బ్లాగులో వ్రాయడం తగ్గింది. బదులుగా కధలు వ్రాయడం మొదలుపెట్టాను. గతంలో (కాలేజీ రోజుల్నించీ దొంగచాటున వ్రాయడం - పూర్తి చెయ్యకుండానే చింపెయ్యడం జరిగేది) ఎప్పుడు మొదలెట్టినా అది పూర్తి అయ్యేది కాదు. అసంతృప్తి. భయం, సిగ్గు. ఇప్పుడు ధైర్యమే చేశానో, సిగ్గు వదిలేశానో -- మొత్తం మీద తెగించి - కొంతలో కొంత తృప్తినిచ్చిన కధల్ని ప్రముఖ పత్రికలకు పంపడం మొదలుపెట్టాను. నా మొదటి కధ 'మధురిమ ' ను నా అభిమాన మాస పత్రిక అయిన 'తెలుగువెలుగు ' లో ముద్రణ అవ్వాలని ప్రగాఢ వాంఛ. అది నెరవేరింది. నవంబరు 2017 సంచికలో ముద్రణ అయ్యింది. నా సంతోషానికి అవధుల్లేవు. అది పంచుకుందామనీ, కధ పై మీ అభిప్రాయల్ని చెప్పి నాకు సరైన మార్గదర్శకత్వం చేస్తారనీ ఆశిస్తూ --
జి.కె.యస్.రాజా
ఫోను: 9989126636
మెయిలు: gksraja@gmail.com
జి.కె.యస్.రాజా
ఫోను: 9989126636
మెయిలు: gksraja@gmail.com
మధురిమ
'మధురిమ ' ఆ పేరు వింటేనే ఏవో సంగీత లోకాల్లో విహరిస్తున్న భావన. వెంకటయ్య తన సంతానానికి ఏం పేరు పెట్టాలనుకున్నాడో ఎప్పుడూ మాటల్లో కూడా వచ్చిన సందర్భం నాకు గుర్తులేదు. వాళ్ళ పెళ్ళయిన రెండేళ్ళ తర్వాత పుట్టిన ఆడబిడ్డకు మాత్రం తన బంగారి పెట్టిన పేరు 'మధురిమ ' ను తలచుకుంటూ మురిసిపోవడం, నాతో వందల సార్లు చెప్పుకుని పొంగిపోవడం నేనెప్పటికీ మరవలేను. మా ఊరినుండి గంటలోపే చేరొచ్చు మా వెంకటయ్య భార్య, బంగారి ఊరు. పెళ్ళయి కాపరానికి వచ్చాక బంగారి భర్తను వదిలి ఎప్పుడూ పుట్టింటికి కూడా వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. ఆమె ఏడవ నెల గర్భిణీగా ఉండగా బలవంతం మీద పుట్టింటికి వెళ్ళింది పురిటికి. ఐదో నెల్లోనే వెళ్ళమని వెంకటయ్య ఎంత మొత్తుకున్నా అమె వినలేదు.
నాకు వాళ్ళతో అనుబంధం ఏర్పడడం ఒక్క రోజులో జరిగింది కాదు. మాకున్న తోట పొలం దగ్గరకు వెళ్ళాలంటే వెంకటయ్య ఇల్లు దాటి వెళ్ళాల్సిరావడమే మా పరిచయానికీ, తర్వాత్తర్వాత గ పడిన అనుబంధానికీ కారణం. వాళ్ళ గురించిన విషయాలు నాకు ప్రత్యేకించి తెలియదు. తెలుసుకోవాల్సిన సందర్భం కానీ, అవసరం కాని కలక్కుండానే మాకు ఒక బంధం ఏర్పడింది. వాళ్ళకు పెళ్ళి అయ్యేనాటికి నేను ఆరో తరగతి చదువుతున్నట్టు గుర్తు. అప్పట్లో ఒక వేసవి రోజు పొలం వెళ్తున్న నన్ను తన ఇంటి వాకిలి బయట కాపు కాచుక్కూర్చున్న వెంకటయ్య ఆపి అరుగుపై కూర్చోబెట్టాడు. ఎప్పుడైనా వెంకటయ్య బలవంతం మీద అ అరుగు మీద కూర్చునేవాడిని. కాలాన్నిబట్టి ముంజలో, సీమచింతకాయలో, సీతాఫలాలో ఇచ్చి తిను బాబూ' అని ఎదురుగా కూర్చొనేవాడు. 'నీకు లేవా మరి వెంకటయ్యా' అంటే 'ఎందుకు లేవు, బోల్డన్ని ఉన్నాయి. నీకోసం ఏరిపెట్టాను నువ్వు తిను బాబూ' అనేవాడు. ఎప్పుడైనా ప్రత్యేకించి చూస్తే కొంచెం నాసిరకానివి వెనక దొడ్లో పోగులుగా కనబడేవి. వాళ్ళ ఇల్లు దాటాక మా పొలానికి కుడి వైపు పుంతగట్టుకి తిరగాలి. అప్పుడు వాళ్ళ పెరడు కూడా కనిపిస్తుంది. మంచివి తీసిపెట్టి తను మిగిలిన నాసిరకం తింటున్నాడని తెలిసినా, ఎప్పుడూ కాదనలేకపోయేవాడిని. తను నన్నంత వాత్సల్యంగా చూడడం ఆశ్చర్యంగా అనిపించేది. అర్ధం చేసుకునే వయసూ లేదు. అడిగే చొరవాలేదు.
అరుగు మీద ఇద్దరు, పక్కన వాల్చి ఉన్న నులక మంచం మీద మరో ఇద్దరు కూర్చొని ఉన్నారు. వెంకటయ్య ఇంట్లో అతను కాకుండా మరో వ్యక్తుల్ని చూసిన గుర్తు నాకెప్పుడూ లేదు. అదే అరుగుమీద ఎన్నోసార్లు కూర్చొని వెంకటయ్య ఆప్యాయంగా అందించిన ఈత పళ్ళూ, తేగలూ తిన్నాను. ఆ అరుగు ఇప్పుడు కొత్త సొబగులద్దుకుంది. నున్నగా అలికి ముగ్గులేసి ఉంది. అంతకుముందు అక్కడక్కడా విరిగిన అరుగు కొనలు సరి చేసిన కారణంగా కోణం తేలి నిదానంగా ఉన్నాయి. అంతలో వెంకటయ్య పెద్ద ఇత్తడి పళ్ళెంలో మిఠాయిలు, చెక్కినాలు అందించాడు కాస్త సందేహిస్తూనే. 'నీకిష్టమయినవి తిను బాబూ ' అంటూనే తొందర తొందరగా లోపలికి వెళ్ళాడు. నేనేం చెయ్యాలో తెలియక తికమక పడుతూ పళ్ళాన్ని చప్పుడు కాకుండా పక్కన పెట్టి దిక్కులు చూస్తున్నాను. అరుగుకింద మంచం మీద కూర్చున్న గుబురుమీసాల పెద్దమనిషి ఆరిపోయిన చుట్టను పట్టుకుని 'తినవయ్యా బాబూ, మీ యెంకటప్ప మాంచి ఉషారుగ ఉన్నాడియ్యాల, ఎదురుచూసి చూసి నువ్వు రాగానే ఇంత మొకం జేస్కుని అయ్యి నీకు దెచ్చిబెట్టేడు. మాకింకా ఏ మర్యాదా మొదలవ్వలేదు. పంతులోరి బోణీ అయితేగానీ మాకు పెళ్ళి సారె రుచి చూపెట్టేటట్టు లేడు. ప్రసాదంలాగ అయినా నోట్లో ఏసుకోవయ్య పంతులూ' అన్నాడు అదో రకం వెటకారంతో. మెల్లగానే పంచదార చిలక ముక్క విరుచుకున్నాను అతి కష్టం మీద.
నోట్లో పెట్టుకోబోతుండగా వెంకటయ్య తలొంచుకున్న కొత్త పెళ్ళికూతుర్ని వెంటబెట్టుకొచ్చాడు. అప్పటికే సుమారు ముఫ్ఫయ్యేళ్ళు దాటుతున్న వెంకటయ్య పక్కన ఆమె లేత చిగురాకులా వణుకుతున్నట్లనిపించింది. ఆమె వంచిన తల ఎత్త లేదు. మెడలో కొత్త పసుపు తాడు బంగారం కంటే పచ్చగా మెరిసిపోతోంది.' ఈవె బంగారి బాబూ! ఇకనించి ఇక్కడే ఉంటాది 'అన్నాడు ఒక రకమైన సంతోషంతోనూ, కొంచెం విజయ గర్వంతోనూ!
ఇంటికెళ్ళాక అమ్మతో చెబితే, 'పళ్ళూ కాయలూ వరకూ సరే, వండిన పదార్ధాలు కూడా ఆరగిస్తున్నావా అక్కడ ' అంది ఎదో తెలియని భయంతో. నేనేమీ మాట్లాడకుండానే, నా మొహంలోని సందేహాన్ని, విసుగునూ గమనించిన మాఅమ్మ, 'అదికాదురానాయనా వాళ్ళ సంసారాలు అంతంత మాత్రం. రెక్కాడితేగాని డొక్కాడని వాళ్ళు, వాళ్ళ కష్టం నువ్వు తినేస్తే ఎలాగా' అంది. 'అయితే మనం ఏమన్నా సాయం చెయ్యొచ్చు కదమ్మా' అన్నాను. అమ్మ ముందు కొంచెం కంగారు పడిందల్లా వెంటనే సర్దుకుని సరే అలాగేలే, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేద్దాంలే. నువ్వు మునుపట్లా అస్తమానూ వాళ్ళింటికి వెళ్ళకూడదు. ఇప్పుడు వెంకటయ్యకు పెళ్ళి అయ్యింది కదా మరి ' అంది నన్ను మరీ చిన్న పిల్లాణ్ణి చేస్తూ.
పదో తరగతిలోకొచ్చాక నేను మాపొలం వెళ్ళడం తగ్గిపోయింది. పెద్ద పరీక్షలని ఎక్కడకూ వెళ్ళనిచ్చేవారు కాదు. ఎప్పుడయినా వీలు చిక్కించుకొని వెళితే వెంకటయ్యతో బాటూ బంగారి కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టి ఎదో ఒకటి తినడానికి పెట్టి చదువు గురించి ఎంతో ఆసక్తిగా అడిగేది. నాకు తెలవకుండానే ఆవిణ్ణి అక్కా అని పిలిచేవాణ్ణి. అలా పిలిచినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఎంత సంబరపడిపోయావారంటే,ఆ భావాల్ని దాచుకోలేకపోయేవారు. వాళ్ళ పాపకు అప్పటికి రెండేళ్ళు ఉండొచ్చు. ముద్దుగా బుడి బుడి నడకలతో చాలా ముచ్చటగా ఉండేది. ' పాపా ఇటు రామ్మా' అని పిలిస్తే, వెంటనే బంగారి 'దాని పేరు మధురిమ బాబూ' అని 'వెళ్ళు మధురిమా, నీ మామ ' అని నా దగ్గరకు తీసుకొచ్చేది. కొత్తగా చూసేది నన్ను. దగ్గరకు చేరేది కాదు కానీ, వాళ్ళ అమ్మ వెనకాల దాక్కుని నవ్వేది. ఆ నవ్వు భలే వింతగా ఉండేది. 'మధురిమ ' భలే పేరు. బంగారక్కకు ఎలా తట్టిందో ఆ పేరు? అనుకునేవాణ్ణి ఆ పిల్లను చూసినప్పుడల్లా.
ఎప్పుడైనా వెంకటయ్య ఊర్లో ఎదురైతే 'బంగారక్క ఇంట్లో ఉందా ' అని అడిగితే, మహా సంబరంగా చెప్పేవాడు 'ఉంది బాబూ, నువ్వు నాల్రోజుల్నించి ఆపడలేదని ఎదురు చూస్తాంది. ఈలయితే ఓపాలి రాబాబూ ' అనేవాడు. నా తెలుగు పుస్తకం అడిగితే పట్టుకెళ్ళిచ్చాను బంగారక్కకి. అప్పుడు తెలిసింది ఆమెకు చదవడం వచ్చని. 'కిందటేడుది ఇయ్యి బాబూ కొద్ది రోజులు చదూకున్నాక ఇస్తాను ' అని అడిగింది ఒకసారి. తెలుగు వాచకం తో పాటూ సుమతీ శతకం కూడా పట్టుకెళ్ళిచ్చాను. 'మీ ఇంట్లో చందమామ పుస్తకాలు ఉన్నాయా, పాతవైనా పర్లేదు ' అని అడిగింది మరోసారి. ఇంట్లో ఎప్పటివో చందమామ పుస్తకాలు భోషాణంలో ఉన్న వాటిని ఏరి ఒక పెద్ద కట్ట ఇచ్చాను బంగారక్కకు. ఎంత సంబరపడిపోయిందో!
వెంకటయ్య కూలిపనిలో కెళితే బంగారక్క ఇంటిదగ్గరే ఉండి పిడకలు చేసి అమ్మడం, పెద్ద కుటుంబాల వాళ్ళకు పప్పులూ అవీ విసిరి పెట్టడం లాంటి పనులు చేసిపెడ్తూ ఉండేది. కానీ ఇళ్ళల్లో పాచి పనులు, గిన్నెలు తోమె పనులకు ఎవరైనా అడిగినా వెళ్ళేది కాదు. వెంకటయ్య కూడా అలా పనికి పంపడం ఇష్టం లేనట్టే ఉండేవాడు. ఇంటిదగ్గర ఎప్పుడూ ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. మధ్యాహ్నం వేళల్లో తీరిక జేసుకోని పాత పేపరో, నేనిచ్చిన చందమామ పుస్తకమో చదువుతూ గడిపేది. పుస్తకం పట్ల బంగారక్కకున్న ఆపేక్ష నన్ను ముగ్ధుణ్ణి చేసేది.
ఇంటర్మీడియట్ చదువుకని వెళ్ళిన నేను ఆ రెండు సంవత్సరాలూ వెంకటయ్యను, బంగారక్కను కలవనేలేదు. అప్పుడప్పుడూ గుర్తుకొచ్చేవారు, కాని నా కొత్త స్నేహితులు, హాస్టలు జీవితం, చదువు ఒత్తిడి వాళ్ళ జ్ఞాపకాలనుండి కొంత దూరం చేశాయి. సెలవుల్లో వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కొంచెం సంకోచం కలిగేది. వయసుతోపాటూ పెరిగిన భయాలు, సందిగ్ధాలూ, అహంపెంచే విజ్ఞానపు ఛాయలు నన్ను అక్కడికి వెళ్ళనీయలేదు. ఒకరోజు ఇంకో నలుగురు స్నేహితుల్తో కలిసి అటే మా పొలం వైపు వెళుతూ, తొందరగా ఆ ఇల్లు దాటిపోవలనుకుంటున్న నన్ను, అంత దూరం నుంచే గుర్తు పట్టిన బంగారక్క పిల్లని వెంటెసుకొని పెరట్లోంచి పరుగులాంటి నడకతో ఇంటి ముందుకు వచ్చింది. ఆమె వెనకాలే వాళ్ళ పాప 'మధురిమ ' వచ్చి మమ్మల్ని తేరిపార చూస్తోంది. అప్పటికే మేం ఆ ఇల్లు దాటిపోతున్నాం. "బాబూ' ఎల్లిపోతున్నారేంటి. కాస్సేపు కూర్చొని పోదురు రండి ' అని పిలిచింది. గొంతులో అదే మార్దవం, అదే చొరవ, ఆతృత - ఎమీ మారలేదు. తల్లి అయిన కారణంగా కొంత నిండుతనం సంతరించుకున్నట్టు కనబడింది. 'మళ్ళీ వస్తాను అని చెప్పు వెంకటయ్యతో ' అనుకుంటూ ముందుకు సాగిపోయాను సావాసగాళ్ళతో. నాగొంతు, నా సమాధానం నాకే అసహజంగా అనిపించాయి. పిలుపులో బంగారక్కా అన్న పదానికి ఎందుకు చోటు దొరకలేదో నాకే అర్ధం కాలేదు. నాకే సిగ్గనిపించింది. ఇంటికెళ్ళాక వెంకటయ్య ఆప్యాయత, అంతకు మించిన గౌరవం బంగారక్క దగ్గర తనకు దొరికిన చనువు, దక్కిన వాత్సల్యం గుర్తుకొచ్చి కళ్ళ నీళ్ళు తిరిగాయి. ఒక నిర్ణయానికొచ్చి అటు ఒత్తిగిలి పడుకున్నాను.
మర్నాడు ఇంట్లోంచి బయలుదేరి తిన్నగా పొలం వైపుకే నడవసాగాను. వెంకటయ్య ఇంటి దగ్గర ఆగాలా వద్దా? బంగారక్క దగ్గర కాస్సేపు కబుర్లు చెప్పాలని ఉబలాటంగానే ఉంది. తను ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు. ఆ విషయాన్ని తనతోపాటూ తన ఇంట్లో వాళ్ళు కూడా మాటిమాటికీ అంటున్నారు ప్రతీ సందర్భంలోనూ. అంత మంచి మనసున్న ఆ ఇద్దరి దంపతుల దగ్గరకూ వెళ్ళడానికి ఇంత వెనక ముందు ఎందుకవుతున్నట్టు. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అన్న వెరపు ఒక పక్క, బాల్యంలోంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్న తనను ఇంట్లోవాళ్ళు, మరీ ముఖ్యంగా తల్లి ఏవో చాదస్తాలతో చేస్తున్న కట్టడి ఒక వైపు. వెంకటయ్య ఇల్లు సమీపిస్తోన్న కొలదీ అంతకుముందు ఎప్పుడూ లేనంత టెన్షన్ గా అనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను, వెనకనుండి పిలుపుతో. వెంకటయ్య ఎక్కడ నుండి చూశాడో పరుగు పరుగున వచ్చాడు. 'రండి బాబూ, రండి ' అంటూ మహోద్వేగంతో నా సమాధానం కోసం కూడా చూడకుండా ఇంట్లోకి పరిగెత్తాడు. అంతకు ముందు లేని మొక్కలు, పాదులతో ఏర్పాటైన దడి దగ్గరే నిలబడిపోయిన నన్ను, బయటికొచ్చిన బంగారి సంభ్రమానందాలతో, ఏమాత్రం సంకోచం లేకుండా చెయ్యి పట్టుకొని అరుగు దగ్గరకు తీసుకెళ్ళిపోయింది. ఆ సంతోషానికి అవధుల్లేవు. అదే ఊపులో వెంకటయ్యకు పురమాయిచేసింది. 'చాప కాదయ్యా, ఆ మంచం అన్నా ఎయ్యి మా తమ్ముడికి ' అని నా వంక తిరిగి 'రా తండ్రీ కూర్చో' అని నన్ను కూర్చోబెట్టి ఒక్క పరుగున లోనికెళ్ళింది. మెరిసిపోతున్న కొత్త ఇత్తడి చెంబుతో మంచినీళ్ళు తెచ్చి మంచం పక్కన కింద పెట్టింది. తను చతికిలబడి వసారా రాటకి జారబడి కూర్చుంది. నేను ఏం మాట్లాడాలో తెలియక తల వంచుక్కూర్చున్నాను. ఒక నిముషం తరువాత తనే చెప్పడం మొదలుపెట్టింది. 'నన్ను అన్నిందాలా బాగా చూసుకుంటాడు మీ వెంకటయ్య, కానీ పిల్ల భవిష్యత్తు గురించి ఏమీ పట్టించుకోడయ్యా. ఆళ్ళకి చదువు కావాలయ్యా. కానీ బతక నేర్చినోళ్ళకి మాత్రమే దొరికే చదువు కాదు. తన బతుకు తను ధైర్యంగా బతికే చదువు, పదిమందికీ సాయం చెయ్యగలిగే చదువు చదివించాలి. అయ్యో నువ్వు ఎలా ఉన్నావు అని అడక్కుండానే నా సొదలో పడిపోయానయ్యా. ఇన్నాళ్ళకొచ్చావ్. నాకు తెలియదు బాబూ నువ్వు వస్తున్నావని. ఏం తీసుకుంటావ్? ఏం చేసి పెట్టనయ్యా నీకు? నీ కోసమే ఎదురు చూస్తున్నాను తమ్ముడూ'. ప్రవహంలా మాట్లాడేస్తోంది బంగారక్క. ఇంక నేనుండబట్టలేకపోయాను. 'అక్కా! ఏంటిది, ఏవయ్యింది నీకు? ఏం చెయ్యాలి నేను?' అంటూ తడబడుతూనే అన్నాను. 'మీ వెంకటయ్యకి మధ్యలో జబ్బు చేసిందయ్యా. అయినా అలాగే నాకు కష్టం కలక్కూడదని ఓపిక లేకపోయినా పనిలోకి వెళ్తూనే ఉన్నాడు. నా కష్టం ఏ మూలకీ తోడవ్వడం లేదు '. అని ఒక్క క్షణం ఆగి 'ఇదంతా మాగోల నీ కెందుకు గానీ, నాబిడ్డను ఏం చెయ్యను తమ్ముడూ?' అంది.' ఏమయ్యింది నీ బిడ్డకు అన్నాను అతికష్టం మీద. 'ఏం కాలేదు తమ్ముడూ! మేం ఎలాగైనా దానికి కావాల్సిన తిండి, బట్ట ఇవ్వగలం కానీ అన్నిటికన్నా అవసరమయిన చదువు కావాలి కదయ్యా దానికి! ఇక్కడ ఇప్పుడు మూడో తరగతి చదువుతోంది. ఈ ఊర్లో ఐదు తరువాత లేదు కదా! అదీ నా బెంగ '. 'ఏవిటిది అక్కా! వెంకటయ్యా నువ్వన్నా చెప్పవు? మూడో తరగతి చదివే పిల్ల చదువు గురించి ఇప్పటినుండీ ఇంత గాభరా పెట్టుకుంటారా ఎవరైనా!' అన్నాను. వెంకటయ్య అమాయకమైన ఓ చిన్న నవ్వు నవ్వి అన్నాడు ' అదే నేనూ చెబుతున్నా బాబూ, ఈ బంగారి ఇంటేనా! పొద్దస్తమానూ ఇదే ధోరణి. నేను ఆమధ్య కొంచెం జబ్బు పడినందుకు కాస్త ఓపిక తగ్గింది బాబూ. బంగారేమో ఈ బెంగతో జబ్బు పడేటట్టుండాది, నువ్వే చెప్పాలి బాబూ '. నావంకే తేరిపార చూస్తోంది మధురిమ. నేను తనను చూద్దామంటే గబుక్కున తల తిప్పేసి వాళ్ళ అమ్మ కొంగుచాటుకు చేరిపోతుంది. దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా 'మధురిమ 'ను మచ్చిక చేసుకోలేకపోయాను. బంగారక్క వంక తిరిగి 'అక్కా మధురిమను ఐదవ తరగతి వరకూ చదివించండి, తరువాత సంగతి నేను చూసుకుంటాను. అప్పటికి నాకు చదువు పూర్తయ్యి ఎక్కడైనా సెటిల్ అయిపోతాను. మా బంగారక్క కూతురికి ఆ మాత్రం చెయ్యలేనా! నువ్వు ఆ సంగతి మర్చిపో! అన్నాను భరోసా ఇస్తున్న గర్వంతో. 'అది కాదు తమ్ముడూ! మమ్మల్ని ఎలాగైనా పట్నానికి తీసుకుపోయి అక్కడ ఏదైనా పని ఇప్పిస్తే మధురిమను అక్కడే చదివించుకోటం మాకు తేలిక అవ్వుద్ది. ఈ ఇల్లు కూడా ఖాళీ చెయ్యాలని పంతులు గారు చెప్పారంట ఈయనతో. ఇది కాల్వగట్టుకదా ఎడల్పు చెయ్యనీకి ఇల్లు పీకెయ్యమన్నారు. మధురిమ కోసమయినా పట్నానికి పోతేనే బావుంటాదికదా అని ఆశ. ఎదో ఒకటి చేసి మమ్మల్ని పట్నం పట్టూపో నాయనా' అంది. ఎందుకో బంగారక్క ఒక్కసారిగ పెద్ద వయసులో పడిపోయింది అనిపిపించింది. ఇంకొంతసేపు అక్కడే కూర్చొని ధైర్యం చెబుతూనే ఉన్నాను. వెంకటయ్యతో ఏవో పిచ్చాపాటీ మాట్లాడుతుండగానే బంగారక్క కాఫీ తెచ్చింది స్టీలు గ్లాసుతో. కాలుతుందని కొత్త జేబురుమాలు గ్లాసుకి చుట్టి చేతికందించింది. 'మరి మీకూ ' అన్నాను. మాకు అలవాటు లేదయ్యా. మాకు మజ్జిగ ఉంది తెచ్చుకుంటం, నువ్వు తాగు నాయనా!'. నన్ను కూర్చోబెట్టి , నేను బంగారక్కతో మాట్లాడుతుండగా వెంకటయ్య కంగారుగా వెళ్ళింది నా కాఫీ కి పాలూ, పొడి కోసం అయ్యుంటుందని అర్ధమయ్యింది. పిల్లను తీసుకొని లోపలికెళ్ళిపోయి మొహం కడిగి మళ్ళీ తల దువ్వి తీసుకొచ్చింది బంగారక్క. చూసేకొద్దీ ముచ్చట అనిపించింది. ఇద్దరూ పిల్ల వంక చూస్తూనే దాని ముచ్చట్లు చెబుతూ మురిసిపోవడం చూసి నాకూ గొప్ప ముచ్చటేసింది. ఈ పిల్లను చూసుకుంటూ, చదివించుకుంటూ వీళ్ళిద్దరూ ఎంతటి కష్టాన్నయినా మరిచిపోతారనిపించింది. వాళ్ళ దగ్గర నుండి బయలుదేరి, దారిలో వాళ్ళకు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఇల్లు చేరాను. తరువాత ఉన్న నాలుగు రోజులూ అటు వెళ్ళడమే పడలేదు.
మర్నాడు నా ప్రయాణం అనగా మధురిమను తీసుకొని ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. రేపు నా ప్రయాణం అనగా, వీధిలో నాన్న కోసం వచ్చిన పెద్దమనుషులతో మాట్లాడుతూ అక్కడే కూర్చున్నాను. అంతలో అమ్మ పిలిస్తే పెరట్లోకి వెళ్ళాను. నాకోసం కాచుక్కూర్చున్న వెంకటయ్య, బంగారి నిలుచుని ఉన్నారు. మధురిమ వసారా గట్టెక్కి ఊచలు పావుతూ బిక్కుబిక్కుమని చూస్తోంది. బంగారక్క అంది, ' రేపే నీ ప్రయాణం అంటకద బాబూ, అందుకే గుర్తు చేద్దామని వచ్చాము'. 'తప్పకుండ నేను ప్రయత్నిస్తాను. కానీ ఇంత ప్రశాంతమైన వాతావరణం లోంచి ఆ పట్నం లో మీరు సర్దుకోగలరా అని ఆలోచిస్తున్నాను ' అన్నాను కాస్త లో గొంతుతో. ' ఏం ఫర్వాలేదు బాబూ పిల్లను బాగా చదివించి దాని కాళ్ళ మీద అది నిలబడేలా చేసేవరకూ అక్కడుండి మళ్ళీ ఇక్కడకొచ్చేస్తాం బాబూ, అంతవరకూ ఇది నా కాలు నిలవనివ్వదు. నువ్వే మాకో దారి చూపించి పుణ్యం కట్టుకో నాయనా ' అన్నాడు వెంకటయ్య. అడగడం అంటే అడిగాడు కానీ అతనంత ఉత్సాహంగాలేడు. అతనికి బంగారి అంటే ప్రాణం. ఆ పూరిల్లు అంటే ఇష్టం. బంగారికి మధురిమ అంటే ప్రాణం. 'సరే నేను గట్టిగా ప్రయత్నించి, అమ్మద్వారా మీకు కబురు పెడతాను సరేనా' అన్నాను సముదాయించినట్టు. ఇంతలో అమ్మ ఒక సంచీలో కొన్ని మామిడి పళ్ళు, చిన్న సీసాలో కొత్త మాగాయ పచ్చడి తెచ్చి అక్కడ గట్టుపై పెట్టింది. కొంగున ఉన్న ఐదు రూపాయలు తీసి పిల్ల చేతుల్లో పెట్టింది. 'పుస్తకాలు కొని పెట్టు బంగారీ' అంటూ. 'డబ్బులొద్దమ్మా' అని బంగారి అంటోండగానే అమ్మ అందుకుని,' ఇదిరా అబ్బాయ్ దీని వరస, పిలవకపోయినా వచ్చి అన్ని రకాల పనులూ చేసి పెడ్తుంది. ఈ వాకిళ్ళన్నీ మెత్తిందీ, గట్లు అలికిందీ బంగారే. న్వువ్వు ఎప్పుడొస్తావని ఎన్నిసార్లు అడుగుతుందో లెఖ్ఖ లేదు. కన్న తల్లిని నాకే తెలియదే బంగారీ వాడేప్పుడొస్తాడో, ఇక నీకేం చెప్పనూ అంటాను. పాపం ఇక్కడ వాళ్ళకు గడవడం కొంచెం కష్టంగానే ఉన్నట్టుంది నాయనా. ఆ పట్నంలో ఉంటే పిల్లను బాగా చదివించొచ్చని దాని ఆశ. నీ స్నేహితులెవరితోనయినా చెప్పి ఆ పుణ్యం కట్టుకో. ఇద్దరూ కష్టబడే వాళ్ళే '. అంది అమ్మ బంగారి వంక అప్యాయంగా చూస్తూ. అమ్మలో చాలా మార్పు వచ్చినట్టు స్పష్టంగా కనబడుతోంది. 'అలాగే అమ్మా తప్పకుండా' అన్నాను. నాన్న పిలిచారు ఇంతలో. వాళ్ళు నావంకే ఆశగా చూస్తూ మధురిమతో చెయ్యి ఊపిస్తూ భారంగా నడిచి వెళ్ళిపోయారు.
అప్పటికి నేను ఇంజనీరింగు మూడో సంవత్సరం చదువుతున్నాను. ఒకే గదిలో ఉండి చదువుకుంటున్న నా స్నేహితుణ్ణి అడిగాను. వాళ్ళ నాన్నగారు కాంట్రాక్టరు. ఇక్కడ పట్నంలోనే ఉండి పని చేసుకునేటట్టు ఏర్పాటు జరిగింది. వాళ్ళ నాన్నగారు కూడా ' మంచి నమ్మకమయిన మనుషులు అవసరమేనోయ్' అంటే - 'ఆ విషయంలో పూచీ నాదండి ' అని చెప్పి, ఆ సాయంత్రమే అమ్మకు ఫోను చేసి వివరాలు చెప్పి వెంకటయ్యను ముందు పంపమన్నాను. అతడిని అక్కడ చేర్చి అన్ని ఏర్పాట్లూ చేసి కొంచెం డబ్బు తీసి ఇవ్వబోతే వెంకటయ్య తీసుకోలేదు. 'నీ పుణ్యమా అని ఇక్కడ మంచి చోట పని దొరికింది బాబూ. ఇక బంగారికి బెంగ తీరినట్టే' అని కళ్ళు చెమరుస్తుండగా నా చేతులు పట్టుకున్నాడు. 'ఇందులో నేను చేసింది ఏముంది వెంకటయ్యా. మీరు కష్టించి పని చేసేవాళ్ళు, మీకు పని దొరకకపోవడం ఉండదు. కానీ ఒక్క సంగతి, ఏ ఇబ్బంది వచ్చినా మొహమాటపడకుండా నాకు చెప్పాలి. సరే! ఎప్పుడు తీసుకొస్తావు బంగారక్కను, మధురిమను?' అని అడిగాను. " ఆ పెద్దయ్యతో జెప్పి, ఇప్పుడెల్లమంటే ఇప్పుడే ఎల్లి రేపటికల్లా ఒచ్చేస్తాను బాబూ' అన్నాడు. అలా వాళ్ళను పట్నంలో పనిలో పెట్టాక, మళ్ళీ ఇరవైఐదేళ్ళ తరువాత ఇప్పటికి మధురిమ నుండి ఫోను రావడంతో, తెగిపోయిన సంబంధం మళ్ళీ అతికినట్టనిపించి చాలా సంతోషం అనిపించింది.
ఒక పక్క ఉద్వేగం , ఆతృత. మరో పక్క మధురిమ ఏం చేస్తుంటుందో, బంగారక్క, వెంకటయ్య ఎలాఉన్నారో! నాకు ఫోను చేసినప్పుడు తను 'మధురిమ'ను అని చెప్పగానే విషయం అర్ధమయ్యింది. గతం అంతా ఒక్కసారే తెర తీసినట్టు నాకు ప్రత్యక్షమయి పోయింది. ఆ చిన్న కుటీరం లాంటి ఇల్లు, ఎదురుగా సన్నగా సాగే పిల్ల కాలవగట్టు , ఆ గట్టుపై దూరదూరంగా పెద్దగా విస్తరించిన నిద్రగన్నేరు చెట్లూ, ఇంటి ముంగిట చిన్న పూల మొక్కలూ - మల్లె పొద, కనకాంబరాలూ శీతాకాలంలో పూచే సీతమ్మవారి జడగంటలూ, దడి అంతటా పెరిగిన పాదులూ, తాటాకు కప్పుపై చూరు వరకూ వేళ్ళాడే ఆనపపాదు, పక్క సందులో వేసిన చిన్న పందిరిపై ఎప్పుడూ పచ్చగా ఉండే చిక్కుడు పాదూ --- ఎప్పుడూ ఎదో ఒక పనిలో మునిగిపోయుండే బంగారక్క, ఆమె తనకు దొరికిన వరంలాగ అపురూపంగా చూసుకునే వెంకటయ్యా, వాళ్ళకు కలిగిన ఏకైక సంతానం ముచ్చటగొలిపే మధురిమ - అంతా నిన్న మొన్నటి దృశ్యం లాగ కళ్ళముందు కదలాడింది. తను ఇంజనీరింగు అయ్యాక ఎలాగైనా విదేశాల్లో చదవాలని నాన్నను, అమ్మను ఒప్పించి వెళ్ళడం, అక్కడనుండి మరో దేశంలో ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసి, అదే కంపెనీ ఇండియాలో పెడితే ప్రయత్నం మీద ఇక్కడే ఈ మహానగరంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుండగా మొన్న ఆఫీసులో ఉన్న సమయంలో వచ్చిన మధురిమ ఫోను తో మరుగున పడిపోయిన బంధం మళ్ళీ వెలుగులోకి వచ్చినట్టయ్యింది. ఎంత స్వఛ్ఛమయిన మనుషులూ వెంకటయ్యా, బంగారక్కానూ. ఇన్నాళ్ళూ ఎన్నో ప్రదేశాలు తిరిగాను. ఎంతోమంది గొప్ప వాళ్ళను కూడా కలిశాను. కాని వీళ్ళ లాంటి అచ్చమయిన మనుషులు నాకు తారసపడలేదు. ముక్తసరిగా మాట్లాడింది మధురిమ. నేను తనకు గుర్తు ఉండే అవకాశం లేదు.
తనను చివరిసారి చూసినప్పుడు పది సంవత్సరాల లోపే వయసు ఉంటుంది ఆ పిల్లకు. మధ్యలో కలవడం కాదు కదా కనీసం మాట్లాడలేదు కూడా. మధ్యలో ఒకసారి విదేశం నుండే నా స్నేహితుణ్ణి కనుక్కుంటే అప్పటికే వాళ్ళ నాన్నగారి దగ్గర కాంట్రాక్టు పని నుండి వెళ్ళిపోయారన్నాడు కానీ అంతకు మించి ఏమీ చెప్పలేకపోయాడు. గత పాతిక సంవత్సరాల్లో నాలుగైదుసార్లు వచ్చి ఉంటాను సొంత ఊరు. నాన్నగారు కాలం చేసినప్పుడు తప్ప మిగతా వచ్చిన ఏ సందర్భంలోనూ అమ్మ దగ్గర పట్టుమని పదిరోజులు గడిపిన సందర్భం లేదు. ఇన్నేళ్ళలోనూ అమ్మే వెంకటయ్య కుటుంబం గురించి నా దగ్గర ప్రస్తావన తెచ్చేది. 'ఎక్కడున్నారో, ఎలాఉన్నారో' అని నిట్టూర్చేది అమ్మ. నేను వాళ్ళను పూర్తిగా మరిచిపోయానన్న నిష్ఠూరం అమ్మ మాటల్లో ధ్వనించేది.
గురువారం ఆఫీసుకు సెలవు పెట్టి రెడీ అయ్యాను మధ్యాహ్నం మూడింటికి. మధురిమ ఆ రోజే ఎలాగైనా వీలు చూసుకొని ఫలానా జంక్షన్ దగ్గర కలుద్దామనీ, అమ్మ నన్ను ఆ రోజున ఎలాగైనా తీసుకురమ్మంటోందనీ చెప్పింది. నేను వివరాలు అడగబోతే, అన్నీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం అని ఫోను పెట్టేసింది. మధురిమ మంచి చదువులే చదివి ఉంటుందనిపించింది ఆమె మాటల్నిబట్టి. కానీ ఏదో తొందరలోనూ, పని ఒత్తిడిలోనూ ఉన్నట్టు తోచింది నాకు . నన్నెంతో ఆప్యాయంగా చిన్నప్పటినుండి ప్రేమించిన ఆ దంపతులను వాళ్ళ ఏకైక ఆశ, ఆలంబన అయిన మధురిమను ఇన్నాళ్ళకు చూడబోతున్నానన్న ఉద్వేగాన్ని కంట్రోలు చేసుకోవడం నాకు కష్టమే అనిపించింది. కారులో నేనే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాను. తను చెప్పిన జంక్షన్ మంచి లొకాలిటీ. మధురిమ బాగానే సెటిల్ అయ్యుంటుందనుకున్నాను. చిన్నపటినుండీ బంగారక్క తపన అదేకదా. కారు కాస్త దూరాన్నే ఖాళీగా ఉన్న దగ్గర ఆపుకొని, కిందకు దిగి ఆమెకు ఫోన్ చేశాను. రింగు అవుతుండగానే దూరం నుండి చెయ్యి ఊపుతూ కనబడింది. ఈమే మధురిమా అని సందేహం కలిగింది. కొంచెం కురచగా ఉన్నట్టు కనబడుతోంది, లావుగా ఉన్న కారణంగా. దగ్గరకొచ్చాక గమనించాను, మొహంలో అలసట కనిపిస్తోంది. కొంచెం కంగారులో ఉన్నట్టు కళ్ళు అటూ ఇటూ పరిగెడుతున్నాయి. నన్ను గురించి ఆమెకు ఆతృతగానీ, ఆసక్తిగానీ ఉన్నట్టు కనబడలేదు. చిన్నప్పటి చిరునవ్వుతో మెరిసినట్టుండే ఆ కళ్ళేనా ఇవి? ' మధురిమా!' అన్నాను పిలుపుగానే కాకుండా నిర్ధారణ కోసం అన్నట్టు ఉంది నా పలకరింపు. 'నమస్తే అండీ, వెళదామా" అంది కారు ఎక్కడానికి సిధ్ధపడుతూ. బయలుదేరాకా ఏమి మాట్లాడాలా అని ఆలోచిస్తుండగా, ఆమే మొదలెట్టింది. 'అమ్మ మిమ్మల్ని చాలాసార్లు తలబెడుతూ ఉంటుంది. మీ ఫోన్ నెంబరు కనుక్కోవడం కష్టమే అయ్యిందండీ. ఊరికి వెళ్ళి మీ అమ్మగార్ని అడిగితీసుకున్నాను. పాపం ఆవిడ మంచం పట్టి ఉన్నారు. మమ్మల్నందరి గురించీ ఎన్నో వివరాలు అడిగారు. నాకు ఎక్కువ సమయం ఉండడం కుదరలేదు. కేవలం మీ ఫోను నెంబరు కోసమే ఆ ఊరు వెళ్ళవల్సొచ్చింది. మిమ్మల్ని అమ్మకు కలిపితే నాకో పెద్ద బరువు తీరినట్టే' అని ఆగింది.
నాకు మనసు నిండా సందేహాలే! 'ఎలాఉంది బంగారక్క?' అడుగుతుంటే గొంతు నొక్కేసినట్టు అయ్యి మాట అస్పష్టంగా వచ్చింది. ' చూస్తారుగా' అంది ముక్తసరిగా మధురిమ. కొంచెం సేపు మౌనం తరువాత 'వెంకటయ్య --' అంటుండగానే మధురిమ అక్కడనుండి యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ కి తీసుకోవాలండీ ' అంది. అప్పటికే చాలా దూరం వచ్చాం. నగరం శివారుకి వెళుతున్నాం. అనేక ప్రశ్నలు మదిని దొలిచేస్తుండగా మధురిమ నా ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ , 'ఏమోనండి ఈ పరుగుల ప్రపంచంలో ఎలా నెగ్గుకు రావాలో అని భయం వేస్తూ ఉంటుంది ఒక్కోసారీ'. 'ఇంతకీ మీరేం చేస్తున్నారు?' అప్పటికి అడిగాను మధురిమ గురించి. 'బీయస్సీ చదివాక ఇక చదువు సాగలేదు. ఉద్యోగంలో చేరాను. అక్కడ ఏర్పడిన పరిచయం పెళ్ళికి దారి తీసింది. అమ్మకు అంతగా ఇష్టం లేకపోయినా చేసుకున్నాను. నాకు ఒక కొడుకు. పెళ్ళి అయిన తరువాత నేను ఉద్యోగం చెయ్యడం ఆయనకు ఇష్టం లేదని మానేశాను. ఇక్కడ జీతం అంతంత మాత్రంగా ఉందని ఆయన సంవత్సరం క్రితం గల్ఫ్ లో ఉద్యోగానికి వెళ్ళారు. నా కొడుక్కి రెండేళ్ళు. నెల నెలా ఆయన పంపే డబ్బు చాలీ చాలక అవుతోంది. ఈ మధ్య ఆ మాత్రం కూడా పంపలేకపోతున్నారు. నేను ఇంటిదగ్గర నుండే ఆన్ లైన్ లో చీరలు, డ్రస్సులు అమ్మడం చేస్తున్నాను. ఇంకా నాలుగు నెలలే అయ్యింది మొదలుపెట్టి. బానే ఉంది రెస్పాన్సు. కానీ అందుకు తగ్గట్టు పెట్టుబడి, వెనుక సపోర్ట్ లేకపోవడం కష్టం అయిపోతోంది. ఒక పక్క చిన్న పిల్లాడు. అమ్మకు మీరే చెప్పి ఒప్పించాలి. నా దగ్గర ఉంటే నాకెంతో సహాయం అవుతుంది '. అని ఆపి మొహం తుడుచుకుంటూ 'ఆ రైట్ సైడున గేట్ లోకి వెళ్ళాలండి 'అంది.
అప్పుడు గమనించాను ఆ గేటు పై న ఉన్న బోర్డు. 'అనాధాశ్రమం '. నాకు విషయం అర్ధం అయ్యే లోపే 'మధురిమ ' అక్కడ రిజిష్టరులో మా పేర్లు వ్రాసి, వరండాలో నుండి ఒక హాలు దగ్గర ఆగి తను లోపలికి వెళ్ళి చూసి బయటకు వచ్చి 'మీరొకసారి ఇక్కడే నిలబడండి, నేనెళ్ళి అమ్మను తీసుకు వస్తాను ' అంటూనే ఆ భవనం దాటుకొని వెనక్కు వెళ్ళింది. నేను ఆ దిగ్భ్రాంతి లోనుండి తేరుకోలేకపోతున్నాను. వేల ప్రశ్నలు. ఒకే పట్నంలో ఉంటూ బంగారక్క విడిగా ఉండడం, అదీ వృధ్ధాశ్రమంలో కూడా కాదు. అనాధాశ్రమంలో. ఇంతకీ వెంకటయ్య ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడా? మనసులో దడ పుట్టింది ఆ ఊహకు. వరండాలో అటూ ఇటూ పచార్లు చేస్తుండగా, ఒకతను పలకరించాడు. 'ఎవరు కావాలి బాబూ?' అంటూ. అరవై దాటి ఉండొచ్చు వయసు. లుంగీ, కుట్టించిన కురచ చేతుల బనీను మాసినై. జుట్టు బాగా కురచగా ఉంది. వయసుకు మించిన వార్ధక్యం కనబడుతోంది. కొంచెం వంగి కుంటుతూ నడుస్తున్నాడు. నేను కొంచెం తేరుకుని అతని ప్రశ్నకు 'బంగారక్క కోసం ' అన్నాను. 'మీకు సొంతంగానే అక్కా?' అతని ప్రశ్నకు జవాబు అతనికి తెలుసు. 'వరసకు ' అన్నాను అతి కష్టం మీద. 'మాకు మాత్రం దేవుడిచ్చిన బిడ్డే బాబూ బంగారి, అమె వచ్చాక మాకెంత సౌకర్యం పెరిగిందనీ. అందరి పక్కలూ తనే శుభ్రం గా వేస్తుంది. నడవలేని వాళ్ళకు తనే తెచ్చి పెడుతుంది భోజనం. ఒకరిద్దరికి తినిపిస్తుంది కూడా. ఎప్పుడు చచ్చిపొతామా అని ఎదురు చూసే వాళ్ళమే ఎక్కువ మంది. అలాంటిది బంగారి వచ్చాక ఆ ఊసే పోయింది. ఆయమ్మికి కష్టమే తెలియదు కావును అంత చాకిరీ చేసి కూడా మాకు సాయంత్రం పూట కధలు చదివి వినిపిస్తుంది. చందమామలోని కధలు. ఆమెకున్న సామానల్లా రెండు మూడు జతల బట్టలూ, ఆ పాత చందమామ పుస్తకాలూనూ. అంతేకాదు, మాలో కొంతమందికున్న చుట్టా, బీడీ అలవాటు మానిపించేసింది. ఇక్కడ రూలు అదే కానీ బంగారి రాకముందు, పెద్ద సారు బయటికెళ్ళగానే చాటున గబగబా కాల్చేసేవాళ్ళం. బంగారి చెప్పాక అందరం మానేశాం. ఒకళ్ళిద్దరు వినకుండా కాల్చారని ఓ రోజంతా తను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా ఉండిపోయింది. అందరం బతిమిలాడి వాళ్ళ చేత బీడి మానిపించి, బంగారి చేత ఎంగిలి పడేట్టు చేశాం. మళ్ళీ ఎవ్వరూ వాటి జోలికి వెళ్ళలేదు బాబూ' ఆయన కళ్ళలో తడి నా మసకేసిన కళ్ళకి లీలగా కనిపించింది. 'అది సరే, నువ్వెప్పుడూ వచ్చినట్టు లేదు కదా' అన్నాడాయన నా మొహం లోకి కళ్ళు చిట్లించి చూస్తూ. నేనేం చెప్పాలా అని సంకోచిస్తుండగానే ఆయనే మళ్ళీ అన్నాడు. ఈ సారి ఆయన కంఠధ్వనిలో మార్దవం తగ్గింది. కొంత ఆందోళనా, కొంచెం విసుగూ తో ' ఇలా వచ్చి చూసెళ్ళు, అంతేగాని ఇన్నాళ్ళకు నాకు తీరింది, ఇక బంగారిని తీసుకెళతాను అని మాత్రం అనమాకు నాయనా! అప్పుడు నిజంగానే అనాధలం అయిపోతాం '. నేను నిశ్చేష్టుణ్ణయిపోయాను. ఆయన తీసుకెళ్ళొద్దు అన్నందుకు కాదు. కనీసం తీసుకెళ్ళాలన్న ఆలోచన ఈ క్షణం వరకూ కూడా నాకు రానందుకు. సిగ్గుపడిపోయాను. తల వంచుకున్నాను నాకళ్ళల్లో నీళ్ళు ఆయనకు కనబడకుండా. ఇంతలో ఆయన వడివడిగా నడుచుకుంటూ హాలులోకి తన మంచం దగ్గరకు వెళ్ళిపోయాడు.
అప్పుడు చూశాను, వరండా లో ఆ చివర్నుండి వస్తున్న బంగారక్కను, మధురిమను. మధురిమ ఏదో చెబుతోంది. కాని అక్క నావైపే చూస్తూ వడివడిగా వచ్చేస్తోంది. ఆ పరుగులాంటి నడకను అందుకోలేక మధురిమ ఏదో చెప్పేస్తోంది. దగ్గరకు వచ్చేప్పటికి మధురిమ మాట్లాడ్డం ఆపేసింది. నేను తదేకంగా అక్కనే చూస్తున్నాను. బంగారక్కలో ఎదో కొత్తదనం. అడుగులోనూ, నడకలోనూ ఒకరకమయిన ఆత్మ విశ్వాసం. ముదురురంగు ముతకచీర. కట్టులో కొంచెం అనాసక్తత, నిర్లక్ష్యం కనిపిస్తున్నాయి. "ఏవిటి తమ్ముడూ అలా చూస్తున్నావు? ఎలా ఉన్నావు? నీ భార్యను తీసుకురాలేదేం నాయనా? ఎన్నాళ్ళయ్యిందయ్యా నిన్ను చూసి! పెద్దవాడివయిపోయావు. రా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఇంతలో మధురిమ 'అమ్మా.. ' అని ఇంకా ఏదో చెప్పబోయింది. కాని అక్క వినిపించుకునే స్థితిలో లేదు. నా చెయ్యి పట్టుకొని హాలులోకి తీసుకెళ్ళింది. దాదాపు ముఫ్ఫై మంది ఉంటారు హాల్లొ. ఆడవాళ్ళు పదిమంది వరకూ ఉన్నారు. లోపలికి వెళ్ళంగానే అందరూ ఆతృతగా ' బంగారీ నీ తమ్ముడేగా!" అన్నారు ముక్త కంఠంతో. 'రోజూ నీ సంగతే చెబుతా ఉంటాది బాబూ, అందుకే మాకూ నువ్వు ఎలా ఉంటావో సూద్దారని ఓ ఉబలాటంగానే ఉంది '. అంది మంచం మీదనుండి లేవలేని ఒక ముసలామె. నేను అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టాను. నోట మాట పెగల్లేదు. 'సరే, మా తమ్ముడు మళ్ళీ తొందరపడతాడేమో ఎల్లాలని. నేను కాసేపు మాట్లాడి పంపించేసి వస్తాను. మీకందరికీ నిమ్మ రసం నీళ్ళు వంటలక్కే తెస్తానంది.ఆవిణ్ణి ఇబ్బంది పెట్టకుండా ఎవరి గ్లాసులు వాళ్ళు తీసుకుని సిధ్ధంగా ఉండండి '. బంగారమ్మోయ్! ముగ్గిరికి టీ అమ్మోయ్ ' అని అరిచాడొకాయన వెనకనుండి. " సరే, మామూలే కదా. చెప్పే వచ్చాను వంటలక్కతో' అని చెప్పి బంగారక్క నన్ను ఈడ్చుకెళ్తున్నంత తొందరగా ఆఫీసు రూం లోకి తీసుకెళ్ళింది. అదే స్టోర్ రూం కూడా. ' బాబూ, మా తమ్ముడు ' అని అక్కడ కూర్చొని ఎదో రాసుకుంటున్నాయనకు పరిచయం చేసింది. నేను నమస్కరించాను. 'ఈయనే బాబూ ఈ అనాధల్నందర్నీ కడుపులో పెట్టుకు చూసుకుంటున్నారు. ఆ పుణ్యానికి ఆయన్ను కుటుంబంలో అందరూ వెలేసారు. తన వాటా ఆస్థి అమ్మేసి ఈ ఆశ్రమం నడిపిస్తున్నారు '. ఇంకా ఏదో చెప్పబోతున్న అక్కను మధ్యలో ఆపి ఆయన అన్నారు 'నాదేముందిలే ఇంత నీడ కలిపించానంతే. కాని ఈ బంగారి వచ్చాకనే వాళ్ళందరికీ అనాధలం అన్న భావనే పోయింది బాబూ. ఆశ్రయం కల్పించడం కన్నా ప్రేమ పంచడమే అసలు విషయం అని ఈ బంగారి నిరూపించింది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను మార్కెట్టుకు వెళ్ళి రావాలి ' అంటూ నాకు చెయ్యి కలిపి ఆయన బయట ఆపి ఉంచిన ఆటో స్టార్టు చేసి నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటివరకూ వరండాలో అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న మధురిమ లోపలికొచ్చి 'అమ్మా నేను తొందరగా వెళ్ళాలి. చీరలు డెలివరీ ఇవ్వాలి. బాబును కూడా తీసుకురావాలి. ఇప్పటికే చాలా లేటు అయ్యింది ' అంది. 'ఎలా వెళ్తారు, నేను దింపుతాను కదా' అంటూంటే బంగారక్క కలగజేసుకొని 'దాన్ని వెళ్ళనియ్యి బాబూ. దానికి చాలా పనులుంటాయి. ఆటోలో వెళుతుందిలే'. 'సరే అమ్మా వెళతాను ' నావంక తిరిగి 'నేను మళ్ళీ ఫోన్ చేసి కలుస్తానండీ, ఇక ఉంటాను ' అని మా సమాధానం కోసం చూడకుండానే తొందరగా వెళ్ళిపోయింది మధురిమ.
కొంచెంసేపు నిశ్శబ్దం. నేనే మెల్లగా అడిగాను 'వెంకటయ్య ఎక్కడ '? తల వంచుకునే చెప్పింది బంగారక్క. 'రెండేళ్ళయిపోయింది మీ వెంకటయ్య నన్నొదిలి పోయి. చాన్నాళ్ళు అనారోగ్యంతో బాధపడ్డాడు. నేనేమైపోతానో అన్న బెంగ కూడా కొంత కారణం. ఒక్కగానొక్క కూతురు పెళ్ళి చూడలేకపోయానన్న బాధ కూడా ఆయన్ను కుంగదీసింది '. వెక్కిళ్ళు ఆపుకునే ప్రయత్నం వల్ల అక్క మెడ దగ్గర నరాలు ఉబ్బాయి. 'అక్కా ఊరుకో! ఈ ఊళ్ళో జరగలేదా పెళ్ళి?' 'ఇక్కడే జరిగింది. కాని మధురిమకు ఇష్టం లేదు వాళ్ళ నాన్న అక్కడకు రావడం. అందర్లో నామోషీ అట. మీ వెంకటయ్య కురచ పంచె, పొట్టి చేతుల బనియను తప్ప ఇంకోటి తొడిగి ఎరగడు. పెళ్ళయ్యాక ముఫ్ఫై ఏళ్ళల్లో పట్టుమని నాలుగు పంచెలకంటే బట్టలు కొనుక్కోలేదాయన. సొంతానికి ఇంత చల్లని సోడా తాగి ఎరగడు. నా మనసుకు నొప్పి కలిగించకూడదన్న ధ్యాస తప్ప ఇంకేమీ చూడలేదు మీ వెంకటయ్యలో. అంత ప్రేమను తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉండేది. కూతురు గురించి కూడా ఆయనకు బెంగ లేదు. నిన్ను తలుచుకునేవాడు బాబూ. మాకేమన్నా కష్టం వచ్చినా నువ్వొకడున్నావని ఆయనకో నమ్మకం' ఇక దుఖ్ఖాన్ని ఆపుకోవడం అక్క వల్ల కాలేదు. వెక్కి వెక్కి ఏడ్చేసింది. నాకేమీ పాలుపోలేదు. అక్క భుజం మీద చెయ్యివేశాను. 'అక్కా ఊరుకో. వెంకటయ్య స్వార్ధం తెలియని మనిషి. మలినం అంటని మట్టిమనిషి. మిమ్మల్ని నేను ఇన్నేళ్ళుగా పట్టించుకోలేదు. ఎమీ చెయ్యలేని అసమర్ధుణ్ణి ' ఇక మాటలు పెగల్లేదు. బంగారక్క కొంచెం సంభాళించుకొని, ఉన్నంతలో నువ్వొక్కడివేనయ్య మీ వెంకటయ్యకూ, నాకూ' అంది నాచేతిని సవరిస్తూ.
'ఈ ఊళ్ళోనే ఉంటావు కదా. వస్తూ ఉండు. మధురిమ అవసరం లేదు. దారి తెలిసింది కదా' అంది. ఆమె దుఖ్ఖం లోంచి బయటపడి కొంచెం ఉక్రోషం లోకి వెళ్ళిందనిపించింది. "అదేంటక్కా, అంత అపురూపంగా పెంచావు మధురిమను. చదివించి యోగ్యురాల్ని చేశావు. అంత కోపం నిష్ఠూరం కన్న కూతురి పైనా...' నా మాట పూర్తి అవ్వకుండానే ' అదే బాబూ నాకూ మీ వెంకటయ్యకూ తేడా. ఆయన ప్రేమించాడు. నేను ప్రేమను కోరుకున్నాను. కోరుకుంటే ప్రేమ దక్కదు అన్న నిజం నా విషయంలో రుజువయ్యింది. అందుకే ప్రేమ అందుకోగల వాళ్ళకే ప్రేమను పంచే పనిలో ఉన్నాను. 'అక్కా! నీకూ తెలుసనుకుంటాను. నాన్నగారు కాలం చేసి చాలాకాలం అయ్యింది. అమ్మ కూడా ఆఖరి రోజులు గడుపుతోంది. మంచం పట్టింది. ఇప్పుడే ఓ నిర్ణయానికి వచ్చాను. మాకు బ్రతకడానికి లోటు లేదు. రేపే ఉద్యోగానికి రాజీనామా చేసి ఊరికి వెళతాను. నా భార్య ఎప్పటినుండో అంటూనే ఉంది, మా అమ్మ దగ్గర ఉందామని. మా తోటను చూసుకుంటూ మన ఊళ్ళోనే అమ్మ దగ్గరే ఉంటే తృప్తిగా ఉంటుంది '. తల వంచుకునే ఉన్న నన్ను గెడ్డం పట్టుకు మెల్లగా పైకి లేపి ' చదువుకున్నవాడివి నీకు ఏది మంచిది అనిపిస్తే అలాగ చెయ్యి తమ్ముడూ. అందరికీ భోజనాల వేళయ్యింది. పొద్దు కూకక ముందే ఇక్కడ భోజనాలు అయిపోతాయి. ఇక ఉండనా ' అని లేచి నుంచుంది. 'సరే వెళతానూ' అని కష్టంగా రెండడుగులు వేసి ఆగి వెనక్కి చూశాను. అక్క నావైపే చూస్తూ హాలు వైపుకు వెళ్ళబోతోంది. "అక్కా ఒక్క విషయం .. 'మధురిమ ' పేరు పెట్టాలని ఎందుకనిపించింది?' అని అడిగాను. చిన్న నిరాశతో కూడిన చిరునవ్వుతో. 'నువ్వు ఇచ్చిన చందమామ పుస్తకంలోదేనయ్యా. రాకుమారి మధురిమ తల్లిదండ్రులను రాక్షసుల్నించి విడిపించడానికి చేసిన సాహసం నాకు ఎంతో మనసుకు పట్టేసింది. అది చదివినప్పటికి నాకు మూడో నెల. ఆడపిల్ల పుడితే ఆ పేరు పెట్టుకోవాలనుకున్నాను. అదో పిచ్చి నాకు. అదే మాట అనేవాడు మీ వెంకటయ్య ' అలాచెప్పి ఒక వేదాంతిలా నవ్వి వెనక్కి తిరగబోతుండగా 'అక్కా మరొక్క సంగతి ' అన్నాను. ఏంటి అన్నట్టు చూసింది. ఆఖరి రోజులు గడుపుతున్న అమ్మ తప్ప నాకూ నా భార్యకూ ఎవరూ లేరు. నీకు తెలుసో లేదో మాకు సంతానం కలగలేదు. మమ్మల్నే పిల్లలనుకొని మాదగ్గరకు వచ్చెయ్యొచ్చు కదా అక్కా' అన్నాను దీనంగా. 'మరి వీళ్ళంతా'? అని హాలు వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది వెనక్కి చూడకుండా. అప్పటికే కను చీకటి పడింది. వాళ్ళంతా 'బంగారక్క' కోసం ఎదురు చూస్తున్నారు.