తెలుగు సంగతులు

గురువారం, మే 23, 2013

'సమ్మర్ హిల్'  పుస్తక సమీక్ష

చాలా కాలం తరువాత పుస్తకాలు చదివే తీరిక, అవకాశం దొరకడంతో వరుసగా నాలుగు చదివి ఐదోది చదువుతూ చదివినవాటి గురించి మిత్రులతో అభిప్రాయాలు పంచుకోవాలని ---
నేను చదివిన నాలుగు పుస్తకాలూ—1) ఎ.ఎస్.నీల్ రచన ‘సమ్మర్ హిల్ ‘ తెలుగు అనువాదం. 2)శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి – ‘వడ్లగింజలు’ 3)రఘు – ‘ప్రేమతో వడ్డెర చండీదాస్’4)ఈచర్ వారియర్ ‘నాన్న – రాజన్ తండ్రి అన్వేషణ’ తెలుగు అనువాదం. ఇక ఇప్పుడు సగంలో ఉన్నది – సడ్లపల్లె చిదంబర రెడ్డి రచన ‘కొల్లబోయిన పల్లె’.
ఇందులో విషయపరంగా ఒకదానికొకటి పోలిక లేవు. కానీ ఎందుకనో పుస్తకాల అరలోంచి వెదుక్కొని ఏరి ఏరి ఇవన్నీ వరుసలో చదివాను. ప్రతి పుస్తకం విభిన్నమయిన అనుభూతిని, కొన్ని భావోద్వేగాన్ని కలిగించాయి.

ఎ.ఎస్.నీల్ వ్రాసిన ‘సమ్మర్ హిల్’ పుస్తకం పిల్లల పెంపకం గురించిన వాటిలో జగద్విఖ్యాతి గాంచిన పుస్తకం. చాలామంది చదివే ఉంటారు లేదా వినైనా ఉంటారు.  పెంపకం గురించి కంటే కూడా పిల్లల మనస్తత్వ పరిశీలన, దానిపై ఆధారపడి తల్లిదండ్రులకు, టీచర్లకు మార్గదర్శి గా ఈ పుస్తకం ఖచ్చితంగా చదవవలసినదే. తెలుగులో అనువాదం కోసం ఎదురు చూసి, ఇప్పటికి దొరకబుచ్చుకోగలిగినందుకు సంతోషంగా ఉంది. రచయిత స్వయంగా ఇంగ్లండు కు సమీపంలో తన ఆశయాలకు తగ్గట్టు స్కూలు నిర్మించి నిర్వహించి సాధించి --- ఆ అనుభవాలనే పుస్తకంగా మలిచారు.
పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపే నేటి పోటీ ప్రపంచపు బలవంతపు మార్కుల/ర్యాంకుల చదువుల దుష్ఫలితాల దిశగా పోకుండా, స్వేచ్చగా బిడ్డ తన అభిరుచి మేరకు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కలిగించడమే ‘సమ్మర్ హిల్’ స్కూలు ముఖ్య ఉద్దేశ్యం. పుట్టగానే ఇంజనీరు, డాక్టరు, పెద్ద గుమాస్తా(ఫైనాన్సియల్ అకౌంటెంట్), కంప్యూటర్ కీ బోర్డు ఆపరేటర్ (సాఫ్టువేరు ఇంజనీరు)  లేదా మరోటో అనీ తల్లిదండ్రులూ, ఆ పై ఫ్లెక్సీలు, బానర్లు, హోర్డింగులు, బ్రోచర్లు, టివీ ప్రకటనల హోరుతో ప్రయివేటు స్కూళ్ళ యాజమాన్యాలూ బిడ్డని పంజరంలో ఇరికించే ప్రక్రియ ఇంటింటా సాధారణమయిపోయిన ఈ రోజుల్లో ‘సమ్మర్ హిల్’ కనువిప్పు కలిగించేదే. అయినా అందరినీ పీడించే ప్రశ్న—“ఇది ఆచరణ సాధ్యమేనా?”  మొదటగా మనం ఆలోచించుకోవాల్సింది ఇంజనీరుకో, పెద్ద గుమాస్తాకో తల్లిదండ్రులమా? లేక స్వేచ్చగా పెరిగి మనుషులుగా తయారవ్వబోయ్యే పిల్లలకు తల్లిదండ్రులమా? ఈ విషయాన్నే ‘సమ్మర్ హిల్’ చాలా సోదాహరణంగా ఆచరణసాధ్యమయిన పద్ధతులను చర్చించింది. ఇప్పటి యాంత్రిక చదువులు, జీతాల/సంపాదనల పాత్రను నిర్దారించడానికే తప్ప జీవితాల్ని, వాటి మాధుర్యాన్ని చవి చూడగలిగే మానవ సంబంధాల్నిపెంపొందించుకొనే నేర్పరితనాన్ని, స్వేచ్చకు అవకాశాన్ని ఏ మాత్రం దరి చేరనీయడం లేదు. అందుకే విద్యావంతులు పెరుగుతున్నా, స్కూళ్ళు, కాలేజిలు లెక్కకు మించి పెరుగుతున్నా—విజ్ఞత, వివేకం కొరవైన యాంత్రిక జీతగాళ్ళను మాత్రమే తయారు చేసుకుంటున్నాము. అందుకే సమాజంలో, ప్రతి వ్యక్తిలోనూ, వ్యవస్థలోనూ ఈ అశాంతి, అభద్రత. మన చదువులు ఏ కోశానా స్వేచ్చను, మానవత్వాన్ని బోధించడంలేదు. తద్భిన్నంగా ‘అవి’ అవసరం లేదు అనే ఆలోచనను చిన్నతనం నుండే బుర్రల్లో బీజింపచేస్తున్నాయి. అనవసర చాదస్తాలతో, మూడ నమ్మకాల పట్ల ఆసక్తిని కలుగచేస్తున్నాయి మన లోగిళ్ళు. ఉదాహరణకు సెక్స్ పట్ల లేని పోని అపోహలు కలిగించి పిల్లలకు, యువకులకు అదేదో నేరసంబంధిత చర్యగా భావన కలుగ చెయ్యడం వల్ల వారిలో చిన్నతనంనుండే తాము నేరస్తులమన్న భావన అంతరాంతరాల్లో ఏర్పడి అదే స్థిరపడిపోతుందన్న విషయాన్ని ‘సమ్మర్ హిల్’ పరిశీలనాత్మకంగా మన ముందుంచుతుంది. యూరప్ ఆలోచనల ప్రభావం చేతనేమో, సెక్స్ విషయాలను మోతాదుకు మించి చర్చించిందని మన భారతీయులకు అనిపించొచ్చు. ఉదాహరణకు పిల్లలలో సెక్స్ పట్ల ఆసక్తి, హస్తప్రయోగం వగైరా విషయాలను చాలా సందర్భాల్లో బాహాటంగా చర్చించడం జరిగింది. కానీ అందులో నిజాయతీ, నిర్మొహమాటం, చెప్పాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే అది సహజమయిన, ప్రకృతి సంభందిత విషయం. అతి ముఖ్యమయినది కూడా. మొత్తం మీద విలువైన పుస్తకం. మంచి మనుషులుగా తమ బిడ్డలను తిర్చిదిద్దుకోవాలనే ప్రతి తల్లిదండ్రులూ, అలాంటి బాధ్యతను విస్మరించని ఉపాధ్యాయులూ తప్పక చదవవలసిన పుస్తకం ‘సమ్మర్ హిల్’. పుస్తకంలోవి మచ్చుకు కొన్నివాక్యాలు ----
అబద్ధాలు చెప్పడం స్వల్పమైన బలహీనత. అబద్దాలతో జీవించడం ఘోరమైన ప్రళయం.”
“బలప్రయోగం అనేది మానవజాతిని పట్టి పీడిస్తున్న శాపం. పోప్, రాజ్యాంగ యంత్రం, టీచర్,తల్లిదండ్రుల ద్వారా బలప్రయోగం జరుగుతున్నది.”
“నిజానికి స్కూళ్ళలో, కాలేజీలో ప్రధమ స్థానం సంపాదించే సంపాదించే విద్యార్ధులలో ఎక్కువమంది తరువాత సామాన్యులుగా దిగాజారిపోతారు.”
“జీవితం నుంచి పలాయన మంత్రం పటించడానికి మతం ఉపయోగపడుతుంది.”
ప్రచురణ: ప్రజా శక్తి బుక్ హౌస్.  పేజీలు: 338. వెల: రూ.130/-.  

తదుపరి పోస్టు కొద్ది రోజుల్లో శ్రీపాద వారి 'వడ్లగింజలు' గురించి.

కామెంట్‌లు లేవు: