కె. బాలగొపాల్, పరిచయం అక్కర్లేని నిక్కచ్చి అయిన వ్యాసకర్త. నిశిత పరిశీలన, విశ్లేషణ, నిర్మొహమాట విమర్శ ఆయన ప్రత్యేకతలు. అంతకు మించి ఆయన శాస్త్రీయ దృక్పధం, అవగాహనలతో ఏ విషయాన్నయినా గణాంకాలు, ఆధారాలతో విస్పష్టంగా వివరించగల దిట్ట. ఆయన భావజాలం, పదజాలం కమ్యూనిష్టు పోరాట యోధుణ్ణి గుర్తు చేస్తాయి కాని, ఆయన కేవలం ప్రజల మనిషి. ప్రజాసమస్యలే ఆయన రచనలకు ముడిసరుకు.
చరిత్రపై ఆయనకున్న అవగాహన, ప్రత్యేక ఆసక్తి ఆయన్ను మంచి చారిత్రక విమర్శకునిగా నిలబెట్టాయి. 1990 లొ అనంతపురంలొ జరిగిన హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షోపన్యాసంలో తాను చరిత్రకారుణ్ణి కాదని, కేవలం ఔత్సాహిక పరిశీలకుణ్ణి మాత్రమే అని చెప్పుకోవడం ఆయన నిరాడంబరతను చాటేది మాత్రమే.
'చరిత్ర రచనపై బాలగోపాల్ ‘ అన్న ఈ పుస్తకం లో ఉన్న పది వ్యాసాలూ చరిత్ర పట్ల మనకు, అత్యంత ఆసక్తిని రేపుతూ, చరిత్ర రచనలో సాధారణంగా చోటు చేసుకొనే పాలక వర్గాల వైపు పక్షపాతం, వక్రీకరణల గురించిన ఎరుక కలిగి 'అసలు మనం చదువుతున్న చరిత్రలో సత్యం పాలు ఎంత?' అన్న సందేహం ఏర్పడుతుంది. సాధారణంగా ఇటువంటి రచనలకు ఫుట్ నోట్ లు ఇవ్వడం తప్పనిసరి. ఈ పుస్తకంలొ, పాఠకునికి ప్రతి పేజీ కిందా వాటి జోక్యం అడ్డం తగలకుండా వ్యాసం చివర్లో అంకెలవారీగా వివరణ ఇవ్వడం సౌలభ్యంగా ఉంది. వ్యాసాలూ, వాటిలోని వ్యక్తుల, సంఘటనల వివరణలు మనకు చరిత్ర పట్ల చాలా ఆసక్తిని రేపుతాయి. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, భారత కార్మిక చరిత్ర, తెలంగాణ రైతాంగ పోరాటంలో మహిళల పాత్ర, చరిత్ర పాఠాలపై కాషాయం నీడ, భారత స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిముల పాత్ర వంటి భిన్నమయిన విషయాలపై నిర్ద్వందంగా చేసిన విమర్శలు, పరామర్శలు మొత్తంగా ఈ వ్యాసాలు. వారు, వీరు అన్న బేధం ఎక్కడా చూపకుండా లోపాలున్న ప్రతీ వ్యవస్థనూ, సంస్థనూ ఏకిపారేసిన విధానం బాలగొపాల్ నిష్కర్ష్ చరిత్ర రచనకు అద్దం పడుతుంది. ఉదాహరణకు -- "ప్రజలు చిన్న చిన్న రాయితీలతో సంతృప్తి చెందేవారు కాదు కానీ, భారత కమ్యునిస్టు పార్టీ ప్రజల చైతన్యాన్ని నీరు కార్చడంలో పాలక వర్గాలకు చాలా తోడ్పడింది." అని ఒక సందర్భంలొ వివరిస్తారు. నిజమయిన చరిత్ర కోణానికి నిక్కర్చైన రచనగా చెప్పుకోడానికి ఉదాహరణలు ఇవ్వడం కష్టమయిన పని. ఈ వ్యాస సంకలనం చదవడమే చరిత్ర పై ఆసక్తి ఉన్న వారికి మార్గం. ఇది చదివాక, మరిన్ని చరిత్ర రచనల కోసం వెదకడం మాత్రం తధ్యం.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు 2015 లో ప్రచురించిన ఈ పుస్తకం వెల - 130 రూపాయలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి