తెలుగు సంగతులు

శుక్రవారం, మే 26, 2017

శ్రీరమణ గారి శ్రీ ఛానెల్


"తాతా ! సూరీడు నేలమీద నీళ్ళని ఎండవల విసిరి ఎందుకు ఆకాశంలోకి తీసుకెళ్తాడు".
మనకి పొదుపుగా వాడుకోడం తెలియదని, మళ్ళీ మనం ఇబ్బంది పడతామనీ ... నీళ్ళని పైకి తీసుకెళ్ళి మబ్బుల్లో దాచిపెడతాడు. మళ్ళీ మనకి కావాల్సి వచ్చినప్పుడు వర్షం కురిపించి మన నీళ్ళు మనకి ఇస్తాడు.."
"మరైతే తాతా ! మనకి నీళ్ళు కావాలని సూరీడుకి ఎవరు చెబుతారు?"
"చెట్లు"
"తాతా ! నీళ్ళు పల్లానికే ఎందుకు పరుగులు పెడతాయి?"
అడుగున ఉండేవాళ్ళకీ, వేళ్ళకీ చెందాలనీ ... అందాలనీ..."
"మరైతే అంతెత్తున ఆనకట్టలు కట్టి వాటిని కట్టేస్తున్నారు దేనికీ?"
"పై వాళ్ళ కోసం"
"తాతా ! పిడుగులు ఎప్పుడూ చెట్ల మీదే పడతాయెందుకు?"
"మన మీద పడితే కాలిపోతామని అవి లాగేసుకుంటాయి."
"మరి పాపం వాటిని గొడ్డళ్ళతో కొట్టి ఎందుకు చంపేస్తున్నారు తాతా?"
" ....................."
"పొయ్యిలో కట్టెలు కాలిపోతూ అన్నం వండేందుకు, కూర వండేందుకూ, చలి కాగడానికీ వేడి ఇస్తాయి కదా! వాటిలోకి అంత వేడి ఎక్కడినుంచి వస్తుంది?"
"మొక్కలు పుట్టినప్పటినుంచీ, పెద్దవై మానులయ్యేదాకా రోజూ సూరీడులోంచి వేడిని పీల్చుకొని, ఆ వేడిని చేవగా దాచిపెడతాయి. మనం నరికి పోగులు పెట్టి చిచ్చు పెట్టగానే పీల్చుకున్న వేడిని మనకి ఇచ్చేస్తాయి."
"మరైతే అది పాపం కదా! కళ్ళు పోవూ..."
" ..................."
"తాతా ! మామిడి చెట్లూ, నేరేడు చెట్లూ ఒక్క పండు కూడా తినకుండా కాసినవన్నీ అందరికీ పందారం చేస్తాయెందుకూ?"
"పాపం వాటికి మనలాగా కాళ్ళూ చేతులూ లేవు కదా ! ఎటూ కదల్లేవు కదా !నోరూరించే పళ్ళు పంచిపెడితే మనమూ, కోతులూ, పిట్టలూ పళ్ళు తిని, వాటి గింజలతో కొత్త మొక్కలు మొలిపిస్తాయని ఆశ!"
"మరైతే పిట్టలకీ, ఉడతలకీ మనమేం మిగల్చం కదా ... "
" ................."
" తాతా నువ్వు మాకు ఐసులూ, జీళ్ళూ, బుడగలూ కొని పెడుతూ ఉంటావ్ దేనికీ?"
" నన్ను మీ జట్టులో చేర్చుకుంటారని ఆశ..."
" ................................................................. " 

                 ఈ సంభాషణ, అందులోని అంతర్లీనంగా ఉన్న గొప్ప సందేశం నాకు చాలా నచ్చాయి. ఇంత పసితనంగా, చక్కగా ఎవరు మనల్ని నిలబెట్టేశారనేగా మీ ప్రశ్న? ఇంకెవరండీ బాబూ? శ్రీ శ్రీ రమణ గారే. అవునండీ బాబూ! మీరు అనుకునే 'మిధునం' శ్రీరమణ గారే ! ఇది వారి 'శ్రీఛానెల్ ' పుస్తకంలోని ఒక చెళుకు. అబ్బో ఇలాంటివి చెమక్కులు, లిమరిక్కులు, ఛలోక్తులు, విసుర్లు, కసుర్లు, కబుర్లూ బోల్డన్ని ఉన్నాయండీ! నిఝెం అండీ బాబూ! అంతే కాదండోయ్, మధ్య మధ్యలో తొంగి చూసి మనల్ని గిలిగింతలు పెట్టే బాపు కార్టూన్లు దీనికి అదనం. కావాలంటే పుస్తకం కొని చదవండి. నేను కినిగే లో డిజిటల్ కాపీ కొనుక్కున్నాను. దాంట్లోంచి ఒక్క 'విసురు ' మీపై ఇలా విసిరానంతే! 
               ఆ... ఏవిటంటారూ?, సరిగ్గా వినబళ్ళే ... ఓహో 'ఇది గ్రంధ చౌర్యం కాదా? ' అంటారా! అవును మరీ, ఒక్క ముక్క కాపీ కొట్టినా కాపీ రైటు భంగపరిచినట్టే. తెలుసు. కానీ ఏమి చెయ్యను? మీ అందరి చేతా చదివించాలనీ, కొంచెం అయినా, కొసరు అయినా రుచి చూస్తే మీరంతా కొంటారనీ నమ్మకంతో, ఈ నేరానికి తలబడ్డాను. అయినా శ్రీరమణ గారు కోప్పడరు. వారు ఛాలా ఛాలా మంచివారు. పైగా వారికి రెండో శ్రీ కూడా తగిలించాం కదా! ఇక కోప్పడరు. పైగా నా ఇష్ట దైవాలైన 'రమణ బాపు ' గార్ల స్నేహితుడు మన శ్రీరమణ గారు. ఇంత అవినాభావ సంబంధం (దగ్గర చుట్టరికం) ఉంటే ఇంకేం అంటారు అని ధైర్యం. ఆపకుండా చదివేశానేమో, మనసుకు సరిపోయినట్టు లేదు. తృప్తి కలగలేదు. మళ్ళీ చదువుకోవాలి. ఇక ఉంటాను మరి.


జి.కె.యస్. రాజా.

సోమవారం, డిసెంబర్ 19, 2016

సోమయ్య కే కాదు నాలాంటి వారికి ఎందరికో నచ్చే వ్యాసాలు.

వాడ్రేవు చినవీరభద్రుని "సోమయ్యకు నచ్చిన వ్యాసాలు" వివిధ విషయాల సమాహారం. తాత్విక చింతన, సునిశిత విశ్లేషణ, విషయ విస్తృతి, అదే సమయంలో వ్యాస క్లుప్తత, సమకాలీన సంఘటనలపై తర్కంతో కూడిన వివరణ --- ఇవీ చినవీరభద్రుని వ్యాసాల్లో మనకి స్పష్టంగా కనిపించేవి. ప్రకృతి పారవశ్యం, కవిత్వపు మధురానుభూతీ, సామాన్య- సంప్రదాయ జీవన పరిమళాలూ, వివిధ వాదాల రంగరింపు, కళలపై అపారమైన మక్కువ వగైరా విభిన్న అనుభూతుల్ని చవి చూడొచ్చు - వాడ్రేవు వ్యాసాల్లో. అందుకే అవి సోమయ్యగారికి మాత్రమే నచ్చేవి కాదంటాను.
అనేక పార్శ్వాలు కనపడతాయి. వివిధమైన దర్శనాలు చెయ్యొచ్చు. డి.ఎన్.ఏ, గ్లోబలైజేషన్ (గ్లోబల్, లోకల్ కలిపి గ్లోకలైజషన్ గా పేరు పెట్టడం సముచితం), క్రికెట్ పై వెర్రి వ్యా'మోహం',  ఒక చిత్రకారుని అంతరంగ విశ్లేషణ, మహాత్ముల ఆలోచనల మదింపు, సారాంశ సంగ్రహం, ప్రాచీన బౌధ్ధ ధర్మాలలోని ఔచిత్యం, శంకరాచార్యుని కర్మ - జ్ఞాన సాపేక్షతా దృష్టిపై చూపు -- ఇలా ఏ విషయమయినా ఆయన వ్యాసాల్లో మనకు లభ్యమవుతాయి. అటువంటి ప్రతి చింతనా తాత్వికంగా, మనసుకు హత్తుకుపోయేలా ఉంటాయి. సరళంగా మొదలయ్యే ప్రతీ వ్యాసం కొన్ని పేరాల కూర్పుతోనే ఎంతో లోతులకు పయనించి తాత్వికమైన ముగింపు కాని 'ముగింపు ' కు తీసుకెళ్తాయి. ఆ రెండు మూడు పేజీల వ్యాసంలో ఉన్న నిగూఢత, గాఢత ఆ విషయంపై మనల్ని పరిశోధన చేయించేంతగా ప్రభావితం చేస్తాయి. 

ఈ సోమయ్యకు (రావెల) నచ్చిన వ్యాసాలు సుమారు పుష్కరకాలం పాటు అంటే 2000 నుండి 2012 సవత్సరాల  మధ్య కాలంలో  వాడ్రేవు వివిధ పత్రికలకు (ఇండియా టుడే, నవ్య, యువభారతి) వ్రాసినవి. అప్పటి చర్చనీయాంశ విషయాలతోబాటు, కళలు, కవిత్వం,తర్కం- తాత్వికం మొదలైన విషయాల చర్చలో వివిధ కాలాలకు, వివిధ దేశాలకు చెందిన ఎంతోమంది మేధావులను ఉటంకించడం, ప్రత్యేకించి చర్చించడం ఉంటుంది. మనల్ని అక్కడే ఆపేసి ఆయా మేధావుల గురించీ, ఆ తత్వాల విశ్లేషణ గురించీ తెలుసుకోవాలన్న జిజ్ఞాసను రేకెత్తించి - మనల్ని వివిధ గ్రంధాల వైపు, అంతర్జాలం వైపూ పరిగెత్తిస్తాయి. 

అయితే ఇక్కడొక చిక్కు కూడా ఉంది. నావరకూ నాకు కలిగే చిక్కూ, ఇబ్బందల్లా -- పదాల ప్రయోగం, వాటి సంక్లిష్టతానూ. ఇంగ్లీషు - తెలుగు నిఘంటువునే ఎక్కువ సందర్భాల్లో వినియోగించే నేను, ఈ వ్యాసాలు చదువుతున్నప్పుడు తెలుగు - ఇంగ్లీషు ( రెండూ పి. శంకరనారాయణవే) నిఘంటువును అందుబాటులో ఉంచుకోవలసి వచ్చింది. ఉదాహరణకు కొన్ని పదాలు -- నిశ్శ్రేయసం, పరాస్తం, యాదార్ధ్యాలు - వంటివి నాకు అర్ధం అయ్యీ, అవ్వక అక్కడే నిలువరించేస్తాయి. బహుశా ఆ సంక్లిష్టత నా భాషా పరిజ్ఞానపు అధమ స్థాయి అయినా కావచ్చు. లేదా సరైన భావ వ్యక్తీకరణకు చిన వీరభద్రునికి మార్గాంతరం లేక, కావొచ్చు. అంతేగాని పాండిత్య ప్రకర్ష అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆ సంక్లిష్ట పదాల స్థానంలో వేరే సరళ పదాన్ని ఊహించుకున్నా అసంతృప్తిగానే ఉంటుంది. ఈ నా సమీక్షలో వాడిన ఈమాత్రం పదాలకు కారణం - ఆయన వ్యాసాలలోని భావ వ్యక్తీకరణకోసం వాడిన భాష తాలూకు పూనకం కావొచ్చు. ఇటువంటివి ఈ కాలానికి బహు గ్రాంధికం అనిపించడంలో ఆశ్చర్యం లేదు.బహుశా అంతటి విషయ తీవ్రతను వ్యక్తపరచడానికి ఆ సంక్లిష్ట పదబంధాలు అవసరమేమో! వ్యాసాల విశిష్టత కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఈ క్లిష్టమయిన పదాల వల్ల నా వంటి సగటు పాఠకుడికి కలిగే చిన్నపాటి ఇబ్బంది పరిగణనలోకి తీసుకోనక్కర లేదనుకుంటాను.
శ్రీప్రచురణ వారి ప్రచురణ. 476 పేజీలు. 250 రూ.వెల

సోమవారం, జులై 04, 2016

            ఓల్గానుంచి గంగకు -- ఒక సరళమైన మానవ చరిత్ర




'రాహుల్ సాంకృత్యాయన్ ', ఈ పేరు వినగానే మొదట నాకు జ్ఞప్తికి వచ్చేది, నా హైస్కూల్ రోజుల్లో మా నాన్న పుస్తక పఠనాసక్తి.  అప్పట్లో, (సుమారు 1970ల్లో)  మా నాన్న చదువుతున్న పుస్తకం గురించి ఆయన ఇంటికి వచ్చిన ప్రతి స్నేtహితుడి తోనూ, పరిచయస్థులి తోనూ ఈ గొప్ప పండితుడు, బహు భాషా కోవిదుడు, గొప్ప చరిత్రకారుడు, అన్నిటికంటే మించి అతిగొప్ప వాస్తవ వాది, మానవతావాది గా  'రాహుల్ సాంకృత్యాయన్ '  గురించి ప్రస్తావించడం నాకు బాగా గుర్తు వస్తుంది. నా జ్ఞాపకం ప్రకారం, అప్పుడు మా నాన్న ప్రస్తావించిన ఆయన పుస్తకం 'సంచారజీవులు ' అని గుర్తు. కానీ ఇప్పుడు లభ్యమయ్యే ఆయన రచనల్లో ఆ పుస్తకం కనబడడం లేదు. ఆయన ఇతర రచనల పట్టికలో కూడా ఎక్కడా కానరావడం లేదు. ఇప్పుడు ఆ పుస్తకం పై నాకు విపరీతమయిన ఆసక్తి కలుగుతోంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే -- ఈ మధ్య ఆయన పుస్తకాలు వరుసగా రెండు చదవడం, ఆ సందర్భంలో ఆయన ప్రతిభా విశేషాలు కొంత అవగాహన రావడం, ఇంతకాలం ఆయన రచనలు చదవకపోవడం పట్ల చింతించడం జరిగింది.  అలాగే చదివిన మట్టుకు అయినా పూర్తిగా అవగాహన అయ్యిందా అన్న సందేహం నన్ను పీకుతోంది.  మరోసారి చారిత్రక నేపధ్యాన్ని అవగాహన చేసుకుంటూ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపిస్తోంది. 

విస్తృత ప్రాతిపదిక మీద రచనల్ని మౌలికంగా రెండు విధాలుగా విభజించి చూడవచ్చు. ఒకటి కల్పితాలు, రెండోది వాస్తవాలు. ఈ రెండూ కలగలిసిన రచనలే ఎక్కువ. దురదృష్టవశాత్తూ ఖచ్చితత్వం పాఠించాల్సిన మన చరిత్రలు కల్పితాలుగా, కల్ల బొల్లి కధనాలుగా, పాలకపక్ష బాకాలుగా లభిస్తున్న దౌర్భాగ్యం నుండి కొంత విముక్తి ఈ రాహుల్ సాంకృత్యాయన్ పండితుని కధలు, కధనాలు. ఇంతా చెప్పి మళ్ళీ వీరివీ కధలు, కధనాలు అనడం ఏవిటి అనిపించడం సహజం. అక్కడే ఉంది ఈ మహా పండితుని ప్రతిభ. రాతియుగానికి పూర్వం నుంచీ మానవుని జీవనం ఎలా సాగుతూ వస్తోందో -- దొరికిన చారిత్రక సాక్ష్యాధారాలను ఆలంబనగా చేసుకొని సాధారణ పాఠకునికి అర్థం అయ్యే రీతిలో, ఆసక్తి కలింగించే విధంగాu కధగా మలిచి మానవచరిత్రను చెప్పే మహత్తర ప్రక్రియే 'రాహుల్ ' రచనల విశేషం. నేను చదివినవి 'ఓల్గా నుంచి గంగకు ', 'దివోదాసు '. ఈ సమీక్ష/ ప్రస్తావన ముఖ్యంగా 'ఓల్గా నుంచి గంగకు ' గురించి.
విస్తృతమయిన అధ్యయనం, సత్యాన్వేషణ పట్ల అమితాసక్తి, విస్తారమయిన పఠనం, చరిత్రను యధాతధంగా చెప్పాలనే నిష్కర్ష, సామాన్య పాఠకుడికి అర్థమయ్యేలా, ఆసక్తి కలిగించేలా  రచన చేయగల పాండిత్య ప్రతిభ, అందరికీ చరిత్రను అందుబాటులోకి తేవాలనే అంకిత భావం -- ఇన్ని గొప్ప లక్షణాల రచనా సారం ఈ 'ఓల్గా నుంచి గంగకు '.  
ఎన్నో చారిత్రక విషయాల్ని సరళంగా తెలియచెప్పిన తీరు అద్భుతం. ఈ పుస్తకం గురించి ఆయన సమకాలికుడు శ్రీ.భదంత ఆనంద్ కౌశల్యాయన్ వ్యాసంలో కొన్ని వాక్యాలు  -- 
"చాలాకధలు కధలు కావు, చరిత్రే". 
" ఇందులోని మొదటి నాలుగు కధల పేర్లూ -- నిశ, దివ, అమృతాశ్వుడు, పురుహూతుడు. ఈ నాలుగు కధల్లోనూ క్రీస్తుకు పూర్వం 6000 (ఆరు వేలు) సంవత్సరాల లగాయితు క్రీస్తుకు పూర్వం 2500 వరకూ ఉన్న సమాజాన్ని చిత్రించారు. అది ప్రాగైతిహాసిక కాలం. ఇవి కధలూను! అంచేత ఆ కధల్లో కల్పన ప్రధాన అంశం అన్నది సర్వ విదితం. కాని అవి కేవలం కల్పనతో రాసినవి మాత్రం కావు. ఆ కధల్లో మహత్తరమయిన విషయాలన్నీ రాహుల్ జీ ఇండో యూరోపియను, ఇండో ఈరానీ భాషా శాస్త్రాల అధ్యయన ఫలితాలు. తర్వాతి నాలుగు కధలు -- పురుధానుడు, ఆంగిరా, సుదాసుడు, ప్రవాహణుడూను. ఈ కధలన్నిటికీ సాహిత్య ప్రమాణాలున్నాయి. వేదాలు, బ్రాహ్మణాలు, మహాభారతం, బౌధ్ధ గ్రంధాల్లోని "అట్టకధ" పేరుతో ప్రసిధ్ధి చెందిన భాష్యం -- ఇవీ ప్రమాణాలు. సుదాసుడి కధకు ప్రమాణం సాక్షాత్తూ ఋగ్వేదమే! ప్రవాహణ జైవాలికి ఆధారాలు ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, పైన ఉటంకించిన బౌధ్ధ అట్ట కధలూను! "
" ఈ నాలుగు కధల్లోనూ క్రీస్తుకు పూర్వం 2000 దగ్గర్నుంచి క్రీస్తుకు పూర్వం 700 వరకూ ఉన్న సమాజం ఎలా వికాసం చెందిందో చెప్పడానికి ప్రయత్నం చెయ్యబడ్డది."  ఆ తర్వాత కధ బంధులమల్లుడిది. ( క్రీ.పూ. 490) ఈ కధకి కావల్సిన సామాగ్రినంతటినీ బౌధ్ధ గ్రంధాల నుంచే రచయిత తీసుకున్నారు. పదో కధ నాగదత్తుడు. కౌటిల్యుడి అర్ధశాస్త్రం, గ్రీకు యాత్రికుల యాత్రా వివరాలు--" ఇలా సాగిన ఆనంద్ కౌశల్యాయన్ వ్యాసం రచయిత గురించి, రచన గురించి క్లుప్తంగా చెబుతుంది, ఆఖరి పేజీల్లో. 

తరువాత వరుసగా కాలక్రమానుగతంగా  రెండవ ప్రపంచ యుధ్ధకాలం (1942) వరకూ సాగిన కధలన్నీ అందరికీ లభించే చారిత్రక సాక్ష్యాధారాలతో రాసినవే. అనేక ముఖ్య ఘటనలను,  ప్రసిధ్ధి గాంచిన వ్యక్తులనూ ఉదహరిస్తూ, ఉటంకిస్తూ సాగిన రచన గురించి ఎవరికి వారే చదివి తెలుసుకోవాల్సిందే. ఈ రచన వెనుక రచయిత విశేష గ్రంధ పఠనం గోచరిస్తుంది. అంతేకాదు మనల్ని కూడా చరిత్ర పట్ల ఆసక్తుల్ని చేసి, అనేక చారిత్రక సాక్ష్యాల కోసం, వాటి పూర్తి వివరాల కోసం సంబంధిత పుస్తకాల, అంతర్జాల విశేషాల చుట్టూ పరిగెత్తిస్తుంది ఈ రచన. ఒక్కటి మాత్రం సత్యం -- మనం చదువుకున్న చరిత్రల్లోని సత్యం పాలు ఎంత కనీస స్థాయిదో తెలుస్తుంది-- తెలిసి బాధిస్తుంది. క్రీస్తు శకం మొదలయిన తరువాతి చారిత్రక కధనాల్లోని కొన్ని మచ్చు తునకలు  ఈ క్రింద చదవండి.

"అరిస్టాటిల్ చెప్పిన దాంట్లో 'సత్యాన్వేషణకు గీటురాయి మెదడు కాదు. జగత్తులోని పదార్ధమూ, ప్రకృతీనూ'.
 "ఉత్తరాపధపు గాంధారంలో ఇప్పటికీ (క్రీ.శ. 420 నాటికి) దూడ మాంసాన్ని ఇస్తారు. అలాంటిది మధ్యప్రదేశంలో (యుక్త ప్రాంతం - బీహారు) గోమాంసం పేరెత్తడం కూడా మహా పాపం. అక్కడ గోబ్రాహ్మణ సంరక్షణని పరమ ధర్మంగా చెబుతారు. ధర్మంలో ఇంతింత తేడాలెందుకో!"  
 " కాళిదాసు ఒక సందర్భంలో ' తమ పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలాన్నుంచి దాసదాసీ జనాలుగా పుడతారు ' అంటాడు. "
 " శాతవాహన (శాలివాహన) వంశం కోమట్ల వంశం. వ్యాపారస్థులది కాదు ".
 " పాపం - పుణ్యం, ఆచారం - అనాచారం, ఇవన్నీ ఉట్టి కల్పనలు. స్వర్గ నరకాలు, ముక్తి - బంధనాలు ఇవన్నీ చిన్న పిల్లల భ్రమలు! పూజలు, ఉపాసనలు అన్నీ పామరులను మోసం చెయ్యడానికే! దేవుళ్ళు, దేవతలూ - అలౌకిక కల్పనలు అన్నీ మిధ్యే " అంటాడు నాగార్జునుడు '.  
 "1814 లో బ్రిటన్ కి భారతదేశం నుంచి 18,66,608 తానుల బట్ట ఎగుమతి అయింది. 1835 లో 3,76,086 తానుల బట్ట బ్రిటన్ నుంది భారత్ కు పంపబడ్డది." 
ఇంకా ఇటువంటి ఆసక్తి కలిగించే ఎన్నో చారిత్రకాంశాలు పుస్తకం పొడుగునా కనిపిస్తాయి. భరత ఖండం పై తురుష్కుల దండ యాత్ర, ఇంగ్లీషు వాళ్ళ పాలన --- అప్పటి వేతనాలలోని వ్యత్యాసాలు ( అంకెలతో సహా), వైష్ణవ - శైవ మతాల వైరుధ్యాలు - యుధ్ధాలు, హిందూ ముస్లిం సంఘర్షణలు, గాంధీ మిదవాద సిధ్ధాంతంతో వీగిపోయిన విప్లవవీరుల పోరాటాలు.... వగైరా చారిత్రక నిష్ఠుర సత్యాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. తప్పక చదివి తీరాల్సిన మహద్గ్రంధం.
10వ ముద్రణ - 2013, విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్.
పేజీలు - 338, వెల - రూ. 175/-




శుక్రవారం, ఏప్రిల్ 29, 2016

చరిత్ర రచనపై బాలగోపాల్

కె. బాలగొపాల్,  పరిచయం అక్కర్లేని నిక్కచ్చి అయిన వ్యాసకర్త. నిశిత పరిశీలన, విశ్లేషణ, నిర్మొహమాట విమర్శ ఆయన ప్రత్యేకతలు. అంతకు మించి ఆయన శాస్త్రీయ దృక్పధం, అవగాహనలతో ఏ విషయాన్నయినా  గణాంకాలు, ఆధారాలతో   విస్పష్టంగా వివరించగల దిట్ట. ఆయన భావజాలం, పదజాలం కమ్యూనిష్టు పోరాట యోధుణ్ణి గుర్తు చేస్తాయి కాని,  ఆయన కేవలం ప్రజల మనిషి. ప్రజాసమస్యలే ఆయన  రచనలకు ముడిసరుకు. 
చరిత్రపై ఆయనకున్న అవగాహన, ప్రత్యేక ఆసక్తి ఆయన్ను మంచి చారిత్రక విమర్శకునిగా నిలబెట్టాయి. 1990 లొ అనంతపురంలొ జరిగిన హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షోపన్యాసంలో తాను చరిత్రకారుణ్ణి కాదని, కేవలం ఔత్సాహిక పరిశీలకుణ్ణి మాత్రమే అని చెప్పుకోవడం ఆయన నిరాడంబరతను చాటేది మాత్రమే.
'చరిత్ర రచనపై బాలగోపాల్ ‘  అన్న ఈ పుస్తకం లో ఉన్న పది వ్యాసాలూ చరిత్ర పట్ల మనకు, అత్యంత ఆసక్తిని రేపుతూ, చరిత్ర రచనలో సాధారణంగా చోటు చేసుకొనే పాలక వర్గాల వైపు పక్షపాతం, వక్రీకరణల గురించిన ఎరుక కలిగి 'అసలు మనం చదువుతున్న చరిత్రలో సత్యం పాలు ఎంత?' అన్న సందేహం ఏర్పడుతుంది. సాధారణంగా ఇటువంటి  రచనలకు ఫుట్ నోట్ లు ఇవ్వడం తప్పనిసరి. ఈ పుస్తకంలొ, పాఠకునికి ప్రతి పేజీ కిందా వాటి జోక్యం అడ్డం తగలకుండా వ్యాసం చివర్లో అంకెలవారీగా వివరణ ఇవ్వడం సౌలభ్యంగా ఉంది. వ్యాసాలూ, వాటిలోని వ్యక్తుల, సంఘటనల వివరణలు మనకు చరిత్ర పట్ల చాలా ఆసక్తిని రేపుతాయి.  ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, భారత కార్మిక చరిత్ర, తెలంగాణ రైతాంగ పోరాటంలో మహిళల పాత్ర, చరిత్ర పాఠాలపై కాషాయం నీడ, భారత స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిముల పాత్ర వంటి భిన్నమయిన విషయాలపై నిర్ద్వందంగా చేసిన విమర్శలు, పరామర్శలు మొత్తంగా ఈ వ్యాసాలు. వారు, వీరు అన్న బేధం ఎక్కడా చూపకుండా లోపాలున్న ప్రతీ వ్యవస్థనూ, సంస్థనూ ఏకిపారేసిన విధానం బాలగొపాల్ నిష్కర్ష్ చరిత్ర రచనకు అద్దం పడుతుంది. ఉదాహరణకు -- "ప్రజలు చిన్న చిన్న రాయితీలతో సంతృప్తి చెందేవారు కాదు కానీ, భారత కమ్యునిస్టు పార్టీ ప్రజల చైతన్యాన్ని నీరు కార్చడంలో పాలక వర్గాలకు చాలా తోడ్పడింది." అని ఒక సందర్భంలొ వివరిస్తారు. నిజమయిన చరిత్ర కోణానికి నిక్కర్చైన రచనగా చెప్పుకోడానికి ఉదాహరణలు ఇవ్వడం కష్టమయిన పని. ఈ వ్యాస సంకలనం చదవడమే చరిత్ర పై ఆసక్తి ఉన్న వారికి మార్గం. ఇది చదివాక, మరిన్ని చరిత్ర రచనల కోసం వెదకడం మాత్రం తధ్యం.

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు 2015 లో ప్రచురించిన ఈ పుస్తకం వెల - 130 రూపాయలు.

మంగళవారం, సెప్టెంబర్ 10, 2013

నామినితో నా గోడు

నామినితో నా గోడు

ఏదైనా పుస్తకం చదివాక అది ఇంకా మనల్ని వెంబడిస్తోందంటే ఆ రచన మనల్ని కదిలించిందనో, కరిగించిందనో అనుకోవచ్చు. కానీ ఆ భావన ఎన్నాళ్ళు? ఆ తరుములాట ఎంత కాలం? మరో పుస్తకం చదివేదాకానో, లేదా మరో వ్యాపకంలో పూర్తిగా మునిగిపోయ్యే దాకానో! అంతేకాని, ఇదేటి ఈ నాయుడుగోరి గోడు సెవ్వుల్లో కాకుండా గుండెల్లో దూరిపోయి ఓ పట్టాన వదలకుండ పట్టేసినాది. అవును నిఝ్ఝంగా నిజెం. నామిని సుబ్రహ్మణ్యం గారి ‘నంబర్ వన్ పుడింగి’ చదివిన నాల్దినాలయినా జిగటలాగా వదలడంలేదు. పట్టింది మెదడుకి కాదు. మనసుకి కాబట్టి.  నిజం చెప్పాల్సిన బాధ్యత ఏ రచయితకైనా ఉంటుంది. ముఖ్యంగా చరిత్రలు, ఆత్మకధలు వ్రాసేటప్పుడు. కానీ నిజం మాత్రమే వ్రాయడం, అది మాత్రమే కలంలోంచి అలాగే పాకేయడం ఆయన  స్వతసిద్ధ లక్షణంగా నామిని ఆత్మకధలో చూస్తాం. అది చదివిన ప్రభావంలో ఉండగానే నామిని గారికే ఉత్తరం వ్రాసే దుస్సాహసం చేశాను. అదే ఈ కిందిది. ఆయన ఉత్తరం అందుకున్నట వెంటనే ఫోను చేసి చాలాసేపు మాట్లాడారు. చాలా సంబరపడిపోయాను. అసలే పుస్తకం చదివిన ఊపు, ఆపై ఆయనతో మాట్టాడిన పూనకం – ఇదిగో ఇక్కడ ఇలాగ బ్లాగేస్తున్నాను. చిత్తగించండి.
“ఎవడి సోది ఆడే ఆడి బాసలోనే దంచేత్త ఉంటే ఎట్టా సచ్చేది? పదిమంది సదవాలనే గదా ఎవుడయినా రాసేదీ? అచ్చోత్తేదీనూ? ప్రాంతం, మాండలీకం పక్కనబెట్టు. ఊరికో బాస యాస ఉండుద్ది గందా! పక్కూరోడికే అర్తం అయ్యేది కట్టవైపోతే ఎట్టా సదివేది? ‘రావి’  వద్దు – ‘కారా’ కాదు – ‘వంశీ’ కెందుకు – ‘చాసో’ కి చాతకాదు – కేశవరెడ్డికీ, పులికంటికీ ఏందెలుసని అంటావు!!! మరైతే నియ్యి దప్ప ఇంకేం సదవాల్రా? -- అనుకున్నా సగం సదివి. మిగతాయన్నీ సదవొచ్చుగానీ –ఇయ్యి, ఈ ‘పుడింగు’ గాడియ్యి మాత్తరం సదివితీరాలా- అనుకున్నా, పుస్తకం సివరాకరుకొచ్చేకల్లా. నీ పొగురు మాక్కూడా అతికించేట్టున్నావు కదరా ‘పుడింగీ’! అయినా నాకు అర్తం కాని సాలా సంగతుల్లో ఇదోటి—‘నీ అయ్యనొప్పించకుండా, ఎంట తీసికెల్లకుండా, పెల్లెట్ల సేసుకున్నావురా నంగిరి నా కొ---! ఇలాంటి పొగురుబోతు దొంగ పన్లెన్ని సేసినా – గొప్ప పాయింట్లే సెప్పినావు. అందులో ఒకటి –ముక్కెంగా – ‘ఎలచ్చంలప్పుడు కూడా ఆ నీ కొడుకులు డబ్బు దియ్యకబోతే – ఇంకెప్పుడు అది బయటకోచ్చేది?’ ఇది నిజెం. ఇదే నిజెం. ఇంతకంటే ఏ ‘పుడింగు’ అయినా సేసి సచ్చేది ఇంకేం లేదు. గింజల్తోలుకు పోయి నిలవెట్టిందాన్ని—సారాగా అన్నా మన మింద కొంచెం ఒలకబోయించేసుకుంటే --- ఆ నీ కొడుక్కి మల్లీ ఐదేల్లు పని ఉంటాది, గింజలేరుకుందికి. ఇయ్యి మాత్తరం మద్దేన్నం, రాతిరి క్వాటరు మీదే రాసింటావు. ఎక్కువయినందుకే లెక్క నేకండా డోకేసినావ్. అయినా కానీ ఒరే ‘పుడింగీ’ నువ్వు సెప్పినట్టే ఇన్నందుకు, నీకే తలూపినందుకూ అమ్మనీ, అక్కనీ ‘లంజముండలంటా’ వేందిరా? లమ్డిక్కీ! ‘లమ్డిక్కీ’ అంటే నాకర్తం తెలవదు. సోమరాజు రంగారావుకు మైకంలో తెలుత్తాదేమో! ఏదేవన్నాగానీ, నీ యెంబడి దిరిగిన పాపానికి సానా మందిని బజార్నెట్టేసినావు కదరా తిక్కలోడా! అయితేనేం – రోజుకు ఇరవై, ముఫ్ఫై పేజీలు కంటే ఎక్కువ సదవలేనోణ్ణి నీ రెండొందల పన్నెండు పేజీల ‘పుడింగి’ గోలమ్మటా రెండు రోజుల్లోనే పరిగెట్టిచ్చీసినావు కదరా! నువ్వు నిజంగా ‘పుడింగే’. అంతేనా! పిలకాయలకు  ఒక్క కతే చెప్పి ఆల్ల చేత నగిపిచ్చేసినావు సూడు, ఐదూ పదీ పెట్టి కొనిపిచ్చీసినావు సూడు అదీ మొగిలాయితనం అంటే! అందుకే అయ్యన్నీ ఎంటనే కొరియర్ కి పంపించు. నీ యబ్బ డబ్బు పంపిత్తన్లె యిప్పుడే. ఎకౌంటు నెంబరు యిచ్చి పూడ్సినావు కదా సివర్లో.
 మీలా పుడింగిని కాదు కానీ ఒక్కసారిగా మీ పుస్తకం చదివిన వెంటనే ఇంకా ఉండుకున్న పూనకం వల్ల ఇలాగ రాసేశాను నామిని సుబ్రహ్మణ్యం గారూ! క్షమించి మీ పుస్తకాలన్నీ దుకాణాల్లో దొరికేటట్టు సూడు సావీ!”
‘నామిని నంబర్ వన్ పుడింగి’
ప్రచరణ: టామ్ సాయర్ బుక్స్ , ప్లాట్ నెం:211, అన్నమయ్య టవర్స్,యాదవ కాలనీ, తిరుపతి – 517501.
ఫోను: 0877 – 2242102.

లభ్యం: విశాలాంధ్ర, నవోదయ. (ఉత్త మాట. ఎక్కడా లేవు. ఆయన్నే పట్టుకోండి.) 

శుక్రవారం, ఆగస్టు 30, 2013

'అభౌతిక స్వరం'

'అభౌతిక స్వరం' 

 పుస్తకం చదివారా? తప్పక చదవాల్సిన పుస్తకం. చాలా మంది ప్రముఖ వ్యక్తుల లోకీ పరకాయప్రవేశం చేసి వారి గుండె గొంతుకలతో చెప్పిన మాధవ్ శింగరాజు అభినందనీయుడు. 

కొన్ని 'మెచ్చు తునకలు' --
"రాజ్యమంటే నేనేనన్న పధ్నాలుగవ లూయీ పట్టెమంచం పై మూడో తరం సంతతి తూగుతోంది. వేటకెళ్ళడం , చేపలు పట్టడం, పన్నులు వసూలు చెయ్యడం -- ఇదేనా(గా) వారి పని!"
:విప్లవం దుష్ట శక్తి అయితే దుష్టుడినై గర్వించడానికి నాకెలాంటి మొహమాటం లేదు. విప్లవానికి మొదట పూసే పువ్వు ... విషపు నవ్వే గనకైతే ఆ నవ్వుకు వేకువతోనే నా ముఖాన్నివ్వడానికి నేనా రాత్రీ నిద్రపోను."
"దేవుడిని సంశయించినవాడు నాకు దైవ సమానుడు. దేవుడిని ప్రజల్లోకి అనుమతించినవాడు విప్లవయోధుడు."
"దేవుణ్ణి చూపించి భయపెట్టేవాడు ప్రభువైనా, ప్రవక్తైనా నమ్మనక్కరలేదు."
"ఓటమి కూడా విప్లవాన్ని నడిపించే విజయమే."
పైవి 'నెపోలియన్' గురించిన వ్యాసం లోవి.
మరో చోట--
"ఎవరైనా విశ్రాంతిని కోరుకుంటున్నారంటే అర్ధం ... ప్రయాస పడ్డారనీ, అలసిపోయారనీ కాదు. జీవితం పై వారికి ప్రేమ తగ్గిందని."
ఇటువంటివి చాలా చాలానే ఉన్నాయి ఆలోచింపజేసేవి.
రాజా.

ఆదివారం, జులై 14, 2013

ఉత్తరాఖండ ఖండాలు



ఈ చెట్టుని కొట్టనివ్వం. మా అడవి తల్లిని కాపాడుకుంటాం.
1970 ల నాటి ఉత్తరాఖండ్ (అప్పటి ఉత్తరప్రదేశ్ లోని) చిప్కో ఉద్యమ చిత్రం.

ఏమయ్యిందిప్పుడు? ఎవరు కారకులు? ప్రకృతి ప్రేమికుల మాట పెడ చెవిన పెట్టి వ్యాపారమే పరమావధిగా ప్రజలు, ప్రభుత్వాలు ఎడాపెడా గుళ్ళు, హోటళ్ళు, ఎగుడు దిగుడు చూడకుండ రిసార్టులు, కాలజ్ఞానం తెలియక తీర్థయాత్రలు --- ఎవర్ని నిందించుకుంటాం--- స్వయంకృతాపరాధాన్ని  కప్పిపుచ్చుకోడానికి -- ఈశ్వరుడికి మరోసారి మొక్కుదామా? ఆయన పైనే భారం వేసి చిందులు తొక్కుదామా? ఆ మాత్రం పని ఇక్కడనుండే చేసి అక్కడ వాళ్ళనైన బతకనిస్తే ---ఉంటే, ఇంకా ఓపికతో మిగిలుంటే --- ఈశ్వరుడే ఊపిరి పీల్చుకోడా?

ఆదివారం, జూన్ 16, 2013

శ్రీపాద వారి ‘వడ్లగింజలు’కధలు -సమీక్ష



హాస్యం – ఆసికం, వెటకారం – యటకారం, వ్యంగ్యం – వెంగెం అన్నీ ఒక కోవకు చెందినవే  అయినా సందర్భాన్ని బట్టి ప్రకృతి – వికృతి పదాలు వాడితేనే విషయానికి విలువొస్తుంది. హాస్యం అయినా మరో రసమయినా హెడ్డింగు పెట్టుకు వ్రాయడు సరుకున్న వ్రాయసకాడు ఎవరయినా. చదువరి తెలివిడిని బట్టి ఆయా రసాలతో బాటు అసలు సరుకు ఎరుకకు రావాలి, రచనంటే! ఆ కోవకు చెందుతాయి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు. ‘ఆత్మకధ’ లాంటిదే అయినా , ఆయన “అనుభవాలూ జ్ఞాపకాలున్నూ” మనల్ని అలనాటి అగ్రహారాలమ్మటా, గడీ లోకీ, మడి లోకీ ఆర్ద్రత ఉన్నచోట్ల మదిని తడిలోకి తీసుకెళ్ళగలిగే అద్భుతమైన శక్తి గల రచన. యాభైల నాటి కాలమాన పరిస్థితులన్నీ కళ్ళకు కడతాయి. ఎక్కువ భాగం మాత్రం ఆయా బ్రాహ్మణ కుటుంబాల లోగిళ్ళలోనూ, వాకిళ్ళలోనూ

.... తిరుగుతాయి, అందుల్లో ఉన్న లొసుగుల్ని, ముసుగుల్ని రాసుకుంటూ—తోసుకుంటూనూ.

వారిదే అయిన ’వడ్లగింజలు’ కధలు ఆసాంతం పరుగులు పెట్టించే రచన. పబ్లిషరు వాకిట్లోనే “ప్రతి తెలుగువాడూ తప్పక చదవాల్సిన అచ్చ తెలుగు కధలు!” అని తోరణం కట్టేశారు. చదవకపోతే ఎక్కడ తెలుగువాణ్ణి కాకుండా పోతానో అని గబగబా మొదలెట్టేశాను. తీరా లోపలికెళ్ళాక దబదబా చదివించేసింది ఆపనియ్యకుండా. ఆయన శైలి ప్రత్యేకమయినది. శ్రీపాద వారి ఏ ఒక్క రచన చదివినా వారి మిగతా రచనలకోసం తొందరపడకుండా ఉండలేము.
‘వడ్లగింజలు’ పద్నాలుగు కధల సమాహారం. ప్రతీదీ ప్రత్యేకమయినదే! కొన్ని కధలలో పాత్రల పేర్లూ ఉండవు. పరిచయాల పని లేదు. వర్ణనలు అసలే ఉండవు. నేరుగా “సంభాషణ”ల తోనే మొదలయ్యి పోతుంది. ఆ వేగానికీ, శైలికీ అలవడడానికి కొంచెం సమయం పట్టినా, దాని ఫలితంగా అప్పుడు సంభాషించుకుంటున్న రెండు లేదా అంతకు మించి ఉన్న అన్ని పాత్రల్లోకి ఏకకాలంలో మనం పరకాయ ప్రవేశం చెయ్యాల్సి ఉంటుంది. అంతకంటే కూడా ఆ పాత్రలే మనల్ని ఆవహించేస్తాయి. అంతటి శక్తి, ఆకర్షణ ఉన్న రచనలు శ్రీపాద వారివి. కేవలం భార్యా భర్తలిద్దరూ మాట్లాడుకొనే సంభాషణలతోనే మొత్తం కధ “షట్కర్మయుక్తా” నడుస్తుంది, ముగుస్తుంది.  అలాగే అనేక పాత్రలు ఉన్నా, అన్నింటికీ పేర్లు ఉన్నా అవేమి మనకూ – కధాగమనానికీ అడ్డు పడవు. అసలు విషయమయిన ‘చదరంగం’ ఎత్తులతో మనల్ని కూడా ఉత్కంఠలో పడవేస్తాయి, ‘వడ్లగింజలు’ కధలోని ప్రతీ సన్నివేశమూనూ. అంతెందుకు, ముందు మాటలో ‘మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు... “ఈ శతాబ్దం లో వచన రచనకు పెట్టింది పేరు, ... ఒక్క ఇద్దరికే... శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారూ, శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్రి గారూ.” శ్రీపాద వారి విషయంలో నాకు అంతకంటే మించే అనిపించింది. చెళ్ళపిళ్ళ వారివి ఇంకా ఏమీ చదవనందుకు చింతిస్తున్నాను.  
ఇంకా బుక్ షెల్ఫ్ లోంచి ఊరిస్తున్న శ్రీపాద వారి రచనలు ‘పుల్లంపేట జరీ చీర’, ‘మార్గదర్శి’, ‘కలుపు మొక్కలు’ నన్ను కీ బోర్డు మీద నిలవకుండా చేస్తున్నాయి. మరోసారి మరో మంచి పుస్తకం గురించి ముచ్చటించుకుందాం.
మీ వ్యాఖ్యతో పాటు 'ఇమెయిలు' ఇస్తే మీకొక శ్రీపాద వారి పెను కానుక పి డి ఎఫ్ రూపంలో పంపగలను.


గురువారం, మే 23, 2013

'సమ్మర్ హిల్'  పుస్తక సమీక్ష

చాలా కాలం తరువాత పుస్తకాలు చదివే తీరిక, అవకాశం దొరకడంతో వరుసగా నాలుగు చదివి ఐదోది చదువుతూ చదివినవాటి గురించి మిత్రులతో అభిప్రాయాలు పంచుకోవాలని ---
నేను చదివిన నాలుగు పుస్తకాలూ—1) ఎ.ఎస్.నీల్ రచన ‘సమ్మర్ హిల్ ‘ తెలుగు అనువాదం. 2)శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి – ‘వడ్లగింజలు’ 3)రఘు – ‘ప్రేమతో వడ్డెర చండీదాస్’4)ఈచర్ వారియర్ ‘నాన్న – రాజన్ తండ్రి అన్వేషణ’ తెలుగు అనువాదం. ఇక ఇప్పుడు సగంలో ఉన్నది – సడ్లపల్లె చిదంబర రెడ్డి రచన ‘కొల్లబోయిన పల్లె’.
ఇందులో విషయపరంగా ఒకదానికొకటి పోలిక లేవు. కానీ ఎందుకనో పుస్తకాల అరలోంచి వెదుక్కొని ఏరి ఏరి ఇవన్నీ వరుసలో చదివాను. ప్రతి పుస్తకం విభిన్నమయిన అనుభూతిని, కొన్ని భావోద్వేగాన్ని కలిగించాయి.

ఎ.ఎస్.నీల్ వ్రాసిన ‘సమ్మర్ హిల్’ పుస్తకం పిల్లల పెంపకం గురించిన వాటిలో జగద్విఖ్యాతి గాంచిన పుస్తకం. చాలామంది చదివే ఉంటారు లేదా వినైనా ఉంటారు.  పెంపకం గురించి కంటే కూడా పిల్లల మనస్తత్వ పరిశీలన, దానిపై ఆధారపడి తల్లిదండ్రులకు, టీచర్లకు మార్గదర్శి గా ఈ పుస్తకం ఖచ్చితంగా చదవవలసినదే. తెలుగులో అనువాదం కోసం ఎదురు చూసి, ఇప్పటికి దొరకబుచ్చుకోగలిగినందుకు సంతోషంగా ఉంది. రచయిత స్వయంగా ఇంగ్లండు కు సమీపంలో తన ఆశయాలకు తగ్గట్టు స్కూలు నిర్మించి నిర్వహించి సాధించి --- ఆ అనుభవాలనే పుస్తకంగా మలిచారు.
పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపే నేటి పోటీ ప్రపంచపు బలవంతపు మార్కుల/ర్యాంకుల చదువుల దుష్ఫలితాల దిశగా పోకుండా, స్వేచ్చగా బిడ్డ తన అభిరుచి మేరకు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కలిగించడమే ‘సమ్మర్ హిల్’ స్కూలు ముఖ్య ఉద్దేశ్యం. పుట్టగానే ఇంజనీరు, డాక్టరు, పెద్ద గుమాస్తా(ఫైనాన్సియల్ అకౌంటెంట్), కంప్యూటర్ కీ బోర్డు ఆపరేటర్ (సాఫ్టువేరు ఇంజనీరు)  లేదా మరోటో అనీ తల్లిదండ్రులూ, ఆ పై ఫ్లెక్సీలు, బానర్లు, హోర్డింగులు, బ్రోచర్లు, టివీ ప్రకటనల హోరుతో ప్రయివేటు స్కూళ్ళ యాజమాన్యాలూ బిడ్డని పంజరంలో ఇరికించే ప్రక్రియ ఇంటింటా సాధారణమయిపోయిన ఈ రోజుల్లో ‘సమ్మర్ హిల్’ కనువిప్పు కలిగించేదే. అయినా అందరినీ పీడించే ప్రశ్న—“ఇది ఆచరణ సాధ్యమేనా?”  మొదటగా మనం ఆలోచించుకోవాల్సింది ఇంజనీరుకో, పెద్ద గుమాస్తాకో తల్లిదండ్రులమా? లేక స్వేచ్చగా పెరిగి మనుషులుగా తయారవ్వబోయ్యే పిల్లలకు తల్లిదండ్రులమా? ఈ విషయాన్నే ‘సమ్మర్ హిల్’ చాలా సోదాహరణంగా ఆచరణసాధ్యమయిన పద్ధతులను చర్చించింది. ఇప్పటి యాంత్రిక చదువులు, జీతాల/సంపాదనల పాత్రను నిర్దారించడానికే తప్ప జీవితాల్ని, వాటి మాధుర్యాన్ని చవి చూడగలిగే మానవ సంబంధాల్నిపెంపొందించుకొనే నేర్పరితనాన్ని, స్వేచ్చకు అవకాశాన్ని ఏ మాత్రం దరి చేరనీయడం లేదు. అందుకే విద్యావంతులు పెరుగుతున్నా, స్కూళ్ళు, కాలేజిలు లెక్కకు మించి పెరుగుతున్నా—విజ్ఞత, వివేకం కొరవైన యాంత్రిక జీతగాళ్ళను మాత్రమే తయారు చేసుకుంటున్నాము. అందుకే సమాజంలో, ప్రతి వ్యక్తిలోనూ, వ్యవస్థలోనూ ఈ అశాంతి, అభద్రత. మన చదువులు ఏ కోశానా స్వేచ్చను, మానవత్వాన్ని బోధించడంలేదు. తద్భిన్నంగా ‘అవి’ అవసరం లేదు అనే ఆలోచనను చిన్నతనం నుండే బుర్రల్లో బీజింపచేస్తున్నాయి. అనవసర చాదస్తాలతో, మూడ నమ్మకాల పట్ల ఆసక్తిని కలుగచేస్తున్నాయి మన లోగిళ్ళు. ఉదాహరణకు సెక్స్ పట్ల లేని పోని అపోహలు కలిగించి పిల్లలకు, యువకులకు అదేదో నేరసంబంధిత చర్యగా భావన కలుగ చెయ్యడం వల్ల వారిలో చిన్నతనంనుండే తాము నేరస్తులమన్న భావన అంతరాంతరాల్లో ఏర్పడి అదే స్థిరపడిపోతుందన్న విషయాన్ని ‘సమ్మర్ హిల్’ పరిశీలనాత్మకంగా మన ముందుంచుతుంది. యూరప్ ఆలోచనల ప్రభావం చేతనేమో, సెక్స్ విషయాలను మోతాదుకు మించి చర్చించిందని మన భారతీయులకు అనిపించొచ్చు. ఉదాహరణకు పిల్లలలో సెక్స్ పట్ల ఆసక్తి, హస్తప్రయోగం వగైరా విషయాలను చాలా సందర్భాల్లో బాహాటంగా చర్చించడం జరిగింది. కానీ అందులో నిజాయతీ, నిర్మొహమాటం, చెప్పాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే అది సహజమయిన, ప్రకృతి సంభందిత విషయం. అతి ముఖ్యమయినది కూడా. మొత్తం మీద విలువైన పుస్తకం. మంచి మనుషులుగా తమ బిడ్డలను తిర్చిదిద్దుకోవాలనే ప్రతి తల్లిదండ్రులూ, అలాంటి బాధ్యతను విస్మరించని ఉపాధ్యాయులూ తప్పక చదవవలసిన పుస్తకం ‘సమ్మర్ హిల్’. పుస్తకంలోవి మచ్చుకు కొన్నివాక్యాలు ----
అబద్ధాలు చెప్పడం స్వల్పమైన బలహీనత. అబద్దాలతో జీవించడం ఘోరమైన ప్రళయం.”
“బలప్రయోగం అనేది మానవజాతిని పట్టి పీడిస్తున్న శాపం. పోప్, రాజ్యాంగ యంత్రం, టీచర్,తల్లిదండ్రుల ద్వారా బలప్రయోగం జరుగుతున్నది.”
“నిజానికి స్కూళ్ళలో, కాలేజీలో ప్రధమ స్థానం సంపాదించే సంపాదించే విద్యార్ధులలో ఎక్కువమంది తరువాత సామాన్యులుగా దిగాజారిపోతారు.”
“జీవితం నుంచి పలాయన మంత్రం పటించడానికి మతం ఉపయోగపడుతుంది.”
ప్రచురణ: ప్రజా శక్తి బుక్ హౌస్.  పేజీలు: 338. వెల: రూ.130/-.  

తదుపరి పోస్టు కొద్ది రోజుల్లో శ్రీపాద వారి 'వడ్లగింజలు' గురించి.

సోమవారం, జూన్ 25, 2012

పరాయి పాలన నాడు-నేడు


                         పరాయి పాలన, నాడు-నేడు

పాలక, పాలిత వర్గాల మధ్య ఘర్షణను చిత్రీకరించిన రచనలు 20 వ శతాబ్ది తొలి అర్ధ భాగంలో చాలా వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ‘దొర’తనాన్ని కళ్ళకు గట్టే, వాటిని ఎదుర్కోవడంలో సామాన్యుల తెగింపు గురించిన  రచనలు, అదే సమయంలో నిజాం నిరంకుశ పాలనపై వెలువడిన కధలు, గేయాలు, నవలలు వగైరా సాహిత్యం చాలానే ఉంది. ఆ సమయంలోనే – 1937-38 కాలంనాటి తెలంగాణ పరిస్థితుల్ని ఒక పల్లెటూరి నేపధ్యంలో వాస్తవాలకు దగ్గరగా చిత్రీకరించిన నవల శ్రీ దాశరధి రంగాచార్యా గారి ‘చిల్లర దేవుళ్ళు’. ఈ రచయిత--- ఎన్నో సినీ గీతాల, మాటల రచనలు చేసిన సుప్రసిద్ధ కవి శ్రీ దాశరధి కృష్ణమాచార్యులవారికి సోదరుడు, వరంగల్లు జిల్లాకు చెందిన వారు.

‘చిల్లర దేవుళ్ళు’ నవల ఆసాంతం అప్పటి తెలంగాణ పల్లెలలో జరుగుతున్న దారుణమైన దోపిడీని, కుల/వర్ణ వ్యవస్థని అద్దం పట్టినట్టు చిత్రీకరించడం జరిగింది. తెలంగాణ మాండలీకంతో బాటు, అప్పటి నిజాం పాలనా ప్రభావం వల్ల తెలుగులో, తెలంగాణంలో జొరబడిన ‘ఉర్దూ’ వాడుకను యధాతధంగా ఆయా పాత్రలతో పలికించారు. ఉర్దూ పదాలకు మాత్రం కింది ఫుట్ నోట్స్ లో అర్ధాలు ఇచ్చారు. అక్కడక్కడా కధనంలో తెలంగాణా మాండలీకం ఇతర ప్రాంత పాఠకులకు కొంచెం అడ్డు తగిలినట్టనిపించినా, కధాగమనంలోని నిజాయితీ వల్ల, వాస్తవ చిత్రీకరణ వల్ల కొంతసేపటికి పూర్తిగా కధలోని జీవితాలలోకి ప్రవేశించేస్తాము. ఇక భాష అడ్డు రాదు.
అప్పటి తెలంగాణాలోని పరిస్థితులపై, ముఖ్యంగా--- కుల వ్యవస్థపై, వెట్టి చాకిరిపై, దొరతనపు దౌర్జన్యాలపై, స్త్రీల అణచివేతపై, గ్రామపెద్దల (పటేల్ పట్వారీ వ్యవస్థ) కుయుక్తులు—భూఆక్రమణలపై, నిజాం నిరంకుశత్వంపై, బలవంతపు మతమార్పిళ్ళపై ఎక్కుపెట్టిన అస్త్రం దాశరధి రంగాచార్య గారి ‘చిల్లర దేవుళ్ళు’.  అంతేకాకుండా తెలంగాణాలోని అప్పటి ఆర్ధిక, సామాజిక స్థితిగతులతో బాటు ఆనాటి రాజకీయ వ్యవస్థని కూడా మనకు కళ్ళకు కట్టింది ఈ నవల. నవలాప్రక్రియలో భాగంగానే పాత్రలు కల్పితాలే అయినా, వాటి స్వభావం వాస్తవానికి దగ్గరగా ఉండడం, అప్పటి యదార్ధ రాజకీయ సంఘటనల్ని, వ్యక్తుల్ని పాత్రలుగా చేర్చడం ద్వారా ‘చిల్లర దేవుళ్ళు’ చారిత్రక నవల స్థాయిని పొందింది.
అయినప్పటికీ నవల సౌందర్యం కోసమో, లేదా రచనా సరళి అదేనేమో గాని, సాధారణ నవలల్లో కనిపించే వర్ణనలు, ముఖ్యంగా నాయకీ నాయకుల ప్రేమ వ్యవహారాల్లో ఊహల్లో తేలడాలు, నాయకుని పట్ల చాలామంది యువతులు ఆకర్షితులవ్వడం, తీరా అతని నుంచి సానుకూల స్పందన కనిపించకపోయేసరికి – ఆకస్మాత్తుగా సోదర ప్రేమగా పరిణతి చెందిపోవడం వగైరా విషయ చిత్రీకరణలో సాధారణ నవలా ప్రక్రియ చట్రాన్ని అధిగమించలేకపోయారు రచయిత. ముఖ్యంగా కధాంతంలో – అప్పటి వరకూ ‘పంతులు’ గా వున్న పాణి (నాయకుడు), రెడ్డి గారి పుత్రిక ‘మంజరి’ని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి — కధలో గొప్ప మలుపు తిప్పేసి, నాటకీయ లేదా సినిమా ఫక్కీలో నాయకుడు చిన్నప్పుడు తప్పిపోయిన బావ వరుసవాడేనని ముఖ్యంగా ‘రెడ్డే’ నని తేల్చి వర్ణ సంకరం జరక్కుండా జాగ్రత్త పడిపోయినట్టు అనిపిస్తుంది రచయిత ఊహ. లేదా వర్ణాంతర వివాహం అప్పట్లో అసాధ్యం అనుకొని ఎందుకు ఎదురీత అని సరిపెట్టారో తెలియదు గాని, నవలలోని అభ్యుదయ భావాలకు ఇది కొంత అవరోధంగా కనబడుతుంది. మొత్తం మీద కధనం అంతా ‘గడీ’ (కోట లాంటి దొరల నివాసం)లోనూ, వారి వాకిళ్ళ లోనూ అధిక భాగం జరగడం వల్ల, పీడిత జనాల గుడిసెల్లోకి అంతగా చూసినట్లు కనపడదు. కానీ ముఖ్య పాత్రధారి ‘పాణి’ అప్పటి చారిత్రిక పురుషులు మాడపాటి హనుమంతరావు వంటి స్వాతంత్ర సమర యోధులతో చర్చలు జరపడం, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు, ఆంధ్రమహా సభల నిర్వహణ మొదలైన విషయాల్ని ప్రస్తావించడం ద్వారా నవలకు చారిత్రిక లక్షణం అబ్బింది. ‘మెలోడ్రామా’ కి సంబంధించిన కొద్దిపాటి ఘటనలూ మినహా, మొత్తం మీద ‘చిల్లర దేవుళ్ళు’ చదవదగ్గ పుస్తకం.  స్వాతంత్రానికి పూర్వపు తెలంగాణ ముఖ చిత్రాన్ని అతి దగ్గరగా చూసే అవకాశం పాఠకులకు దొరుకుతుంది. అప్పటికీ, ఇప్పటికీ ఆలోచింపచేసే, మేలుకొలిపే ఉన్నత రచన ‘చిల్లర దేవుళ్ళు’. సాహిత్య అకాడమి అవార్డు, హిందీ, ఇంగ్లిషు భాషల్లోకి అనువాదంగా వెళ్లడం, ఆకాశవాణిలో రేడియో నాటకంగా ప్రసారం, దరిమిలా సినిమాగా నిర్మించడం – ఈ నవలకు అవార్డులు, రివార్డులుగా పరిగణించవచ్చు. అనేక పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకం. విశాలాంధ్ర ప్రచురణ.
ఇంతటితో ఈ సమీక్ష అయిపొయింది కానీ, కాకతాళీయంగా వెనువెంటనే చదివిన మరో పుస్తకం గురించిన వ్యాఖ్య కూడా జమిలిగా ఇక్కడే వ్రాస్తే సరిగా ఉంటుందని భావించాను. ‘చిల్లర దేవుళ్ళు’ రచనా కాలం నాటి నుండి-- ఆరు దశాబ్దాల తరువాత కధల రూపంలో వచ్చిన ‘న్యూ బాంబే టైలర్స్’ మహమ్మద్ ఖదీర్ బాబు కలం నుండి ఒలికిన జీవిత చిత్రాలు. 
 ఈ రెండు పుస్తకాలకు పొంతన లేకపోయినా ఏదో తెలియని లింకు ఉందనిపించే వైచిత్రి. అప్పటి నిజాం పాలనలో నిరంకుశంగా జరిగిన మత మార్పిళ్ళు గురించి విడమర్చిన ఉన్నతవర్గానికి చెందిన రచయిత రంగాచార్య గారయితే, అరవయ్యేళ్ళ తరువాత ముస్లిముల దీనావస్థను వ్యధాభరితంగా చిత్రించిన నేటి మైనారిటీ వర్గానికి చెందిన రచయిత ఖదీర్ బాబు. ఈ రెంటిలోనూ ఉన్న సారూప్యాలు వాస్తవ జీవిత చిత్రీకరణ, అణచివేత.  అయితే అణచివేత విషయంలో వర్గాలు మారినా, పాలక – పీడిత చరిత్ర మెజారిటీ, మైనారిటీ లకు అతీతమయినదని గ్రహించాలి. ‘చిల్లర దేవుళ్ళు’ తెలంగాణ (వరంగల్లు) నేపధ్యం లోనిదయితే, ‘న్యూ బాంబే టైలర్స్’ చిన్న పట్టణం లోని చిన్న మధ్య తరగతి జనుల మధ్య నడుస్తాయి. కావలి పట్టణం దానికి నేపధ్యం.
స్వాతంత్రానికి పూర్వం తెల్ల దొరల దౌష్ట్యం, అంతకు మించి గ్రామాల్లో దొరల, భూస్వాముల దౌర్జన్యాలు ‘చిల్లర దేవుళ్ళు’ కళ్ళకు గడితే, స్వాతంత్రానంతరం నల్ల దొరల దాష్టీకం, మత విద్వేషాలు, పరోక్షంగా పరాయి శక్తుల పాలన, గ్రామాల్లో చేతివృత్తుల, చిన్నకారు బతుకుల ఛిద్ర పటాన్ని’న్యూ బాంబే టైలర్స్’ ఆవిష్కరించింది. 
ఖదీర్ బాబు కధావిధానం, అతిశయోక్తులు లేని సరళత, గుండెల్ని తాకే మధ్య చిన్న తరగతి బతుకుల చిత్రీకరణ ఆయన అన్ని రచనల్లో లాగానే సహజంగా ఉన్నాయి. ‘గుడ్డలంటే కొలతలు బట్టి కుట్టడం కాదు, మనిషిని బట్టి కుట్టడం’ అనే పీరుభాయికి, పోరడు, వాళ్ళ నాయన, తాత కూడ ఒకే చొక్కాలో దూరగలిగే ‘లూజు’ ఫిట్టింగు రెడీమేడ్ గుత్తందారీ కుట్ర బాగానే అవగాహనకు  వచ్చింది. నైపుణ్యం, పని కౌశల్యం  స్థానం లో కేవలం లాభం, పెట్టుబడి చొరబడ్డాయని, అవి సామ్రాజ్యవాదులు, పెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థల కబంధ హస్తాల్లోనే ఉన్నాయని, స్వతంత్రం, ప్రజాస్వామ్యం బూటకం గానే మిగిలిపోతున్నాయని, గౌరవమయిన కులవృత్తులు చేసుకొనేవారు రోజువారీ కూలీలుగా బతుకు బానిసలుగా మారిపోవలసి వచ్చిందని పీరూభాయికి బోధపడినా పౌరుషం చంపుకోలేక తన పాత టైలరు దుకాణానికే రంగులేసి మళ్ళి తెరవడం అతని వ్యక్తిత్వాన్ని చాటి చెబుతాయి. అదే దోవలో, ‘పెండెం సోడా సెంటరు’ కధ కూడ నడుస్తుంది. విదేశీ పానీయాల ధాటికి, వాటి రంగు రంగుల వ్యాపార ప్రకటనల జోరుకి ఆరోగ్యమయినవి, చౌకయినవి అయిన మన పానీయాలు, సోడాలు వెల వెల పోతూంటే--పెండెం చంద్రయ్య ముందు నీరు కారిపోయినా, స్వాతంత్ర పోరాటం నాటి స్ఫూర్తి అతనిని, అతని మనో ధైర్యాన్ని దెబ్బ తీయలేకపోయాయి. అందుకు మూల్యంగా తన తరువాతి తరం (కొడుకు) కూడా బలి అయిన సంగతి మనసుల్ని కలచివేస్తుంది. మిగతా కధలలో ఎక్కువ ముస్లిముల వ్యధలు కనబడతాయి. మూఢసంప్రదాయాలు, ఆర్భాటాలు మధ్యతరగతి బతుకుల్ని అప్పుల ఊబిలోకి ఎలా దించి, కుదించి, కృశింప చేస్తాయో విశదమవుతుంది.
ఇన్నీ చదివాక ఖచ్చితంగా అనిపించే, అగుపించే విషయం — అవును, మనం నిజంగా పరాయి పాలననుండి విముక్తి పొందామా? లేదా నల్లదొరల మధ్యవర్తిత్వంతో, దళారి తనంతో ఇప్పటికీ అస్వతంత్రులుగానే ఉన్నామా? అనిపిస్తుంది. నిజమే మరి! మనం కట్టిన పన్నులతో భారీగా దశాబ్దాల పాటు చేసిన పరిశోధన, పరిశ్రమ అంతా విదేశీ పెట్టుబడుల పేరుతో ప్రయివేటుపరం కావడం తరువాతి పరిణామంగా మన సహజ వనరులే మనకి గాని, మనం ఎన్నుకున్నామనుకుంటున్న, కుంటుతూన్న ఈ ప్రభత్వం అజమాయిషీలో లేకపోవడం ఇప్పటి చేదు నిజం. ఉదాహరణగా – ఒ ఎన్ జి సి వేల కోట్ల ఖర్చుతో చేసిన పరిశోధన, సహజ వాయు నిక్షేపాల గుర్తింపు – ఒక్క సారిగా రిలయన్సు లాంటి వడ్డీ వ్యాపారస్తుల చేతికి అప్పచెప్పి సహజ వాయువు లభ్యత ఎంతో కూడా తెలుసుకోలేని దీనావస్థ మన ప్రభుతది. కొనసాగింపుగా ఆ బావుల్లో 26 శాతం వాటాను ‘బ్రిటీషు పెట్రోలియం’ సంస్థకు రిలయన్సు లాభాలకు అమ్ముకోవడం—దేనికీ సూచన. మనం ఎవరి అదుపులో, ఆధిపత్యంలో ఉన్నాం.