తెలుగు సంగతులు

శుక్రవారం, మే 20, 2011

గోదారి కతలు




గోదారి కతలు
బి.వి.ఎస్.రామారావు గారి “గోదావరి కధలు”  పుస్తకానికి  “గోదారి కతలు” అనే పేరు పెట్టి ఉంటే బాగుండుననిపించింది. కధతో పాటు సజీవమైన పాత్రలు, గోదావరి చుట్టూ ముడివేసుకున్న జీవితాలు, పెనవేసుకున్న జీవనాలు, ఆ యాస, ఆ బాస, ఆ బతుకు, ఆ గోదారి చల్లదనం, ఆ గోదారి గట్టు సోయగాలు, సోయగాల పడుచులు, గోదారి రుచులు, రాదారి పడవలు, నది ఒడ్డున గుళ్ళు, దేవుళ్ళు, అర్చకులు, అర్భకులు, జూదాలు, కోడిపందాలు, పోలీసులు, కోర్టులు,తీర్పులు వగైరాల  మీదుగా నడిచి,నడుం వాల్చి, పరుగెత్తి, కాలే ఇసుకలో నడవలేక ఒగురుస్తూ ,బాధల సుదిగుండాల్లోకి కొట్టుకుపోతూ ఉన్న  సమయానికి మళ్ళీ గోదారి చల్లనిగాలుల వెన్నెల సాయంకాలాలకు మళ్లిస్తూ – కొంచెం వెచ్చగా-కొంచెం చల్లగా మొత్తం మీద హాయిగా గోదారి మీద తిప్పేశారు బి.వి.ఎస్.రామారావు గారు. అన్నింటా నేటివిటిని ఇంత గొప్పగా చూపించిన ఈ కధలకు “గోదారికతలు” అని పెడితేనే మరింత రంజుగా ఉండేదేమో! అయినా అంతటి నేటివిటీని బొమ్మల్లో తీర్చి దిద్దేసి అప్పుతచ్చుని (క్షమించాలి-ఇది కీ.శే.ముళ్ళపూడి గారికి మాత్రమే సొంతమయిన పదప్రయోగం) సరిచేసేశారు బాపు గారు. అక్కడక్కడా తొంగి చూస్తూ, కొన్నిచోట్ల రొమ్మువిరుచుకు తిరుగుతూ కనిపిస్తుంది రచయితకు బాపు,రమణలతో గల  సావాస సౌరభం. స్నేహానికి మరో పేరయిన బాపు రమణల ద్వయంతో దోస్తీ కట్టిన రామారావు గారు ధన్యుడో, ‘మా సీతారావుడు” అంటూ ఆప్యాయంగా చెప్పుకొనే బాపు రమణలే అదృష్టవంతులో తేల్చడం గోదాట్లో మూడు మునకలేసినంత సులువు కాదు.
నిష్కల్మషమయిన ప్రేమని, మొరటుతనంతో కూడిన ఆప్యాయతల్ని , ‘మన బతుకులింతే’ అనుకుని భరించే అమాయకత్వాల్ని, అలా భరిస్తూనే సమయానికి కాళిక లాగా తిరగబడి చీల్చి చెండాడే పడతుల తెంపరితనాల్ని, వేటికీ లొంగని గడుసుతనాల్ని కళ్ళకు కట్టారు రామారావుగారు. వీటన్నిటిని గోదావరికి ఆవలకు పోకుండానే అందమ్మటానే ఆ ఇసుక మేటల్లోనే, ఆ కొబ్బరిచెట్లలోనే, ఆ వెన్నెల అలల్ల్లోనే, ఆ చల్లగాలుల్లోనే దొర్లించిన ఆ కతలే – అక్కడ వేడెక్కిన ఇసుక దిబ్బల్నీ, ఎడారిని తలపించే వడగాల్పుల్నీ, కొంపలు ముంచే వరదల్నీ, బతుకులు ముంచే ఓవర్లోడు లాంచీల్నీ, షావుకార్ల/లాంచీ ఓనర్ల/కాంట్రాక్టరు బామ్మర్దుల దాష్టీకాల్నీ, పాతాళం వరకూ కుంగిపోయే మురికి బతుకుల్ని, పొట్ట కోసం అరుగులపై ఒలికించే ఒయ్యారాల్నీ సమతూకంలో పవిత్ర గోదావరి సమస్త మెలికల్నీ చిత్రీకరించిన తీరు అద్భుతం.
ఎటొచ్చీ ఇంతగా మురిపించే, కరిగించే ఈ గోదావరి కధలు భాషాపరంగా, ఇతర ప్రాంతవాసులకు అక్కడక్కడా ఒక పట్టాన కొరుకుడు పడకపోవచ్చు. యాస పట్టుపడకపోయినా కధలు అందులోని జీవితాల చిత్రీకరణా అందరినీ అలరిస్తాయి, ఆలోచింపచేస్తాయి. గంగా నది పవిత్రతకి, గోదావరి అందాలకి, ఆవకాయ రుచులకు భాష,యాస, అడ్డం రానే రావు. అవడానికి మట్టి బొమ్మలే అయినా సొబగులద్ది బంగారు నల్లపూసల తావళం తగిలించేసరికి (సీతమ్మకీ చేయిస్తీ కధలో) సీతారాములు వెలుగులు చిమ్మినట్టే ‘సీతారావుడు’ (క్షమించాలి-చనువు తీసుకున్నందుకు) రాసిన గోదావరి మీద, గోదావరి ఒడ్డున, గోదావరి లోన, కధలన్నీ తళుకులీనుతున్నాయి.  తప్పక కొని చదవాల్సిన పుస్తకం.
‘గోదావరి కధలు’. రచయిత: బి.వి.ఎస్.రామారావు. ముఖ చిత్రం: బాపు.
ప్రచురణ: ఎమెస్కో.  వెల: రూ.150/-

     
  

1 కామెంట్‌:

రసజ్ఞ చెప్పారు...

‘మన బతుకులింతే’ అనుకుని భరించే అమాయకత్వాల్ని, అలా భరిస్తూనే సమయానికి కాళిక లాగా తిరగబడి చీల్చి చెండాడే పడతుల తెంపరితనాల్ని, వేటికీ లొంగని గడుసుతనాల్ని అమ్మో! అమ్మో! అమ్మో!ఇట్టా మా గుట్టు రట్టు సేసేత్తే ఎట్టా? సెప్పండి ఆయ్! మీతో మా సెడ్డ సావొచ్చి పడినాదే ;)