తెలుగు సంగతులు

శనివారం, జులై 18, 2020

'అసురుడు' పుస్తక సమీక్ష 'అసురుడుపుస్తక సమీక్ష

      రాముడు దేవుడు. రావణుడు రాక్షసుడు. వీరిద్దరి వైరానికి కారణం సీత. రాముడు రావణున్ని వధించి సీతను తిరిగి తెచ్చుకుంటాడు. ఇదీ క్లుప్తంగా రామాయణం. రామాయణం అంతా ఇప్పుడెందుకూ అని ఎవరికైనా సందేహం రావొచ్చు. ఎందుకంటే రామాయణం యుగయుగాలుగా వింటున్న పవిత్రమైన కధ. వాల్మీకిది కాకుండా ఎన్ని రామాయణాలు, వాటిపై ఎన్ని వ్యాఖ్యానాలూ, విమర్శలూ వచ్చినా మనకంతా అది ఒక వైపు నుండి విన్నదే. విశేషాలన్నీ అయోధ్య నుంచి మొదలై, మిధిలా నగరం, వింధ్యారణ్యం, కిష్కింధ మీదుగా వెళ్ళి లంకకు చేరి తిరిగి అయోధ్యకు చేరడంగా మనకు తెలుసు. అదే విన్నాం. దశరధునికి ముగ్గురు భార్యలూ, అయినా సంతానలేమి, చివరకు కలిగిన నలుగురు సంతానం ఇత్యాదిగా మనకు కధ సాగుతుంది. అప్పటికే పుట్టి పెరుగుతున్న రావణుని విషయాలు కధలో మనకు స్ఫురించవు. అతని బాల్యం, అతని పూర్వులూ, బలిచక్రవర్తి నుండి అతను పొందిన స్ఫూర్తీ, శ్రమించి ఏర్పరుచుకున్న లంక సామ్రాజ్యం వగైరా అంతగా కనబడదు. చర్చకు రాదు. శూర్పణఖ వృత్తాంతం, సీతాపహరణం నుండే రావణుని ప్రసక్తి రావడం, అతనిలోని రాక్షస ప్రవృత్తి మాత్రమే  మనకు కనబడతాయి.

అదే 'రావణాయనం' రాస్తే ఆవలివైపు విశేషాలన్నీ క్షుణ్ణంగా తెలుస్తాయి. కధనంలో సీతాపహరణం నుండే రాముడు చదువరులకు పరిచయం అవుతాడు. అలాంటి రీతిలో, మరోకోణం నుండి రాసిందే రావణాయనంగా నేను ప్రస్తావిస్తున్న ' అసురుడునవలరచయిత ఆనంద్ నీలకంఠన్. తెలుగు అనువాదం ఆర్. శాంతా సుందరి. అలా చెప్పక పోతే ఇది అనువాదమనే విషయమే మనం గుర్తించం. అంత చక్కగా, సరళంగా ఉంది ఆవిడ అనువాదం. అది ఆవిడ ప్రతిభ

కధ విషయానికొస్తే రామాయణమే ఆవైపు నుండి అనుకోవచ్చు కానీ, అంత తేలిగ్గా నిర్వచించేసుకోడం కుదరని లోతు ఉంది నీలకంఠన్ రచనలో. 'అసురుడు 'కధా రీతి ప్రారంభం నుండే గొప్ప ఎత్తుగడతో మొదలయింది. దీన్ని ఆసాంతం రావణుడూ, అతనితోబాటూ  భద్రుడు అనే సామాన్యుడూచెరి సగంగా చెప్పుకు పోతుంటారు. దానివల్ల జరిగిన గొప్ప ప్రయోజనం ఏంటంటే, అది పురాణ కధే అయినా, ఎప్పుడూ మనం వినే పాలకవర్గం పక్షంగా  కాకుండా జనం వైపు నుండీ భద్రుడి చేత కధ చెప్పించిన తీరు వల్ల నిజాన్ని దగ్గరగా చూడగలిగిన భావన.   దేశ చరిత్రైనా  పాలకుల చరిత్రగానే లిఖితం అవ్వడం మనం చూస్తున్న నిష్ఠుర సత్యం. కానీ జనం వైపు నుండి చెప్పిన అతికొద్ది (నాకు తెలిసి) చరిత్రల్లో, హోవార్డు జిన్ రాసిన ' అమెరికా ప్రజల చరిత్ర 'ఒకటైతే, పురాణ ఇతివృత్తాల్లో పాలితులవైపు నుండి నీలకంఠన్ అసురుడి కధ మరోటి.
  
పక్క రావణుడు చెప్పే కధనంలో పాలకులకు సహజంగా ఉండే సామ్రాజ్య కాంక్షా, అహంభవమూ, గర్వాతిశయమూ, సామాన్యుల పట్ల ఉండే చిన్న చూపూ దృశ్యమానమవుతుంటే, మరోపక్క భద్రుని కధనంలో సామాన్యుడి వేదనా, నిస్సహాయతా, ప్రభువులకు తలవొంచే బానిసతత్వమూ గోచరిస్తూంటుంది. మూడో కోణంలో అదే కూలీ నాలీ జనానికి ఉండే కొంత కపటత్వమూ, కక్కుర్తి బుధ్ధులూ, చోర గుణమూ, వ్యసనపరత్వమూ కళ్ళకు కట్టిస్తాడు కవి. ప్రభువైనా, సామాన్యుడైనా సహజంగా ఉండే మానవ బలహీనతలకూ, స్వార్ధపరత్వానికీ అతీతులు కారని ఎక్కడికక్కడ వివరణ ఇస్తాడు రచయిత.  

రచన మరో ముఖ్యమయిన ఉద్దేశ్యంగా కనబడే విషయం, కుయుక్తుల కూటమి అయిన బ్రాహ్మణ గుంపుల కుతంత్రాలూ, శ్రమదోపిడీ ధ్యేయంగా కుల వ్యవస్థ నిర్మాణమూ, వాటిని అమలుపరచడానికి ఇటు రావణున్నీ, అటు రాముణ్ణీ ఒకే రకంగా మభ్యపెట్టగలిగే వారి జిత్తులూ కధ పొడుగూతా చెబుతూనే ఉంటాడు. ఒడుపు తెలిసిన రచయిత ప్రతిభ, కధను మొత్తం రావణుడు, భద్రుడు ప్రత్యక్ష సాక్షులుగా  నడిపించడంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకు ఆయన ఎంచుకున్న దారి మహ ఉత్కంఠగా ఉంటుంది. రావణుడి యవ్వన దశనుండీ వెంటాడే పాత్ర భద్రుణ్ణి ఒక చాకలి కులస్థుడుగా చిత్రించడంలో ఔచిత్యం మనకు చివరిలో అతడు అయోధ్య చేరి సీత అడవులపాలు కావడానికి అతనే కారణభూతుడవటం వల్ల అర్ధమవుతుంది.

ఇక కధనంలో ఉన్న బిగి కేవలం వర్ణనలే కాకుండా ముఖ్య పాత్రల భావోద్వేగాల్ని సృజించిన తీరు ఆకట్టుకునేదిగా ఉంటుంది. ప్రతీ యుధ్ధఘట్టంలోనూ తెగిపడే తలలూ, మొండేలూ, ప్రవహించే రక్తంతోబాటూ సైనికుల చెమట, బాధా, వేదనా కలగలిసి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తనంతతాను హాయిగా బ్రతికే అడివిమనిషికి పాలకుల రూపంలో, స్వజాతి ప్రేమనూ, పరజాతి ద్వేషాన్నీ మనసుల్లో పాదుగొల్పి, రెచ్చగొట్టి తమ రాజ్య విస్తరణ చేసుకునే దిశలో మట్టి మనిషి తన ఉనికినీ, స్వేచ్చనూ ఎలా కోల్పోతాడో అడుగడుగునా స్పష్టం చేసే కధన రీతి అసలు మర్మాల్ని మన ముందుంచుతుంది.
  
రామాయణం వంటి ప్రతి పురాణ కధలలోనూ సాధారణంగా కనబడే అతిశయోక్తులూ, అతీతశక్తులూ, ప్రకృతివిరుధ్ధమయిన సంఘటనలూ ' అసురుడు ' కధనంలో చాలావరకూ లేకుండాచూసి, కొంత వాస్తవికతతో చిత్రించడం జరిగింది. పుష్పక విమానానికి కూడా సాంకేతికత జోడించి కధను నమ్మశక్యం చెయ్యడం రచయితకున్న చాకచక్యం.

మొత్తంగా నవల తప్పక చదవాలనిపించే రచన. పుస్తకం ముద్రణ ఆకర్షణీయంగా, అతి తక్కువ అచ్చు తప్పులతో, నాణ్యమయిన తేలికయిన కాగితంతో చక్కగా ప్రచురించబడింది. నాలుగు వందల అరవై పేజీలున్నా పట్టుకుని చదవడానికి బరువనిపించని మంచి కాగితం వాడడం సౌకర్యంగా ఉంది. మరోసారి చెప్పుకోవల్సిన సంగతి అనువాదం గురించి. శ్రీమతి ఆర్. శాంతా సుందరిగారి అనువాద కౌశలం అద్భుతం. పరభాష నుండి దిగుమతి అయిన రచనగా ఒక్క దగ్గర కూడా అనిపించదు.

     ఇంత మంచి పుస్తకం వెల రోజుల ఇతర  పుస్తకాల ధరలతో బేరీజు వేస్తే చౌకనే. రెండువందల యాభై రూపాయలుఅన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్దా లభ్యం