తనికెళ్ళ భరణి రచన ''పరికిణీ'' పుస్తకం లోనిది
ఒక దాన్ని మించి మరోటి గా ఉన్న పాతిక పైగా ఉన్న కవితలు ఆలోచింపచేస్తాయి, కొన్ని చిన్న నాటి గురుతులను మోసుకొస్తే మరి కొన్ని గుండెల్ని పిండేస్తాయి.
తప్పక కొని చదవాల్సిన పుస్తకం. కాని ఒకటే బాధ -- ఇది పట్టుమని పది నిముషాల్లో అయ్యిపోతుంది. ఫరవాలేదు. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఎన్నాళ్ళయినా తాజాగానె ఉంటుంది.
స్వర్గం నుంచి నాన్నకి
నాన్నా!
నేను అమ్మ కడుపులో తొమ్మిదినెల్లూ
నీ గుండెలో
పద్దెనిమిదేళ్ళు పువ్వులా పెరిగాను
నీ తలా ఇల్లూ తాకట్టు పెట్టీ
నన్నో అయ్య చేతిలో పెట్టావ్...
భర్తే దేవుడన్నావ్!
అత్తే దేవతన్నావ్!
మెట్టినిల్లే స్వర్గమన్నావ్!
నిజమే-- భర్త దేవుడే - శిల!
అత్త దేవతే-- కాళిక!!
కన్నీళ్ళ కల్లాపి చల్లడంతో
మొదలౌతుంది నా కాపరం
పగలల్లా పని చెయ్యడం
రాత్రి పందిరి మంచం మీద
అలంకరించిన శవంలా
పడుకోవడం నా సంసారం
అర చేతుల్ని అంట్లు తోమడానికి అంకితం చేశా!
కాళ్ళని వంటింట్లో
గుంజల్లా పాతేశా
వీపుని అత్తగారికెప్పుడో
అప్పగించేశా!
చెవుల్ని బూతులు వినడానికీ
కళ్ళని కన్నీళ్ళు నింపుకోడానికీ
అలవాటు చేశా!
గొంతుని మొగుడి రెండు చేతుల్లోనూ పెట్టేశా!
సరే! నోరు మీరేగా కుట్టి పంపించారు అత్తారింటికి!
అత్త నన్నెంత దుమ్మెత్తి పోస్తున్నా
ధ్వజస్థంభంలా ఉలకడు పలకడూ-మొగుడు
ఆ ధ్వజస్థంభమే నయం- గాలికన్నా గంటలల్లాడతాయ్!
గడప మీద జుట్టు విరబోసుక్కూర్చున్న
ఆడపడుచు పేలు నొక్కుకుంటూ అత్తగారికి ఉప్పందిస్తుంది!
పడక్కుర్చీలో పాతెయ్యబడ్డ మావగారు - జీర్ణం కాని భగవద్గీత శ్లోకం డోకుతాడు!!
ఆ పెరట్లో నా వంక దీనంగా చూసేవి ఆవులూ గేదెలే
రాత్రౌతోందంటే బెంగగా ఉంటోంది నాన్నా!
తెల్లారుతోందంటే దడగా ఉంటోంది నాన్నా!!
ఒక్కసారి అమ్మనీ నిన్నూ చూడాలని ఉంది
మళ్ళీ పల్లకి ఎక్కే లోపు
ఒక్కసారి రావా!
ఈ ఉత్తరం అందేసరికి నేను
మీరు కోరుకున్నట్టు స్వర్గం లోనే ఉంటానేమో!
---- మీ కన్న కూతురు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి