తెలుగు సంగతులు

సోమవారం, ఏప్రిల్ 25, 2011

పుస్తక పఠనం

ఏప్రిల్  23, అంతర్జాతీయ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏడాదిన్నర క్రితం ప్రచురించిన పోస్టును మళ్ళి ప్రచురిస్తున్నాను. సందర్భానుసారం బాపు గారి కార్టూన్ చూడకపోతే పుస్తకాల పండక్కి ముగ్గు లేనట్టే--- అందుకే ఇది....

"కిండిల్ గురించి మిత్రులు వ్రాసిన పరిచయ వాక్యాలు నా గురించే వ్రాసినట్టున్నాయి. అవే ఇవి.
ఒక వ్యక్తికి చదవటమంటే విపరీతమైన ఆసక్తి. పగలనకా, రాత్రనకా చదువుతూనే ఉండేవాడు. ఇష్టాలుండచ్చు కాని, అవి వెర్రిగా ముదిరితే అందర్నీ ఇబ్బందికి గురిచేస్తాయి. ఈయన పుస్తకపఠన పిచ్చిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించి విఫలమైన కుటుంబసభ్యులూ, స్నేహితులూ ఆయనతో “నువ్విలానే చదివితే నీ కళ్ళు పాడైపోతాయి. అప్పడిక నువ్వు పుస్తకం అంటూ చదవలేవు. అందుకనే చదవటం తగ్గించు, లేకపోతే గుడ్డివాడివైపోతావు” అని భయపెట్టారు. అతను ముందు పెద్దగా పట్టించుకోకపోయినా, రాను రాను ఆ భయం అతనిలో పాతుకుపోయింది. “నిజంగా కళ్ళు పోతేనో?!” అన్న ఊహ అతణ్ణి నిలువనివ్వలేదు. దీపముండగానే ఇళ్ళు చక్కదిద్దుకోవాలన్న పద్ధతిని పాటించేసి, కళ్ళుండగానే బ్రెయిలీ లిపి అభ్యసించేసి అందులో ప్రావీణ్యం సాధించాడు. ఇహ, పగలు కళ్ళతో, రాత్రుళ్లు ముసుగు తన్ని బ్రెయిలీ లిపిలోనే యడాపెడా చదవుతూ పోయాడు. తమ ఉపాయం వికటించిందని గ్రహించిన ఇంట్లోవాళ్ళు తలలు పట్టుకున్నారు.

తమాషాకే ఈ కథ అనుకున్నా, పుస్తకాలంటే బోలెడు ఇష్టం ఉన్నా, చదవటంలో ఉన్న సాధకబాధకాలు ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సుబ్బరంగా భోంచేసి, అలా కాసేపు చల్లగాలిలో తిరిగొచ్చి, అరలో ఉన్న ఓ పుస్తకాన్ని తీసుకొని, పడక కుర్చీలో నడుం వాల్చి దాన్ని చదువుకుంటూ నిద్రలోకి జారుకోవడం కోసమే పుస్తకాలనుకుంటే, కొత్త పరికరాలు అక్కరలేదు.  ప్రయాణాల్లో, వెయిటింగ్ రూమ్స్ లో పుస్తకాలు ఎక్కువగా అక్కరకు వస్తాయి. జీవితాల్లో నిలకడకన్నా పరుగుపందాలే ముఖ్యమైన ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ పుస్తకాలు (ఈ-పుస్తకాలు) తప్పనిసరైపోయాయి. కాని కంప్యూటర్ స్క్రీన్ మీద చదవాలంటే కళ్ళకి కష్టం. “మీ కళ్ళను అంత శ్రమ పెట్టకోకండి."
కిండిల్ తో సమానంగా, కొన్ని విషయాలలొ కొంచెం ఎక్కువగా, పని చేసే ఇ ఫోన్ అన్ని రకాల పుస్తకాలు చదవడానికి బావుంది. పిడిఎఫ్ ఫార్మాట్ లో తెలుగు పుస్తకాలు చదవడానికి గుడ్ రీడర్ అనే అప్లికేషన్ (ఫ్రీ డౌన్ లోడ్) చక్కగా ఉంది. ఉచితంగా తెలుగు పుస్తకాల కొసం చాలా వెబ్ సైట్లే ఉన్నాయి. ఉదాహరణకు  www.archive.org
ఈ సైట్ చాలా పురాతనమయిన మంచి పుస్తకాల్ని ఉచితంగా అందిస్తోంది. ఆస్వాదించండి.
 రాజా.

బుధవారం, ఏప్రిల్ 20, 2011

మరక మంచిదే నయ్యర్ గారూ!

అన్నా హజారే దీక్ష తదుపరి పరిణామాల మీద ఎవరి అభిప్రాయాలు వారికుండడం సరే! కాని  ప్రజల్లో నెలకొన్న స్తబ్దత , గూడు కట్టిన అంతర్మధనం, ఆక్రోశం  హజారే నిరశన సమయంలో పెల్లుబికిన సంగతి, దాని పర్యవసానం గా కేంద్రం తలొంచిన విషయం గుర్తెరగాలి. గొంతెత్తిన జనసమూహాలు హజారే భోళా మనిషని అనుకోలేదు. అదే సమయంలో  సిబాలు చిదంబరం వంటి వారు లోక్ పాల్ బిల్లును ప్రజాభీష్టం ప్రకారం వెంటనే అమలు చేసేస్తారని అత్యాశ పడనూలేదు. ప్రముఖ పాత్రికేయులు కులదీప్ నయ్యర్  గారు ఈ ఉద్యమాన్ని నిరాశా దృక్పధం తోనూ, హజారే తో బాటు గళమెత్తిన ప్రజను భోళా మనుషులుగానూ ఊహించుకున్నట్టు తోస్తోంది. గాంధీ మార్గంలో కాకపొతే శివాజీ మార్గంలో సాధిస్తామన్న హజారే  మాట వారికి ఉగ్రవాదం లాగ ఎందుకు వినబడిందో? ఆయన మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతుంది, లావా పెల్లుబుకుతుంది వగైరా చెప్పడంలో ఎక్కడా హింసాత్మక ధ్వని వినిపించలేదా? అయితే ఒక విషయాన్ని బాగానే విశదీకరించారు. ‘కపిల్ సిబాలు లోకపాల్ బిల్లును (ఉద్యమాన్ని కాదు) ఎగతాళి చేస్తున్నారు’ అని. ఇది మాత్రం ప్రజలు గమనించి ఇదే ఊపులో, పనిలో పనిగా సమాంతరంగా మరో ముఖ్యమయిన డిమాండు తో ప్రజలు ఉద్యమించాలి. అది సిబాలును బిల్లు ముసాయిదా కమిటీ నుండి తొలగించాలని. ప్రజల అభిప్రాయాలకు, అవసరాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా పైగా అవహేళన చేసే వారి పట్ల లోక్ పాల్ ముసాయిదాకు  ముందే ఒక ‘జనపాల్’ ఉద్యమానికి  సిద్ధం అవ్వాలి. దాని ద్వారా సిబాలుల్ని, శిశుపాలుల్సి వధించాలి/ తప్పించాలి. ఇక నయ్యర్ గారి మరో మాట అభ్యంతరకరం. “అన్నా ఉద్యమం వ్యాధి లక్షణం మాత్రమే!” అన్నది. ఇది అచ్చు తప్పో,ఆయన అభిప్రాయమో తెలియదు కాని, ఏదైనా తీవ్రంగా పరిగణించవలసిన విషయమే. ఉద్యమం వ్యాధి లక్షణం కాదు నయ్యర్ గారూ! వ్యాధి నిర్మూలనకు చేసే శస్త్రచికిత్స. ప్రస్తుత ఉద్యమ స్థితిని చికిత్సకి కత్తులు సిద్ధం చేసుకునే ముందు చేస్తున్న వైద్య పరీక్షలు, ప్రధమ చికిత్సలుగా అర్ధం చేసుకోవాలి గాని వ్యాధిగా కాదు. మొత్తం మీద ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకే కాదు హజారే ప్రారంభించి జనంతో బలపడిన ఉద్యమానికి దేశం లొ అధిక శాతం మంది గుబులు పడుతున్నారన్న మాట. ఉద్యమం ఘాటెక్కింది. కువిమర్శలు జోరందుకున్నాయి. ‘మరక మంచిదే!’ ప్రజల దగ్గర ప్రక్షాళనకి టాయిలెట్ క్లీనర్లు, కోలాలు, ఆసిడ్లు ఉన్నాయి. --  
నయ్యర్  గారి వ్యాసాన్ని ఇక్కడ చూడండి. http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20110420a_004101005&ileft=276&itop=47&zoomRatio=130&AN=20110420a_004101005

సోమవారం, ఏప్రిల్ 18, 2011

నమ్మకాలు -వాస్తవాలు

మన దేశంలోనే కాదు. ప్రపంచాదేశాలన్నింటా మతం, నమ్మకాలు, తెచ్చిపెట్టుకున్న విశ్వాసాలు వగైరాల ప్రభావంతో వెలసిన సంస్థలు, ట్రస్టులు,ఆలయాలు మొదలైన ధార్మిక సంస్థలు గా చెప్పుకునేవన్నీ చివరకు (మొదలు లో కూడా) వాటికి సంబంధించి పోగుపడిన కోట్లమంది అమాయక భక్తుల విరాళాలు, నిధుల పరిరక్షణ పేరుతో పెద్ద నాయకులతో, అధికారులతో కుమ్మక్కయ్యి ఆర్ధిక నేరాలకు, హత్యోదంతాలకూ, ఇంకా చెప్పనలవి కాని కుంభకోణాలకు పాల్పడుతున్నవి శతాబ్దాలుగా కళ్ళకు కడుతున్న చరిత్ర. ఆదిశంకరాచార్య, మహమ్మద్ ప్రవక్త, బుద్ధుడు, ఏసుక్రీస్తు,శ్రీరామకృష్ణ పరమహంస, వంటి మహాత్ములు అప్పటి దీనజన విముక్తికోసం, జ్ఞానం పట్ల వారిని జాగృతం చెయ్యడం కోసం కృషి చేస్తే, చుట్టూ చేరిన ప్రజాద్రోహులు, సామ్రాజ్యవాదులు, పాలకులు మహాత్ములకు అండదండగా ఉన్నట్టు నటిస్తూ, మందిరాలు కట్టి, విగ్రహాలు పెట్టి, శిలవేసి ప్రజాబాహుళ్యానికి అందకుండా చేసి, లేనిపోని మహత్తులను, మత్తులను  అంటగట్టి, వారి ఉన్నతాశయాల్ని మూడనమ్మకాలుగా తర్జుమా చేసేసి ప్రజల్ని అసలు జ్ఞానం వైపుకు మళ్లకుండా మూర్ఖంగానే ఉంచి, బానిసత్వాన్ని కొనసాగించే కుట్రలే చరిత్ర మొత్తం కనిపిస్తున్న దాఖలాలు. ఇప్పడు మహాత్ముల పర్వం ముగిసినట్టనిపిస్తోంది. మతం ముసుగులో అవే మూడనమ్మకాల్ని మరింత సాంకేతికత జోడించి వాడుకుంటూ వారే సొంత సామ్రాజ్యాలు నెలకొల్పుకొనే స్థాయికి స్వాములు,అమ్మలు, బాబాలుగా పరిణతి చెందారు. ప్రజలు కూడా తమను తాము తెలుసుకొనే ప్రయత్నం చెయ్యకుండా పూర్తి ఆర్దికపరమయిన అంశంగా లాభాల కోరికలతో కొంతమంది, బాధల అసలు కారణం కనుక్కోలేక వీళ్ళ దగ్గరే పరిష్కారం వెతుక్కునే కొంతమంది అమాయకులు కలిసి జేజేలు కొట్టుకుంటూ కొండనక, ఎండనక వారి వెంటబడడం-- వారేమో దొంగ వేషధారణలతో భక్తులకు మాత్రం వర్తించే నియమాలను పెట్టి, నిండిన బొక్కసంతో ఏ సి మందిరాలలో స్పెషల్ భక్తులకు స్పెషల్ దర్శనం, ప్రయివేటు ఉపదేశాలు సంభాషణలు – ఎందుకిలా???
ఆశ్రమంలోనే నలుగురి కాల్చివేత(హత్యలు), నిగమాగమ ప్రారంభసరంభంలో జారిన గొలుసుల మహత్తులు వంటి సంఘటనల తరువాత పాపపరిహారంగా చేసిన మంచినీటి వసతి,విద్య,వైద్య సేవలు అందరికీ విదితమే! ఇక్కడ అసలు వైచిత్రి ఏమిటంటే ప్రభుత్వం చెయ్యాల్సిన పనులను ఈ మతసంస్థలు తలకెత్తుకోవడం, మతాతీత గణతంత్ర రాజ్యాంగ రక్షకులేమో ఆశ్రమాలలో పాదాభివందనాలు, పోలీసు రక్షణలు--- ఏమి జరుగుతోందసలు???
“ మనం ‘ ఏమిటో ‘ ’ఆదాని’ నుంచి పారిపోవడానికి ఉపయోగించుకున్నంత కాలం దేవుడు, తాగుడు స్థాయి ఒక్కటే ”. ఒక మహానుభావుని పలుకు. ఆయనను ఈ రొంపిలోకి దించద్దనుకున్నా సందర్భంగా గుర్తొచ్చి రాసేశాను.
మళ్ళి అసలు విషయానికి వస్తే, సాక్షాత్తూ భగవాన్ కి వైద్య సేవలందించడానికి తుచ్చ మానవుల అవసరం ఉంటుందా? ప్రభుత్వ, పోలీసు వలయాలు ఎందుకు అక్కడ? మీడియా కధనాలు ఈ రోజు కొత్తగా శోధించినవేమున్నాయి? మనసు తెరిచి చూసుకుంటే అందరికీ అంతా స్పష్టమే. అక్కడ చేరినవాళ్ళు అప్పటికే బలిసి పులిసి ఉన్నవాళ్ళు ఒకరకం. అమాయక భక్తులొక రకం. ఇప్పుడు జరుగుతున్న అసలు వ్యవహారమంతా డబ్బు,ఆస్తులు,ట్రస్టు, బిల్డింగులు,భూమి పుట్రా, నగా నట్రా  వాటిలో వాటాలు, పంపకాలు, తరలింపులు, బుజ్జగింపులు, పందేరాలు --- ఇక చెప్పలేనంత. ఇలాంటి సంస్థల పుట్టుకే ఇదయినప్పుడు, ముగింపు కూడా ఇలాగే ఉంటుంది. ఎటొచ్చీ అమాయక భక్తుల్ని మినహాయిస్తే, అక్కడ చేరిన, చేరుకుంటున్న వాళ్ళంతా ఎంతటివారయినా తుచ్చులే! దొంగలే!
ఆలోచించవలసింది సామాన్యులు, మేధావులు మాత్రమే! ప్రతీ దానికి అన్నలో, అన్నా హాజరేలో వస్తారని ఎదురు చూడడం అవివేకం బాధ్యతా రాహిత్యం. ఈ అవ్యవస్థల్ని సమూలంగా నాశనం చేసే వ్యక్తులెవరైనా సరే -- అసలంటూ పూనుకుంటే ,భావి తరాలను కాపాడినవారవుతారు.   
రాజా.   

గురువారం, ఏప్రిల్ 14, 2011

మన్ చాహే గీత్


గాయం చేయనివాడు గాయకుడే కాదు
మనల్ని వెంటాడి వేధించడం చేతకానిది ఒక పాటా కాదు
అంటూ మొదలుపెట్టిన వెనుక పేజీవ్యాఖ్య (పబ్లిషరు చే) ఈ పుస్తకానికి అతికినట్టు సరిపోయింది. “మన్ చాహే గీత్” ... మహమ్మద్ ఖదీర్ బాబు  వ్రాసిన హిందీ పాటలు-పరిచయాలు చాలా సరళంగాను, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.. సురయ్యా, షంషాద్ బేగం ,తలత్ మహమూద్, మన్నాడే నుండి రఫీ, లతా, కిశోర్ ల వరకు అందరి గాయకుల్ని, గొప్ప గొప్ప సంగీతదర్శకుల్ని పరిచయం చేసిన తీరు అద్భుతం గా వుంది. అంతటి గొప్ప కళాకారులకి కేవలం రెండేసి పేజీలు ఎలా సరిపోతాయన్న సందేహాన్ని పుస్తకంలోకి ప్రవేశించగానే పటాపంచలు చేసేశాడు ఖదీర్ బాబు. సంగీతం గురించి చాలా సూటిగా చెబుతూనే అందరి సంగీతకారుల జీవిత కోణాల్ని స్పృశించిన పద్ధతి చాలా బావుంది. పాటల రికార్డింగు సందర్భాలలో తీసిన అలనాటి మేటి సంగీతకారుల ఫోటోలు గొప్ప అనుభూతినిస్తున్నాయి. అవే పాటలు ఈ పుస్తకం చదవకముండు ఒకరకమయిన ఆనందాన్ని ఇస్తే, చదివిన తరువాత  ఆ యా సంగితకారులతో, గాయని గాయకులతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్టు అవే పాటలు మనకు బాగా తెలిసున్న వాళ్ళు మనకోసమే కంపోజ్ చేసినట్టు పాడినట్టు అనిపిస్తాయి. పరిచయ వ్యాసాలు ఇంత బావుండడం వల్ల సమయం తీసుకొని మళ్ళి ఆ పాత పాటల కలెక్షను బయటకు తీసి వింటున్నానంటే పుస్తకం ఎంత ప్రభావవంతంగా ఉందో  అర్ధం చేసుకోవచ్చు. సంగీతప్రియులు తప్పక షెల్ఫు లో ఉంచుకోవాల్సిన పుస్తకం.
*మన్ చాహే గీత్- పాటలు ప్రసిద్దుల పరిచయాలు.
*రచన: మమ్మాద్ ఖదీర్ బాబు.
*ప్రచరణ: కావలి ప్రచురణలు. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం.
*వెల: రూ:95/-

శనివారం, ఏప్రిల్ 09, 2011

హజారే అన్నా!

హజారే అన్నా! హజారోన్ కి అన్నా! కరోదొంకి మార్గదర్సీ!అన్నా! ఇంతమందిని తట్టి లేపావన్న ఆనందం ఒకవైపు ఆ వెనువెంటనే -- ఇంత కాలం ఎలా,ఎందుకు నిద్దరోయామన్న స్ఫురణ కలిగి కులుక్కుమంటోందన్నా! మీరన్నట్టే ఇంకా జరగాల్సింది చాలా ఉంది. నువ్వు తలతెంచి ఇవ్వాల్సినంత ఉద్రేకం నీనుండి అస్సలు ఊహించాలేమన్నా! తల వంచుకోం అంటున్నావు కానీ—ఇన్నేళ్ళుగా అన్యాయ పాలనకి, అక్రమ రాజకీయాలకి, ధనికస్వామ్యానికి, అగ్రకుల అహంకారానికి తలలు వంచే ఉన్నాం. మన దేశం, మన హక్కులు, మన పన్నులు, మన పనుల కోసం మనం ఎన్నుకున్న ప్రతినిధులముందే, వాళ్ళు మన సేవకులన్న కనీస స్ఫురణ కూడా లేకుండా, దేబిరిస్తున్నాం చూడు—తల వంచుకునే కదా అన్నా? నువ్వు నిజాయితీగా, విశ్రాంత మిలిటరీ ఉద్యోగిగా నీ హక్కు భుక్తమయిన అన్నం తినడం మానేసి,అన్నిటికీ సిద్ధపడి తలవంచావుకదన్నా! మేం తలెత్తుకు తిరగాలనే కదా! ఇంకా తల తెంచి ఇచ్చే అగత్యం ఏమిటి? అటువంటి ఉద్రేకపూరితమయిన ఆలోచన నీకెందుకన్నా? అంతవరకొస్తే తలలు తెంచుకొని కాదు, తలలు తెంచే అన్నలున్నారట కదన్నా! వారి పాత్రల్ని వారినే పోషించనిస్తారులే ఇదే దేశప్రజ. నువ్విలాగే ఉండాలన్నా! తల వంచొద్దు, తల తెంచుకోనూ వద్దు. మేమందరం తలెత్తుకు తిరిగేటట్టు, అవినీతిపరుల మెడలు వంచేటట్టు మమ్మల్ని తట్టి లేపేవాళ్ళ అవసరం ఎప్పటికప్పుడు అవసరమేనన్నా. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వేషాలతో, కొంగొత్త మోసాలతో ఆ జాడ్యాలు తలెత్తుతూనే ఉంటాయి. ఇది చారిత్రిక సత్యం. కానీ ఇలాంటి మహత్కార్యాలు ఆలస్యం అవుతుంటే జాతి నిర్వీర్యం అయిపోయి జాగృతం చెయ్యడానికి నీలాంటి వాళ్ళు ఎన్నాళ్ళు అన్నం మానెయ్యాలన్నా?

కానీ నువ్వేందన్నా? కేవలం ముందు చూపుతోటి, ముక్కు సూటిగా వెళ్లిపోతూ వెనక జరుగుతున్న కుట్ర  సంగతి చూసుకోవట్లేదు. ఇంతటి మహోద్యమాన్ని ‘హైజాక్’ చేసేస్తున్నారన్నా! సకల అవినీతి వర్గాలూ – పాకుకుంటూ తేళ్ళు, పాముల్లాగా పాక్కుంటూ చాపకింద దూరేస్తున్నారు చూస్కో.

లోక్ పాల్ బిల్లుకు కమిటీని వెయ్యడానికి ఎన్నికలయ్యేంతవరకు కుదరదన్న ప్రభుత్వానికి ఇప్పుడెలా కుదిరిందన్నా? అసలు కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఎన్నికల అవసరం ఏమిటి?వారికి ఆ వెసులుబాటు ఎందుకు?హక్కు ఎక్కడిది? లొక్ పాల్  బిల్లులో ఇది కూడా ప్రస్తావించాలి. ప్రతీ చట్టసభ సభ్యుడూ ఆయా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా, సభకి హాజరు, రోజువారీ ఇతర కార్యక్రమాల వివరాలు అందరికీ అందుబాటులో ఉంచాలి. ఇక మంత్రులయితే ఉన్నతాధికారి లాగో, ఒక న్యాయమూర్తి లాగో  విధి నిర్వహణ, కుటుంబ జీవితమే గాని రహస్యజీవితం కుదరదు.  వారు కలుసుకొనే ప్రతీ వ్యక్తి యొక్క వివరాలు, వారితో చర్చించిన విషయాలు పూర్తి పారదర్శకంగా ఉండాలి. ఇంత జరిగాక (లక్షల కోట్లు అవినీతి) వారు విధినిర్వహణ సమయాన్నంతా కెమేరా కన్ను నీడలో ఉండాలని కోరుకోవడం ప్రజలకున్న హక్కు. ప్రజాప్రతినిధి ఇక ఏ మాత్రం గ్లామరు, ఆధిపత్యం చలాయించే పనిగా భావించకూడదు. అలా సిద్ధపడిన వారే ఎన్నికలలో పోటీ చెయ్యడానికి సిద్ధపడాలి గాని, ప్రత్యేక హక్కులు, రక్షణ కోరుకోకూడదు. అసలు ఇప్పుడు నీకేదన్నా రక్షణ? ప్రజల బాగోగుల్ని చూసుకోవాల్సిన వారికేందుకు రక్షణ కావాలి? ప్రతినిధులు ఎవరికి అందుబాటులో ఉంటున్నారు? వారి వందిమాగదులకే కదన్నా! లోకల్ లీడరు సాయం మధ్యవర్తిత్వం లేకుండా ఏ సామాన్యుడయినా తమ ఎం ఎల్ ఏ ను గాని, ఎం పీ ని గాని, మంత్రిని గాని కలుసుకోగలుగుతున్నాడా? మంత్రివర్గ సభ్యులు పార్టి వ్యవహారాల్నిగాని, వందిమాగదులతో ఊరేగింపులు, ప్రారంభోత్సవాలకు గాని, హాజరు కాకూడదు. పార్టీ వ్యవహారాలకు ఇప్ప్పుడున్న ప్రతీ పార్టీకి ప్రభుత్వాన్ని మించిన వ్యవస్థలే ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవసాయప్రధాన దేశం లో వ్యవసాయశాఖ మంత్రికి డబ్బులు దండిగా గడించే క్రికెట్టు సమాఖ్య అధిపతిగా ఉండి, క్రికెట్టును ఆస్వాదించే తీరిక ఉంటుందా హజారన్నా? ఆ వాణిజ్య పంటకి (క్రికెట్టు) వేరే సమర్దులే లేరా? పార్టీలు మార్చేవారికోసం పదవుల పందేరానికి డబ్బు దండుకోడానికి తప్ప దేవస్థానాలకు చైర్మను పోస్టులెందుకు? యువ శక్తికి జన శక్తికి మన దేశంలో లోటు ఉందా? అంతేగాదు, ఈ నాలుగు రోజులలో అన్ని అవినీతికేంద్రాలు, వారి ప్రతినిధులు ఈ పవిత్ర ఉద్యమంలో దూరి పోతున్నారన్నా. పెద్ద పారిశ్రామిక వేత్తలు,వ్యాపారవేత్తలు, మాఫియా రంగులోళ్ళు, రాజకీయ పార్టీలు, మీడియా అధిపతులు --- అంతెందుకు—తప్పుడు రికార్డులు సమర్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు యాష్కీలు, హైటెక్ అవినీతి ఆరోపణలున్న చంద్రబాబులు, దశాబ్దాలుగా బలమయిన వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి బో’ఫార్సు’ ను మరిపించిన సోనియమ్మలు—అమ్మో జాబితా చేంతాడంత-- మీకు వత్తాసు పలుకుతున్నట్టే పలుకుతున్నారు. అటువంటి మేధావులతో (అసలు 2జీ కుంభకోణమే జరగలేదన్న వాదనాపటిమ కలిగిన సిబాలులు) నిండిపోయిన వ్యవస్థలో మన పాత్ర సగమే ఉంటే ఎంతని పోట్లాడగలవన్నా? సగమన్నా సాధించావన్న తృప్తి కొండంత బలం నీకు, జాతిజనులకు కలిగించినా అది సరిపోదు. అయినా తప్పదు. నీ కున్న ఉద్యమ ఉద్దేశ్యమే ఎంతమందిలో ఉందో చూశావు కదా! అందుకే మేమున్నాం. తల వంచొద్దు. తల దించొద్దు. తల తెంచుకోవడం అసలొద్దు.     

రాజా

సోమవారం, ఏప్రిల్ 04, 2011

ఉగాది శుభాకాంక్షలు

ఉగాదిపూట సాధారణంగా అందరూ నవ్వుకోవాలని హాస్య సంబంధ కార్యక్రమాల్ని అన్ని టివీ చానళ్ళు ప్రసారం చేస్తారు. సంవత్సరం పొడుగునా నవ్వుకోవచ్చని ఓ ఆశ, నమ్మకం. సంవత్సరమంతా నవ్వుకోవాలంటే ఈ ఒక్క రోజు నవ్వుల కార్యక్రమం సరిపోతుందా? ఎప్పటికీ నవ్వుకొనే నిర్మలమయిన మనసు ఉండాలి. అందుకు మనం కొంతైనా పసితనాన్ని అలవరచుకోవాలి. అర్ధం లేని కట్టుబాట్లతో, వ్యత్యాసాలతో,ఆడంబరాలతో బిగుసుకు కూర్చుంటే ఎన్ని కితకితలైనా చర్మం కందుతుందే గాని మనసారా నవ్వు రాదు. ఎక్కినప్పుడు మన ‘సారా’ నవ్వో, కిక్కో తెప్పించొచ్చు గాని తరువాత మిగిలేది జేబుకి బొక్క, తలకి తిక్క.  అందుకే పిల్లల్లాగ కొంతమేరకైనా ఆలోచిస్తే ( అంటే ఏమీ ఆలోచించకపోవడం అన్నమాట.) హాయి—అదే ఏడాది పొడుగునా అందరికీ ఉగాది. లేదా 'స్వాతి కార్టూన్లు' కొనేసుకుంటే ఇక చింత ఉండదు. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకోవచ్చు. కానీ నలుగుర్లో ఉన్నప్పుడు -మనలో మనం నవ్వుకుంటే వాళ్ళు మనల్ని వేరేగా అనుకునే ప్రమాదం ఉంది.  


మావి చిగుర్లు, కోకిల పాటలు, వసంతాగమన వేడుకలు, షడ్రుచుల పచ్చడి, పండగసందడి..ఉగాది.
యుగానికి ప్రారంభం ఉగాది అని చెబుతారు. యుగారంభంనాటికే ఈ పంచాంగాల లెక్కలున్నాయా అని కాదు.. ఆ కాలమాన లెక్కలన్నీ క్రమేణా ఏర్పడ్డాక, వత్సర గణింపుకి అదనంగా ఈ యుగారంభం అన్నది శుభపరిణామ సూచకంగా పెట్టి వుంటారు.
ఆలోచించవలసింది ఇంకోటుంది. మనం పంచాంగాలు, జ్యోతిష్యాలు, శాస్త్రాలు అన్నీ క్రోడీకరించి పెళ్లి వగైరా చాలా వాటికి ముహూర్తాలు పెట్టుకుంటాం కదా! మరి పెళ్లిరోజు జరుపుకున్నప్పుడు ఇంగ్లీషు కాలెండరు తేదీ ప్రకారం చేసుకోవడం ఎంతవరకు సమర్ధనీయం? పుట్టిన రోజులు సంగతి మాట్లాడుకోకపోవడమే శ్రేయస్కరం. ఎందుకంటే మంచి వేళ కోసం వేలంవెర్రిగా బిడ్డ పురుడు పోసుకోవడాన్నిమనమే నిర్ధారణ చేసేసి ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ  సిజేరియన్లు, ముందస్తు / వాయిదా పురుళ్ళ తో బిడ్డల్ని కనేకాలం లో ఇవన్నీ వ్యర్ధప్రసంగాలే!
గత నలభై ఏళ్లుగా చూస్తున్నాను.. బయటకు చూడగలిగితే ఉగాది వసంతసరంభంగానే కనిపిస్తోంది. లేత ఆకుపచ్చని చిగుర్లు, కమ్మని కోకిల గీతాలు, వేప పువ్వు పరిమళం, చెరుకుగడ నూగు మబ్బు పూత, వికసించడానికి సిద్ధమౌతున్న కాడమల్లెలు మొత్తానికి సన్నగా పరుచుకున్న ప్రకృతి పరిమళం.. అన్నీ అలాగే ఉన్నాయి-కాని కాస్త నగరజీవితం లోంచి, టెలివిజన్ భూతాన్నుంచి  బయటకు తొంగి చూస్తే అంతా అదే దృశ్యం. ఉగాది పచ్చడిలోని వేపపువ్వు చేదు గురించే చాలామందికి తెలుసుగాని, చెట్టుదగ్గరే వీచే వేపపువ్వు పరిమళం ఎంతమంది ఆస్వాదిస్తున్నాం?  
చిన్న పెద్ద బేధం లేకుండా అందరం ఉగాది పండుగనంతా ఫీల్ అయ్యేది ‘ఇడియట్ బాక్సు’ ముందే! సరిగా తెలుగు ఉఛ్ఛరించలేని సినీమాయా వయ్యారిభామల చిలిపి(చిలుక కాదు) పలుకులతోనే మనకు పంచాంగ శ్రవణం.ఫాషన్ డిజైనర్ తో తయారై, మెటల్ జిగి జిగిలు,రసాయనాల రంగులు కలబోసిన  చీర ఈ ఉగాదికి మన టివీ యాంకర్లు  చూపబోయే అచ్చ చచ్చు తెలుగుదనం.
ప్రపంచీకరణ పేరుతో, రాజ్యకుట్రలతో జరుగుతున్న వాణిజ్యదాడి ముందు, ఆదినుండీ ప్రకృతి- -మానవుల పవిత్ర సమ్మేళనం , ఇలా వికృతంగా వెల వెల పోవాల్సిందేనా? ఎంతమాత్రం కాదు.
కాస్తంత ఖగోళవిజ్ఞత, నియమబద్ధత, హేతుబద్ధ తర్కం, ఆరోగ్యపుష్టి, పర్యావరణ దృష్టి, సమభావం పెంచకుంటేచాలు. పచ్చడిని పదిమందితో పంచుకుతిందాం. కోకిల పాటల్ని పరివారంతో విందాం. తిరిగి కుహూ కుహూ! అని మనసారా కూస్తూ పాడదాం. ఆటలు పసివాళ్ళతో ఆడదాం. పెద్దవాళ్ళతో ఆత్మీయంగా గతస్మృతులు కబుర్లుగా చెప్పుకుందాం. సాయంత్రం కావల్సినవాళ్ళతో కలిసి ఆనందం పంచుకుంటూ ఒక్కటైనా పౌర సమాజపు బాధ్యతావర్తనను పంచాంగ ప్రమాణంగా స్వీకరిద్దాం.
బొత్తిగా ఇలా టివీ ముందు కూలబడిపోయి బిడ్డల తొలి అడుగులను కూడా పట్టించుకొనే స్థితిలో ఉండడానికి ‘ఇడియట్ బాక్సు’ కారణమే! దానికి ఎవరు పెట్టారో కానీ సరి అయినదే!
ఇలాంటివి ఇంకో రెండొందలు ఆణిముత్యాలున్నాయి ఈ పుస్తకంలో.
'స్వాతి కార్టూన్లు'. వెల: రూ:200/-, ఋషి బుక్ హౌస్, విజయవాడ.

రాజా.