తెలుగు సంగతులు

గురువారం, ఆగస్టు 30, 2018

సాక్షి ఆదివారం (ఫండే) 26-08-2018 లో నా కధ 'అంతశ్శత్రువు ' ప్రచురితమయింది.
కింది లింకు ద్వారా చదవొచ్చు. చదివి మీ అభిప్రాయాలూ, విమర్శలూ చెబితే సంతోషం.

https://www.sakshi.com/news/funday/story-bu-gks-raja-1111156

ఇక్కడే పూర్తి కధ చదవాలనుకున్నవారి కోసం - -

అంతఃశత్రువు

A story bu gks raja - Sakshi
పెళ్ళి చూపులకోసం సెలవు పెట్టక తప్పలేదు నాకు. పెళ్ళి ఇష్టం లేదని కాదు. కానీ ఇంకా దానిపై సరైన అభిప్రాయం ఏర్పరచుకోలేదు. అవగాహన లేకపోవడమో, నాకై నేను చెప్పలేకపోవడమో, కొంత సిగ్గూ మొహమాటం వల్లనో, పెళ్ళి గురించిన ప్రసక్తి అమ్మ తెచ్చినప్పుడల్లా ‘ఇప్పుడు కాదులేమ్మా’ అని నెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ట్రైనింగు అనీ, పనిచేస్తున్న ప్రదేశం అనుకూలం కాదనీ వంకలు పెట్టుకుంటూ గడిపాను. అయినా నాకిప్పుడెంత వయసనీ, మొన్ననే ఇరవై నాలుగెళ్ళాయి. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని మావాళ్ళ ఆందోళన. ప్రస్తుతం కశ్మీరు ప్రాంతంలో పనిచేస్తున్న నేను, అతికష్టం మీద పదిరోజులు సెలవు సంపాదించి ఊరికి బయలుదేరాను. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక నేను మిలిటరీలోకి వెళ్ళటం అమ్మకూ, నాన్నకు అస్సలు ఇష్టం లేదు. అమ్మ మరీ గొడవ చేసేసింది. ‘‘కావాలంటే ఇంకా పై చదువులు చదువు. లేదా వేరే ఉద్యోగం ఏదైనా చూసుకో. అంతేకానీ ఈ దినదినగండం మిలిటరీలో ఒద్దురా నాయనా’’ అని అమ్మ అంటే, ‘‘అమ్మా! మిలిటరీ అంటే యుద్ధమేనా. పైగా నేను ఇంజనీరును కదా. నేనెక్కడో సురక్షితమయిన చోటే పని చేస్తానమ్మా. నామాట నమ్ము’’ అని నమ్మబలికాను. చాలా బతిమాలాను. నాకు ఎలాగయినా మిలిటరీ ఉద్యోగం చెయ్యాలన్న కోరిక బలంగా ఉండటంతో, మొత్తం మీద ఒప్పించే సాధించాను.
ఈరోజు అమ్మ నాకోసం ఎంత ఎదురు చూస్తూ ఉంటుందో ఊహించగలను. రెండురోజుల ప్రయాణం తరువాత మా ఊరు చేరాను. దారిపొడుగునా పచ్చని పొలాలు. అప్పుడే పొలం పనులకు జట్లు జట్లుగా వెళ్తున్న కూలీలు, పశువుల్ని మేపడానికి గుంపులుగా బయలుదేరిన పిల్లగాళ్ళూ. భలే ముచ్చటగా ఉంది పల్లెల దృశ్యం. ఈ పల్లెటూళ్ళ అందాల ముందు కాశ్మీరు దిగదుడుపే. ఎంతయినా మా ఊరు కదా! ఇంటికి చేరేటప్పటికి ఎదురుచూస్తూన్న అమ్మ హడావుడికి అంతే లేదు. ముందు పెద్ద గ్లాసెడు పాలిచ్చి స్నానం చెయ్యమని తొందరపెట్టేసింది. దగ్గరుండి వళ్ళంతా మీగడ రాయించి, నలుగు పెట్టించి, కుంకుళ్ళతో తలంటు పోయించింది మా మంగలి వెంకటస్వామితో. తడి తలకు ఒకటీ, వంటికి మరోటి తువ్వాళ్ళతో ఎంత ఒద్దన్నా నా వొళ్ళంతా తుడిచింది. పొయ్యికి దగ్గర్లోనే పీట వేసి కూర్చోబెట్టి, పలహారంలోకి కుడుములు, గారెలు ఇంకా పిండి అట్టు అంటూ వేసి బలవంతంగా తినిపించేసింది. అమ్మ అనురాగానికి కరిగిపోయాను. కళ్ళు చెమ్మగిల్లాయి. తలొంచుకున్నాను. అట్టు వేస్తున్నదల్లా ఇటుతిరిగిన అమ్మ కంగారుపడిపోయి ఒక్క ఉదుటున లేచి నన్ను పట్టుకుని వణికే కంఠంతో ‘‘ఏవిరా నాయనా కళ్ళు తడి చేసుకుంటున్నావు? అక్కడ నీకు తిండి సౌకర్యం కుదరడం లేదా ఏవిటీ. వెర్రినాగన్నా. ఎలా చిక్కిపోయావురా. మరేవీ ఇబ్బంది లేదు కదా అక్కడ. అలా అయితే ఉద్యోగం వదిలేసి చక్కా వచ్చెయ్యి. ఇక్కడ మాత్రం రాజాలాగ బతకలేకనా’’ అంది కంగారుగా.  
‘‘అదేంలేదమ్మా, అక్కడ చాలా బావుంటుంది. అది సరే, నాన్న ఎన్నింటికి వస్తారు’’ అని మాట మార్చేశాను. నువ్వు కాస్త కాఫీ పుచ్చుకుని నిద్రపో. ఎంత ప్రయాణం చేసి వచ్చావో! అవును కాఫీయేనా, టీ తాగుతావా?’’ అడిగింది అమ్మ. మా ఇంట్లో కాఫీ అలవాటు లేదు. నాకోసమని తెప్పించి ఉంచిందేమో! ‘‘అమ్మా! నువ్వు ముందు టిఫిన్‌ తిను. తరువాత ఇద్దరం కాఫీ తాగుదాం. నువ్వు ముందు కుడుములు తింటూ ఉండు. అట్టు నేనే వేస్తాను నీకు’’ అనంటూ అమ్మను భుజం పట్టుకు లేపాను పొయ్యిదగ్గరనుండి. ‘‘అయ్యో నువ్వు అట్టు వెయ్యడవేంట్రా మగబిడ్డవి? అయినా నేనేవీ తినను కానీ, కాఫీ కలిపేస్తానుండు’’ అంది అమ్మ. నేను ఊరుకోకుండా అమ్మను పీట మీద కూర్చోబెట్టి ఒక అట్టు వేయించి అమ్మ ప్లేటులో వేశాను. నాకో ముక్క తినిపించి ‘‘ఎంత దోరగా వేశావురా అట్టు. ఎవరికి రాసి పెట్టి ఉందో కానీ, నీకొచ్చే పెళ్ళాం సుఖపడుతుందిరా నాయనా’’ అంటూ మధ్య మధ్యలో కళ్ళు కొంగుతో ఒత్తుకుంటూ మహానందంగా తింటోంది అమ్మ.
మరో అట్టు వేశాను, అమ్మ వద్దని ఎంత మొత్తుకుంటున్నా. ‘‘అది సరే! అసలు సంగతి చెప్పనియ్యి. ఇప్పుడు నువ్వు చూడబోయే సమ్మంధం, సుబ్బారాయుడుగారనీ, మనకంటే కాస్త మోతుబరి అంట. మీనాన్న ఇక్కడ పంచాయితి ప్రెసిడెంటు అయితే, అక్కడ ఆయన మండలానికి ప్రెసిడెంటు అంట. అవన్నీ నాకెందుకు కానీ, పిల్ల చక్కని చుక్క అటరా, గుణాల రాశి అట. మనకు బాగా కావాల్సినావిడ, సత్యోతమ్మగారనీ, ఆవూరేలే, ఆవిడ చెప్పింది. ఆవిడకు ఆ పిల్లలంతా బాగా అలవాటట. అలాంటి మంచిపిల్ల దొరికి నా బంగారుకొండను సుఖపెట్టేదయితే నాకీజన్మలో ఇంకేంకావాలీ. నాన్నకు బాగా మోజుగా ఉంది ఈ సంబంధం కలుపుకోవాలని. ఆ రాజకీయాల్లో కూడా ఇంకో మెట్టు ఎక్కినట్టవుతుందని కావును. అయినా నీకు నచ్చాలి కదా’’ అని ఆగి నా మొహం వంక చూసింది అమ్మ. ‘‘అది సరే అమ్మా. అక్క రేపు రావడం ఏంటి, ఇవ్వాళే వచ్చి ఉండొచ్చుకదా?’’ అన్నాను మాట మారుస్తూ. ‘‘రేపీపాటికి ఇక్కడ ఉంటుందిరా. దానికి మాత్రం నిన్ను చూడాలని ఎంత ఆత్రంగా ఉందనీ. ఇంకాస్సేపట్లో ఫోను చేసేస్తుంది చూడు.’’ అంది అమ్మ, గిన్నెలు మూతలు పెట్టి సర్దుకుంటూ. ‘‘ఎలా ఉందమ్మా అక్క? పిల్లల్ని తీసుకొస్తుంది కదా. బావ కూడా వస్తుంటే ఎంత బావుణ్ణు కదా అమ్మా’’ అన్నాను.
మూడోనాడు మా పంతులుగారు చెప్పిన టైముకే బయల్దేరదీశారు నాన్న. మేం నలుగురం కాక, మా దూరపు బంధువు రాఘవ మావయ్యతో బయల్దేరాం. నేను కారు నడుపుతానంటే అమ్మ, నాన్న ససేమిరా అన్నారు. పెళ్ళికొడుకు హోదాకి భంగం అట. డ్రైవరుతో కలిసి ఇరుగ్గా సర్దుకున్నాం అంబాసిడరు కారులో. గంటన్నరలో పెళ్ళికూతురు ఇల్లు చేరాం. పట్నం కాదు కానీ పెద్ద ఊరు. మండల కేంద్రం. మర్యాదలూ, పలకరింపులూ అయ్యాక హాలులో కూర్చున్నాం. అక్కడ అన్ని పళ్ళూ, పలహారాలూ పెట్టారు, కానీ ఎవ్వరూ ముట్టుకోలేదు. వాళ్ళూ మొహమాటపెట్టలేదు. కతికితే అతకదట. నాకు ముందే చెప్పి పెట్టింది మా అక్క. అమ్మాయి తల్లి మా అక్కను లోపలికి పిల్చుకెళ్ళి, పెళ్ళికూతుర్ని వెంటబెట్టుకొచ్చారు. మరో ఇద్దరు అమ్మాయిలు, కొందరు ముత్తయిదువులూ గుమ్మాల్లోనుండే నవ్వులాడుకుంటూ, గుసగుసలాడుతూ చూస్తున్నారు.
అమ్మాయి పేరు చంద్రిక అట. ఆమెతోనే చెప్పించారు. అందరికీ నచ్చినట్టే ఉంది. అక్కడ ఉన్న అందరూ ఇక పెళ్ళే తరువాయి అన్నంత ధీమాగా ఉన్నట్టు కనిపించారు. అమ్మాయి తండ్రి ‘‘అమ్మాయి నచ్చిందా బాబూ, ఏవన్నా అడగాలా’’ అన్నారు కొంచెం గంభీరంగానే. ‘‘అబ్బే ఏవీ అక్కర్లెద్దండి’’ అన్నాను కంగారుగా. ‘‘సరే మిలిటరీలో అంటకదా, ఏవిటి పని బాబూ’’ ఆయనే అడిగారు మళ్ళీ. అప్పటివరకూ అమ్మాయినే కళ్ళారా చూసుకుంటూ, అమ్మాయి తల్లితో ఏవో చెప్పేస్తున్న మా అమ్మ, ఉలిక్కిపడినట్టు ఒక్కసారి కలగచేసుకుని ‘‘అన్నయ్యగారూ! అబ్బాయి మిలిటరీలో అన్నమాటేకానీ, వాడు ఇంజనీరు కదా యుద్ధాలకీ వాటికీ అస్సలు సబంధమే లేని ఉద్యోగం. సరిహద్దు దగ్గరక్కూడా వెళ్ళే పని ఏవి ఉండదు వాడికి’’ అంది. అందరూ మొహాలు చూసుకుంటున్నారు. నాకు ఏం మాట్లాడాలో అయోమయం అయిపోయింది. సుబ్బారాయుడుగారు కొంచెం నుదురు ముడేసి ‘‘అంతేనా అబ్బాయ్‌’’ అన్నారు నావంక చూస్తూ. నేను కొంచెం సర్దుక్కూర్చుని, ‘‘కాదండి, మా అమ్మకు నా ఉద్యోగం గురించి అంత అవగాహన లేదండి. నేను చేస్తున్నది ఇంజనీరుగానే అయినా, యుద్ధాలకు దగ్గర్లో పని చెయ్యవలసి వస్తుంది.
సరిహద్దుల్లో ఉండటం కూడా ఉద్యోగంలో భాగమే. అయినంతమాత్రాన మాకు భద్రత లేకపోవడం ఏవీ ఉండదు. అందరికీ ఉండే అభద్రతా పరిస్థితే మాకూ ఉంటుంది.’’ అని ఆగాను. అందరూ నిశ్శబ్దం అయిపోయారు. అప్పటివరకూ తలవంచుకుని అమ్మ, అక్క అడిగినవాటికి మెల్లగా సమాధానాలు చెప్తున్న పెళ్ళికూతురు, నేను మాట్లాడుతున్నంతసేపూ కళ్ళెత్తి తదేకంగా నావంకే చూస్తూ ఉంది. ఆమెను క్రమంగా ఏదో భయం ఆవహించినట్టు అయ్యింది. ఆ గంభీర వాతావరణంలోంచి ఎలా తేలికపడాలా అని అందరికీ ఉన్నట్టే ఉంది. సుబ్బారాయుడుగారే కలగజేసుకుని, నాన్న వంక తిరిగి ‘‘భోజనాలు చేసి వెళితే బాగుండును. అయినా పెద్దలు చెప్పిన మాటొకటుంది కదండి. పట్టించుకోవాల్లెండి. అబ్బాయి ఎప్పటివరకు ఉంటాడు? ఇంకా మా కుటుంబ పెద్దలతో చెప్పలేదు. వాళ్ళకూ చెప్పి అప్పుడు ఏ సంగతీ కబురు చేస్తాం. ఏవంటారు?’’ నాన్న, అమ్మ కూడా కళవళపడుతూ ‘‘అలాగే మరి. పెద్దలకు చెప్పండి. అప్పటివరకూ ఎదురుచూస్తాం. ఇక సెలవామరి.’’ అని లేచారు. చంద్రికకు ఇది అనుకోని పరిణామమేమో. అలాగే కూర్చుండిపోయింది, అందరూ లేచినా. ఆమె వణుకుతున్న చేతులు నలుపుకుంటోంది తల వంచుకుని. ‘‘అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళవే’’ అన్నారు సుబ్బారాయుడుగారు ఒకింత విసుగు ధ్వనిస్తున్న కంఠంతో.
ఇంటికి తిరిగొచ్చాక అమ్మ బాధపడింది. అక్క నిర్లిప్తంగా తన ఊరికి ప్రయాణం అయ్యింది. నాన్న రుసరుసలాడేరు. ప్రత్యేకంగా ఉద్యోగం సంగతి నేను ఎందుకు అలా చెప్పానని వాళ్ళకు కోపం, బాధ. నాకంత ఇష్టమయిన సొంత ఊరిలో, సొంత ఇంటిలో అమ్మ దగ్గర మరో నాలుగురోజులు సెలవు గడపటం కష్టమయ్యింది. కాశ్మీరుకు బయల్దేరుతూ అమ్మకు చెప్పాను ‘‘అమ్మా! ఉన్న విషయం దాచి పెళ్ళి చేసుకోవడం ఏవంత మంచిది కాదని నీకు తెలియదా? అయినా నా ఉద్యోగంలో నాకున్న భద్రత గురించి వాళ్ళకు అనుమానాలుంటే ఆ సమ్మంధం మాట మరిచిపోవడం మంచిది. నువ్వు నా పెళ్ళి గురించి బాధపడకు. నాకు ప్రాణమయిన ఉద్యోగం వల్లే నాకు ప్రాణహాని ఉంటుందన్న తప్పుడు భావన, భయం నీకు లేకపోతే నాకు అంతే చాలమ్మా. నచ్చిన పిల్ల రాకపోయినా, వచ్చిన పిల్ల నచ్చొచ్చు కదమ్మా. ఈ విషయంలో నీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ము. నాకు కాస్తంత ఊరట. నాకోసం నువ్వు ఎంతో ఇష్టంగా చేసి డబ్బాల్లో పెట్టిన సున్నుండలు, జంతికలు, పాలకోవ బిళ్ళలు నాకేవీ రుచించవు అమ్మా, నువ్వు నవ్వుతూ మనస్పూర్తిగా సాగనంపకపోతే’’ ఇక నాకు గొంతు పెగల్లేదు. తల వంచుకున్నాను. అమ్మ అమాంతం కౌగిలించుకుని వీపు నిమిరి ముద్దులు పెట్టేసి, కన్నీళ్ళతోటే నవ్వుతూ సాగనంపింది.
మళ్ళీ నా ఉద్యోగంలో పడిపోయాను. అమ్మ ఓరోజు ఫోనులో చంద్రిక సంగతి ఎత్తింది. ‘‘సుబ్బారాయుడుగారు మళ్ళీ ప్రస్తావన తేకపోయినా, ఆ పిల్ల మనింటి కోడలయితే బావుణ్ణని ఉందటరా. సత్యోతమ్మగారని, అంతకుముందు నీకు చెప్పాను చూడు ఆ ఊరావిడ, ఆవిడ చెప్పిందిరా’’ అంది ఆశగా. ‘‘పెద్దవాళ్ళకు ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాంలేమ్మా. ఇక మర్చిపో’’ అని సరిపెట్టాను అమ్మని. తీరిక చేసుకుని అమ్మకు ఉత్తరం వ్రాశాను, వారం వారం ఫోనులో మాట్లాడుతున్నా కూడా. ఉత్తరం అందుకున్నాక పొంగిపోయి ఫోను చేసింది అమ్మ. ఎన్నిసార్లు ఫోనులో మాట్లాడినా అమ్మకు తనివి తీరదట. కానీ ఆ ఒక్క ఉత్తరం వందసార్లు చదువుకున్నానని చెప్పింది. ఎంతటి శక్తి ఉంది చేతివ్రాతలో! అప్పటినుండీ నెలకొక్కటయినా అమ్మకు ఉత్తరం వ్రాయాలని నిశ్చయించుకున్నాను.
నేను ఆఫీసులో ఉన్నవేళ మా ఇంటి దగ్గర నుండి ఫోను వచ్చిందని కబురొచ్చింది. ‘ఇలాంటి వేళల్లో ఎప్పుడూ మావాళ్ళు చెయ్యరే,’ అనుకుంటూ గాభరాగా టెలిఫోను ఆపరేటరు దగ్గరకు వెళ్ళి ఫోను అందుకున్నాను. అవతల నాన్న కంఠం, ‘‘సుబ్బారాయుడుగార్ని రాత్రి ఎవరో చంపేసార్రా. హత్య. నేనక్కడికే వెళుతున్నాను. ఇదిగో అమ్మ వివరాలు చెబుతుంది’’. నేను మ్రాన్పడిపోయాను. అంతలో అమ్మ గొంతు. చాలా భయంగానూ కంగారుగానూ ‘‘ఘోరం జరిగిపోయిందిరా నాయనా’’ అంటూ వెక్కుతూ ఆయాసపడుతోంది. ‘‘అమ్మా! నువ్వు కాస్త నెమ్మదించు. మెల్లగా చెప్పమ్మా’’ అన్నాను అమ్మకు ఏమన్నా తేడా వస్తుందేమోనన్న భయంతో. ‘‘ఏవో ముఠా తగాదాలట. పాత కక్షలు. ఆ పాడు రాజకీయాలు మనకొద్దు అంటే మీ నాన్న వినరు. నాకేవీ పాలుపోవడం లేదురా నాయనా. గుండెల్లో అంతా ఒకటే గాభరాగా ఉందిరా. నువ్వు ఇలాంటి సమయంలో ఇక్కడ ఉంటే బావుణ్ణని మనసు పీకుతోందిరా’’ అంటూ ఆయాసపడుతూ ఆగింది. ‘‘అమ్మా నేను రేపు మళ్ళీ ఫోను చేస్తాను. అయిపోయినదాన్ని మనమెవరం ఏం చెయ్యలేము కదా. నీ ఆరోగ్యం జాగ్రత్త. అక్కను రమ్మనీ, నాల్రోజులిక్కడే ఉండమను. నాన్నను జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేను రాత్రికే ఫోను చేస్తానులే. కంగారుపడకమ్మా. నేనూ తొందరగానే వస్తాను’’ అంటూ పెట్టేశాను.
రెండు రోజుల తర్వాత, వెళ్ళాలా వద్దా అన్న సంకోచంలో ఉండి ఇంటికి ఫోను చేశాను. అమ్మతో మాట్లాడాను. అప్పటికి సుబ్బారాయుడుగారి హత్య జరిగి ఐదు రోజులయ్యింది. నాన్న ఇంట్లో లేరు. పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రివరకూ సుబ్బారాయుడుగారి ఊళ్ళోనే ఉంటున్నారట. అక్కడి రాజకీయాలు, గ్రూపులు, తగాదాలు, కోర్టులు, పోలీసులు ఇవే విషయాలతో ఉక్కిరిబిక్కిరిగా ఉంటున్నారట. ఇవన్నీ చెప్పి అమ్మ ‘‘నువ్వు శ్రద్ధగా ఒక విషయం వినాలిరా నాయనా! ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వొకసారి నాల్రోజులు సెలవు పెట్టుకుని వారి పెద్ద కర్మ నాటికి రావాలి. ఆ అమ్మాయి చాలా ఢీలా పడిపోయిందిరా. నేను ఆ చావు రోజున వెళ్ళడవే. నన్ను పట్టుకుని వదల్లేదు చంద్రిక. ఏకధారగా ఏడుస్తూనే ఉంది. తరువాత కూడా ఈ నాల్రోజుల్నించీ తిండీ, నిద్రా లేకుండా ఓ కుమిలిపోతోందట. వాళ్ళ అమ్మగారికి భర్త పోయిన దుఃఖం కంటే ఈ పిల్ల శోకాన్నే తట్టుకోలేకపోతున్నారట. సత్యోతమ్మ గారు రోజూ నాకు ఫోను చేస్తున్నారు అక్కడి సంగతులన్నీ చెబుతూ. చంద్రిక నీతో ఒక్కసారి మాట్లాడాలంటోందటరా నాయనా. అర్థం చేసుకోలేనివాళ్ళకు ఇది విడ్డూరంగానో, తప్పుగానో అనిపించొచ్చు కానీ, ఇంతటి విపత్తులో ఆ పిల్ల అలా అడుగుతోందంటే ఒకసారి ఆలోచించాలి బాబూ. సంతోషాలకీ, సంబరాలకీ అందరూ ఉంటారు. దుఃఖసమయంలో వెన్నంటి ఉన్నవాళ్ళే ఆత్మబంధువులవుతారు నాయనా. ఆ పిల్ల మన వల్ల కలిగే ఎలాంటి సాంత్వన కోరుకుంటోందో మరి. పెద్ద మనసు చేసుకొని ఆ పెద్దకర్మ నాటికి వస్తే మర్నాడో ఎప్పుడో ఒక్కసారి చంద్రికను చూసి వద్దాం. ఏవంటావు?’’ అమ్మకు ఏం సమాధానం చెప్పాలో పాలుపోవడం లేదు. ‘‘అలాగేనమ్మా’’ అన్నాను యాంత్రికంగా.
వారం సెలవు మీదే బయలుదేరాను. పెద్ద కర్మ రోజున పెద్ద జన సందోహమే అక్కడ. చుట్టుపక్కల జనంతోబాటూ అనేకమంది నాయకులు కూడా వచ్చారు. నాన్న అందర్నీ పలకరిస్తూ ఏర్పాట్లు చేస్తూ హడావిడిగానే ఉన్నారు. మధ్యాహ్నం తరువాత చాలామంది వెళ్ళిపోయారు. అయినా ఇంకా చాలామంది గుంపులు గుంపులుగా ఉండి మాట్లాడుకుంటున్నారు. నాకేవీ తోచడం లేదు. వాళ్ళంతా సుబ్బారాయుడుగారి చావు పట్ల విచారంగా కంటే, గుంభనంగా, గంభీరంగా ఉన్నట్టు కనిపించారు. నాన్న నన్ను పిలిచి అమ్మను తీసుకుని ఊరికి వెళ్ళమన్నారు. తనకు ఇంకా ఆలస్యం అవుతుందన్నారు. అప్పటికే అక్కడ మిగిలిన జనం దగ్గర్లో ఉన్న తోటలకేసి వెళుతున్నారు. ఏవో సమాలోచనలకు అని అర్థమవుతోంది. ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని నాన్నతో చెప్పాను గొంతు తగ్గించి. ‘‘నాన్నా! మీకు చెప్పదగినవాణ్ణి కాదు కానీ, చెప్పక తప్పడం లేదు. ఇక్కడ మీరంతా ఏమి ఆలోచిస్తారో, ఏమి చెయ్యాలనుకుంటారో, అందరూ ఊహించగలిగేదే. అమ్మనీ, మమ్మల్నీ దృష్టిలో పెట్టుకుని ఇక ఈ తరహా ముఠారాజకీయాలు విరమించండి నాన్నా. సుబ్బారాయుడుగారి అమ్మాయి అడిగింది అదేనట నాన్నా. మీరు ఈ ఊబిలో ఉండొద్దని ఆమె కోరిక. అందుకే ఆమె ఏడుస్తోంది  ఏకధాటిగా. అక్కతో ఇదే విషయం రోజంతా చెబుతూనే ఉందట.’’
‘‘ఆపిల్ల అలా అందా? మన గురించి భయపడుతోందా, బాధపడుతోందా’’ అన్నారు నాన్న ఆశ్చర్యంగా. ‘‘తీరిగ్గా ఇంటిదగ్గర మాట్లాడుకుందాం నాన్నా. దయచేసి ఈ ముఠా రాజకీయాలు తగాదాలు వదిలెయ్యండి నాన్నా. మా గురించైనా లేక సుబ్బారాయుడుగారి అమ్మాయి వేడుకున్నదాని గురించైనా మీరివి వదిలెయ్యండి. సుబ్బారాయుడు గారు నాది బతుకు భద్రత లేని ఉద్యోగం అనుకొని వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ అమ్మాయి ఇక్కడే ఎవరికీ భద్రత లేదని మిమ్మల్ని ఈ రొంపిలోంచి తప్పుకోమంటోంది. ఎవరి భద్రత ఎంతో ఇప్పటికైనా తెలిసిందా. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను. తొందరగా వచ్చెయ్యండి నాన్నా. మీకోసం ఎదురు చూస్తుంటాం’’ అని వెనుతిరిగాను. ‘‘ఆగరా అబ్బాయ్‌ నేనూ వస్తున్నాను’’ అంటూ నాతో వచ్చేశారు వెనకనుండి చాలామంది పిలుస్తున్నా వెనక్కి చూడకుండా. వచ్చి వెనుతిరుగుతున్న నా భుజంపై చెయ్యి వేసి నాన్న అన్న మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. ‘‘ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావట్రా అబ్బాయ్‌?’’ ‘‘అదేంటి నాన్నా, ఇంత శోకంలో ఉన్న కుటుంబంలో...’’ అని నేను సందేహిస్తూ అంటుండగా నాన్న గంభీరంగా అన్నారు – ‘‘ఆ అమ్మాయికి మనం పెళ్ళిచూపులకు వెళ్ళిన రోజునుండే ఇష్టం కలిగిందట.
నువ్వు నీ ఉద్యోగం గురించి నిష్కర్షగా నిజం చెప్పినప్పుడు ఆ అమ్మాయి మనసులో నువ్వు స్థానం పొందావు. అమ్మ నాకు ఈ విషయాలన్నీ చెబుతూనే ఉంది. అంతేకాదు. దేశాన్ని రక్షించే మీ ప్రాణాలకు భద్రత లేదనీ, మేం ఊరి మధ్య ఉండి మహా భద్రతగా ఉన్నామనీ అనుకునేదంతా ఉత్తి భ్రమ. మా భద్రతలోని డొల్లతనం సుబ్బారాయుడు గారి లాంటి అనేకమంది హత్యోదంతాలు కళ్ళకు కడుతున్నాయి. అందుకే ఆ అమ్మాయి ఇక్కడి భద్రతకన్నా నువ్విచ్చే భరోసాపట్ల విశ్వాసం కలిగి ఉంది. మరో విషయం, మంచికో చెడ్డకో మనలో ఒక ఆచారం ఉంది. తండ్రి చనిపోయిన ఇంట్లో పెళ్ళికెదిగిన ఆడపిల్ల ఉంటే యజమాని మరణం తరువాత ఏడాదిలోగా పెళ్ళి జరిగితే మంచిదంటారు. నీకిష్టమయితే, నెమ్మది మీద వాళ్ళకు తెలియపరుస్తాను.’’ నా భుజంపై నాన్న చెయ్యి మెత్తగా హత్తుకున్నట్టయ్యింది. ‘‘మీ అందరికీ ఇష్టమయితే అలాగే నాన్నా’’ అంటూ ముందుకు నడిచాను నాన్నతో కలిసి.
- జి.కె.యస్‌.రాజా

కామెంట్‌లు లేవు: