తెలుగు సంగతులు

సోమవారం, జులై 04, 2016

            ఓల్గానుంచి గంగకు -- ఒక సరళమైన మానవ చరిత్ర
'రాహుల్ సాంకృత్యాయన్ ', ఈ పేరు వినగానే మొదట నాకు జ్ఞప్తికి వచ్చేది, నా హైస్కూల్ రోజుల్లో మా నాన్న పుస్తక పఠనాసక్తి.  అప్పట్లో, (సుమారు 1970ల్లో)  మా నాన్న చదువుతున్న పుస్తకం గురించి ఆయన ఇంటికి వచ్చిన ప్రతి స్నేtహితుడి తోనూ, పరిచయస్థులి తోనూ ఈ గొప్ప పండితుడు, బహు భాషా కోవిదుడు, గొప్ప చరిత్రకారుడు, అన్నిటికంటే మించి అతిగొప్ప వాస్తవ వాది, మానవతావాది గా  'రాహుల్ సాంకృత్యాయన్ '  గురించి ప్రస్తావించడం నాకు బాగా గుర్తు వస్తుంది. నా జ్ఞాపకం ప్రకారం, అప్పుడు మా నాన్న ప్రస్తావించిన ఆయన పుస్తకం 'సంచారజీవులు ' అని గుర్తు. కానీ ఇప్పుడు లభ్యమయ్యే ఆయన రచనల్లో ఆ పుస్తకం కనబడడం లేదు. ఆయన ఇతర రచనల పట్టికలో కూడా ఎక్కడా కానరావడం లేదు. ఇప్పుడు ఆ పుస్తకం పై నాకు విపరీతమయిన ఆసక్తి కలుగుతోంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే -- ఈ మధ్య ఆయన పుస్తకాలు వరుసగా రెండు చదవడం, ఆ సందర్భంలో ఆయన ప్రతిభా విశేషాలు కొంత అవగాహన రావడం, ఇంతకాలం ఆయన రచనలు చదవకపోవడం పట్ల చింతించడం జరిగింది.  అలాగే చదివిన మట్టుకు అయినా పూర్తిగా అవగాహన అయ్యిందా అన్న సందేహం నన్ను పీకుతోంది.  మరోసారి చారిత్రక నేపధ్యాన్ని అవగాహన చేసుకుంటూ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపిస్తోంది. 

విస్తృత ప్రాతిపదిక మీద రచనల్ని మౌలికంగా రెండు విధాలుగా విభజించి చూడవచ్చు. ఒకటి కల్పితాలు, రెండోది వాస్తవాలు. ఈ రెండూ కలగలిసిన రచనలే ఎక్కువ. దురదృష్టవశాత్తూ ఖచ్చితత్వం పాఠించాల్సిన మన చరిత్రలు కల్పితాలుగా, కల్ల బొల్లి కధనాలుగా, పాలకపక్ష బాకాలుగా లభిస్తున్న దౌర్భాగ్యం నుండి కొంత విముక్తి ఈ రాహుల్ సాంకృత్యాయన్ పండితుని కధలు, కధనాలు. ఇంతా చెప్పి మళ్ళీ వీరివీ కధలు, కధనాలు అనడం ఏవిటి అనిపించడం సహజం. అక్కడే ఉంది ఈ మహా పండితుని ప్రతిభ. రాతియుగానికి పూర్వం నుంచీ మానవుని జీవనం ఎలా సాగుతూ వస్తోందో -- దొరికిన చారిత్రక సాక్ష్యాధారాలను ఆలంబనగా చేసుకొని సాధారణ పాఠకునికి అర్థం అయ్యే రీతిలో, ఆసక్తి కలింగించే విధంగాu కధగా మలిచి మానవచరిత్రను చెప్పే మహత్తర ప్రక్రియే 'రాహుల్ ' రచనల విశేషం. నేను చదివినవి 'ఓల్గా నుంచి గంగకు ', 'దివోదాసు '. ఈ సమీక్ష/ ప్రస్తావన ముఖ్యంగా 'ఓల్గా నుంచి గంగకు ' గురించి.
విస్తృతమయిన అధ్యయనం, సత్యాన్వేషణ పట్ల అమితాసక్తి, విస్తారమయిన పఠనం, చరిత్రను యధాతధంగా చెప్పాలనే నిష్కర్ష, సామాన్య పాఠకుడికి అర్థమయ్యేలా, ఆసక్తి కలిగించేలా  రచన చేయగల పాండిత్య ప్రతిభ, అందరికీ చరిత్రను అందుబాటులోకి తేవాలనే అంకిత భావం -- ఇన్ని గొప్ప లక్షణాల రచనా సారం ఈ 'ఓల్గా నుంచి గంగకు '.  
ఎన్నో చారిత్రక విషయాల్ని సరళంగా తెలియచెప్పిన తీరు అద్భుతం. ఈ పుస్తకం గురించి ఆయన సమకాలికుడు శ్రీ.భదంత ఆనంద్ కౌశల్యాయన్ వ్యాసంలో కొన్ని వాక్యాలు  -- 
"చాలాకధలు కధలు కావు, చరిత్రే". 
" ఇందులోని మొదటి నాలుగు కధల పేర్లూ -- నిశ, దివ, అమృతాశ్వుడు, పురుహూతుడు. ఈ నాలుగు కధల్లోనూ క్రీస్తుకు పూర్వం 6000 (ఆరు వేలు) సంవత్సరాల లగాయితు క్రీస్తుకు పూర్వం 2500 వరకూ ఉన్న సమాజాన్ని చిత్రించారు. అది ప్రాగైతిహాసిక కాలం. ఇవి కధలూను! అంచేత ఆ కధల్లో కల్పన ప్రధాన అంశం అన్నది సర్వ విదితం. కాని అవి కేవలం కల్పనతో రాసినవి మాత్రం కావు. ఆ కధల్లో మహత్తరమయిన విషయాలన్నీ రాహుల్ జీ ఇండో యూరోపియను, ఇండో ఈరానీ భాషా శాస్త్రాల అధ్యయన ఫలితాలు. తర్వాతి నాలుగు కధలు -- పురుధానుడు, ఆంగిరా, సుదాసుడు, ప్రవాహణుడూను. ఈ కధలన్నిటికీ సాహిత్య ప్రమాణాలున్నాయి. వేదాలు, బ్రాహ్మణాలు, మహాభారతం, బౌధ్ధ గ్రంధాల్లోని "అట్టకధ" పేరుతో ప్రసిధ్ధి చెందిన భాష్యం -- ఇవీ ప్రమాణాలు. సుదాసుడి కధకు ప్రమాణం సాక్షాత్తూ ఋగ్వేదమే! ప్రవాహణ జైవాలికి ఆధారాలు ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, పైన ఉటంకించిన బౌధ్ధ అట్ట కధలూను! "
" ఈ నాలుగు కధల్లోనూ క్రీస్తుకు పూర్వం 2000 దగ్గర్నుంచి క్రీస్తుకు పూర్వం 700 వరకూ ఉన్న సమాజం ఎలా వికాసం చెందిందో చెప్పడానికి ప్రయత్నం చెయ్యబడ్డది."  ఆ తర్వాత కధ బంధులమల్లుడిది. ( క్రీ.పూ. 490) ఈ కధకి కావల్సిన సామాగ్రినంతటినీ బౌధ్ధ గ్రంధాల నుంచే రచయిత తీసుకున్నారు. పదో కధ నాగదత్తుడు. కౌటిల్యుడి అర్ధశాస్త్రం, గ్రీకు యాత్రికుల యాత్రా వివరాలు--" ఇలా సాగిన ఆనంద్ కౌశల్యాయన్ వ్యాసం రచయిత గురించి, రచన గురించి క్లుప్తంగా చెబుతుంది, ఆఖరి పేజీల్లో. 

తరువాత వరుసగా కాలక్రమానుగతంగా  రెండవ ప్రపంచ యుధ్ధకాలం (1942) వరకూ సాగిన కధలన్నీ అందరికీ లభించే చారిత్రక సాక్ష్యాధారాలతో రాసినవే. అనేక ముఖ్య ఘటనలను,  ప్రసిధ్ధి గాంచిన వ్యక్తులనూ ఉదహరిస్తూ, ఉటంకిస్తూ సాగిన రచన గురించి ఎవరికి వారే చదివి తెలుసుకోవాల్సిందే. ఈ రచన వెనుక రచయిత విశేష గ్రంధ పఠనం గోచరిస్తుంది. అంతేకాదు మనల్ని కూడా చరిత్ర పట్ల ఆసక్తుల్ని చేసి, అనేక చారిత్రక సాక్ష్యాల కోసం, వాటి పూర్తి వివరాల కోసం సంబంధిత పుస్తకాల, అంతర్జాల విశేషాల చుట్టూ పరిగెత్తిస్తుంది ఈ రచన. ఒక్కటి మాత్రం సత్యం -- మనం చదువుకున్న చరిత్రల్లోని సత్యం పాలు ఎంత కనీస స్థాయిదో తెలుస్తుంది-- తెలిసి బాధిస్తుంది. క్రీస్తు శకం మొదలయిన తరువాతి చారిత్రక కధనాల్లోని కొన్ని మచ్చు తునకలు  ఈ క్రింద చదవండి.

"అరిస్టాటిల్ చెప్పిన దాంట్లో 'సత్యాన్వేషణకు గీటురాయి మెదడు కాదు. జగత్తులోని పదార్ధమూ, ప్రకృతీనూ'.
 "ఉత్తరాపధపు గాంధారంలో ఇప్పటికీ (క్రీ.శ. 420 నాటికి) దూడ మాంసాన్ని ఇస్తారు. అలాంటిది మధ్యప్రదేశంలో (యుక్త ప్రాంతం - బీహారు) గోమాంసం పేరెత్తడం కూడా మహా పాపం. అక్కడ గోబ్రాహ్మణ సంరక్షణని పరమ ధర్మంగా చెబుతారు. ధర్మంలో ఇంతింత తేడాలెందుకో!"  
 " కాళిదాసు ఒక సందర్భంలో ' తమ పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలాన్నుంచి దాసదాసీ జనాలుగా పుడతారు ' అంటాడు. "
 " శాతవాహన (శాలివాహన) వంశం కోమట్ల వంశం. వ్యాపారస్థులది కాదు ".
 " పాపం - పుణ్యం, ఆచారం - అనాచారం, ఇవన్నీ ఉట్టి కల్పనలు. స్వర్గ నరకాలు, ముక్తి - బంధనాలు ఇవన్నీ చిన్న పిల్లల భ్రమలు! పూజలు, ఉపాసనలు అన్నీ పామరులను మోసం చెయ్యడానికే! దేవుళ్ళు, దేవతలూ - అలౌకిక కల్పనలు అన్నీ మిధ్యే " అంటాడు నాగార్జునుడు '.  
 "1814 లో బ్రిటన్ కి భారతదేశం నుంచి 18,66,608 తానుల బట్ట ఎగుమతి అయింది. 1835 లో 3,76,086 తానుల బట్ట బ్రిటన్ నుంది భారత్ కు పంపబడ్డది." 
ఇంకా ఇటువంటి ఆసక్తి కలిగించే ఎన్నో చారిత్రకాంశాలు పుస్తకం పొడుగునా కనిపిస్తాయి. భరత ఖండం పై తురుష్కుల దండ యాత్ర, ఇంగ్లీషు వాళ్ళ పాలన --- అప్పటి వేతనాలలోని వ్యత్యాసాలు ( అంకెలతో సహా), వైష్ణవ - శైవ మతాల వైరుధ్యాలు - యుధ్ధాలు, హిందూ ముస్లిం సంఘర్షణలు, గాంధీ మిదవాద సిధ్ధాంతంతో వీగిపోయిన విప్లవవీరుల పోరాటాలు.... వగైరా చారిత్రక నిష్ఠుర సత్యాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. తప్పక చదివి తీరాల్సిన మహద్గ్రంధం.
10వ ముద్రణ - 2013, విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్.
పేజీలు - 338, వెల - రూ. 175/-