'మహానటి '
సినిమా విడుదలకు ముందే ఎక్కడ చూసినా చర్చలూ, ప్రత్యేక వ్యాసాలూ, ఇంటర్వ్యూలూ, ఊహాగానాలూ, కధనాలూ అంబరాన్నంటేశాయి 'మహానటి ' గురించి. కొన్ని పాత్రలు, అవి ధరించిన నటుల గురించి ఉత్సుకత రేపే వార్తలు కూడా ఊరేగాయి. అరవై దాటిన నాకు 'సావిత్రి ' గురించి కొత్త కాకపోయినా, మళ్ళీ వినడం, ఒకరు ఆమె జీవిత చరిత్రను వెండి (వెండినా, బంగారమా? కాదు ముచ్చి బంగారం) తెరకెక్కించడం, సహజంగానే ఆనందాన్ని కలుగజేశాయి. కానీ మొదటినుండీ నాకు సందేహం - 'నేను కొత్తగా 'సావిత్రి ' గురించి ఏమి తెలుసుకోవాలా అని. కాదులే ఇప్పటి తరానికి 'సావిత్రి ' గురించి తెలుస్తుందిలే, అని సర్దుకొని సంబరపడ్డాను.
ఎవరిదైనా జీవిత చరిత్ర చెప్పుకున్నప్పుడు, అందునా తెరకెక్కించినప్పుడు, అది చరిత్రగానే ఉండాలి కానీ, నాటకీయత, కృతకమైన విషయాలు జొప్పించకూడదు. నా మిత్రుడు ఒకాయన, (గొప్ప రచయితకూడా), " ఏంటిసార్, ఆ సినిమా, జెమినీగణేశన్, సావిత్రి పెళ్ళి జరిగే సందర్భంలో ఆ శూలానికి, తాళిబొట్టు తగులుకోవడం, అది తీసి కట్టెయ్యడం - ఛీ దరిద్రంగా ఉంది సార్. బయో పిక్ ఏంటిసార్ నాశనం గానూ" అన్నారు. నిజమే కదా అనిపించింది. 'సావిత్రి ' గురించి చెప్పుకోవాలంటే ఆవిడ జాలి గుణం చూపించాలంటే - టాక్సీ డ్రైవరు సహాయాన్ని ఆశిస్తూ, అర్ధిస్తూ అడిగినట్టున్న దృశ్యం కాదు సార్ చూపించాల్సిందీ. ఆమె మూగమనసులు చిత్రం శతదినోత్సవ పండుగ జరగబోతుండగా, రెండు గంటలు ఎవరికీ కనిపించకుండా పోయింది. అప్పుడు ఆమె ఆ పట్నంలో ఉన్న పేదవాడలకెళ్ళి అక్కడ అందరితో తనకొచ్చిన గుర్తింపు, అవకాశాలూ చెబుతూ మన బాధలు ఇక తీరిపోతాయి అని చెప్పి వాళ్ళతో ఆనందాన్ని పంచుకొని, భరోసా ఇస్తూ వెనక్కి వెళ్ళిందట. అదీ సావిత్రి హృదయం. ఆమె పై అనేక పుస్తకాలు ఉన్నాయి. కొన్నింటిలో అభూత కల్పనలు కూడా ఉన్నాయి అంటారు, సినీ జగత్తు తెలిసిన పెద్దలు. ప్రతిభ గల దర్శకుడు చరిత్రను సరిగ్గా అధ్యనయం చెయ్యలేదో, లేక మెలోడ్రామాగా, సినిమా కధగా మలచాలనే అనుకొని, ప్రాధాన్యాలు పక్కకు పెట్టాడో ఆయనకే తెలియాలి.
మా సావిత్రిని "మహానటి" గా చూపిస్తున్నారు కదా అని సంబరపడి గుంపులో జొరబడిపోతే, ఆమె నాశనాన్నీ, ఛిద్రమైన బ్రతుకునూ చూపించారు. బాధ అనిపించింది. కరెక్టు కాదు అనిపించింది. నిజాల్ని దాచమని కాదు. కానీ, దాన్నే పట్టుకు వేళ్ళాడ్డం, అసలు ఆమె నటన గురించి మరింతమంది తో ఆమె పనిచేసినప్పుడు ఆమె గురించి ఆయా మహానుభావులు చెప్పిన విషయాలూ చూపించ వలసింది. ఆ జాగాలో సారా సీసాలూ, విషాద ఘట్టాలూ నింపేశారు.
నాకు వ్యక్తిగతంగా సావిత్రి అంటే గొప్ప అభిమానం, కించిత్తు జాలీ. జెమినిగణేశన్ అంటే విపరీతమయిన కోపమూనూ. 'మహానటి ' చూశాక ఆ గొప్ప నటీ, కరుణామయీ పట్ల నాఅభిమనం కొంచెం తగ్గింది. జాలి కొంత సన్నగిల్లింది. అంతేకాదు, గణేశన్ పట్ల కోపం కూడా ఒక రవ్వ తగ్గు ముఖం పట్టింది. ఇది ఖఛ్చితంగా అవాంఛనీయం. సాటి కళాకారుని, అందునా ఆమె భార్యే అయితే - ఆమె ఎదుగుదలను జీర్ణించుకోలేక, అహంభావంతో, కుళ్ళుమోత్తనంతో బాధపడే కధనే చూడాలంటే హిందీలో అమితాబ్, జయబాధురి నటించిన 'అభిమాన్ ' సినిమా చూస్తే బావుంటుంది. సరిపోతుంది. అంతేకానీ మా సావిత్రి జీవితాన్ని (ఆమె మాహానటిగా జీవించే ఉంది) అందులోని ఛిద్రాన్నీ చూపించి 'బాక్సాఫీసులు ' అంటూ ఊరేగడం బాధ కలిగిస్తోంది. నిజంగా చాలా బాధగా ఉంది.
చివరగా -- మాకు నందమూరి తారక రామారావు 'గారు ' తెలియదు. మా 'ఎంటీవోడు ' తెలుసు. మాకు 'మా సావిత్రి ' తెలుసు. సావిత్రి 'గారు ' తెలియదు. తెలుసుకోదలచుకోలేదు.