మంచి రచయితలనే వాళ్ళు కూడా చాలామంది కధో, కధా సంకలనమో వ్రాసి ముఖచిత్రం బాపు గారి చేత వేయించుకోవాలని ఎంత ఉవ్విళ్ళూరుతారో, అంతే భయపడ్తారట. ఎందుకంటే మొత్తం పుస్తకాన్ని ఆయన బొమ్మ మింగేస్తుందనట. అలాగే ఓలేటి శ్రీనివాస భాను వ్రాసిన పుస్తక సమీక్ష చదివితే అదే గుర్తుకొస్తుంది. ఆ సమీక్ష నన్ను అప్పట్లో విశాలాంధ్ర వగైరా షాపులకు తరిమింది గాని పుస్తకం దొరకలేదు. తనికెళ్ళ గార్కి ఉత్తరం రాశాను గాని, భాగ్యానికి నోచుకోలేదు. ఇన్నాళ్ళకి దొరికింది. బహుశా పదేళ్ళ కిందటిదేమో వోలేటి గారి సమీక్ష- ఈనాడులో వచ్చింది. ఉత్సుకత కొద్దీ ఇక్కడ ఇస్తున్నాను. 'పరికిణి' కొని చదివాక అప్పుడు జాగ్రత్త పెట్టిన ఆ పేపర్ కటింగు ఇప్పుడు బయటకు తీశాను. ముందు మచ్చు తునకగా ఒక కవిత చదివి అప్పుడు సమీక్ష చదివితే, అలాగే పుస్తకం కొనుక్కొని మొత్తం చదివి ఒకటి జాగ్రత్త పెట్టుకొని, ఒకటి ఆత్మీయులకెవరికన్నా బహుకరించుకుంటే బావుంటుంది.
చీరె
రాత్రివేళ ఊరిస్తూ-జారుతూ
శృంగారం వొలికిస్తుంది
తెల్లారగట్ల ఆదరాబాదరాగా-అస్తవ్యస్తంగా
వొంటికి చుట్టుకున్నప్పుడు
హాస్యాన్ని చిలికిస్తుంది!
పుట్టింటివాళ్ళ దగ్గర్నుంచి
కబురొస్తే చాలు కళ్ళొత్తుకుంటూ...
కొంగంతా కరుణరసం వర్షిస్తుంది!!
నీళ్ళ టాంకర్ వీధిలోకొస్తే
బిందెకి సపోర్టింగా నడుమ్మీదకు చెక్కేసి
వీర రసాన్ని ప్రదర్శిస్తుంది
పనిమనిషి 'నాగా'పెడితే
బొడ్డులోకి దోపీ అంట్ల మీద రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది
మొగుడితో గొడవపడ్డ రోజున
నేలమీద చెంగై పరచుకొనీ
భయానకాన్ని- రుచి చూపిస్తుంది
అకారణంగా పతిదేవుదు తిట్టాడా --
దూలానికి వేళ్ళాడుతూ
భీభత్సాన్ని... సృష్టిస్తుంది
పొరపాటయిందే అని బేలగా భర్త కన్నీరు పెట్టాడా !!
అంచుతో తుడుస్తూ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది!!
రాజీకొస్తే చాలు మల్లెవంతి తెల్లని ఉల్లి పొరై
శాంతరసాన్ని ... ప్రసాదిస్తుంది!
ఆరంభంలో మన్మధుడి కోట బురుజు పైన భావొద్వేగంతో
రెపరెపలాడే పతాకంలాంటి చీర !
పది నెల్లు తిరిగేసరికి పండంటి పాపాయిని
గుండెల్లో పెట్టుకొని మాతృ గర్వంతో ఊగిపోతూ
ఉయ్యాలైపోతుంది !!!
రాత్రివేళ ఊరిస్తూ-జారుతూ
శృంగారం వొలికిస్తుంది
తెల్లారగట్ల ఆదరాబాదరాగా-అస్తవ్యస్తంగా
వొంటికి చుట్టుకున్నప్పుడు
హాస్యాన్ని చిలికిస్తుంది!
పుట్టింటివాళ్ళ దగ్గర్నుంచి
కబురొస్తే చాలు కళ్ళొత్తుకుంటూ...
కొంగంతా కరుణరసం వర్షిస్తుంది!!
నీళ్ళ టాంకర్ వీధిలోకొస్తే
బిందెకి సపోర్టింగా నడుమ్మీదకు చెక్కేసి
వీర రసాన్ని ప్రదర్శిస్తుంది
పనిమనిషి 'నాగా'పెడితే
బొడ్డులోకి దోపీ అంట్ల మీద రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది
మొగుడితో గొడవపడ్డ రోజున
నేలమీద చెంగై పరచుకొనీ
భయానకాన్ని- రుచి చూపిస్తుంది
అకారణంగా పతిదేవుదు తిట్టాడా --
దూలానికి వేళ్ళాడుతూ
భీభత్సాన్ని... సృష్టిస్తుంది
పొరపాటయిందే అని బేలగా భర్త కన్నీరు పెట్టాడా !!
అంచుతో తుడుస్తూ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది!!
రాజీకొస్తే చాలు మల్లెవంతి తెల్లని ఉల్లి పొరై
శాంతరసాన్ని ... ప్రసాదిస్తుంది!
ఆరంభంలో మన్మధుడి కోట బురుజు పైన భావొద్వేగంతో
రెపరెపలాడే పతాకంలాంటి చీర !
పది నెల్లు తిరిగేసరికి పండంటి పాపాయిని
గుండెల్లో పెట్టుకొని మాతృ గర్వంతో ఊగిపోతూ
ఉయ్యాలైపోతుంది !!!
తనికెళ్ళ భరణి. 'పరికిణీ'నుండి..
"నటుడుగా, నాటక రచయితగా ప్రసిద్ధుడైన తనికెళ్ళభరణి తానో మంచి దర్జీనని ఇందులో నిరూపించుకున్నారు. ఆయన కుట్టిన ఈ పరికిణి కి పాతిక కుచ్చిళ్ళున్నాయి. అతుకులు వేసిన మధ్య తరగతి జీవితాన్ని పట్టీలా అమర్చి చెంబు ఇస్త్రీ చేసిన ఈ వస్త్రం నిండా జాడవిరిచిన స్వప్నాలు, రంగు వెలిసిన సత్యాలూ కనిపిస్తాయి. వీటిని చూశాక "జీవితాన్ని అందరూ చూస్తారు. హత్తుకునేలా కొందరు మాత్రమే రాస్తారు" అని తప్పక అనిపిస్తుంది. తెలిసిన ఉపమానాల్ని తేలికైన మాటలతో గుదిగుచ్చి విషయాన్ని విస్పష్టం చెయ్యడంలో అద్భుతమయిన ఫ్లూయన్సి ప్రతీ కవితలోనూ కనిపిస్తుంది. సమస్యల జ్వాలామాలాతోరణం మధ్య, ఆలి తాలూకు అమాయకత్వం మీద తాండవమాడే మధ్య తరగతి నటరాజును చూపించిన కవి, కలల జాడీలో అష్ట దిక్పాలకుల చేత ఆవకాయ కలియబెట్టించారు. అరుగు మీద పేలు చిక్కుకుంటూ ఉప్పందించే ఆడపడుచులు, సరిగా తోడుకోని జీవితాన్ని చిలుకుతూ విభూది పండైపోయిన బామ్మలూ, రెండు మూరల మల్లెల కోసం పాలకూరనో, కొత్తిమీరనో వాయిదావేసి, ఏడాదికో పూటైనా నులక మంచంమీద మొగుణ్ణి అనిపించికోవాలని ఆరాటపడే అతిసామాన్యులూ దిగుడు పంచల ఇంటి గోడల మీద దిగదుడుపు క్రీనీడల్లాగా కనిపిస్తారిందులో. చీరై పోయిన వోణీలూ, ముడైపోయిన వాలుజడలూ, గుండెల్లో నిప్పులు పోసే మంగళ వాద్యాలూ – సగటు బతుకును మించిన ద్వ్యర్ధికావ్యం లేదని నిర్ద్వందంగా చెబుతాయి. మెదళ్ళు దాచే లాబ్ లాంటి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి, పరస్పర సర్పాల పడగెత్తి ఆడే హిపోక్రసీ, విద్యల తల్లిని నమ్ముకోక అమ్ముకొనే ప్రవృత్తి పఠితల్ని ఆలోచింపచేస్తాయి. మధ్య తరగతి స్త్రీ మూర్తి మీద అపారమైన గౌరవం, అంతులేని అభిమానాలు అనేక కవితల్లో ఉట్టిపడతాయి. ‘బామ్మ’, ‘స్వర్గం నుంచి నాన్నకి’, ‘చీరె’, ‘పరికిణి’, ‘మా ఆవిడకి మంత్రాలోచ్చు’ లాంటి కవితలే ఇందుకు ఉదాహరణ. అలాగే ‘రామప్ప గుడి’, ‘మూసీ నది’, కుంకుమపువ్వుల మీద భరణి రాసిన పంక్తులు కదిలిస్తాయి. కవి తన ఆరాధ్య నటి సావిత్రి, అభిమాన నటి రేఖల గురించి రాసిన మాటలు నిట్టూర్పుల తాకిడికి ఊగే జడగంటల్లాగా అనిపిస్తాయి. మొదలు పెట్టినా తరువాత పాతిక కవితల్నీ ఏక బిగిన చదవందే మనసు ఊరుకోదు. అక్షరాల అద్దంలో ప్రతిబింబం మసకేసిన ప్రతిసారీ కన్నీటి పొరను తొలగిస్తూ పేజీలు తిరగెయ్యడం పఠితలకు తప్పనిసరి అవుతుంది. తెలిసిన సంగతుల్ని కదిలించేలా చెప్పడానికీ – క్లుప్తత, ఆర్ద్రత, జీవితాన్ని ప్రేమించే గుణాలే కారణమన్న సంగతి బోధపడుతుంది. గంగను భగీరధుడికిచ్చి, కన్నీటిని భారతీయులకిచ్చిన పరమేశ్వరుడికి కవితతో పాటూ పాఠకులు సైతం కృతజ్ఞతలు చెప్తారు. పుస్తకం ముగించగానే లక్ష్మణ్ ముఖచిత్రం, బ్నిం లే అవుట్ ఈ పుస్తకానికి ఎసెట్లు.
(పరికిణి : రచన: తనికెళ్ళభరణి, పేజీలు 36, వెల రూ:20/-, ప్రతులకు – రచయిత, 8-3-678/6, సౌందర్యలహరి, ప్రగతి నగర్, యూసుఫ్ గూడ,హైదరాబాద్-500045.)