తెలుగు సంగతులు

సోమవారం, సెప్టెంబర్ 14, 2026

వినాయక చవితి 2026

 ఇది నాకు గుర్తుండీ కొంచెం పత్రి పండగ. ఇంకొంచెం ఉండ్రాళ్ళ, కుడుముల పండగ. అస్సలికి చాలా పెద్ద గా పుస్తకాల పండగ. ఇప్పుడు దస్త్రాలూ, దస్తావేజులూ పుస్తకాలు అనుకుంటున్నారు


మూణ్ణాలుగు రోజులు ముందునుండే పత్రి పేరు చెప్పి పొలాలు, ముఖ్యంగా దూరంగా ఉండే తోటపొలాలకు మిట్ట మధ్యాహ్నాలు  వెళ్ళి  దోస్తుగాళ్ళం అంతా  చెట్టూ,  కొమ్మా పట్టుకు తిరిగి చిన్ని చేతులకు సరిపడా పట్టుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా వెనుక దొడ్లో ఎక్కడో  ఎవళ్ళమట్టుకు వాళ్ళం దాచి పెట్టుకుంటేమాకు కనీసం చెప్పా పెట్టకుండా మా పెద్ద పాలేరు అతనంతట అతనో, మా అమ్మ చెబితేనో అవన్నీ అవతల, అంటే గేదెల దొడ్లోనో పారబోసేవాళ్ళు


వినాయకుడికి కావల్సినవి అవి కావు.. ఇవీ ఇవీ అనీ, వాళ్ళే ఆరోజుకన్నీ తెస్తాం కదా అనీ వాళ్ళ ఉద్దేశెం కాబోలు. మా నాన్న వాళ్ళ మీద కోప్పడుతూనే ఉండేవారు కూడా, ఇది పిల్లల పండగ వాళ్ళు చేసేదే కరెక్టు అనినేరేడు, మారేడు అంటూ ఏదో ఇంత పొడుగు శ్లోకంలాంటిది చెప్పి అవన్నీ శ్రధ్ధగా తెప్పించి, ఎన్నో కాయలు, పళ్ళూ, తామర పూలు కూడా తెప్పించి మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని పాలవెల్లి కట్టేది, కట్టించేది అమ్మ. అంటే మమ్మల్నీ  చెయ్యి వెయ్యనిచ్చేది అన్నమాట. ఇదంతా ముందు రోజు


ఇక చవితి రోజు చూస్కోండి. వరసగా అందరికీ  ఒంటికి మీగడా, వెన్నా  తర్వాత నలుగూ, కుంకుడుకాయ పులుసుతో తలంట్లూ .. మా అమ్మ ఆధ్వర్యం, మంగలీ మరో సత్తెమ్మో సుబ్బమ్మో సుబ్బరంగా తోవేశేవోళ్ళు. కంట్లో కుంకుడు పులుసు పడకుండా, గోల పెట్టకుండా  తతంగం తెమిలేది కాదు. ఊరడింపుకి నోట్లో ఉప్పు కలికిమా నాన్నకిదంతా కంటగింపు. వీధిలోంచి దొడ్లోకి తిరుగుతూ పిల్లల్ని ఏడిపించుకు తినేది పండగేవిటీ. ఉత్త దండగ, అని మొత్తం సమాజాన్నీ కుంచెం ఎక్కువ మా అమ్మనీ విసుక్కుంటూ, మరో సిగరెట్టు వెలిగించుకుని వీధిలోకి వెళ్ళిపోయేవారు


తర్వాత ముస్తాబులయ్యి వినాయకుడి బొమ్మ ముందు అన్నీ సద్దేవాళ్ళం. అంటే అప్పటికే మా అమ్మ నడుములు విరిగేట్టు అవిర్చిన వాటిని అటూ ఇటూ చిందరవందర చెయ్యడం అన్నమాట. 'అందరివీ అన్ని రకాల పుస్తకాలూ తలోటీ అక్కడ పెట్టండి' అని మా అమ్మ చెపుతుంటే.. మా నాన్నకి అప్పటికి కాస్త ఊరట అనిపించేది కావును, మొత్తం పండగ సందర్భానికి ఆయనకి నచ్చే ఆమాట, పుస్తకాలుతెగ సర్దే వాళ్ళం, నావి మధ్యలో అంటే నావి అనీ. చివరికి అన్నీ రెడీ అయ్యి బస్కీలు పెట్టుకుని కూర్చునేవాళ్ళం. అమ్మ వచ్చి మళ్ళీ అన్నీ సర్దుతూ పాలేర్ని పురమాయించేది, అయ్యవారు  పాటికి ఫలానా ఇంటి దగ్గరుండొచ్చు, దగ్గరుండి తీసుకురమ్మని. మా నాన్న అనేవారు వీధిలోంచే.. చెప్పి పెట్టాను, వస్తుంటాడాయన, మీరు తొందరగా తెవల్చండి. పిల్లలికి ఆకళ్ళు వేస్తాయి. తెల్లారుజాము లేచిన వాళ్ళు ఏమీ తినకుండా ఎలా ఉంటారు? అనిఅమ్మేమో మెల్లగా బుజ్జగించి చెప్పేది, ఇంకొంచెం సేపు నాన్నలూ! శ్రధ్ధగా దణ్ణం పెట్టుకొని ఉండండిబాగా చదువు రావలని కోరుకుంటూ ఉండండి, బ్రామ్మలు వచ్చేస్తున్నారు,అనిమొత్తం మీద తొమ్మిదికో, ఒక్కోసారి ప్పదికో పూజ అయ్యేది.


ఉండ్రాళ్ళు, కుడుములూ కొబ్బరి పచ్చడి అప్పుడే రుబ్బింది ఎంత బాండేదో! అయినా మళ్ళీ వాట్లోకి ఎర్రటి ఆవకాయ కూడా దంచేవాళ్ళం. అంతా బావుండేది. కానీ ఆలస్యంగా పూటుగా తినడం కదా, నీరసంతో కూడిన భుక్తాయాసంతో నిద్రొచ్చేది. ఎంత బావుండేదో! అమ్మకే పాపం నడుం నోప్పి వచ్చేసేది. అయినా సంబరం అమ్మకి. వినాయకుడికి నా పిల్లలు ఎంత శ్రధ్ధగా, ఆకలికి ఆగి, పుస్తకాలు పెట్టుకుని పూజ చేసుకున్నారు. వీళ్ళకు మంచి చదువులు వస్తాయి అన్న తృప్తితో కావును మధ్యాహ్నం నడుం వాల్చి కొద్దిసేపు గొప్ప నిద్దరోయేది. మళ్ళీ తర్వాత హడావిడే, వచ్చే పోయే వాళ్ళేప్రసాదాలుపనోళ్ళకు పండగ వంటకాల పంపకాలూ. ఎంత బాండేదో మాకు  పండగ. దాంట్లో పుస్తకాలు కూడా ఉండడం వల్ల కావును, కొంచెం అందరం పుస్తకాలు చదువుకుంటున్నాం. పరీక్షలవి కాదు. విజ్ఞానానివీ, ఇప్పుడిప్పుడు కొంచెం జ్ఞానానివీ అని అనుకుంటున్నాం


అయినా అప్పటికీ ఇప్పటికీ నన్ను తొలిచేసే ప్రశ్న.. వినాయక జననం, శిర ఖండనా, ఏనుగు తలా, అది కూడా పడమటి దిక్కుకి తల పెట్టిన ఏనుగు తల??? 

'ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా?' అంటాడో సినిమా కవి. అమ్మదేమోకానీ, మన బుజ్జి గణేశుడి నాన్నది ఆవేశమే కదా! అనిపిస్తుంది, నాకైతే

ఏయ్ నోర్ముయ్ అంటుంది ()సభ్య సమాజం. మీరే చెప్పాలి. మీరు విజ్ఞులు.  


గణపతి పప్పా మోరియా.. అంటే ఏంటో నిజెంగా నాకు తెలియదు. అందరూ అంటున్నారు కదా! మనవూ అనాలి.. అంతే.


రాజా.