తెలుగు సంగతులు

సోమవారం, ఆగస్టు 10, 2020


'ఇంట్లో ప్రేమచంద్'

బెంగాలీ కధల్నీ, నవలల్నీ, సినిమాలుగా తీసిన ప్రముఖుల రచనల్నీ అరవై ఏళ్లక్రితం ప్రజ్ఞాశాలి సమీక్ష చేస్తూ --" ఏవుందీ! కుండెడు కుంకుమా, బండెడు పాదధూళీ నూ"అని ఒక్క ముక్కలో కొట్టిపారేశాడు. అంత నిర్దాక్షిణ్యంగా మెచ్చుకోలు తీర్పు ఇవ్వగలిగేది ఇంకెవరు? మన ముళ్ళపూడివారే. ఆయనే ఇంకోసారి గురుదత్ ' ప్యాసా ' సినిమాను సమీక్షిస్తూ అలాగ పార్కులమ్మటా పొడుగ్గా సిగరెట్లు నిట్టురుస్తూ పాటలు పాడుకోపోతే సుబ్బరంగా కధానాయికతో ముఖాముఖీ కూర్చొని ఇదీ సంగతి అని చెప్పుకోవాలికదా? అని తేల్చేశేడాయన, పెద్దంతరం చిన్నంతరం పట్టించుకోకుండా. ! కతల్ని కమామీషుల్నీ సమీక్షించడానికి పెద్దంతరమేవిటీ? అందులోనూ ముళ్ళపూడి వారికి.

ఇంతకీ ఇప్పుడు సంగతంతా ఎందుకూ అంటారా. వస్తున్నా అక్కడికే! సరే మధ్య మధ్యలో నుదుట సింధూరం, పాదధూళీ మనక్కూడా బానే ఉంటాయి కదా అని ఆశతో బెంగాలీ కధలూ, నవలలూ చదవాలనే చాపల్యంతో తిరగేస్తుంటాం కదా, కాస్త వెరైటీ కోసం. అదో అలవాటు.బలహీనతా. పైగా అనువాదం చేసింది చెయ్యి తిరిగిన శాంతా సుందరి గారో అయితే మరీ మనసు లాగుతుంది కదా. మధ్యన వరసబెట్టి ఆవిడ అనువాదాలు చదివేసిన ఊపులో వెతికి మరీ బంగాలీ ప్రసిధ్ధ రచయిత గురించి ఇంటావిడ రాసిన పుస్తకం గుక్కపెట్టి మరీ చదివేశాను. అయిపోయింది. ఇంతకీ ప్రముఖ రచయిత, సామ్యవాది, మానవతావాది కీ.శే. ప్రేంచంద్. ఆయన గురించి ఆయన భార్య 'శివరాణీదేవి 'రచించిన  పుస్తకం పేరు 'ఇంట్లో ప్రేమచంద్ ‘.



పుస్తకం పూర్తయ్యేసరికి, ఏంటబ్బా ఇంతకీ ఇందులో  ఏవిటి సంగతీ అనిపించింది. ముళ్ళపూడి వారి మాటలు బెంగాలీ రచనల గురించినవి గుర్తొచ్చాయి. ఎటొచ్చీ 'వంటెడు జబ్బులూ, ఇంటెడు విరేచనాలూ లెక్క తేలాయి కధనంలో.

ఎవరి జీవిత చరిత్ర అయినా, ఆత్మ కధ అయినా సొంత ఘోష, గోడు లేదా స్వోత్కర్షగా ఉండవు సాధారణంగా. ఎక్కువమంది మహానుభావులవి చరిత్రను నమోదు చేసేవిగా ఉంటాయి. వారి ఆదర్శప్రాయమైన జీవితాల్లోని లోపలి కోణాల్నీ, వారి రోజువారీ అలవాట్లలోని క్రమతనూ, వీధిలోకీ ఇంట్లోకీ వారి ఆలోచనలకూ, అలవాట్లకూ ఉండే సామీప్యతను, తేడాలనూ కూడా ఎత్తి చూపిస్తాయి. ఎక్కువ భాగం ఆయా పెద్దల ఆత్మకధలు ఎంతో నిజాయితీతో నిండి మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు చెబుటాయిగాంధీ గారి సత్యశోధన గానీ శ్రీశ్రీ అనంతం గానీ అలాంటి కుండబద్దలు విషయాలు మనకు ఆహా, అందుకు కదా వాళ్ళు మహాత్ములయ్యారు అనిపించేలా ఉంటాయి

నా మట్టుకు నాకు కొన్ని జీవితచరిత్రలూ, ఆత్మ కధలూ నిరాశనూ నిస్పృహనూ కలిగించాయిప్రభావవంతమయిన సంగతులు దొరకవు సరికదా, అనవసర ప్రసంగాలూ, తెలుసుకోనక్కరలేని విషయాలూ ఉంటాయి. నాకు అలాంటి భావన మాక్సిం గోర్కీ నా బాల్యం, నా బాల్యసేవ చదివినప్పుడు కూడా కలిగింది. ఆయన రచనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రభావాన్ని చూపించినవే అయినా కానీ సొంత కధ వచ్చేటప్పటికి ఏవిటో వాళ్ళ అమ్మమ్మా, ఆవిడ చర్చి నమ్మకాలూ.. నాకుపకరించని విషయాలు కదా అనిపించిందిఅయ్యో అనవసరంగా కాలయాపన చేసేశాను కదా! మరో మంచి చరిత్ర పుస్తకమో లేదా ఆహ్లాదపరిచే హాస్య పుస్తకమో చదివితే బాగుణ్ణు కదా అనిపిస్తుంటుందికొన్ని కఠోర జీవితసత్యాల్ని వేదాంత ధోరణిలో కాకుండా మనసుని తాకి మనల్ని ఘర్షణకీ, రాపిడికీ గురి చేసే కొన్ని పుస్తకాలు మళ్ళీ చదివి ఉంటే బాగుండుకదా సమయంలో అనిపిస్తుంది. అలా అనిపించిన సందర్భం ఇప్పుడు ఇంట్లో ప్రేంచంద్  పుస్తకం చదివినప్పుడు.
  
అప్పటి చారిత్రక విశేషాలు కొన్ని ఇందులో నమోదు అవడం సంతోషకరమే, కానీ అవి బహు స్వల్పం. మనలో చాలామంది  చేసుకునే రోజువారీ వాదనలుసంగతులే ఎక్కువ దొర్లాయి. వాదనల్లో ఎప్పుడూ శివరాణి గారు ప్రేంచంద్ ను రాత్రుళ్ళు రాసుకోవద్దంటూ ఘర్షణ పడడం సందర్భంలో ఆయన పెన్ను విరిచెయ్యడం, కాగితాలు లాక్కోవడం వగైరా స్పర్ధలే. ఆటుపోట్లు ప్రతి రచయితా కళాకరుడూ, కళాకారిణీ ఎదుర్కొనేవే. సంఘర్షణలు రచనా వ్యాసంగానికే ఆటంకమయినప్పుడూ అవి అధిగమించే క్రమం మరీ గొప్పదయితే తప్ప జీవిత చరిత్రల్లో, స్వీయరచనల్లో చోటు చేసుకోనక్కరలేదు

కొన్ని మాత్రం అప్పటి అలవాట్లనీ, సంప్రదాయాల్నీ, దుస్సంప్రదాయాల్ని విప్పి చెప్పడంతో కొద్దిమట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికీ మనల్ని నిస్పృహపరిచే విషయాలు అప్పుడూ అదే విధంగా ఉండడం గమనిస్తాము. యువకుల తొందరపాటూ, నిర్లక్ష్య ధోరణులూ ఎదిగిన సంతానం తల్లిదండ్రుల పట్ల బాధ్యతారహితులుగా ఉండడమూ కనిపిస్తుంది. ఇప్పుడు పెద్దలు అనుకున్నట్టే సరిగ్గా అలాగే  వందేళ్ళనాడు అప్పటి పెద్దలు తమ పిల్లల పట్లా, యువతరం గురించీ అనుకోవడం మనకు కొత్త అలోచననల్ని రేకెత్తిస్తాయి.

ప్రత్యేకించి విశేషం ఏంటంటే, ఇప్పుడు చదివితే సరిగ్గా తొంభై నుండి వంద సంవత్సరాల వెనుక ఒక ప్రసిధ్ధ రచయిత ఇంటిలోని ఘోష వినబడుతుంది. అంత అవసరమా అనిపించింది. ప్రఖ్యాత రచయిత రచనల్లో ఏదో ఒకటి 'గోదాన్ 'లాంటి పుస్తకం చేతిలోకి తీసుకుంటే మేలు కదా అనిపిస్తుంది. లేకపోతే శ్రీపాద వారిదో, ఆచంట జానకిరాం గారిదో స్వీయ చరిత్ర మరోసారి చదువుకుంటే పోలా!

ఇంతట్లోనూ చెప్పుకోదగ్గ విషయంశ్రీమతి ఆర్. శాంతాసుందరి గారి అనువాద ప్రతిభ గురించి చెప్పుకోకుండా సమీక్షా వ్యాసాన్ని ముగించడం కుదరని పని. కానీ ఆవిడ డెభ్భయ్యొ పడిలో ఉండగా ఇంతటి కృషిని మరో పుస్తకం 'సేపియన్స్ 'లాంటి దానిపై పెడితే బావుణ్ణు కదా అనిపించింది నాకైతే.
షరా మామూలుగా అక్షర దోషాలు బాగా దొర్లాయి.


'ఇంట్లో ప్రేంచంద్', రచన ; శివరాణీదేవి ప్రేంచంద్. అనువాదం : ఆర్. శాంతాసుందరి. పేజీలు : 274.ప్రచురణ : హైదరాబాద్ బుక్ ట్రస్ట్. 2012.

కామెంట్‌లు లేవు: