తెలుగు సంగతులు

ఆదివారం, మే 30, 2021

తిప్పి తిప్పి మళ్ళీ నామిని గురించే

 


తిప్పి తిప్పి మళ్ళీ నామిని గురించే


ఎవడేది చెప్పినా ఎగేసుకుపోడం -- ముఖతాచెప్పినా, పుస్తకంలో కూసినా, వ్యాసం కోసవో, పుస్తకం కోసవో ఎగబడిపోవడం నాకున్న బలహీనత. బలం కూడా. ఎందుకంటే సూచనలవల్లే కొంత మంచి సాహిత్యం చవిచూడగలిగాను. అలాంటి ఊరేగింపులోనే ఆరొందల పేజీల చరిత్రాత్మక, ఉర్రూతలూగించే, రాజకీయ సామాజిక ..అంతెందుకు, గొప్పగా అమ్ముడుపోడానికి కావాల్సిన సరంజామా అంతా ఉన్న టైము దండగ పుస్తకం చదివేశాక ఊపిరాడలేదు. ఇలా కాదంజెప్పి మరోటి ఎత్తుకున్నా. కాస్త నిజాలనూ, నాకెప్పటినుండో అర్ధం కాని విషయాల్ని విడమరిచి సీరియస్సుగా చెప్పిన సామ్యవాద పుస్తకాన్ని చదివేసా, మొదటిదాంట్లోంచి బయటపడ్డానికన్నట్టు. ఇవి నిజాలే అయినా బుర్ర హీటెక్కించేశాయి. సమాజం ఏవయిపోతోంది అని వర్రీ ఎర్రీ కూడా ఎక్కించేసింది


ఇంక  ఎలా? బయటపడ్డం? చదివేసే పూనకం దిగడం లేదు. అప్పుడు తట్టింది అప్పటికే రెండుమూడుసార్లు చదివిన పుస్తకం. మొదటిసారి అర్ధం కాలేదని రెండోసారి, రెండోసారి మరి కాస్త ఎక్కువ అర్ధం అయినట్టనిపించి మూడోసారీ.. ఇలా చదివి ఉన్న పుడింగిని భద్రంగా చేతుల్లోకి తీసుకున్నా. ఎందుకైనా మంచిదని రెండో కాపీ కూడా ఎవ్వరికీ ఇవ్వకుండా, ఒకదానికయితే దళసరి అట్టేసుకుని మరీ భద్రపరుచుకుని దాచుకున్నాను కదా!  

ఇక మొదలెడితే రెండూ ఎక్కించిన చిరాకు, హీటు తగ్గుతాయని కమ్మని మజ్జిగలో రాగిజావ కలుపుకుని తాగినట్టు హాయిగా ఉంటాదనీ నాకు ముందే తెలుసు కాబట్టి, మళ్ళీ అదే ఎత్తుకున్నాను. కొంచెం ముందుకు పోయినాక ఏదో ఏకాగ్రత కోసం అన్నట్టు పోజు పెట్టి తలుపు మూసి కంటిన్యూ చేశాను. నాలో నేనే నవ్వుకుంటే కరోనా కష్టకాలంలో, ఈడికేవయ్యిందో అని మహాప్రస్థానానికి ముందుస్టాపులో పడేస్తారేమోనని భయవేసి. ఎంత పుడింగు అయితే మాత్రం ఇన్నిసార్లు చదివాకా కూడా ఇలా ఇరుకుల్ని పెట్టేయడం, ఇలా నగిపిచ్చేడం, ఏం సబబు? అరే మాటిమాటికీ పుస్తకం పక్కనెట్టి గట్టిగా నిబ్బరించుకుని, ఇంకా గట్టిగా గాలి పీల్చుకునీ బయటపడితే తప్ప మరో పేజీ ముందుకు పోదే! ఒక నవ్వా, ఒక విచారమా, ఆస్చెర్యమా, భయమా, సౌందర్యమయిన అనుభూతా? ఎన్ని రకాల ఫీలింగులు కలుగుతాయి. ఒక్కోసారి, కాదు అనేకసార్లు పుడింగికి ఇలా జరగాల్సిందే ఎంత పొగురు? ఎంత బడాయి? అనిపిస్తుంది కూడా. అంతలోనే నాకే చెమటలు పట్టేంత జాలేస్తుంది. పిచ్చి ముండాకొడుకు లాగ సైకిలెక్కి పుస్తకాలేసుకుని, స్కూళ్ళ బయట, రేగుపళ్ళు తేగలూ అమ్ముకునే వాళ్ళతోబాటూ.. ఏంటిదంతా పాపం అనిపించేంతలో మళ్ళీ ఎందుకో భళ్ళున నవ్వు పుట్టించేత్తాడు పుడింగి. నేను జనరల్ గా మర్యాదస్తుణ్ణే. కంపోజిట్ గా, అంటే లోపల్లోపల దొంగనాకొడుకునే అయినా, సాధారణంగా నా భాష రాతలో దారి తప్పదు. దొంగ మర్యాదలన్నీ పాటిస్తుంది. ఎక్కడైనా అదుపు తప్పిందంటే, నిజం మరీ కక్కుకొస్తాంటే వచ్చిన మాటలే కొన్ని మర్యాద పాటించలేదంటే, అది నా తప్పు కాదు. దాని పూర్తి బాధ్యత మాత్రం పుడింగుదే


ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి ఈయన గురించి. దగ్గర ఆయన గురించి ఆయనే..స్కూలు కరస్పాండెంట్ల దగ్గర నంగినంగిగ నేను ఫలాన అని చెప్పినా, చెప్పుకున్నా ' మీరా కూర్చోండి అని ఒక్క మీ కొడుకు అంటే కదా'అని చెప్పుకొస్తాడు. 'అనేక చోట్ల 'నాకొడుకు 'అని ప్రయోగించే పుడింగి ఇక్కడ మాత్రం 'మీ కొడుకు 'అని ఎందుకు ప్రయోగించేడో సందర్భం అంతా చదివినప్పుడే తెలుస్తాది. నవ్వించడం అంటే నవ్వించాలనీ కాదు, అది నవ్వే విషయమూ కాదు. ఏడ్వలేక నవ్వడం అంటారే అలాంటిదో ఏమో. ఒక్కోసారి ఒక్కోలా


మజ్జానం, రేత్రీ చెరో కోర్టరుకూ ఎదిగాక, మజ్జానం హాలులో పొర్లతా ఉంటే దొరికిన నాలుగో తరగతి తెలుగు వాచకం ఎత్తుకోని చదివి ఎంత రొద పడిపోయాడో ఇస్కూలు పిలకాయలంటే గుండెలు బాదుకునే ఎర్రోడుఅందులో అభ్యాసం కింద మూడు పదాలనూ ఉపయోగించి ఒక వాక్యమును వ్రాయుము అని 'కోతి, టీవి, ఆకాశము 'అని మూడు పదాలు ఇచ్చారంట. పుడింగికి మంట. ఎలా వాక్యం చెయ్యడం అని తన్నుకులాడి చివరకు 'నేను టీవీ చూస్తుండగా కోతి ఆకాశం 'లోకి తొంగి చూస్తున్నది అని గాల్లో రాసుకున్నాడంట. ఇదీ ఈయన వరస, ఈయన కత

పెట్టుబడిదారి అవ్యవస్థా, సామ్యవాదం లాంటివేవీ ఎరగనట్టు మాట్టాడే నంగిరి దగ్గర ఏవంటాడో చూడండి. 'కష్టపడితే పలితం దక్కుతాదని కొంతమంది దొంగనాకొడుకులు అంటా వుంటారు. మాలా మాదిగోళ్ళను చూసి తెలుసుకో. వాళ్ళకంటే కష్టపడేవాళ్ళెవరు చెప్పు? కష్టపడితే కాలు మింద కాలేసుకుని కూర్చోవచ్చు అనేది పచ్చి అపద్దం. సోంబేర్లు నాసినమైపోతారనేది యింకా అపద్దం '. ఇంతకంటే శ్రామిక పక్షపాతం ఉంటుందా? చెప్పండి

నాలుగోసారి కూడా నాకు మళ్ళీ అదే అర్ధం అయ్యింది పుడింగి గురించి మంచైనా, చెడైనా నేను కాదు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. సందు ఇవ్వకుండా అంతా ఆయనే చెప్పుకున్నాడు. కొన్ని చెడ్డ దినాల్లో పుడింగి కార్యక్రమం ఆయన మాటల్లోనే 'తాగడం, ఇంట్లో పడి దొల్లతా ఉండడం. వాళ్ళను చూసీ వీళ్ళను చూసీ కుళ్ళతా ఉండడం '. ఇలా అన్ని కోణాలూ ఆయనే విడమర్చి చెప్పేస్తే  ఇక నాలాంటోడికి చెప్పడానికేం మిగుల్తుంది, నా బొంద. అందుకే 'నామిని నెంబర్ వన్ పుడింగి 'చదూకుని రెండూ మూసుక్కూచోడవే, పుస్తకం దొరికితే.  

కామెంట్‌లు లేవు: