తెలుగు సంగతులు

గురువారం, డిసెంబర్ 30, 2010

కొమ్ములు

మా ఊరెళ్ళాను

బాగా డెవలప్ అయ్యింది

ఒకప్పుడు కొండ ఉండేది

...ఫాక్టరీ వచ్చింది

చెరువుండేది

...కాలనీ వచ్చింది

సత్రం ఉండేది

...స్టార్ హోటల్ వచ్చింది

మనుషులుండేవారు

...కొమ్ములొచ్చాయి. --జనార్ధన మహర్షి

ఇలాంటివి బోల్దు ఉన్నాయి కొని చదివితే "వెన్న ముద్దలు" విశాలంధ్ర మరియు అన్ని ముఖ్య పుస్తక కేండ్రాలలోనూ దొరుకుతుంది.

సోమవారం, డిసెంబర్ 27, 2010

"అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి." జిడ్డు కృష్ణ మూర్తి

ఆవిడ- అమ్మ

మా అమ్మ

మెజీషియన్

ఇంట్లో ఎం లేకపోయినా

క్షణాల్లో పుట్టించేస్తుంది!!!

మా ఆవిడ

అంతకంటే పెద్ద మెజీషియన్

ఇంట్లో ఎన్ని ఉన్నా

క్షణంలో మాయం చేస్తుంది!!!!--జనార్ధన మహర్షి.

ఇప్పటి సంగతి--- మా ఆవిడా మారింది

ఎందుకంటే ఇప్పుడు అమ్మ అయ్యింది. రాజా

శనివారం, డిసెంబర్ 25, 2010

తెలివైన తాగుబోతు

హైదరాబాద్ లో డిసెంబరు 25వ తారీఖు తెల్లారుజామున మూడున్నరకి ఓ హోటల్ గదిలోంచి తూలుతూ బయటికి వచ్చాడో ఆసామి. హోటల్ బయట ఆగి ఉన్న ఆటో లోని డ్రైవర్ ని నిద్ర లేపి చెప్పాడు.
"సికింద్రాబాదులోని పేరడైజ్ దగ్గరకి వెళ్ళాలి "
"కుదరదండి ఈసమయంలో టాంక్ బండ్ మీద మంచు. రోడ్డు కనపడదు "చెప్పాడా డ్రైవర్.
"నీకు రెట్టింపు డబ్బిస్తాను కాని పద"
ఆటో డ్రైవర్ ఆలోచించి చెప్పాడు "మూడింతలు చెల్లించండి. ఓ ఆటో డ్రైవర్ ని లేపి ముందు నడవమంటాను. అతని వెనకే మన ఆటో పోనిస్తాను"
"నేనేం తెలివి తక్కువ వాడ్ననుకుంటున్నావా? అలా కుదరదు. రెట్టింపే ఇస్తాను. ముందు నేను నడుస్తాను. నువ్వు వెనక ఆటోని పోనివ్వు" చెప్పాడా తాగుబోతు.

చదవాల్సిన

చిన్న మాటైనా సూటిగా బాణంలా ఉండాలి. ఒక్కోసారి సిసింద్రీలా మరోసారి కొంటెకోణంగిలా ఉండాలి. మొత్తమ్మీద భావగర్భితంగానూ, హృదయాన్ని తాకేలాగానూ ఉండాలి. అందులో ఒకటి ---
"అతనికి ఊరంతా స్థలాలే
పెళ్ళాం గుండెల్లొ తప్ప"-- జనార్ధన మహర్షి.
"మా అమ్మ,
మా ఆవిడ
నా రెండు కళ్ళు ...
కళ్ళు
ఒకదానినొకటి
చూసుకోవు" -- జనార్ధన మహర్షి.
ఇలాంటివి ఇంకా బోల్డన్ని కావాలంటే 'వెన్న ముద్దలు ' (ఎమెస్కో)
చదివి తీరాల్సిందే.


వీక్షణం మాస పత్రిక చూశారా? వాణిజ్య దృక్పథంతో కాకుండా సామాజిక దృక్పథమే ధ్యేయంగా నిజాన్ని నిర్భీతిగా, సమకాలీన రాజకీయ, సామాజిక,న్యాయ,ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు మన ముందుంచే మాస పత్రిక వీక్షణం.
ఈ డిసెంబరు 2010 సంచికలో "చదవాల్సిన పుస్తకాలు", "పోలవరం ప్రాజెచ్టు పై పునరాలోచన", " మానవ సమాజాల అధ్యయనం" వగైరా వ్యాసాలు సరళంగా ఉపయోగకరంగా ఉన్నాయి.
email: veekshanam2003@gmail.com. contact phone:040-66843495.
"పుస్తకం చదవడం చదవడం కోసమే కాదు, ఆ పుస్తకం ద్వారా నేర్చుకున్న అవగాహనను, జ్ఞానాన్ని మార్పు కోసం ఉపయోగించడానికి, జరుగుతున్న మార్పులో భాగం కావడానికి". సం: వీక్షణం.

శుక్రవారం, డిసెంబర్ 24, 2010

తనికెళ్ళ భరణి రచన ''పరికిణీ'' పుస్తకం లోనిది

ఒక దాన్ని మించి మరోటి గా ఉన్న పాతిక పైగా ఉన్న కవితలు ఆలోచింపచేస్తాయి, కొన్ని చిన్న నాటి గురుతులను మోసుకొస్తే మరి కొన్ని గుండెల్ని పిండేస్తాయి.

తప్పక కొని చదవాల్సిన పుస్తకం. కాని ఒకటే బాధ -- ఇది పట్టుమని పది నిముషాల్లో అయ్యిపోతుంది. ఫరవాలేదు. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఎన్నాళ్ళయినా తాజాగానె ఉంటుంది.

స్వర్గం నుంచి నాన్నకి

నాన్నా!

నేను అమ్మ కడుపులో తొమ్మిదినెల్లూ

నీ గుండెలో

పద్దెనిమిదేళ్ళు పువ్వులా పెరిగాను

నీ తలా ఇల్లూ తాకట్టు పెట్టీ

నన్నో అయ్య చేతిలో పెట్టావ్...

భర్తే దేవుడన్నావ్!

అత్తే దేవతన్నావ్!

మెట్టినిల్లే స్వర్గమన్నావ్!

నిజమే-- భర్త దేవుడే - శిల!

అత్త దేవతే-- కాళిక!!

కన్నీళ్ళ కల్లాపి చల్లడంతో

మొదలౌతుంది నా కాపరం

పగలల్లా పని చెయ్యడం

రాత్రి పందిరి మంచం మీద

అలంకరించిన శవంలా

పడుకోవడం నా సంసారం

అర చేతుల్ని అంట్లు తోమడానికి అంకితం చేశా!

కాళ్ళని వంటింట్లో

గుంజల్లా పాతేశా

వీపుని అత్తగారికెప్పుడో

అప్పగించేశా!

చెవుల్ని బూతులు వినడానికీ

కళ్ళని కన్నీళ్ళు నింపుకోడానికీ

అలవాటు చేశా!

గొంతుని మొగుడి రెండు చేతుల్లోనూ పెట్టేశా!

సరే! నోరు మీరేగా కుట్టి పంపించారు అత్తారింటికి!

అత్త నన్నెంత దుమ్మెత్తి పోస్తున్నా

ధ్వజస్థంభంలా ఉలకడు పలకడూ-మొగుడు

ఆ ధ్వజస్థంభమే నయం- గాలికన్నా గంటలల్లాడతాయ్!

గడప మీద జుట్టు విరబోసుక్కూర్చున్న

ఆడపడుచు పేలు నొక్కుకుంటూ అత్తగారికి ఉప్పందిస్తుంది!

పడక్కుర్చీలో పాతెయ్యబడ్డ మావగారు - జీర్ణం కాని భగవద్గీత శ్లోకం డోకుతాడు!!

ఆ పెరట్లో నా వంక దీనంగా చూసేవి ఆవులూ గేదెలే

రాత్రౌతోందంటే బెంగగా ఉంటోంది నాన్నా!

తెల్లారుతోందంటే దడగా ఉంటోంది నాన్నా!!

ఒక్కసారి అమ్మనీ నిన్నూ చూడాలని ఉంది

మళ్ళీ పల్లకి ఎక్కే లోపు

ఒక్కసారి రావా!

ఈ ఉత్తరం అందేసరికి నేను

మీరు కోరుకున్నట్టు స్వర్గం లోనే ఉంటానేమో!

---- మీ కన్న కూతురు.

బుధవారం, అక్టోబర్ 27, 2010

ఇ పుస్తకాలు

"కిండిల్ గురించి మిత్రులు వ్రాసిన పరిచయ వాక్యాలు నా గురించే వ్రాసినట్టున్నాయి. అవే ఇవి.
ఒక వ్యక్తికి చదవటమంటే విపరీతమైన ఆసక్తి. పగలనకా, రాత్రనకా చదువుతూనే ఉండేవాడు. ఇష్టాలుండచ్చు కాని, అవి వెర్రిగా ముదిరితే అందర్నీ ఇబ్బందికి గురిచేస్తాయి. ఈయన పుస్తకపఠన పిచ్చిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించి విఫలమైన కుటుంబసభ్యులూ, స్నేహితులూ ఆయనతో “నువ్విలానే చదివితే నీ కళ్ళు పాడైపోతాయి. అప్పడిక నువ్వు పుస్తకం అంటూ చదవలేవు. అందుకనే చదవటం తగ్గించు, లేకపోతే గుడ్డివాడివైపోతావు” అని భయపెట్టారు. అతను ముందు పెద్దగా పట్టించుకోకపోయినా, రాను రాను ఆ భయం అతనిలో పాతుకుపోయింది. “నిజంగా కళ్ళు పోతేనో?!” అన్న ఊహ అతణ్ణి నిలువనివ్వలేదు. దీపముండగానే ఇళ్ళు చక్కదిద్దుకోవాలన్న పద్ధతిని పాటించేసి, కళ్ళుండగానే బ్రెయిలీ లిపి అభ్యసించేసి అందులో ప్రావీణ్యం సాధించాడు. ఇహ, పగలు కళ్ళతో, రాత్రుళ్లు ముసుగు తన్ని బ్రెయిలీ లిపిలోనే యడాపెడా చదవుతూ పోయాడు. తమ ఉపాయం వికటించిందని గ్రహించిన ఇంట్లోవాళ్ళు తలలు పట్టుకున్నారు.

తమాషాకే ఈ కథ అనుకున్నా, పుస్తకాలంటే బోలెడు ఇష్టం ఉన్నా, చదవటంలో ఉన్న సాధకబాధకాలు ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సుబ్బరంగా భోంచేసి, అలా కాసేపు చల్లగాలిలో తిరిగొచ్చి, అరలో ఉన్న ఓ పుస్తకాన్ని తీసుకొని, పడకకూర్చీలో నడుం వాలుస్తూ దాన్ని చదువుకుంటూ నిద్రలోకి జారుకోవడం కోసమే పుస్తకాలనుకుంటే, కొత్త పరికరాలు అక్కరలేదు. ప్రయాణాల్లో, వెయిటింగ్ రూమ్స్ లో పుస్తకాలు ఎక్కువగా అక్కరకు వస్తాయి. జీవితాల్లో నిలకడకన్నా పరుగుపందాలే ముఖ్యమైన ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ పుస్తకాలు (ఈ-పుస్తకాలు) తప్పనిసరైపోయాయి. కాని కంప్యూటర్ స్క్రీన్ మీద చదవాలంటే కళ్ళకి కష్టం. “మీ కళ్ళను అంత శ్రమ పెట్టకోకండి."
కిండిల్ తో సమానంగా, కొన్ని విషయాలలొ కొంచెం ఎక్కువగా, పని చేసే ఇ ఫోన్ అన్ని రకాల పుస్తకాలు చదవడానికి బావుంది. పిడిఎఫ్ ఫార్మాట్ లో తెలుగు పుస్తకాలు చదవడానికి గుడ్ రీడర్ అనే అప్లికేషన్ (ఫ్రీ డౌన్ లోడ్) చక్కగా ఉంది. ఉచితంగా తెలుగు పుస్తకాల కొసం చాలా వెబ్ సైట్లే ఉన్నాయి. ఉదాహరణకు ఉదాహరణకు www.archive.org
ఈ సైట్ చాలా పురాతనమయిన మంచి పుస్తకాల్ని ఉచితంగా అందిస్తోంది. ఆస్వాదించండి.