తెలుగు సంగతులు

మంగళవారం, సెప్టెంబర్ 10, 2013

నామినితో నా గోడు

నామినితో నా గోడు

ఏదైనా పుస్తకం చదివాక అది ఇంకా మనల్ని వెంబడిస్తోందంటే ఆ రచన మనల్ని కదిలించిందనో, కరిగించిందనో అనుకోవచ్చు. కానీ ఆ భావన ఎన్నాళ్ళు? ఆ తరుములాట ఎంత కాలం? మరో పుస్తకం చదివేదాకానో, లేదా మరో వ్యాపకంలో పూర్తిగా మునిగిపోయ్యే దాకానో! అంతేకాని, ఇదేటి ఈ నాయుడుగోరి గోడు సెవ్వుల్లో కాకుండా గుండెల్లో దూరిపోయి ఓ పట్టాన వదలకుండ పట్టేసినాది. అవును నిఝ్ఝంగా నిజెం. నామిని సుబ్రహ్మణ్యం గారి ‘నంబర్ వన్ పుడింగి’ చదివిన నాల్దినాలయినా జిగటలాగా వదలడంలేదు. పట్టింది మెదడుకి కాదు. మనసుకి కాబట్టి.  నిజం చెప్పాల్సిన బాధ్యత ఏ రచయితకైనా ఉంటుంది. ముఖ్యంగా చరిత్రలు, ఆత్మకధలు వ్రాసేటప్పుడు. కానీ నిజం మాత్రమే వ్రాయడం, అది మాత్రమే కలంలోంచి అలాగే పాకేయడం ఆయన  స్వతసిద్ధ లక్షణంగా నామిని ఆత్మకధలో చూస్తాం. అది చదివిన ప్రభావంలో ఉండగానే నామిని గారికే ఉత్తరం వ్రాసే దుస్సాహసం చేశాను. అదే ఈ కిందిది. ఆయన ఉత్తరం అందుకున్నట వెంటనే ఫోను చేసి చాలాసేపు మాట్లాడారు. చాలా సంబరపడిపోయాను. అసలే పుస్తకం చదివిన ఊపు, ఆపై ఆయనతో మాట్టాడిన పూనకం – ఇదిగో ఇక్కడ ఇలాగ బ్లాగేస్తున్నాను. చిత్తగించండి.
“ఎవడి సోది ఆడే ఆడి బాసలోనే దంచేత్త ఉంటే ఎట్టా సచ్చేది? పదిమంది సదవాలనే గదా ఎవుడయినా రాసేదీ? అచ్చోత్తేదీనూ? ప్రాంతం, మాండలీకం పక్కనబెట్టు. ఊరికో బాస యాస ఉండుద్ది గందా! పక్కూరోడికే అర్తం అయ్యేది కట్టవైపోతే ఎట్టా సదివేది? ‘రావి’  వద్దు – ‘కారా’ కాదు – ‘వంశీ’ కెందుకు – ‘చాసో’ కి చాతకాదు – కేశవరెడ్డికీ, పులికంటికీ ఏందెలుసని అంటావు!!! మరైతే నియ్యి దప్ప ఇంకేం సదవాల్రా? -- అనుకున్నా సగం సదివి. మిగతాయన్నీ సదవొచ్చుగానీ –ఇయ్యి, ఈ ‘పుడింగు’ గాడియ్యి మాత్తరం సదివితీరాలా- అనుకున్నా, పుస్తకం సివరాకరుకొచ్చేకల్లా. నీ పొగురు మాక్కూడా అతికించేట్టున్నావు కదరా ‘పుడింగీ’! అయినా నాకు అర్తం కాని సాలా సంగతుల్లో ఇదోటి—‘నీ అయ్యనొప్పించకుండా, ఎంట తీసికెల్లకుండా, పెల్లెట్ల సేసుకున్నావురా నంగిరి నా కొ---! ఇలాంటి పొగురుబోతు దొంగ పన్లెన్ని సేసినా – గొప్ప పాయింట్లే సెప్పినావు. అందులో ఒకటి –ముక్కెంగా – ‘ఎలచ్చంలప్పుడు కూడా ఆ నీ కొడుకులు డబ్బు దియ్యకబోతే – ఇంకెప్పుడు అది బయటకోచ్చేది?’ ఇది నిజెం. ఇదే నిజెం. ఇంతకంటే ఏ ‘పుడింగు’ అయినా సేసి సచ్చేది ఇంకేం లేదు. గింజల్తోలుకు పోయి నిలవెట్టిందాన్ని—సారాగా అన్నా మన మింద కొంచెం ఒలకబోయించేసుకుంటే --- ఆ నీ కొడుక్కి మల్లీ ఐదేల్లు పని ఉంటాది, గింజలేరుకుందికి. ఇయ్యి మాత్తరం మద్దేన్నం, రాతిరి క్వాటరు మీదే రాసింటావు. ఎక్కువయినందుకే లెక్క నేకండా డోకేసినావ్. అయినా కానీ ఒరే ‘పుడింగీ’ నువ్వు సెప్పినట్టే ఇన్నందుకు, నీకే తలూపినందుకూ అమ్మనీ, అక్కనీ ‘లంజముండలంటా’ వేందిరా? లమ్డిక్కీ! ‘లమ్డిక్కీ’ అంటే నాకర్తం తెలవదు. సోమరాజు రంగారావుకు మైకంలో తెలుత్తాదేమో! ఏదేవన్నాగానీ, నీ యెంబడి దిరిగిన పాపానికి సానా మందిని బజార్నెట్టేసినావు కదరా తిక్కలోడా! అయితేనేం – రోజుకు ఇరవై, ముఫ్ఫై పేజీలు కంటే ఎక్కువ సదవలేనోణ్ణి నీ రెండొందల పన్నెండు పేజీల ‘పుడింగి’ గోలమ్మటా రెండు రోజుల్లోనే పరిగెట్టిచ్చీసినావు కదరా! నువ్వు నిజంగా ‘పుడింగే’. అంతేనా! పిలకాయలకు  ఒక్క కతే చెప్పి ఆల్ల చేత నగిపిచ్చేసినావు సూడు, ఐదూ పదీ పెట్టి కొనిపిచ్చీసినావు సూడు అదీ మొగిలాయితనం అంటే! అందుకే అయ్యన్నీ ఎంటనే కొరియర్ కి పంపించు. నీ యబ్బ డబ్బు పంపిత్తన్లె యిప్పుడే. ఎకౌంటు నెంబరు యిచ్చి పూడ్సినావు కదా సివర్లో.
 మీలా పుడింగిని కాదు కానీ ఒక్కసారిగా మీ పుస్తకం చదివిన వెంటనే ఇంకా ఉండుకున్న పూనకం వల్ల ఇలాగ రాసేశాను నామిని సుబ్రహ్మణ్యం గారూ! క్షమించి మీ పుస్తకాలన్నీ దుకాణాల్లో దొరికేటట్టు సూడు సావీ!”
‘నామిని నంబర్ వన్ పుడింగి’
ప్రచరణ: టామ్ సాయర్ బుక్స్ , ప్లాట్ నెం:211, అన్నమయ్య టవర్స్,యాదవ కాలనీ, తిరుపతి – 517501.
ఫోను: 0877 – 2242102.

లభ్యం: విశాలాంధ్ర, నవోదయ. (ఉత్త మాట. ఎక్కడా లేవు. ఆయన్నే పట్టుకోండి.) 

శుక్రవారం, ఆగస్టు 30, 2013

'అభౌతిక స్వరం'

'అభౌతిక స్వరం' 

 పుస్తకం చదివారా? తప్పక చదవాల్సిన పుస్తకం. చాలా మంది ప్రముఖ వ్యక్తుల లోకీ పరకాయప్రవేశం చేసి వారి గుండె గొంతుకలతో చెప్పిన మాధవ్ శింగరాజు అభినందనీయుడు. 

కొన్ని 'మెచ్చు తునకలు' --
"రాజ్యమంటే నేనేనన్న పధ్నాలుగవ లూయీ పట్టెమంచం పై మూడో తరం సంతతి తూగుతోంది. వేటకెళ్ళడం , చేపలు పట్టడం, పన్నులు వసూలు చెయ్యడం -- ఇదేనా(గా) వారి పని!"
:విప్లవం దుష్ట శక్తి అయితే దుష్టుడినై గర్వించడానికి నాకెలాంటి మొహమాటం లేదు. విప్లవానికి మొదట పూసే పువ్వు ... విషపు నవ్వే గనకైతే ఆ నవ్వుకు వేకువతోనే నా ముఖాన్నివ్వడానికి నేనా రాత్రీ నిద్రపోను."
"దేవుడిని సంశయించినవాడు నాకు దైవ సమానుడు. దేవుడిని ప్రజల్లోకి అనుమతించినవాడు విప్లవయోధుడు."
"దేవుణ్ణి చూపించి భయపెట్టేవాడు ప్రభువైనా, ప్రవక్తైనా నమ్మనక్కరలేదు."
"ఓటమి కూడా విప్లవాన్ని నడిపించే విజయమే."
పైవి 'నెపోలియన్' గురించిన వ్యాసం లోవి.
మరో చోట--
"ఎవరైనా విశ్రాంతిని కోరుకుంటున్నారంటే అర్ధం ... ప్రయాస పడ్డారనీ, అలసిపోయారనీ కాదు. జీవితం పై వారికి ప్రేమ తగ్గిందని."
ఇటువంటివి చాలా చాలానే ఉన్నాయి ఆలోచింపజేసేవి.
రాజా.

ఆదివారం, జులై 14, 2013

ఉత్తరాఖండ ఖండాలుఈ చెట్టుని కొట్టనివ్వం. మా అడవి తల్లిని కాపాడుకుంటాం.
1970 ల నాటి ఉత్తరాఖండ్ (అప్పటి ఉత్తరప్రదేశ్ లోని) చిప్కో ఉద్యమ చిత్రం.

ఏమయ్యిందిప్పుడు? ఎవరు కారకులు? ప్రకృతి ప్రేమికుల మాట పెడ చెవిన పెట్టి వ్యాపారమే పరమావధిగా ప్రజలు, ప్రభుత్వాలు ఎడాపెడా గుళ్ళు, హోటళ్ళు, ఎగుడు దిగుడు చూడకుండ రిసార్టులు, కాలజ్ఞానం తెలియక తీర్థయాత్రలు --- ఎవర్ని నిందించుకుంటాం--- స్వయంకృతాపరాధాన్ని  కప్పిపుచ్చుకోడానికి -- ఈశ్వరుడికి మరోసారి మొక్కుదామా? ఆయన పైనే భారం వేసి చిందులు తొక్కుదామా? ఆ మాత్రం పని ఇక్కడనుండే చేసి అక్కడ వాళ్ళనైన బతకనిస్తే ---ఉంటే, ఇంకా ఓపికతో మిగిలుంటే --- ఈశ్వరుడే ఊపిరి పీల్చుకోడా?

ఆదివారం, జూన్ 16, 2013

శ్రీపాద వారి ‘వడ్లగింజలు’కధలు -సమీక్షహాస్యం – ఆసికం, వెటకారం – యటకారం, వ్యంగ్యం – వెంగెం అన్నీ ఒక కోవకు చెందినవే  అయినా సందర్భాన్ని బట్టి ప్రకృతి – వికృతి పదాలు వాడితేనే విషయానికి విలువొస్తుంది. హాస్యం అయినా మరో రసమయినా హెడ్డింగు పెట్టుకు వ్రాయడు సరుకున్న వ్రాయసకాడు ఎవరయినా. చదువరి తెలివిడిని బట్టి ఆయా రసాలతో బాటు అసలు సరుకు ఎరుకకు రావాలి, రచనంటే! ఆ కోవకు చెందుతాయి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు. ‘ఆత్మకధ’ లాంటిదే అయినా , ఆయన “అనుభవాలూ జ్ఞాపకాలున్నూ” మనల్ని అలనాటి అగ్రహారాలమ్మటా, గడీ లోకీ, మడి లోకీ ఆర్ద్రత ఉన్నచోట్ల మదిని తడిలోకి తీసుకెళ్ళగలిగే అద్భుతమైన శక్తి గల రచన. యాభైల నాటి కాలమాన పరిస్థితులన్నీ కళ్ళకు కడతాయి. ఎక్కువ భాగం మాత్రం ఆయా బ్రాహ్మణ కుటుంబాల లోగిళ్ళలోనూ, వాకిళ్ళలోనూ

.... తిరుగుతాయి, అందుల్లో ఉన్న లొసుగుల్ని, ముసుగుల్ని రాసుకుంటూ—తోసుకుంటూనూ.

వారిదే అయిన ’వడ్లగింజలు’ కధలు ఆసాంతం పరుగులు పెట్టించే రచన. పబ్లిషరు వాకిట్లోనే “ప్రతి తెలుగువాడూ తప్పక చదవాల్సిన అచ్చ తెలుగు కధలు!” అని తోరణం కట్టేశారు. చదవకపోతే ఎక్కడ తెలుగువాణ్ణి కాకుండా పోతానో అని గబగబా మొదలెట్టేశాను. తీరా లోపలికెళ్ళాక దబదబా చదివించేసింది ఆపనియ్యకుండా. ఆయన శైలి ప్రత్యేకమయినది. శ్రీపాద వారి ఏ ఒక్క రచన చదివినా వారి మిగతా రచనలకోసం తొందరపడకుండా ఉండలేము.
‘వడ్లగింజలు’ పద్నాలుగు కధల సమాహారం. ప్రతీదీ ప్రత్యేకమయినదే! కొన్ని కధలలో పాత్రల పేర్లూ ఉండవు. పరిచయాల పని లేదు. వర్ణనలు అసలే ఉండవు. నేరుగా “సంభాషణ”ల తోనే మొదలయ్యి పోతుంది. ఆ వేగానికీ, శైలికీ అలవడడానికి కొంచెం సమయం పట్టినా, దాని ఫలితంగా అప్పుడు సంభాషించుకుంటున్న రెండు లేదా అంతకు మించి ఉన్న అన్ని పాత్రల్లోకి ఏకకాలంలో మనం పరకాయ ప్రవేశం చెయ్యాల్సి ఉంటుంది. అంతకంటే కూడా ఆ పాత్రలే మనల్ని ఆవహించేస్తాయి. అంతటి శక్తి, ఆకర్షణ ఉన్న రచనలు శ్రీపాద వారివి. కేవలం భార్యా భర్తలిద్దరూ మాట్లాడుకొనే సంభాషణలతోనే మొత్తం కధ “షట్కర్మయుక్తా” నడుస్తుంది, ముగుస్తుంది.  అలాగే అనేక పాత్రలు ఉన్నా, అన్నింటికీ పేర్లు ఉన్నా అవేమి మనకూ – కధాగమనానికీ అడ్డు పడవు. అసలు విషయమయిన ‘చదరంగం’ ఎత్తులతో మనల్ని కూడా ఉత్కంఠలో పడవేస్తాయి, ‘వడ్లగింజలు’ కధలోని ప్రతీ సన్నివేశమూనూ. అంతెందుకు, ముందు మాటలో ‘మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు... “ఈ శతాబ్దం లో వచన రచనకు పెట్టింది పేరు, ... ఒక్క ఇద్దరికే... శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారూ, శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్రి గారూ.” శ్రీపాద వారి విషయంలో నాకు అంతకంటే మించే అనిపించింది. చెళ్ళపిళ్ళ వారివి ఇంకా ఏమీ చదవనందుకు చింతిస్తున్నాను.  
ఇంకా బుక్ షెల్ఫ్ లోంచి ఊరిస్తున్న శ్రీపాద వారి రచనలు ‘పుల్లంపేట జరీ చీర’, ‘మార్గదర్శి’, ‘కలుపు మొక్కలు’ నన్ను కీ బోర్డు మీద నిలవకుండా చేస్తున్నాయి. మరోసారి మరో మంచి పుస్తకం గురించి ముచ్చటించుకుందాం.
మీ వ్యాఖ్యతో పాటు 'ఇమెయిలు' ఇస్తే మీకొక శ్రీపాద వారి పెను కానుక పి డి ఎఫ్ రూపంలో పంపగలను.


గురువారం, మే 23, 2013

'సమ్మర్ హిల్'  పుస్తక సమీక్ష

చాలా కాలం తరువాత పుస్తకాలు చదివే తీరిక, అవకాశం దొరకడంతో వరుసగా నాలుగు చదివి ఐదోది చదువుతూ చదివినవాటి గురించి మిత్రులతో అభిప్రాయాలు పంచుకోవాలని ---
నేను చదివిన నాలుగు పుస్తకాలూ—1) ఎ.ఎస్.నీల్ రచన ‘సమ్మర్ హిల్ ‘ తెలుగు అనువాదం. 2)శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి – ‘వడ్లగింజలు’ 3)రఘు – ‘ప్రేమతో వడ్డెర చండీదాస్’4)ఈచర్ వారియర్ ‘నాన్న – రాజన్ తండ్రి అన్వేషణ’ తెలుగు అనువాదం. ఇక ఇప్పుడు సగంలో ఉన్నది – సడ్లపల్లె చిదంబర రెడ్డి రచన ‘కొల్లబోయిన పల్లె’.
ఇందులో విషయపరంగా ఒకదానికొకటి పోలిక లేవు. కానీ ఎందుకనో పుస్తకాల అరలోంచి వెదుక్కొని ఏరి ఏరి ఇవన్నీ వరుసలో చదివాను. ప్రతి పుస్తకం విభిన్నమయిన అనుభూతిని, కొన్ని భావోద్వేగాన్ని కలిగించాయి.

ఎ.ఎస్.నీల్ వ్రాసిన ‘సమ్మర్ హిల్’ పుస్తకం పిల్లల పెంపకం గురించిన వాటిలో జగద్విఖ్యాతి గాంచిన పుస్తకం. చాలామంది చదివే ఉంటారు లేదా వినైనా ఉంటారు.  పెంపకం గురించి కంటే కూడా పిల్లల మనస్తత్వ పరిశీలన, దానిపై ఆధారపడి తల్లిదండ్రులకు, టీచర్లకు మార్గదర్శి గా ఈ పుస్తకం ఖచ్చితంగా చదవవలసినదే. తెలుగులో అనువాదం కోసం ఎదురు చూసి, ఇప్పటికి దొరకబుచ్చుకోగలిగినందుకు సంతోషంగా ఉంది. రచయిత స్వయంగా ఇంగ్లండు కు సమీపంలో తన ఆశయాలకు తగ్గట్టు స్కూలు నిర్మించి నిర్వహించి సాధించి --- ఆ అనుభవాలనే పుస్తకంగా మలిచారు.
పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపే నేటి పోటీ ప్రపంచపు బలవంతపు మార్కుల/ర్యాంకుల చదువుల దుష్ఫలితాల దిశగా పోకుండా, స్వేచ్చగా బిడ్డ తన అభిరుచి మేరకు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కలిగించడమే ‘సమ్మర్ హిల్’ స్కూలు ముఖ్య ఉద్దేశ్యం. పుట్టగానే ఇంజనీరు, డాక్టరు, పెద్ద గుమాస్తా(ఫైనాన్సియల్ అకౌంటెంట్), కంప్యూటర్ కీ బోర్డు ఆపరేటర్ (సాఫ్టువేరు ఇంజనీరు)  లేదా మరోటో అనీ తల్లిదండ్రులూ, ఆ పై ఫ్లెక్సీలు, బానర్లు, హోర్డింగులు, బ్రోచర్లు, టివీ ప్రకటనల హోరుతో ప్రయివేటు స్కూళ్ళ యాజమాన్యాలూ బిడ్డని పంజరంలో ఇరికించే ప్రక్రియ ఇంటింటా సాధారణమయిపోయిన ఈ రోజుల్లో ‘సమ్మర్ హిల్’ కనువిప్పు కలిగించేదే. అయినా అందరినీ పీడించే ప్రశ్న—“ఇది ఆచరణ సాధ్యమేనా?”  మొదటగా మనం ఆలోచించుకోవాల్సింది ఇంజనీరుకో, పెద్ద గుమాస్తాకో తల్లిదండ్రులమా? లేక స్వేచ్చగా పెరిగి మనుషులుగా తయారవ్వబోయ్యే పిల్లలకు తల్లిదండ్రులమా? ఈ విషయాన్నే ‘సమ్మర్ హిల్’ చాలా సోదాహరణంగా ఆచరణసాధ్యమయిన పద్ధతులను చర్చించింది. ఇప్పటి యాంత్రిక చదువులు, జీతాల/సంపాదనల పాత్రను నిర్దారించడానికే తప్ప జీవితాల్ని, వాటి మాధుర్యాన్ని చవి చూడగలిగే మానవ సంబంధాల్నిపెంపొందించుకొనే నేర్పరితనాన్ని, స్వేచ్చకు అవకాశాన్ని ఏ మాత్రం దరి చేరనీయడం లేదు. అందుకే విద్యావంతులు పెరుగుతున్నా, స్కూళ్ళు, కాలేజిలు లెక్కకు మించి పెరుగుతున్నా—విజ్ఞత, వివేకం కొరవైన యాంత్రిక జీతగాళ్ళను మాత్రమే తయారు చేసుకుంటున్నాము. అందుకే సమాజంలో, ప్రతి వ్యక్తిలోనూ, వ్యవస్థలోనూ ఈ అశాంతి, అభద్రత. మన చదువులు ఏ కోశానా స్వేచ్చను, మానవత్వాన్ని బోధించడంలేదు. తద్భిన్నంగా ‘అవి’ అవసరం లేదు అనే ఆలోచనను చిన్నతనం నుండే బుర్రల్లో బీజింపచేస్తున్నాయి. అనవసర చాదస్తాలతో, మూడ నమ్మకాల పట్ల ఆసక్తిని కలుగచేస్తున్నాయి మన లోగిళ్ళు. ఉదాహరణకు సెక్స్ పట్ల లేని పోని అపోహలు కలిగించి పిల్లలకు, యువకులకు అదేదో నేరసంబంధిత చర్యగా భావన కలుగ చెయ్యడం వల్ల వారిలో చిన్నతనంనుండే తాము నేరస్తులమన్న భావన అంతరాంతరాల్లో ఏర్పడి అదే స్థిరపడిపోతుందన్న విషయాన్ని ‘సమ్మర్ హిల్’ పరిశీలనాత్మకంగా మన ముందుంచుతుంది. యూరప్ ఆలోచనల ప్రభావం చేతనేమో, సెక్స్ విషయాలను మోతాదుకు మించి చర్చించిందని మన భారతీయులకు అనిపించొచ్చు. ఉదాహరణకు పిల్లలలో సెక్స్ పట్ల ఆసక్తి, హస్తప్రయోగం వగైరా విషయాలను చాలా సందర్భాల్లో బాహాటంగా చర్చించడం జరిగింది. కానీ అందులో నిజాయతీ, నిర్మొహమాటం, చెప్పాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే అది సహజమయిన, ప్రకృతి సంభందిత విషయం. అతి ముఖ్యమయినది కూడా. మొత్తం మీద విలువైన పుస్తకం. మంచి మనుషులుగా తమ బిడ్డలను తిర్చిదిద్దుకోవాలనే ప్రతి తల్లిదండ్రులూ, అలాంటి బాధ్యతను విస్మరించని ఉపాధ్యాయులూ తప్పక చదవవలసిన పుస్తకం ‘సమ్మర్ హిల్’. పుస్తకంలోవి మచ్చుకు కొన్నివాక్యాలు ----
అబద్ధాలు చెప్పడం స్వల్పమైన బలహీనత. అబద్దాలతో జీవించడం ఘోరమైన ప్రళయం.”
“బలప్రయోగం అనేది మానవజాతిని పట్టి పీడిస్తున్న శాపం. పోప్, రాజ్యాంగ యంత్రం, టీచర్,తల్లిదండ్రుల ద్వారా బలప్రయోగం జరుగుతున్నది.”
“నిజానికి స్కూళ్ళలో, కాలేజీలో ప్రధమ స్థానం సంపాదించే సంపాదించే విద్యార్ధులలో ఎక్కువమంది తరువాత సామాన్యులుగా దిగాజారిపోతారు.”
“జీవితం నుంచి పలాయన మంత్రం పటించడానికి మతం ఉపయోగపడుతుంది.”
ప్రచురణ: ప్రజా శక్తి బుక్ హౌస్.  పేజీలు: 338. వెల: రూ.130/-.  

తదుపరి పోస్టు కొద్ది రోజుల్లో శ్రీపాద వారి 'వడ్లగింజలు' గురించి.