ్యుదయ భావాలకు ఇది కొంత అవరోధంగా కనబడుతుంది. మొత్తం మీద కధనం అంతా ‘గడీ’ (కోట లాంటి దొరల నివాసం)లోనూ, వారి వాకిళ్ళ లోనూ అధిక భాగం జరగడం వల్ల, పీడిత జనాల గుడిసెల్లోకి అంతగా చూసినట్లు కనపడదు. కానీ ముఖ్య పాత్రధారి ‘పాణి’ అప్పటి చారిత్రిక పురుషులు మాడపాటి హనుమంతరావు వంటి స్వాతంత్ర సమర యోధులతో చర్చలు జరపడం, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు, ఆంధ్రమహా సభల నిర్వహణ మొదలైన విషయాల్ని ప్రస్తావించడం ద్వారా నవలకు చారిత్రిక లక్షణం అబ్బింది. ‘మెలోడ్రామా’ కి సంబంధించిన కొద్దిపాటి ఘటనలూ మినహా, మొత్తం మీద ‘చిల్లర దేవుళ్ళు’ చదవదగ్గ పుస్తకం.  స్వాతంత్రానికి పూర్వపు తెలంగాణ ముఖ చిత్రాన్ని అతి దగ్గరగా చూసే అవకాశం పాఠకులకు దొరుకుతుంది. అప్పటికీ, ఇప్పటికీ ఆలోచింపచేసే, మేలుకొలిపే ఉన్నత రచన ‘చిల్లర దేవుళ్ళు’. సాహిత్య అకాడమి అవార్డు, హిందీ, ఇంగ్లిషు భాషల్లోకి అనువాదంగా వెళ్లడం, ఆకాశవాణిలో రేడియో నాటకంగా ప్రసారం, దరిమిలా సినిమాగా నిర్మించడం – ఈ నవలకు అవార్డులు, రివార్డులుగా పరిగణించవచ్చు. అనేక పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకం. విశాలాంధ్ర ప్రచురణ.
ఇంతటితో ఈ సమీక్ష అయిపొయింది కానీ, కాకతాళీయంగా వెనువెంటనే చదివిన మరో పుస్తకం గురించిన వ్యాఖ్య కూడా జమిలిగా ఇక్కడే వ్రాస్తే సరిగా ఉంటుందని భావించాను. ‘చిల్లర దేవుళ్ళు’ రచనా కాలం నాటి నుండి-- ఆరు దశాబ్దాల తరువాత కధల రూపంలో వచ్చిన ‘న్యూ బాంబే టైలర్స్’ మహమ్మద్ ఖదీర్ బాబు కలం నుండి ఒలికిన జీవిత చిత్రాలు. 
 ఈ రెండు పుస్తకాలకు పొంతన లేకపోయినా ఏదో తెలియని లింకు ఉందనిపించే వైచిత్రి. అప్పటి నిజాం పాలనలో నిరంకుశంగా జరిగిన మత మార్పిళ్ళు గురించి విడమర్చిన ఉన్నతవర్గానికి చెందిన రచయిత రంగాచార్య గారయితే, అరవయ్యేళ్ళ తరువాత ముస్లిముల దీనావస్థను వ్యధాభరితంగా చిత్రించిన నేటి మైనారిటీ వర్గానికి చెందిన రచయిత ఖదీర్ బాబు. ఈ రెంటిలోనూ ఉన్న సారూప్యాలు వాస్తవ జీవిత చిత్రీకరణ, అణచివేత.  అయితే అణచివేత విషయంలో వర్గాలు మారినా, పాలక – పీడిత చరిత్ర మెజారిటీ, మైనారిటీ లకు అతీతమయినదని గ్రహించాలి. ‘చిల్లర దేవుళ్ళు’ తెలంగాణ (వరంగల్లు) నేపధ్యం లోనిదయితే, ‘న్యూ బాంబే టైలర్స్’ చిన్న పట్టణం లోని చిన్న మధ్య తరగతి జనుల మధ్య నడుస్తాయి. కావలి పట్టణం దానికి నేపధ్యం.
స్వాతంత్రానికి పూర్వం తెల్ల దొరల దౌష్ట్యం, అంతకు మించి గ్రామాల్లో దొరల, భూస్వాముల దౌర్జన్యాలు ‘చిల్లర దేవుళ్ళు’ కళ్ళకు గడితే, స్వాతంత్రానంతరం నల్ల దొరల దాష్టీకం, మత విద్వేషాలు, పరోక్షంగా పరాయి శక్తుల పాలన, గ్రామాల్లో చేతివృత్తుల, చిన్నకారు బతుకుల ఛిద్ర పటాన్ని’న్యూ బాంబే టైలర్స్’ ఆవిష్కరించింది. 
ఖదీర్ బాబు కధావిధానం, అతిశయోక్తులు లేని సరళత, గుండెల్ని తాకే మధ్య చిన్న తరగతి బతుకుల చిత్రీకరణ ఆయన అన్ని రచనల్లో లాగానే సహజంగా ఉన్నాయి. ‘గుడ్డలంటే కొలతలు బట్టి కుట్టడం కాదు, మనిషిని బట్టి కుట్టడం’ అనే పీరుభాయికి, పోరడు, వాళ్ళ నాయన, తాత కూడ ఒకే చొక్కాలో దూరగలిగే ‘లూజు’ ఫిట్టింగు రెడీమేడ్ గుత్తందారీ కుట్ర బాగానే అవగాహనకు  వచ్చింది. నైపుణ్యం, పని కౌశల్యం  స్థానం లో కేవలం లాభం, పెట్టుబడి చొరబడ్డాయని, అవి సామ్రాజ్యవాదులు, పెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థల కబంధ హస్తాల్లోనే ఉన్నాయని, స్వతంత్రం, ప్రజాస్వామ్యం బూటకం గానే మిగిలిపోతున్నాయని, గౌరవమయిన కులవృత్తులు చేసుకొనేవారు రోజువారీ కూలీలుగా బతుకు బానిసలుగా మారిపోవలసి వచ్చిందని పీరూభాయికి బోధపడినా పౌరుషం చంపుకోలేక తన పాత టైలరు దుకాణానికే రంగులేసి మళ్ళి తెరవడం అతని వ్యక్తిత్వాన్ని చాటి చెబుతాయి. అదే దోవలో, ‘పెండెం సోడా సెంటరు’ కధ కూడ నడుస్తుంది. విదేశీ పానీయాల ధాటికి, వాటి రంగు రంగుల వ్యాపార ప్రకటనల జోరుకి ఆరోగ్యమయినవి, చౌకయినవి అయిన మన పానీయాలు, సోడాలు వెల వెల పోతూంటే--పెండెం చంద్రయ్య ముందు నీరు కారిపోయినా, స్వాతంత్ర పోరాటం నాటి స్ఫూర్తి అతనిని, అతని మనో ధైర్యాన్ని దెబ్బ తీయలేకపోయాయి. అందుకు మూల్యంగా తన తరువాతి తరం (కొడుకు) కూడా బలి అయిన సంగతి మనసుల్ని కలచివేస్తుంది. మిగతా కధలలో ఎక్కువ ముస్లిముల వ్యధలు కనబడతాయి. మూఢసంప్రదాయాలు, ఆర్భాటాలు మధ్యతరగతి బతుకుల్ని అప్పుల ఊబిలోకి ఎలా దించి, కుదించి, కృశింప చేస్తాయో విశదమవుతుంది.
ఇన్నీ చదివాక ఖచ్చితంగా అనిపించే, అగుపించే విషయం — అవును, మనం నిజంగా పరాయి పాలననుండి విముక్తి పొందామా? లేదా నల్లదొరల మధ్యవర్తిత్వంతో, దళారి తనంతో ఇప్పటికీ అస్వతంత్రులుగానే ఉన్నామా? అనిపిస్తుంది. నిజమే మరి! మనం కట్టిన పన్నులతో భారీగా దశాబ్దాల పాటు చేసిన పరిశోధన, పరిశ్రమ అంతా విదేశీ పెట్టుబడుల పేరుతో ప్రయివేటుపరం కావడం తరువాతి పరిణామంగా మన సహజ వనరులే మనకి గాని, మనం ఎన్నుకున్నామనుకుంటున్న, కుంటుతూన్న ఈ ప్రభత్వం అజమాయిషీలో లేకపోవడం ఇప్పటి చేదు నిజం. ఉదాహరణగా – ఒ ఎన్ జి సి వేల కోట్ల ఖర్చుతో చేసిన పరిశోధన, సహజ వాయు నిక్షేపాల గుర్తింపు – ఒక్క సారిగా రిలయన్సు లాంటి వడ్డీ వ్యాపారస్తుల చేతికి అప్పచెప్పి సహజ వాయువు లభ్యత ఎంతో కూడా తెలుసుకోలేని దీనావస్థ మన ప్రభుతది. కొనసాగింపుగా ఆ బావుల్లో 26 శాతం వాటాను ‘బ్రిటీషు పెట్రోలియం’ సంస్థకు రిలయన్సు లాభాలకు అమ్ముకోవడం—దేనికీ సూచన. మనం ఎవరి అదుపులో, ఆధిపత్యంలో ఉన్నాం.          
       

బుధవారం, ఫిబ్రవరి 15, 2012


బంధువులు
“అయ్యా! నమస్కారం! దయచేయ్యండి. హేవిటో--- మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మానందింప జేయ.... అంటూ శుభలేఖల్లో బంధువులందరికీ రాసుకుపోతాంగాని కొందర్నిజూస్తేఒళ్ళు చిర్రెత్తిపోదూ?” అన్నాడు అవధాని.
అదేం ముక్క, నన్నడిగితే పనికిమాలిన బంధువు,బాధ పెట్టే బంధువు అంటూ ఎవ్వడు లేడు.కొందరు వచ్చి ఆనందపెడతారు, మరికొందరు వెళ్లి ఆనందపెడతారు. అందరున్ను ఆనందపెట్టేవారే”! అన్నారు శాస్త్రులవారు.
ప్రేమికుల ‘దినం’
మేము హైస్కూల్ లో చదువుకునేటప్పుడు మా సోషల్ మాష్టారు పిల్లల్ని కొట్టేవారు కాదుగాని, ఆయనకు వ్యంగంగా తిట్టి, వెక్కిరించి దురద తీర్చుకునే అలవాటు ఉంది. క్లాసు జరుగుతుండగా బంట్రోతు తెచ్చిన నోటీసు చదువుతూ “ఒరేయ్! రేపు మీ ‘దినం’ అటరా. స్కూలుకు సెలవు” అన్నారు. మర్నాడు నవంబరు 14, పిల్లల దినోత్సవం, చాచా నెహ్రూ పుట్టిన రోజు.ఉదయంపూట కొన్ని కార్యక్రమాలు, చాక్లెట్లు, తరువాత ఆటవిడుపు అది మా సెలవు. వెంటనే వెనక బెంచిలోంచి మాలో చురుకైన గడుగ్గాయి “అవును మాష్టారూ! మీ ‘దినం’ ఎప్పుడో అయిపోయింది. ఇంకా మాదే మిగిలి ఉంది” అన్నాడు. అప్పటికి రెండు నెలల ముందే ఉపాధ్యాయుల ‘దినం’, డా:సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం, సెప్టెంబరు 5న అయ్యింది. దెబ్బకు మా సోషల్ మాష్టారు నోరు తెరచి, వెంటనే తేరుకొని, కాస్త మెత్తగా మందలిస్తూ వాడి సమయస్ఫూర్తికి మెచ్చుకున్నారు.
‘దినము’ అంటే రోజు అనే కదా! గతంలో (ఇప్పుడు కూడా అనుకోండి) చావు సందర్బ్హంలో జరిపే తంతును ‘దినం’ అనేవారు. “వాడికి దినం పెట్టేస్తా”! అనో, వాడికి ‘దినాలు’ దగ్గర పడ్డాయనో అనడం ద్వారా అక్కసు వెళ్ళగక్కడం, శాపనార్ధాలు పెట్టడం వగైరా భావవ్యక్తీకరణలు చేసేవారు. ఇప్పటికీ ఎవరైనా చనిపోయిన ఇంట్లోవాళ్ళు వ్యవహారాలను వాయిదా వేస్తూ ‘దినాలు” వెళ్లిపోనీయండి, మాట్లాడుకుందాం అంటుంటారు.
  ఇంతకీ ఈ దినాల గోల ఏంటంటారా? మరో రెండు రోజుల్లో ప్రేమికుల ‘దినం’ వస్తోంది కదా! ప్రేమ పేరుతో పార్కులు, రిసార్టులు, నెక్లెస్ రోడ్డు, నగరశివార్లలోని దాబాలు-- ఒక్కటేమిటి, కాస్తంత చాటు, మరింత మాటు దొరికిన ప్రదేశాలన్నీ వింత పోకడలతో నిండిపోతాయి. అదేదో ఉద్ధరించే సమాజం వాళ్ళు, పోలీసులు, హిజ్రాలు ఈ ప్రేమికులకు కంట్లో నలుసుల్లా, కౌగిలింతల మధ్య గుచ్చుకొనే డ్రెస్సుల తాలూకు వర్కుల ఫెళ ఫెళ తళుకుల ములుకుల్లాగా తగులుకుంటారు. ప్రేమ వ్యక్తపరచడానికి కావాల్సిన సామాగ్రి అమ్మకాలే ఇక్కడ అసలు విషయం. గ్రీటింగు కార్డులు, గులాబీలు, రకరకాల బహుమతులు –ఇంకా కండోమ్స్ వగైరా వాటికి గిరాకి ఎంతో లెక్కించడం కష్టం. అదంతా పెద్ద వాణిజ్య ‘వల’యం. నిజంగానే ఇది ప్రేమకు’దినం’.
ప్రేమ ఈ దినమే పుడుతుందా? పుట్టిన ప్రేమ పరాకాష్టకు చేరుకొనే దినమా? ప్రేమికుల రోజును పాటించడం, ‘కలుసు’కోవడం, కానుకలు ఇచ్చుకోవడం,షికార్లు వగైరా లే ప్రేమకు చిహ్నాలా?నిర్దారణలా? మరింత వింతగోలిపే విషయం—ఈ రోజుల్లో ప్రేమ వ్యక్తపరచాలంటే ఇంగ్లీషులో మూడు ముక్కలు కక్కాల్సిందే!! అలా చెప్పలేకపోతే, చెప్పక పొతే  ఇక ప్రేమ లేనట్టేనట!!! అదే “ఐ లవ్యూ”!
కొందరు అత్యాధునిక (అల్ట్రా మాడర్న్) యువ ప్రేమ దంపతులయితే చీటికి మాటికి  ఆ పదాలు బాగా వాడుతుంటారు. “డార్లింగ్’ షాపింగ్ అయిపోయిందా? నాకు ఆ కారు అవసరం లేదు-‘మై స్వీట్ హార్ట్’ .. కారునీ, డ్రైవర్ని నువ్వే ఉంచేసుకో! డిన్నర్ కి రాను ‘డియర్’! నాకోసం ఎదురు చూడకు ‘హనీ’! ఐ లవ్యూ డార్లింగ్”! ఇలాంటి దీర్ఘాలు, గారాలతో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నప్పుడే ఈ ఇంగ్లిషు ప్రేమలు అర్ధమవుతాయనుకుంటాను. కాని మనకు మాత్రం లొసుగులు, వాటికి పూచే రోల్డుగోల్డు పూతలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అదేవిటో మన ఖర్మ! అయ్యో సోదిలో పడిపోయాను--- ప్రేమికుల ‘దినం’ వచ్చేస్తోంది—దర్భలు సిద్ధం చెయ్యండి.   రాజా.
మాటకచేరి
ఈనాడులోను,ఆంధ్రభూమి లోను ‘పుణ్యభూమి’ గాను తరువాత ఉదయం దినపత్రికలో ‘మాటకచేరి’గాను వారంవారం వ్యాసాలు వ్రాసి సమకాలీన రాజకీయాలను వ్యంగ్యంగా ఏకేసిన గజ్జెల మల్లారెడ్డి గారి ‘మాటకచేరి’ పేరుతోనే సంకలనంగా 1991 లో తెచ్చి మనల్ని మళ్ళి మళ్ళి మేలుకోలుపుతూ తరింపచేసారు నిశాంత్ పబ్లికేషన్ వారు. విశాలాంధ్ర వంటి అన్ని పుస్తక కేంద్రాలలోను దొరుకుతుంది. ఎప్పటికి నిత్యనూతనమనిపించే, అన్నికాలాలకు అతుక్కున్నట్టుండే ఒక మచ్చు తునక---
బురద గంధం లాగ పూసుకుంటాం మేము
సిగపట్ల మెడపట్ల చెలరేగుతాం మేము
పత్రకలు మా గూర్చి ప్రశ్నించగారాదు
సినిమాలు తెరమీద చిత్రించగా రాదు.

గురువారం, డిసెంబర్ 29, 2011

బద్ధకపు అభివృద్ది-మధ్యతరగతి బుద్ధి.





ఆయనెవరో కోట్ చేసినట్టు “అభివృద్ధికి నిర్వచనం మరింత బద్ధకంతో ఎక్కువ కార్యాల్నీ, సౌకర్యాల్నీ సమకూర్చుకోవడం”.  ఇదేదో వింతగానో వెగటుగానో  అనిపించవచ్చుకొందరికి. కాని తరచి చూస్తే వాస్తవమే  గోచరిస్తుంది.  ఉదాహరణకి టివి రిమోట్, రిమోట్ బొమ్మలు, ఇంట్లోనుంచే అంతర్జాలం (internet) ద్వారా బాంకు లావాదేవీలు, ప్రయాణ ఏర్పాట్లు, షాపింగులు  వగైరాలన్నీ. ఇక్కడ ఒక మేధావి విశ్లేషించిన అభివృద్ది మెట్లను మననం చేసుకోవడం సందర్భోచితం అవుతుంది. గత రెండు శతాబ్దాలలో ప్రపంచ అభివృద్ది ప్రధానంగా మూడు సాంకేతిక దశలుగా అభివృద్ది  చెందింది. అవి మెకానికల్, కెమికల్, ఎలక్ట్రానిక్ రంగాలు. 
 కానీ  ఈ అభివృద్ధి అనబడే ప్రతి మెట్టు నిర్మాణానికి ఎంతమంది పరిశోధకులు, శాస్త్రజ్ఞులు, శ్రామికులు వారి వారి మేధను, శ్రమను  వెచ్చిస్తే – అందరికి ‘బద్ధకంగా పనులు చక్కబెట్టుకొనే అవకాశం చిక్కుతోంది? కాని మనకి వారెవరినీ గుర్తించే తీరిక, విజ్ఞత ఉండడం లేదు. అవసరం అనిపించడం లేదేమో బహుశా! ఎందుకంటే చాలా అభివృద్ది అంశాలకు, వాటి ఫలాలకు ఖరీదు కట్టి చెల్లిస్తున్నామనే లోలోపలి అభిప్రాయం కావచ్చు. కొంతవరకూ వాస్తవమే. కాని ప్రతి పరిశోధకుడు, కర్షకుడు, కార్మికుడు తగిన ప్రతిఫలాన్ని పొందడం లేదన్న వాస్తవాన్ని గుర్తించే స్థితిలో సమాజం లోని సింహభాగం లేకపోవడం కఠిన వాస్తవం.   ఈ ‘సింహ భాగం’ లో ఒకప్పుడు ఉన్నత వర్గాలుగా పిలవబడే అధికాదాయ, భూస్వామ్య వర్గాలు మాత్రమే ఉండేవి. కాని రాను రాను మధ్య తరగతి కూడా చేరడం కాస్తంత చేదు నిజం. ఈ మధ్య తరగతి లో కూడా,కొన్ని రకాల  తొత్తు గాళ్ళు మాత్రమే ఉన్నత వర్గాలకు సై కొడుతూ--- శ్రామిక శక్తిని, మేధస్సును గుర్తించడానికి ఒప్పుకోనివాళ్ళు ఉంటారు. వీళ్ళు సాధారణంగా కొన్ని వర్గాలకు చెంది ఉంటారు.  ఉదాహరణకు --  పలుకుబడి ద్వారానో, కులం మద్దత్తు తోనో ప్రభుత్వోద్యోగాలు పొందిన వారు, మార్కెట్ల మార్పుతో  గాలి వాటు లాభాలు పొందిన వాళ్ళు, నాయకుల వెంబడి తిరిగి లబ్ది పొందే వాళ్ళు, మధ్యవర్తిత్వాలు చేసే బ్రోకరు గాళ్ళు , సారా పాటగాళ్ళు, క్లబ్బులు- లాటరీలోళ్ళు, రౌడీలు – దందా గాళ్ళు, చిన్న మొత్తాలను పెద్ద వడ్డీలకు తిప్పేవాళ్ళు, గల్లీ లీడర్లు, ఓట్లు కొనే వాళ్ళు, కల్తీ గాళ్ళు, లంచాలోళ్ళు, ఆర్.టి.ఏ. – రిజిష్ట్రారు ఆఫీసుల దగ్గరుండే రాతగాళ్ళు(అంటే లోపలి ఆఫీసర్లకి బయటి కలెక్షను గాళ్ళు), మతం పేరుతో- దేవుడి పేరుతో అమాయకులను దోచుకునే వాళ్ళు--- వగైరా ‘కొంచెం శ్రమ తో (లేదా అసలు శ్రమ లేకుండా) ఎక్కువ సొమ్ము’  నొల్లుకునే రకం జనమన్న మాట. అంతేగాని, నిజాయితీగా పని చేసుకొనే అసలు సిసలు జనం కాదు.  ఈ రకంగా మధ్య తరగతి, మద్యం తరగతి తొత్తు గాళ్ళ  మద్దత్తుతో, మధ్యవర్తిత్వంతో  -- దోపిడీ చేసుకునే పాలకవర్గాలు విశృంఖలంగా జాతి సంపదను మెక్కేస్తున్నాయి.  అందుచేత పెద్ద నేరగాళ్ళను దోపిడిగాళ్లను అదుపు చెయ్యాలంటే మనలో, మన మధ్యలో, మన వెంటే ఉన్న దళారి గాళ్లను కనిపెట్టి పని పట్టాలి. పెద్ద దోపిడీదారులు ఎప్పుడూ సామాన్య జనానికి ముఖా ముఖి రారు. మనలోనే ఉండే ఈ మధ్యవర్తి తొత్తు కొడుకుల్నేఅడ్డం పెట్టుకొని మన సంపదను దోచుకుంటారు.
ఈ మధ్యవర్తిగాళ్ళే మొత్తం ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళుగా చలామణి అవుతుంటారు. దేవుడికి ఏం మొర పెట్టుకోవాలన్నా పుజారిగాళ్ళు తప్పనిసరి అని భక్తుల్ని మభ్యపెట్టగలిగే తెలివితేటలు మన దోపిడీదార్లవి.
దీనికి పరిష్కారం ఉందా? ఎందుకుండదు. మన మధ్యలోనే ఉందికదా! ఈ బ్రోకరుగాళ్ళను అదుపు చెయ్యాలంటే, జనం విద్య నేర్వాలి. అది స్కూలు లో నేర్పే విద్య కాదు. మన హక్కుల్ని మనం గుర్తించగలిగే విజ్ఞత. దానిని కాపాడుకునే బాధ్యతా. దానికోసం ఎదురునిలబడే సత్తా. సమాచార హక్కు చట్టం ఆసరాతో చిన్న తీగలాగితే కదిలిన పెద్ద డొంక -- 2జి కుంభకోణంలో ఎంతమంది ఘరానా గాళ్ళు ఊచలు లెక్కబెడుతున్నారు? ఒక్క ప్రజాప్రయోజన వ్యాజ్యం తో ఎంతమంది ప్రముఖులు, ఘనులు ఇప్పుడు చిప్పకూడు తినడం లేదు?   అందుచేత కావాల్సింది కాస్తంత భాద్యత, విజ్ఞత,చొరవ మరి కాస్త తెగువ. చాలామంది బొక్కుడుగాళ్లను బొక్కలో వెయ్యొచ్చు.
ఈ మధ్యవర్తుల ప్రమేయం జనజీవితంలో ఎంత పొందికగా ఒదిగిపోయిందంటే – మనకే స్పృహకు రానంత—దళారి లేకుండా స్కూలు అడ్మిషన్ దగ్గరనుండి, రేషనుకార్డు, జననమరణ సర్టిఫికేట్, ‘అనా’రోగ్యశ్రీ  వైద్యం, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, మునిసిపాలిటీ చెత్త కంప్లయింటు, ఓటరు నమోదు, టాక్సులు, రిజిస్ట్రేషన్లు, ట్రాఫిక్ చలాను--- మహాప్రభో!! ఇందుగలడందు లేడని సందేహం అక్కర్లేదు. ఇదంతా చూస్తుంటే అసలు బ్రోకరుగిరీ దేవుడి దగ్గరే మొదలయ్యిందనిపిస్తుంది.  పంతులు లేకుండా, మంత్రాలు చెప్పకుండా బిడ్డలకు పేరు పెట్టుకోవడం దగ్గరనుండి, తలనీలాలు (నెత్తి మీద బొచ్చు) ఇచ్చుకోవాలన్నా, పెళ్లి, శోభనం( అవును – దానికి మంత్రాలు, పూజలు, ముహూర్తం కూడాను), చావుకి సరే సరి తరతరాలు తద్దినాలు పేరుతొ పంతుళ్ళకు పొత్తర్లు ఇవ్వడమే గాని – మనకు మనం గా పెద్దల్ని తలచుకోలేని దుస్థితి. దేవుడి సంగతైనా, ప్రభుత్వం సంగతైనా మధ్యవర్తుల్ని తప్పించాలి. భక్తులకి, ప్రజలకి అందవలసినవి వరాలు కాదని, మనకు దక్కాల్సిన హక్కులని అర్ధం అవ్వాలి. మనం – మన దేవుడు, మన గోడు, కోరికలు మనం ఇష్టం వచ్చిన రీతిలో ఆయనకు తెలిసే విధంగా (మనకొచ్చిన, నిజాయితీ తో కూడిన భాషలో) చెప్పుకోవాలి. మన దేవుడే అయితే, అడిగేది సబబైనదైతే ఇచ్చి తీరతాడు. దాన్ని మనోబలంతో సాధించుకోవాలి. మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల విషయం మరి ---  వారి కర్తవ్యం వారునెరవేర్చాలి  అంటే – ఆ కర్తవ్యం ఏమిటో, దానికి మనం వారికి అప్పగిస్తున్న బాధ్యత ఎంత, వారు గుంజుకుంటున్న అధికారం ఎంత, వారిపై అవుతున్న వ్యయం ఎంత, అదనంగా కూడ బెడుతున్నసంపద ఎలా వస్తోంది, ఆదాయానికి మించిన ఆస్తులు లెక్కలేస్తే – ప్రపంచంలోని ఏ ఆడిటింగు సంస్థా తేల్చలేనన్నిరకరకాల సంపదలు, వగైరా అన్నీ -- ఎన్నుకున్న మనకు అర్ధం కావాలి – అర్ధం చేసుకోవాలి. అంతవరకూ నిష్కృతి లేదు. మరో ఈజిప్టు గానో, టునీషియా గానో వీధికెక్కాల్సిన అవసరం మన భరతజాతికి రాకూడదంటే, ఇప్పటికయినా మేలుకోవాలి.  
నాలుగు దశాబ్దాలకు పైగా మూలుగుతున్న లోక్ పాల్ బిల్లుకు పార్లమెంటులో దక్కిన గౌరవం కళ్ళారా చూశాం కదా!  అనుకూలించావచ్చు, వ్యతిరేకించావచ్చు, అంతేగాని పలాయనం చిత్తగించడం ఎంతవరకు సబబు? అధికార, విపక్ష అనే బేధం లేకుండా ఇంత ముఖ్యమయిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు ఎగవేసే ప్రతినిధులకు ప్రజలు ఎలా బుద్ది చెప్పాలి? ఐదు సంవత్సరాలు ఆగాలా? ఈ లోపుగానే వారిపై అనర్హత ఓటు వేసే—కనీసం నిలదీసే  అవకాశం ప్రజలకు లేనప్పుడు ఇంకెక్కడి ప్రజాస్వామ్యం?టిక్కెట్టు ఇచ్చిన పార్టీ విప్ జారీ చేసినట్టే ముఖ్యమయిన బిల్లులకు/చట్టాలకు, రాజ్యాంగ సవరణలకు ఓట్లేసిన ప్రజలు విప్ జారీ చేసే విధంగా సంస్కరణలు చేసుకోలేమా? అసాధ్యం అంటారు ఆ గొప్ప గొప్ప ప్రతినిధులు, పెద్దలు, పార్టీలు. కాని మానవుని సామాజిక అవసరాలకొద్దీ ఎన్ని రకాల రాజ్యాంగాలు, చట్టాలు వ్రాయలేదు? ఎంతమంది మేధావులు, బహుళ జన ప్రేమికులు ఎంత శ్రమకోర్చి అవన్ని తయారు చేసుకుంటూ వచ్చారు? కాని ఇప్పుడు అధికారంలో, అనధికార అధికారంలో, సంపద దోపిడిలో ఉన్నవాళ్ళే చట్టాలకు దగ్గర చుట్టలుగా ఉన్నందుకు అవి జరిగే అవకాశం చాలా తక్కువ.  అందుకే ఇప్పటికైనా విప్లవాత్మకమయిన మార్పును ప్రజలు గట్టిగా కోరుకోవాలి. ప్రజలు ఐక్యం కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల ఐక్యతాశక్తిని అందరం ప్రగాడంగా విశ్వసించాలి. 
  

సోమవారం, నవంబర్ 28, 2011

కలాలే కత్తులు


కలాలే కత్తులు



ఇది చలి కాలం. గిలి కాలం. చక్కిలిగిలి కాలం. చక్కని నెచ్చెలి చెక్కిలి తో జిల్ జిల్ కాలం-- సాగినవాడికి.  మరి బడుగు జీవికి-- ఇది చలి కాలమే! కలి కాలం. ఆకలి కాలం. అంబలి కి కూడా కరువైన, అకృత్యాల బలి కాలం. కప్పుకున్న గోనె పాత కూడా బరువయిన వాడికి, మోకాళ్లను మాత్రం ఒడుపుగా డొక్కల్లోకి గుచ్చుకునే సౌకర్యం ఉన్నవాడికి ఇది చలి కాలమే! కాలం మారుతోంది అంటారు- యుగాలు, తరాలు మారుతున్నాయి కాని చలి గిలి కొందరికి—చలి బాధ ఎందరికో—అన్న స్థితి మాత్రం మారడం లేదు. ఆకలికి చచ్చిపోవడం ఊహ కైనా అందుతుందేమో గాని, చలికి చచ్చిపోవడం ఎంత దుర్భరమో ఆ బాధ పడినవాడికి తప్ప తెలియదేమో—సైనేడు రుచి చెప్పలేనట్టు.
ఇటువంటి చలికాలం గురించి సుప్రసిద్ధ జర్నలిస్టు, రచయిత, సాహిత్యవేత్త డా:ఎ.బి.కె.ప్రసాద్ వ్రాసిన వ్యాసం “కలాలు-కరవాలాలు” (సాహిత్యకీయాలు) అనే పుస్తకంలోనిది. ఈ పుస్తకం ఎన్నో విశిష్టమయిన వ్యాసాల సంకలనం. తప్పక చదివవలసిన పుస్తకం. మచ్చుగా ఈ చిన్ని వ్యాసాన్ని ఇక్కడ యధాతధంగా చదవండి.
దుప్పటిలో దూరి మనల్ని అల్లుకుని నిద్దురపోయేది ఎవరు? చెవుల్లో వేళ్ళు జొనిపి మనల్ని అల్లరి పెట్టేది ఎవరు? ఎవరయ్యా మన బుగ్గల్ని చిదిమేసి, పెదాల్ని కొరికేసి నిదురపోనీయనిది ఎవరు? రాత్రివేళ గడప దాటనీయకుండా కాపలా పెట్టేది ఎవరు?
చలికాలం! ఏటా వచ్చే చలికాలం మన సంప్రదాయ జీవితాన్ని పరిపుష్టం చేస్తున్నది. చలికాలమే లేకుంటే ఉన్ని కంబళ్ళు పుట్టుకొచ్చేవి కావు.  చలికాలమే లేకుంటే రేగుపళ్ళు దొరికేవి కావు. చలికాలమే లేనినాడు మనకు నిగనిగ మెరిసే, తళతళ లాడే అంతలేసి ఉసిరికాయలు దర్శనమిచ్చేవి కావు. చలికాలాన్ని తట్టుకోడానికే కదా భోగి మంటలు పుట్టినాయి. ఒక దృశ్యాన్ని మనసుకు తెచ్చుకోండి. నీలాల నేత్రాల్లో కనుపాపలు బెదిరిపోతే అటూ ఇటూ తిరుగుతుంటాయి. రెప్పలకి పూసిన కాటుక చెరిగి, బెదిరి బుగ్గలమీదికి పాకేస్తుంది. తలంటి పోసిన లేత జుత్తు పకపక తుళ్ళిపడినట్టు గాలికి ఎగురుతుంటుంది. పసుపు రాసి నలుగు పెట్టుకున్న బంగారు చేతులతో అమ్మ, నెత్తి మీద దోసిళ్ళతో రేగిపళ్ళు అక్షింతల్లాగ కుమ్మరిస్తుంది. వాటిలోని దమ్మిడీలు కింద కనక వర్షం లాగ కురిస్తే పిల్లలు వాటి కోసం ఒకరినొకరు తోసేసుకొని తగవులాడుకుంటారు. పెద్దలు వాళ్ళని మురిపెంగా మందలిస్తూ తలో దోసెడు రేగుపళ్ళు కాటుక కళ్ళ పాపాయి శిరసుపై దీవెనల్లా కుమ్మరిస్తూ వుంటారు. అది భోగిపళ్ళ వేడుక. అది చలికాలమిచ్చిన కానుక. గ్రామానికి చలి కాపలా కాస్తున్న వేళ వేకువజామున నిదుర లేవడానికి కదా మేలుకొలుపులు మొదలయ్యాయి.
“తెల్లవార వచ్చే తెలియని నా స్వామి
మళ్లి పరుండేవు లేరా!
మళ్లి పరుండేవు, మెసలుతూ వుండేవు
కళ్యాణ గుణధామ లేరా!
నల్లనయ్యా లేర
నను గన్న తండ్రి...”
అనే పాట జ్ఞాపకముందా? తెల్లవారుజామున చలిగాలిలో తేలివచ్చి, కనురెప్పల్ని తట్టి చెవులలో తియ్యని ధ్వనుల్ని ఒలికించే మధురమయిన మేలుకొలుపు పాట చలికాలం నుంచే పుట్టినాయి కదా? ధనుర్మాసం చలికాలం చల్లని వింటినారి మీదే కదా హొయలు పోయేది. అన్ని కాలాల కంటే ఉన్న కాలమే గొప్పది. ఇపుడిక్కడ చలికాలమే నడుస్తున్నది. అయితే ఓ రకంగా ఇది –‘ఉన్న’ వారికి సుఖమైన కాలం. ఉన్ని కోట్ల వారు, దళసరి స్వెట్టర్ల వారు.. ఎందు కట్టెలు వెలిగించి, నెగళ్లు రగిలించి నిగ నిగలాడే గాజుగ్లాసుల్లో తళతళలాడే విదేశీ మద్యం నింపుకొని ఆరారా తాగుతూ మసాలా వంటకపు మాంసాహారం భుజిస్తూ సుఖమయంగా గడపగలిగేవారు రుతువుల రాజుని బతిమాలి తెచ్చుకున్న కాలమిది. ఆకాశాన్ని కప్పుకోలేక, భూమిని చుట్టుకోలేక, చర్మంతో సరిపెట్టుకోలేక , చావు చల్లగా ఉండే పేవ్ మెంట్ల మీదే చనిపోయిన వారి మృతదేహాల మీద పడగ విప్పి ఆడే పాము ఇది. పేదల పాలిట బాముల కాలమిది.
“.... నడివీధిని పడి బతికే
నీ వంటిని గుడ్డ లేదు
వల్లకాటి చితులన్నీ
ఆరి, పచ్చిబారినాయి
రైలు దారి మదుం లోన     
పల్లక తొంగో కొడుకా
మీద వేళ్ళు రైలు మంట
అదే నీకు చలి మంట”
అని ఆరుద్ర ఒక చోట రాశాడు. ఇది పేదల బాధ. తెలుగు కవులు పేదల పక్షానికి ఫిరాయించక ముందు ప్రబంధ యుగంలో రుతువర్ణన మాత్రం తప్పనిసరిగా చేసేవారు.అందుకు వారు కలిగిన వారి చలికాలపు సరదాల గురించి రాసేవారు. కస్తూరి పూసిన జవరాండ్ర జవనాలు వయసువారి చలిని తీర్చే అందమైన కుంపట్లని అర్ధం వచ్చే పద్యాలు పాతకాలపు కవులు ముచ్చటపడి రాసేవారు.వాళ్ళు తరచుగా ముసలివాళ్ళు, పళ్ళుఊడినవారూ ఉండేవారు. అయితే వారా పద్యాలు రాజుల్ని, జమిందారుల్ని,వారి దగ్గర డబ్బులు కొట్టేసి మారు వేషాల్లోని రాజుల వలె  బతికే రసిక మంత్రిమండలిని, ఆ మూడు వర్గాల వారి ఉంపుడుగత్తెల్ని మెప్పించడానికి రాసేవారు.అయితే ఆయా వర్గాల్లోని రాజులకూ, జమీందారులకు, వారి ఉంపుడుగత్తెలకూ చదవడం పూర్తిగా వచ్చేది కాదు. కాబట్టి వారూ ఆ కావ్యాల్ని చాలా గౌరవంగా చూసేవారు. చదవడం వచ్చినవారి సంఖ్య పెరిగేసరికి చాలావరకు అలాంటి ప్రభందాలు నశించిపోయాయి. ఆ కవులూ అంతరించిపోయారు. ప్రబంధాల సంఖ్య  తగ్గడంతోనే సాహిత్యంలో అబద్దాల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో తగ్గింది. రుతువులన్నీ రాజుల, వారి కుటుంబాల, వారి మంత్రి, సామంత, దండనాయకుల సుఖం కోసమే ఒక చక్రగతిన తిరుగుతున్నాయనే భ్రమను కల్పించి కవులూ పబ్బం గడుపుకున్నారు. అయితే గురజాడ మహాకవి తో మొదలై, శ్రీశ్రీ నాడు ప్రభంజనంలాగ పెరిగి, సుబ్బారావు పాణిగ్రాహి నాడు ప్రజల చేతి ఆయుధంగా మారిన తెలుగు కవిత్వం అబద్ధాలకు దూరమై వాస్తవానికీ, ప్రజలకూ దగ్గరైంది. రుతువుల రాకపోకల ప్రభావం ప్రజలపై ఉంటుందన్న అవగాహన మాత్రమే నేడు అందరికీ ఉంది.
వానలు కురియక తెలుగు రైతులు గడ్డిపోచల్లాగ ఎందిపోయారు. గుండె చెరువైన వారి కంటినుండి రాలిన నీరే పొలాలకు నీరై అక్కడక్కడా అరకొర పంటలు పండాయి. సరిగ్గా అప్పుడు సముద్రంలో పుట్టిన విషం తుఫానై నాలుకలు చాస్తూ ఆ పంటపొలాల ప్రాణహరితాన్ని పీల్చివేసింది. చేతికి అందిన సస్య లక్ష్మిని ఎత్తుకుపోయింది. పల్లెలను ఆకలితో, దుఖంతో, గుండె మంటలతో అల్లాడిపోతున్నప్పుడు చలిగాలులు గుర్రాలు పూన్చిన రధం మీద ఎక్కి సంక్రాంతి లక్ష్మి వస్తున్నది. ఎవ్వరూ ఆమెకు స్వాగతం చెప్పకండి. భయకంపిత హస్తాలతో నమస్కరించడం సాధ్యం కాదని చెప్పండి. కొనప్రాణాలతో ఉన్న ఈ పల్లెటూళ్ళతో నీకేం పని తల్లీ, పోయి ప్రపంచ బాంకు రమ్య హర్మ్యాల్లో, భవ్య భవంతుల్లో పూజలు అందుకో అమ్మా అని చెప్పండి. ధాన్యపు కంకుల నుంచి వేళ్ళాడే సిరిమువ్వల సవ్వడులు నీకిక్కడ వినిపించవు. పోయీ ప్రైవేటు పరిశ్రమల యంత్రాలనుంచి వెలువడే శ్రావ్య సంగీతాన్ని ఆస్వాదించమని చెప్పండి!! “   
ఎ.బి.కె.ప్రసాద్ గారి ఈ వ్యాస సంకలనం లో ఎంతో సాహితి చర్చ ఉంది. వాస్తవాలు గణాంకాలు ఉన్నాయి. మేలుకొలుపు ఉంది. చలిని తగ్గించే వేడి, వాడి ఉన్నాయి.
ఎమెస్కో వారి ప్రచురణ. వెల:రూ:100/-
  

శనివారం, అక్టోబర్ 15, 2011

పొగ బండి కధలు



ఓలేటి శ్రీనివాస భాను పేరు కనపడగానే పొగబండి కధలు పుస్తకం కొనేశాను. ఆయన పేరు అంతగా నాకు గుర్తుండేలా హత్తుకున్న విషయాలు రెండు  ఇక్కడ తప్పక ప్రస్తావించాలి. ఒకటి అందర్ని మెప్పించిన దూరదర్శన్ డైరెక్టరు శ్రీ ఓలేటి పార్వతీశం గారు(ఆయనకి, శ్రీనివాస భాను గారికి ఏమయినా బాంధవ్యం గాని, సంబంధం గాని ఉందో లేదో నాకు తెలియదు). ఇక రెండవ విషయం, దశాబ్దం కంటే ముందు మాట. తనికెళ్ళభరణి గారిపరికిణిపుస్తకం గురించి వీరు వ్రాసిన సమీక్ష.(లింకు ఇక్కడ  - http://gksraja.blogspot.com/2011_03_01_archive.html)
పరికిణి’  పుస్తకానికి తగ్గట్టుగా అనేకంటే మించిన విధంగా నన్ను ఆకట్టుకుంది.    పుస్తకం కోసం నన్ను గంగవెర్రులెత్తించింది. పుస్తకాల షాపులకు పరుగులు పెట్టించింది. అందుకే ఆపేరు చూడగానే పుస్తకం కొనేశాను. అనేకమంది స్నేహితులకు కూడా కొని ఇచ్చేలా చేసింది పరికిణి’ పుస్తకం.
ఇక పొగబండిసంగతి. ఆశించినంత, ఆతృత పడినంత స్థాయి తృప్తినివ్వలేకపోయినా, మంచి కధలే చదివాననే హాయి కలిగింది.  కొంచెం ఎక్కువ ఉహించుకోవడం నా తప్పేగాని, భాను గారి కధలది కాదు. సింహభాగం కధలు ఆకట్టుకున్నాయి. మంచి ఇతివృత్తాల్నే ఎంచుకున్నారు. పేరుకు తగ్గట్టుగానే పొగ చిమ్మాయి. కానీ ఆ ‘పొగ’లో కధలు కాస్తంత ‘పొగ’చూరాయి. రైల్వే వ్యవస్థ వెనుక సమాచారం సామాన్య ప్రయాణికుడికే కాకుండా, మాన్య ప్రయాణికుడికి కూడా తెలిసే అవసరం, అవకాశం లేదు. ఈ కధల పుణ్యమా అని ఆ అవసరం వచ్చింది. అతిగా ఉన్న రైల్వే సమాచారం అక్కడక్కడా కధకు కూడా కొంత గ్రహణం పట్టించినా, కధనం లోని విశిష్టత వల్ల అప్పటికప్పుడే వీడి పోయింది కూడా.
“పాదాల్ని తాకడంలో పశ్చాతాపం... కృతజ్ఞత పోటి పడ్డాయి” “సారా కంపునీ, సరసాల్నీ భరిస్తూ ముగ్గురు పిల్లల్నీ, రెండు అబార్షన్లనీ”  "పిండాల్ని అద్దుకున్న నల్ల నువ్వుల్లాగ జ్ఞాపకాలు”  "అంబలి ఖర్చు కన్నా ఆవకాయ ఖర్చెక్కువ”  “జారుతున్న జడల్లాగా రెండు వైపులా రైలు పట్టాలు”  “వయసుతో వచ్చిన అందం తో బాటు, వయసు రాక ముందు నుంచీ ఉన్న అందం వల్ల”  “ఆగే ముందు ఊగే బొంగరం లాంటి నడుము” లాంటి వాక్య నిర్మాణాలు నిండుగా, మెండుగా ఉన్నాయి. మొత్తం మీద ‘పొగబండి కధలు’ బొగ్గుతోనే అయినా, ఎలెక్ట్రిక్ వేగంతోనూ, గూడ్సు బండిలా సుతిమెత్తగానూ, కొంచెం బరువుగానూ సాగిపోయింది. ఓలేటి గారికి డబుల్ అభినందనలు.
‘పొగబండి కధలు’  పబ్లిషర్: క్రియేటివ్ లింక్స్. ధర: రూ:60/-