తెలుగు సంగతులు

ఆదివారం, జూన్ 16, 2013

శ్రీపాద వారి ‘వడ్లగింజలు’కధలు -సమీక్ష



హాస్యం – ఆసికం, వెటకారం – యటకారం, వ్యంగ్యం – వెంగెం అన్నీ ఒక కోవకు చెందినవే  అయినా సందర్భాన్ని బట్టి ప్రకృతి – వికృతి పదాలు వాడితేనే విషయానికి విలువొస్తుంది. హాస్యం అయినా మరో రసమయినా హెడ్డింగు పెట్టుకు వ్రాయడు సరుకున్న వ్రాయసకాడు ఎవరయినా. చదువరి తెలివిడిని బట్టి ఆయా రసాలతో బాటు అసలు సరుకు ఎరుకకు రావాలి, రచనంటే! ఆ కోవకు చెందుతాయి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు. ‘ఆత్మకధ’ లాంటిదే అయినా , ఆయన “అనుభవాలూ జ్ఞాపకాలున్నూ” మనల్ని అలనాటి అగ్రహారాలమ్మటా, గడీ లోకీ, మడి లోకీ ఆర్ద్రత ఉన్నచోట్ల మదిని తడిలోకి తీసుకెళ్ళగలిగే అద్భుతమైన శక్తి గల రచన. యాభైల నాటి కాలమాన పరిస్థితులన్నీ కళ్ళకు కడతాయి. ఎక్కువ భాగం మాత్రం ఆయా బ్రాహ్మణ కుటుంబాల లోగిళ్ళలోనూ, వాకిళ్ళలోనూ

.... తిరుగుతాయి, అందుల్లో ఉన్న లొసుగుల్ని, ముసుగుల్ని రాసుకుంటూ—తోసుకుంటూనూ.

వారిదే అయిన ’వడ్లగింజలు’ కధలు ఆసాంతం పరుగులు పెట్టించే రచన. పబ్లిషరు వాకిట్లోనే “ప్రతి తెలుగువాడూ తప్పక చదవాల్సిన అచ్చ తెలుగు కధలు!” అని తోరణం కట్టేశారు. చదవకపోతే ఎక్కడ తెలుగువాణ్ణి కాకుండా పోతానో అని గబగబా మొదలెట్టేశాను. తీరా లోపలికెళ్ళాక దబదబా చదివించేసింది ఆపనియ్యకుండా. ఆయన శైలి ప్రత్యేకమయినది. శ్రీపాద వారి ఏ ఒక్క రచన చదివినా వారి మిగతా రచనలకోసం తొందరపడకుండా ఉండలేము.
‘వడ్లగింజలు’ పద్నాలుగు కధల సమాహారం. ప్రతీదీ ప్రత్యేకమయినదే! కొన్ని కధలలో పాత్రల పేర్లూ ఉండవు. పరిచయాల పని లేదు. వర్ణనలు అసలే ఉండవు. నేరుగా “సంభాషణ”ల తోనే మొదలయ్యి పోతుంది. ఆ వేగానికీ, శైలికీ అలవడడానికి కొంచెం సమయం పట్టినా, దాని ఫలితంగా అప్పుడు సంభాషించుకుంటున్న రెండు లేదా అంతకు మించి ఉన్న అన్ని పాత్రల్లోకి ఏకకాలంలో మనం పరకాయ ప్రవేశం చెయ్యాల్సి ఉంటుంది. అంతకంటే కూడా ఆ పాత్రలే మనల్ని ఆవహించేస్తాయి. అంతటి శక్తి, ఆకర్షణ ఉన్న రచనలు శ్రీపాద వారివి. కేవలం భార్యా భర్తలిద్దరూ మాట్లాడుకొనే సంభాషణలతోనే మొత్తం కధ “షట్కర్మయుక్తా” నడుస్తుంది, ముగుస్తుంది.  అలాగే అనేక పాత్రలు ఉన్నా, అన్నింటికీ పేర్లు ఉన్నా అవేమి మనకూ – కధాగమనానికీ అడ్డు పడవు. అసలు విషయమయిన ‘చదరంగం’ ఎత్తులతో మనల్ని కూడా ఉత్కంఠలో పడవేస్తాయి, ‘వడ్లగింజలు’ కధలోని ప్రతీ సన్నివేశమూనూ. అంతెందుకు, ముందు మాటలో ‘మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు... “ఈ శతాబ్దం లో వచన రచనకు పెట్టింది పేరు, ... ఒక్క ఇద్దరికే... శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారూ, శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్రి గారూ.” శ్రీపాద వారి విషయంలో నాకు అంతకంటే మించే అనిపించింది. చెళ్ళపిళ్ళ వారివి ఇంకా ఏమీ చదవనందుకు చింతిస్తున్నాను.  
ఇంకా బుక్ షెల్ఫ్ లోంచి ఊరిస్తున్న శ్రీపాద వారి రచనలు ‘పుల్లంపేట జరీ చీర’, ‘మార్గదర్శి’, ‘కలుపు మొక్కలు’ నన్ను కీ బోర్డు మీద నిలవకుండా చేస్తున్నాయి. మరోసారి మరో మంచి పుస్తకం గురించి ముచ్చటించుకుందాం.
మీ వ్యాఖ్యతో పాటు 'ఇమెయిలు' ఇస్తే మీకొక శ్రీపాద వారి పెను కానుక పి డి ఎఫ్ రూపంలో పంపగలను.


కామెంట్‌లు లేవు: