ఈ బ్లాగును శోధించు

సోమవారం, జనవరి 17, 2011

పుస్తకాలు కొనడవా?

“అడిగితే గాని అమ్మయినా పెట్టదు”. ఈ పాత సామెతను మార్చాల్సిన రోజులొచ్చాయనిపిస్తోంది. పిల్లలు అడక్కపోయినా బలవంతంగా కూరుతున్నారు తల్లులు. అయినా పాత సామెతకు సరిపోయే ఒకే అమ్మ ఉంది మన దేశం లో – సోనియమ్మ. ఈవిడది ఒక మెట్టు పై మాటే! అడిగినా పెట్టదు. తెలంగాణా కోసం ఎంతమంది అరిచి గీ పెట్టినా ఒక్కసారీ నోరు విప్పని అమ్మ ఈ జగన్మాత. ఈవిడ ఎలా అమ్మ ? ఎవరికి అమ్మ? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే హక్కు ఆవిడకు రాజ్యంగబద్ధంగా ఉందా ? రాష్ట్రశాసన సభ ఉంది.. లోక సభ ఉంది.. కేంద్ర మంత్రివర్గం ఉంది..ప్రధానమంత్రి ఉన్నారు. అవన్నీ మానేసి ఒక పార్టీ లేదా పార్టీల కలగూరగంపకి నాయకురాలు ఇవ్వదగిన విషయమా ప్రత్యేకరాష్ట్రం? అవునులెండి! అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయాలన్నా, ప్రారంభోత్సవం చేయాలన్నా ఆవిడే దిక్కు గా భావించే దిక్కుమాలిన పార్టీ శ్రేణులు---, ఏమాత్రం అడ్డగించని బిజెపి,తెరాస,తెదేపా, కమ్యూనిస్టులు వగైరా పనికిమాలిన ప్రతిపక్షాలు – అమ్మని సూపర్ పవర్ చేసేసి రాజ్యాంగం ఉనికికే ప్రమాదం తెచ్చే దౌర్భాగ్యం పట్టించేసారీ రాష్ట్రానికి. ప్రత్యేక రాష్ట్రం లాంటి ఏ డిమాండునయినా, ప్రజాభీష్టం మేరకు, రాజ్యంగాబద్ధంగా సాధించుకోవాలి గాని... ఇలా దేబిరించి రాజ్యాంగాన్ని పరిహసించే విధంగా మాత్రం కాదు.

నచ్చిన పుస్తకం

“మీకు నచ్చిన పుస్తకం” అన్న అంశం పై జరిగిన ఒక గోష్ఠిలో వక్తలంత వారికీ నచ్చిన పుస్తకాల గురించి మాట్లాడారు. ఆఖరుగా మాట్లాడాల్సిన వక్తను సమయాభావంవల్ల క్లుప్తంగా మాట్లాడాలని నిర్వాహకులు కోరారు. దానితో మండిన ఆయన నిరసనగా ‘నాకు బాగా నచ్చిన పుస్తకం, బాలన్సు బాగా ఉన్నప్పుడు నా బాంక్ పాస్ పుస్తకం’ అని ఒకే ఒక వాక్యంతో ఉపన్యాసాన్ని ముగించాడు.

పుస్తకాలు కొనడవా? బార్బేరియస్!

"మన దేశంలొ ఇండస్ట్రీస్ పెరగలేదంటే, ప్రాజెక్టులు రాలేదంటే, అందుక్కారణవేవిటీ? ఇదే. అక్షరాల ఇదే. ఈ పుస్తకాలు కొనడవనే జబ్బే! ప్రతివాడూ పుస్తకాలు కొండవే? ఊరికోడు కొంటే చాలదూ? అదే నలుగురం ఎరువడిగి తెచ్చుకుంటాం. లేదా దొంగిలిస్తాం. క్రైంస్ అనగా నేరాలు. నెలకి రెండు వర్షాల్లాగా జరుగుతాయి. నాలుగు డబ్బులు తిరుగుతాయి. కోర్టులు వర్ధిల్లుతాయి. సివిలైజేషను ముందుకి నడుస్తుంది. ప్రతివాడూ పుస్తకాలు కొనేస్తే ఇదంతా స్థంభించిపోదూ? కోర్టులు, బందిఖానాలు, సిగార్సు వగైరా వర్తక వ్యాపారాలు అన్నీ ఆగిపోతాయి. ఆ తరువాత పుస్తకాలు వ్రాసుకుందుకు మటుకు మెటీరియలు ఏవి దొరుకుతుందీ? నేరాలు జరక్కపోతే వేటి గురించి వ్రాస్తాం? హత్యా సాహిత్యం హతం ఖతం అయిపోదూ? అన్యాయం హరించిపొతే ఏది నశించాలని రాస్తాం? అసలే ఆంధ్రాలో ప్రతి మూడోవాడూ కవి. అడ్డమైనవాడూ రాసేస్తున్నాడోయ్ అని అడ్డమైనవాడూ ఏడ్చి నెత్తి మొత్తుకుంటున్నాడు. మర్నీలాంటివాళ్ళు కూడా బుక్కులికి వందలూ వేలూ గుమ్మరించి కొనేస్తే బుక్కిండిస్ట్రీ పెరిగిపోతుంది. రైటర్లు రోజూ తిండి తిండం మరిగి, బలిసి, రాయడం మానేస్తారు. ఆ పైన ఇది లాభసాటిరోయ్ భగవాన్లూ అని ప్రతి రెండోవాడూ కూడా రాయడం మొదలెట్టేస్తాడు. ఇహనందరూ రైటర్లే, అప్పుడు ప్రతివాడికీ తన పుస్తకాలు చదువుకుందికిమటుకు తీరుబాటుంటుంది. మరొహడి చెత్త చదవనపుడు డబ్బు పోసి కొండవెందుకులె అని ఎలాగూ కొనడు. ...అందువల్ల ఫండ్స్ ని అక్రమంగా దుర్వినియోగం చేసి పుస్తకాలు ..." ముళ్ళపూడి వారి గిరీశం లెక్చర్లు నుంచి ఓ మచ్చు తునక.

మరి ఈ పుస్తకం కొనాలనిపిస్తోందా? అయినా కొని చదవొద్దు. కొంటే వొచ్చే అనర్థం అర్థమయ్యింది కదా! నా దగ్గర, మన మిత్రుల దగ్గర ఇలాంటివి కోకొల్లలు. అరువడిగి తెచ్చుకుందాం. బుథ్ధిగా, పథ్ధతిగా తిరిగి ఇచ్చేసుకునే (ఇల్లు కదలకుండా) ఏర్పాటు చేసుకుందాం. మరి మీకిష్టవయితే మన బ్లాగు gksraja.blogspot.com చూడండి. అందులో కుడి వైపు పైన ఉన్న FOLLOW బటన్ నొక్కి మీ email ID ఎంటర్ చెయ్యండి. మీ ఉద్దెశాల్నీ, సూచనల్నీ నా మెయిలు gksraja@yahoo.com కి వ్రాయండి. తొందర్లోనే మన నెట్ వర్క్ ఒకటి తయారు చేసుకుందాం. ఏవంటారు?

ఒకవేళ కొనాలనే భయంకరమైన నిర్ణయం తీసుకుంటే మంచిదే! పది కాలాలపాటు మనతో ఉండవలసిన ఇలాంటి పుస్తకాలు జాగ్రత్త చేసుకొని మనసు బాలేనప్పుడూ, బాగా ఉత్సాహంగా ఉన్నప్పుడూ మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు. ముళ్ళపూడి వారి రచనలన్నీ నేను కొన్నంతవరకూ 8 సంకలనాలుగా వచ్చాయి. ఒక్కోటి రూ.150/- విశాలాంధ్రావారు బహు చక్కగా ముద్రించి సభ్యత్వం తీసుకున్నవారికి తగిన డిస్కౌంట్ తో అమ్ముతున్నారు.