తెలుగు సంగతులు

సోమవారం, నవంబర్ 28, 2011

కలాలే కత్తులు


కలాలే కత్తులుఇది చలి కాలం. గిలి కాలం. చక్కిలిగిలి కాలం. చక్కని నెచ్చెలి చెక్కిలి తో జిల్ జిల్ కాలం-- సాగినవాడికి.  మరి బడుగు జీవికి-- ఇది చలి కాలమే! కలి కాలం. ఆకలి కాలం. అంబలి కి కూడా కరువైన, అకృత్యాల బలి కాలం. కప్పుకున్న గోనె పాత కూడా బరువయిన వాడికి, మోకాళ్లను మాత్రం ఒడుపుగా డొక్కల్లోకి గుచ్చుకునే సౌకర్యం ఉన్నవాడికి ఇది చలి కాలమే! కాలం మారుతోంది అంటారు- యుగాలు, తరాలు మారుతున్నాయి కాని చలి గిలి కొందరికి—చలి బాధ ఎందరికో—అన్న స్థితి మాత్రం మారడం లేదు. ఆకలికి చచ్చిపోవడం ఊహ కైనా అందుతుందేమో గాని, చలికి చచ్చిపోవడం ఎంత దుర్భరమో ఆ బాధ పడినవాడికి తప్ప తెలియదేమో—సైనేడు రుచి చెప్పలేనట్టు.
ఇటువంటి చలికాలం గురించి సుప్రసిద్ధ జర్నలిస్టు, రచయిత, సాహిత్యవేత్త డా:ఎ.బి.కె.ప్రసాద్ వ్రాసిన వ్యాసం “కలాలు-కరవాలాలు” (సాహిత్యకీయాలు) అనే పుస్తకంలోనిది. ఈ పుస్తకం ఎన్నో విశిష్టమయిన వ్యాసాల సంకలనం. తప్పక చదివవలసిన పుస్తకం. మచ్చుగా ఈ చిన్ని వ్యాసాన్ని ఇక్కడ యధాతధంగా చదవండి.
దుప్పటిలో దూరి మనల్ని అల్లుకుని నిద్దురపోయేది ఎవరు? చెవుల్లో వేళ్ళు జొనిపి మనల్ని అల్లరి పెట్టేది ఎవరు? ఎవరయ్యా మన బుగ్గల్ని చిదిమేసి, పెదాల్ని కొరికేసి నిదురపోనీయనిది ఎవరు? రాత్రివేళ గడప దాటనీయకుండా కాపలా పెట్టేది ఎవరు?
చలికాలం! ఏటా వచ్చే చలికాలం మన సంప్రదాయ జీవితాన్ని పరిపుష్టం చేస్తున్నది. చలికాలమే లేకుంటే ఉన్ని కంబళ్ళు పుట్టుకొచ్చేవి కావు.  చలికాలమే లేకుంటే రేగుపళ్ళు దొరికేవి కావు. చలికాలమే లేనినాడు మనకు నిగనిగ మెరిసే, తళతళ లాడే అంతలేసి ఉసిరికాయలు దర్శనమిచ్చేవి కావు. చలికాలాన్ని తట్టుకోడానికే కదా భోగి మంటలు పుట్టినాయి. ఒక దృశ్యాన్ని మనసుకు తెచ్చుకోండి. నీలాల నేత్రాల్లో కనుపాపలు బెదిరిపోతే అటూ ఇటూ తిరుగుతుంటాయి. రెప్పలకి పూసిన కాటుక చెరిగి, బెదిరి బుగ్గలమీదికి పాకేస్తుంది. తలంటి పోసిన లేత జుత్తు పకపక తుళ్ళిపడినట్టు గాలికి ఎగురుతుంటుంది. పసుపు రాసి నలుగు పెట్టుకున్న బంగారు చేతులతో అమ్మ, నెత్తి మీద దోసిళ్ళతో రేగిపళ్ళు అక్షింతల్లాగ కుమ్మరిస్తుంది. వాటిలోని దమ్మిడీలు కింద కనక వర్షం లాగ కురిస్తే పిల్లలు వాటి కోసం ఒకరినొకరు తోసేసుకొని తగవులాడుకుంటారు. పెద్దలు వాళ్ళని మురిపెంగా మందలిస్తూ తలో దోసెడు రేగుపళ్ళు కాటుక కళ్ళ పాపాయి శిరసుపై దీవెనల్లా కుమ్మరిస్తూ వుంటారు. అది భోగిపళ్ళ వేడుక. అది చలికాలమిచ్చిన కానుక. గ్రామానికి చలి కాపలా కాస్తున్న వేళ వేకువజామున నిదుర లేవడానికి కదా మేలుకొలుపులు మొదలయ్యాయి.
“తెల్లవార వచ్చే తెలియని నా స్వామి
మళ్లి పరుండేవు లేరా!
మళ్లి పరుండేవు, మెసలుతూ వుండేవు
కళ్యాణ గుణధామ లేరా!
నల్లనయ్యా లేర
నను గన్న తండ్రి...”
అనే పాట జ్ఞాపకముందా? తెల్లవారుజామున చలిగాలిలో తేలివచ్చి, కనురెప్పల్ని తట్టి చెవులలో తియ్యని ధ్వనుల్ని ఒలికించే మధురమయిన మేలుకొలుపు పాట చలికాలం నుంచే పుట్టినాయి కదా? ధనుర్మాసం చలికాలం చల్లని వింటినారి మీదే కదా హొయలు పోయేది. అన్ని కాలాల కంటే ఉన్న కాలమే గొప్పది. ఇపుడిక్కడ చలికాలమే నడుస్తున్నది. అయితే ఓ రకంగా ఇది –‘ఉన్న’ వారికి సుఖమైన కాలం. ఉన్ని కోట్ల వారు, దళసరి స్వెట్టర్ల వారు.. ఎందు కట్టెలు వెలిగించి, నెగళ్లు రగిలించి నిగ నిగలాడే గాజుగ్లాసుల్లో తళతళలాడే విదేశీ మద్యం నింపుకొని ఆరారా తాగుతూ మసాలా వంటకపు మాంసాహారం భుజిస్తూ సుఖమయంగా గడపగలిగేవారు రుతువుల రాజుని బతిమాలి తెచ్చుకున్న కాలమిది. ఆకాశాన్ని కప్పుకోలేక, భూమిని చుట్టుకోలేక, చర్మంతో సరిపెట్టుకోలేక , చావు చల్లగా ఉండే పేవ్ మెంట్ల మీదే చనిపోయిన వారి మృతదేహాల మీద పడగ విప్పి ఆడే పాము ఇది. పేదల పాలిట బాముల కాలమిది.
“.... నడివీధిని పడి బతికే
నీ వంటిని గుడ్డ లేదు
వల్లకాటి చితులన్నీ
ఆరి, పచ్చిబారినాయి
రైలు దారి మదుం లోన     
పల్లక తొంగో కొడుకా
మీద వేళ్ళు రైలు మంట
అదే నీకు చలి మంట”
అని ఆరుద్ర ఒక చోట రాశాడు. ఇది పేదల బాధ. తెలుగు కవులు పేదల పక్షానికి ఫిరాయించక ముందు ప్రబంధ యుగంలో రుతువర్ణన మాత్రం తప్పనిసరిగా చేసేవారు.అందుకు వారు కలిగిన వారి చలికాలపు సరదాల గురించి రాసేవారు. కస్తూరి పూసిన జవరాండ్ర జవనాలు వయసువారి చలిని తీర్చే అందమైన కుంపట్లని అర్ధం వచ్చే పద్యాలు పాతకాలపు కవులు ముచ్చటపడి రాసేవారు.వాళ్ళు తరచుగా ముసలివాళ్ళు, పళ్ళుఊడినవారూ ఉండేవారు. అయితే వారా పద్యాలు రాజుల్ని, జమిందారుల్ని,వారి దగ్గర డబ్బులు కొట్టేసి మారు వేషాల్లోని రాజుల వలె  బతికే రసిక మంత్రిమండలిని, ఆ మూడు వర్గాల వారి ఉంపుడుగత్తెల్ని మెప్పించడానికి రాసేవారు.అయితే ఆయా వర్గాల్లోని రాజులకూ, జమీందారులకు, వారి ఉంపుడుగత్తెలకూ చదవడం పూర్తిగా వచ్చేది కాదు. కాబట్టి వారూ ఆ కావ్యాల్ని చాలా గౌరవంగా చూసేవారు. చదవడం వచ్చినవారి సంఖ్య పెరిగేసరికి చాలావరకు అలాంటి ప్రభందాలు నశించిపోయాయి. ఆ కవులూ అంతరించిపోయారు. ప్రబంధాల సంఖ్య  తగ్గడంతోనే సాహిత్యంలో అబద్దాల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో తగ్గింది. రుతువులన్నీ రాజుల, వారి కుటుంబాల, వారి మంత్రి, సామంత, దండనాయకుల సుఖం కోసమే ఒక చక్రగతిన తిరుగుతున్నాయనే భ్రమను కల్పించి కవులూ పబ్బం గడుపుకున్నారు. అయితే గురజాడ మహాకవి తో మొదలై, శ్రీశ్రీ నాడు ప్రభంజనంలాగ పెరిగి, సుబ్బారావు పాణిగ్రాహి నాడు ప్రజల చేతి ఆయుధంగా మారిన తెలుగు కవిత్వం అబద్ధాలకు దూరమై వాస్తవానికీ, ప్రజలకూ దగ్గరైంది. రుతువుల రాకపోకల ప్రభావం ప్రజలపై ఉంటుందన్న అవగాహన మాత్రమే నేడు అందరికీ ఉంది.
వానలు కురియక తెలుగు రైతులు గడ్డిపోచల్లాగ ఎందిపోయారు. గుండె చెరువైన వారి కంటినుండి రాలిన నీరే పొలాలకు నీరై అక్కడక్కడా అరకొర పంటలు పండాయి. సరిగ్గా అప్పుడు సముద్రంలో పుట్టిన విషం తుఫానై నాలుకలు చాస్తూ ఆ పంటపొలాల ప్రాణహరితాన్ని పీల్చివేసింది. చేతికి అందిన సస్య లక్ష్మిని ఎత్తుకుపోయింది. పల్లెలను ఆకలితో, దుఖంతో, గుండె మంటలతో అల్లాడిపోతున్నప్పుడు చలిగాలులు గుర్రాలు పూన్చిన రధం మీద ఎక్కి సంక్రాంతి లక్ష్మి వస్తున్నది. ఎవ్వరూ ఆమెకు స్వాగతం చెప్పకండి. భయకంపిత హస్తాలతో నమస్కరించడం సాధ్యం కాదని చెప్పండి. కొనప్రాణాలతో ఉన్న ఈ పల్లెటూళ్ళతో నీకేం పని తల్లీ, పోయి ప్రపంచ బాంకు రమ్య హర్మ్యాల్లో, భవ్య భవంతుల్లో పూజలు అందుకో అమ్మా అని చెప్పండి. ధాన్యపు కంకుల నుంచి వేళ్ళాడే సిరిమువ్వల సవ్వడులు నీకిక్కడ వినిపించవు. పోయీ ప్రైవేటు పరిశ్రమల యంత్రాలనుంచి వెలువడే శ్రావ్య సంగీతాన్ని ఆస్వాదించమని చెప్పండి!! “   
ఎ.బి.కె.ప్రసాద్ గారి ఈ వ్యాస సంకలనం లో ఎంతో సాహితి చర్చ ఉంది. వాస్తవాలు గణాంకాలు ఉన్నాయి. మేలుకొలుపు ఉంది. చలిని తగ్గించే వేడి, వాడి ఉన్నాయి.
ఎమెస్కో వారి ప్రచురణ. వెల:రూ:100/-