ఈ బ్లాగును శోధించు

ఆదివారం, మార్చి 06, 2011

ముళ్ళపూడి


ముళ్ళపూడి వెంకటరమణ గారి  అస్తమయం తెలుగు సాహితీ ప్రియులకు అశనిపాతమే! ముఖ్యంగా హాస్య, చమత్కార, వ్యంగ్య రచనలు ఆస్వాదించేవారికి తీరని లోటే! నాకు వ్యక్తిగతంగా ఆయన రచనలతో ఏర్పడిన అనుబంధం అనుపమానమైనది. ఇది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. బాపు రమణల మీద ఉన్న అపారమైన అభిమానంతో ఒక స్నేహితుని సహాయంతో 2006 లో చెన్నై లోని వారింటికి వెళ్ళాను. ఉదయమే 8 గంటల వేళ బాపు గారి సతీమణి తలుపు తీసి కూర్చోమని మాకు మంచి నీళ్ళిచ్చి, బాపు గారిని పిలిచారు. నాకు మాటలకందని ఉద్వేగభరితమయిన ఆ క్షణాల్ని వివరించలేను. మమ్మల్ని పరిచయం చేసుకొని, ఉదయాన్నే వారికి అసౌకర్యం కలిగించానేమో అని మొక్కుబడిగా అనబోయేంతలోనే ఆయన ఆ మాటను తుంచేసి, మేము అంత (హైదరాబాదు) దూరంనుండి రావడాన్ని లోతుగా ప్రస్తావించి, హైదరాబాదులోనె  వారిని ఎప్పుడైనా కలవవొచ్చని చనువిచ్చారు. వెంఠనే నేను చంక ఎక్కేసి హైదరాబాదు వచ్చినప్పుడు మా ఇంటికి రావాలని ఆహ్వానించేశాను. ఆయన అంత సులువుగానే అంగీకరించేశారు-- ఒక్క షరతుతో-- ఎన్ సి ఎల్ రామచంద్ర రాజు గార్ని కలవాలని. అంతకు ముందే మా మాటలలో రామచంద్ర రాజు గారి ఇంటి దగ్గరగానే ఉంటాను అని చెప్పాను.
ఇంతలో రమణ గారు చెయ్యి తుడుచుకుంటూ వచ్చారు. ఉదయాన్నే భోజనం కానిస్తున్నానని, మేము వేచి ఉన్నందుకు సంజాయిషీగా ఏదో చెప్పబోయారు-- అంతలోనే నేను నాలుగు పళ్ళు వారిద్దరి చేతుల్లో పెట్టి వంగి కాళ్ళకు దణ్ణం పెట్టాను-- వారిద్దరూ వారించినా! నాకు గుర్తుండి అంతకు మునుపు ఎవరికీ కాళ్ళకి దణ్ణం పెట్టలేదు- మా నాన్నగారు చిన్నప్పట్నుండీ నూరిపొసిన ఆత్మగౌరవ సిధ్ధాంత ఫలితంగా! బాపు రమణ గార్ల విషయంలో ఆ సిధ్ధాంతానికి మినహాయింపు ఇచ్చేశాను. భాషాపరంగా ఇద్దరి పేర్ల మధ్య కామా వాడడం అవసరం. కాని వారిద్దరి మధ్య కామా కాదు కదా -- చిన్న ఆణువుని కూడా దూర్చె సాహసం ఎంతటి భాషా పండితుడూ చెయ్యలేడు. 
రమణ గారు ఉత్సాహంగా కబుర్లు చెప్పారు. బాపు గారు ఎక్కువసేపు మౌనంగా వింటూ మధ్య మధ్యలో మితంగా మాట కలుపుతున్నారు. మాటల్లో రమణగారు తను ఇప్పుడు బాపు ఇంట్లోనే ఉంటున్నానని, ఆర్ధిక ఇబ్బందుల వల్ల సొంత ఇంటిని పోగొట్టుకున్నానని చెప్పారు. చాల బాధ అనిపించినా, దేవుడున్నాడో లేడో తెలియని అయోమయం గాణ్ణి, నాకు మొదటగా ఉన్నాడేమో అని సందేహం లాంటిది కలిగింది. అందుకే వారిద్దరూ కలిసే ఉండాలని రమణ గారి ఇల్లు పోగొట్టి ఉంటాడు. నాలాంటి సామాన్యుడి ఉహకి  కూడా అందని  సంగతి-- ఎంత స్నేహితులయితే మాత్రం ఇంత విడ్డూరమా?
మరోసారి ఆ అపురూప ద్వయాన్ని కలిసిన సందర్బ్హం-- సికింద్రాబాదు తాజ్ మహల్ హోటల్ లో ఉదయానే నేను టిఫిన్ ఆర్డర్ చేసుకొని ఎదురు చూస్తుండగా, బాపు రమణ గార్లు లోపలికి వచ్చి ప్రవేశం దగ్గరగానే కూర్చొని టిఫిన్ ఆర్డర్ చేసుకున్నారు. నాకు వెంఠనే వెళ్ళేసేసి ఉన్నపళంగా మాట్టాడేయాలని ఆత్రుత.కాని సభ్యత అడ్డొచ్చి ఆగాను. వారు నాలాగే ఎం ఎల్ ఏ పెసరట్టు తింటున్నారు. ఓపికపట్టి   వారి ఫలహారం పూర్తవగానే వెళ్లి దణ్ణం పెట్టి పలకరించాను. పూర్వాశ్రమంలో వారింటికి వెళ్ళిన వివరాల్ని గుర్తు చేసి మరోసారి ఇంటికి రమ్మని ఆహ్వానించాను. ఓ యెస్ అన్నారు. అంటూనే ‘రామచంద్ర రాజు గారు ఎలా వున్నారు? మీకు దగ్గరే కదా! చూడొచ్చు ఒకసారి’ అనడుగుతుంటే చెప్పొద్దూ – నాకు కొంచెం ఆ రామచంద్ర రాజు గారంటే అసూయ కలిగింది. ఇంతటి స్నేహమయుల స్నేహాన్ని అందుకోగల ఆయన ధన్యుడే అనుకొని ఊరుకున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీలో టివి కోసం రామాయణం తీస్తున్నామని, నాన్నోకసారి అక్కడకు రమ్మని ఆహ్వానించారు. అప్పుడు మా ఇంటికి వెళ్ళే కార్యక్రమం  పెట్టుకోవచ్చు అన్నారు. అలాగే! అన్నాను. అలాగే అశ్రద్ధ చేసేశాను. జీవితంలో ఎంతటి గొప్ప అవకాశాన్ని కోల్పోయానో ఇప్పుడర్ధమౌతోంది. అయినా ఫరవాలేదు. ఆయన పాత పుస్తకాలనే మళ్ళిమళ్ళి చదువుకుంటూ కొత్తగా ఉహించుకుంటూ అవే పాత్రల్ని సాగదీసుకుంటూ కాలం గడిపేస్తాను. కాని రాబోయే తరాలవారికి ముఖ్యంగా తెలుగు వారికి నట్టింట బుడుగులు, పెరటింట బామ్మలు, పక్కింట పిన్నిలు, ఎదురింట సీతలు, మనసింట సీగానపెసూనాంబలు మట్టంగా తెలుగింట గిలిగింతలు లేకుండా పోతాయేమోనన్న బెంగ చాలా భారం అనిపిస్తోంది.
రమణ గారికి ఆత్మశాంతి, బాపు గారికి మరింత మనోబలం చేకూరాలని కోరుకుంటూ ఓ భాగ్య అభాగ్య్డుడు.  

1 వ్యాఖ్య:

Phani Dokka చెప్పారు...

రాజా గారూ,

మీ రచన బావుంది. బాపు రమణల ముచ్చట్లు చెప్పుకునే కొద్దీ బావుంటాయి, విన్నకొద్దీ వినాలనిపిస్తాయి, పోతన పద్యాల్లాగ.

మీ ప్రొఫైల్ ఫొటో పూర్తిగా చూద్దామని బటన్ నొక్కితే, అదే బొమ్మ కాస్త పెద్దది గా కనబడింది :-)

మీలాగే నాక్కుడా మిథునం కథ అంటే ప్రాణం.

మీకు వీలున్నప్పుడు నా "పల్లకీ" పుస్తకం ( నవోదయ విజయవాడ వారివద్ద, హైదరాబాదు సంస్కృత భాషా ప్రచార సమితి, అబిడ్స్ వారి వద్ద దొరుకుతుంది ) చదివి మీ అభిప్రాయాలు, కామెంట్లు చెప్పండి.

నమస్కారములతో,
ఫణి డొక్కా.