తెలుగు సంగతులు

సోమవారం, జనవరి 24, 2011

కరువు బరువు


రాజుగారి తలపాగానుండి రాణీ గారి పై బట్ట సర్దుబాటే కాదు --
మంత్రిగారి వాటం చూసినా తెలియటంలేదూ రాజ్యం ఎలా ఉందో!!
ఇలాంటివి --కాదు ఇంకా గమ్మత్తైనవి బోలెడన్ని కావాలంటే మన ప్రియతమ బాపూ గారి స్వాతి కార్టూన్లు పుస్తకం కొని చూడాల్సిందే -- ఋషి పుబ్లిషర్సు వారి ప్రచురణ. విశాలాంధ్ర బుక్ హౌస్ లో దొరుకుతుంది. కార్టూన్ క్రింది వ్యాఖ్య మన సొంత పైత్యం. మీకు తెలుసుగా, బాపూగారి బొమ్మలే మాట్లాడుతాయి.
ఇక అవ్యవస్థల వైపు ఒక్కసారి తొంగి చూస్తే--కొంచెం ఆలస్యానికే పెనాల్టీలు, అదనపు రుసుములు, సేవల నిలిపివేత లాంటి చర్యలు-- తమ విలువైన, ప్రాణాధారమయిన ఖాతాదారులపై తీసుకునే టెలికాం కంపెనీలు, లైసెన్సులు పొంది సకాలంలో సేవలందించకపోవడం ఎలా క్షమార్హం? సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుంటే తప్ప ట్రాయ్ లాంటి సంస్థలు కూడా తమ కనీస విధుల్ని నిర్వహించే పరిస్థితి లేదంటే, ఇది ఖచ్చితంగా రాజకీయుల అతి ప్రమేయం, అధికార దుర్వినియోగం మాత్రమే! ఆలస్యానికి ఒప్పందం ప్రకారం విధించాల్సిన జరిమానాలు, తీసుకోవాల్సిన చర్యలు సక్రమంగా ఆయా సంస్థలు తీసుకుంటే, మౌలిక సదుపాయాల కల్పనలో, సేవలు అందించడంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని చాలా మట్టుకు నివారించవచ్చు.అయితే రాజకీయుల అనవసర జోక్యాన్ని ముందుగా అరికట్టవలసి ఉంది. అత్యున్నత స్థాయిలో అవినీతికి ఇదే కేంద్ర బిందువు అన్న విషయాన్ని విస్మరించకూడదు. మొత్తంగా వ్యవస్థలో రాజకీయ నాయకులు, అధికారులు, గుత్తేదార్లు కలిసి ఏర్పరచిన విషవలయాన్ని చేధించకపోతే, ట్రాయ్, ఆంధ్రప్రదేశ్ లోని ఎ పి ఐ ఐ సి లాగే అన్ని సంస్థలు నిష్క్రియాపరత్వంతోటి, లాలూచీతనంతోటి భ్రష్టు పట్టిపోతాయి. కామన్ వెల్త్ గేమ్స్, ఆంధ్రప్రదేశ్ లోని జలయజ్ఞం,2జి స్పెక్ట్రం... ఏ పేరైతేనేమి, ఎంత కుంభకోణమయితేనేమి ఇలాగే దర్జాగా సాగి సాగిపోయే ప్రమాదంనుండి మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వాలు గుత్తేదార్ల చేతిలో ఉండే స్థాయి నుండి, గుత్తేదార్లే ప్రభుత్వాల్ని నడిపే స్థాయికి ప్రమాదం ముంచుకొస్తోంది. తస్మాత్ జాగ్రత్త!

మరో మంచి పుస్తకం గురించి చిన్న విషయం....

పుట్టిన గడ్దనే నమ్ముకొని, అడవి తల్లి ఒడిలోనే పెరిగి, పొద్దంతా ఆనందంగా ప్రకృతి పంచనే కాయకష్టం చేసుకుబ్రతుకుతున్న అడవిబిడ్డల్ని వారి భూమినుంచి, జీవనవిధానంనుంచి బ్రతుకునుండి వేరుచేసి, అభివృధ్ధి పేరు చెప్పి వెళ్ళగొడితే సహించక తిరగబడ్డ ఒక ఆడపిల్ల నిజజీవితగాధ "అడవి తల్లి". సి.కె.జాను అనే ఆడబిడ్డ స్వయంగా అనుభవించిన దైన్య జీవితంలోనుండి, నిర్దాక్షిణ్యంగా భూమినుండి విడదీసిన పరిణామాలకు విలవిల్లాడిపోయిన గిరిజనుల గుండె చప్పుళ్ళనుండి పుట్టిన తిరుగుబాటే సి.కె.జాను. ఆ తిరుగుబాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయాన్ని ఒక్క కుదుపు కుదిపింది. దిగివచ్చిన ప్రభుత్వం ఆమె నాయకత్వంలోని ఆదివాసీలతొ ఒడంబడిక చేసుకుంది. షరా మామూలుగానె ఆచరణలో పెట్టలేదు. దానికి సి.కె.జాను మరింత పట్టుదలతో తిరిగి పోరాటాన్ని కొనసాగిస్తూ-- "ఆదివాసీల సమస్యల్ని ఆదీవాసీలే పరిష్కరించుకోవాలని, భూమిని నమ్ముకొన్న అడవి బిడ్డ్డలకు ఆ శ్రమ విలువ తెలియని వేరే మేధావులెవ్వరూ పరిష్కారం చూపించరని సిధ్ధాంతీకరించిన ఆమె నిరక్షరాసురాలు. ఆమె స్వయంగా చెప్పగా భాస్కరన్ అనె జర్నలిస్టు వ్రాసిన అసంపూర్తి ఆత్మ కధే "అడవి తల్లి".

కామెంట్‌లు లేవు: