తెలుగు సంగతులు
శనివారం, జనవరి 08, 2011
మనమందరం
"మనమందరం సామాజికంగా, మతపరంగా కొన్ని కొన్ని నిర్దేశించిన భావోద్వేగాలకు లోనయ్యేట్టుగా ప్రోగ్రాం అయి ఉన్నాం. ఇదే గొప్పది అనుకోవడం, దానికి విశ్వాసంగా ఉండడం, కట్టుబడి ఉండడం, కనీసం అవి ఎందుకు అలా చెబుతున్నాయో కూడా మనకు మనం ప్రశ్నించుకోకుండా వాటిని గుడ్డిగా అనుసరిస్తాం."---- రాంగోపాల్ వర్మ.
మిత్రులకు వందనాలు! ఈ మధ్య సంచలనం (అనుకుంటున్నారు మరి) సృష్టించిన రాంగోపాల్ వర్మ పుస్తకం "నా ఇష్టం" బాగానే ఎక్కువ ముక్కు సూటిగా, కొంచెం తార్కికంగా, కాస్తంత ఆలోచింపచేసేదిగా, అక్కడక్కడా అసందర్భంగా, ఎక్కడెక్కడో తిక్క తిక్కగా ఉంది. చాలావిషయాలు ఉత్కంఠ రేపేవిగా ఉన్నాయి. కొనదగినదే గాని కొంచెం ధర ఎక్కువే! రూ.175/-. అసలు విషయం. ఈ పుస్తకం ఆయనకే అంకితం. ఎందుకని అడక్కండి, అది ఆయనిష్టం-- అడగడానికి మనమెవళ్ళం- కొనడంవరకే!!! ఎమెస్కో పబ్లిషింగ్!
శుక్రవారం, జనవరి 07, 2011
పుస్తకాలు
వ్వాట్! బయింగ్ బుక్స్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్ .... దిస్ ఈజ్ బార్బేరియస్... పుస్తకాలు కొండవా?? డబ్బు పెట్టా? నువ్వు స్టోన్ ఏజ్ మనిషిలా వున్నావోయ్! మై డియర్ వెంకటేశం! --- ముళ్ళపూడిగారి గిరీశం.
మనం కూడా అలాగే చేద్దాం. పుస్తకాలు కొనడం ఏవిటి మన బొంద! పాతా వాటినే పంచుకుందాం అందరూ కలిసొస్తే! నా దగ్గర పంచుకోతగినవి సుమారూ 500 ఉన్నాయి! మీ లాంటి స్నెహితుల దగ్గరవి మరో 500 పోగడతాయి. ఉచితంగా మన మిత్రులందరికీ(హైదరాబాదు వరకూ పరిమితం) కావల్సినవాటిని లోకల్ పోస్టు ద్వారా పంపే నెట్ వర్క్ తయారు చేద్దామని చిన్న ఆలోచన. మీ అభిప్రాయాలు తెలియచేస్తే ప్రయత్నం మొదలుపెడదాం.
రాజా
ఆదివారం, జనవరి 02, 2011
కొట్ట షమ్మత్షరం
“ఎవడైనా కోపంగా కొడతాడు. లేకపోతే బలంగా కొడతాడు. ఈడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక కోట కడుతున్నట్టు, గులాబి మొక్కకు అంటు కడుతున్నట్టు, చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా!”-అతడు సినిమాలో-తనికెళ్ళ భరణి . ఇందులో "ఈడు"ఎవడు?? ఇంగిలీసోడు!! తెల్లోడు! వాణ్ణి తరిమేసిన పెద్దలు ఆ తాలూకు "సారా"న్ని తరమడం మరిచిపోయారు. శతాబ్దాలకు సరిపడా మాంఛిగా, జాగ్రత్తగా, శ్రథ్థగా,పద్ధతిగా కొట్టాడు.
కొత్త సంవత్సరం వచ్చేసింది! అయితే ఏవయ్యింది? మందు భాఘా కర్షయ్యింది....
గోర్నమెంటుకి గిట్టింది. పోలీసులకి ముట్టింది. కుర్రకారుకి తడిసి జేబుడయ్యింది-- గోర్నమెంటుకి, పోలీసోళ్ళకి సమర్పించుకోడానికి!!!
అర్ధరాత్రి గంతులకి రోడ్లు వేదికలయ్యాయి. సంవత్సరంలో అప్పుడప్పుడూ అనుమతుల్ని అందిపుచ్చుకొనే కుర్రాళ్ళకి పట్టపగ్గాల్లేకుండా పోయింది. మందుతోనే కుర్రకారు రాత్రంతా కేరింతలు కొట్టేరంటే మందు మీద అనుమానం వస్తోంది. మందు ఇంగ్లీషు (drugs)రూపం ధరించేసిందని నిర్ధారణ దొరికిపోతోంది.
ఏ రెండు జనవరి ఒకట్లైనా ఒక రకంగా ఉన్నాయా? ఒక జనవరి ఒకటిన ఉన్న వెన్నెల వేరు! మరో ఒకటిన వెన్నెల వేరు. ఖగోళంగా గాని, భూగోళంగా గాని మరే ప్రకృతి శాస్త్రానికయినాగాని కలవని/కుదరని ఈ సంవత్సరారంభం లెఖ్ఖల కోసం తప్ప సంబరాలకోసం కానే కాదు. ముఖ్యంగా మనకి ఇంత భావదాస్యం పనికిరాదనుకుంటాను.
సాక్షాత్తూ గవర్నరుగారన్నట్టు 31 వెళితే ఏమవుతుంది-- 1టో తారీఖు వస్తుంది. ఆయనది వాస్తవవాదమా! వెటకారమా! కొందరికి పేలిన జోకు, మరికొందరికి కాలిన మేకు....
కొత్త సంవత్సరం వచ్చేసింది ! అయితే ఏంటట? వరదల్లో తడిసిన ధాన్యం మొలకలెత్తి కుళ్ళి కుశించింది, దీక్షలతో, ఓదార్పులతో, పదవుల మార్పులతో, ఆడే అందరి నాటకాలకీ కలెక్షన్లు బాగానే ఉన్నాయి ! ఎలక్షన్లు ముందుకొస్తే బావుణ్ణని అపోజిషనోళ్ళూ, మందు బాబులూ ఎదురు చూస్తున్నారు.. ఉధ్ధరిస్తారేమోనన్న్న మిణుకు మిణుకు ఆశ కొత్త పార్టీలకు కొంత ఓట్ల శాతాన్నన్నా తగలేసుకున్నందుకు మధ్య తరగతి మేధావులు మద్యంలో అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపి జోగేరు నిద్రలోకి!
కొత్త సంవత్సరం వచ్చేసింది ! ఏవయ్యింది??? పాత సంవత్సరపు తలనొప్పి (hangover) పొద్దున్నే తలకెక్కింది! ఇంకా కొంతలో కొంత నయం! ఒకట్రెండు తారీఖులు సెలవులొచ్చాయి! శారిడాన్ కునుక్కుందాం పదండి మందుకు-- షారీ !!! మందుల షాపుకు.....
గురువారం, డిసెంబర్ 30, 2010
కొమ్ములు
మా ఊరెళ్ళాను
బాగా డెవలప్ అయ్యింది
ఒకప్పుడు కొండ ఉండేది
...ఫాక్టరీ వచ్చింది
చెరువుండేది
...కాలనీ వచ్చింది
సత్రం ఉండేది
...స్టార్ హోటల్ వచ్చింది
మనుషులుండేవారు
...కొమ్ములొచ్చాయి. --జనార్ధన మహర్షి
ఇలాంటివి బోల్దు ఉన్నాయి కొని చదివితే "వెన్న ముద్దలు" విశాలంధ్ర మరియు అన్ని ముఖ్య పుస్తక కేండ్రాలలోనూ దొరుకుతుంది.
సోమవారం, డిసెంబర్ 27, 2010
ఆవిడ- అమ్మ
మా అమ్మ
మెజీషియన్
ఇంట్లో ఎం లేకపోయినా
క్షణాల్లో పుట్టించేస్తుంది!!!
మా ఆవిడ
అంతకంటే పెద్ద మెజీషియన్
ఇంట్లో ఎన్ని ఉన్నా
క్షణంలో మాయం చేస్తుంది!!!!--జనార్ధన మహర్షి.
ఇప్పటి సంగతి--- మా ఆవిడా మారింది
ఎందుకంటే ఇప్పుడు అమ్మ అయ్యింది. రాజా
శనివారం, డిసెంబర్ 25, 2010
తెలివైన తాగుబోతు
"సికింద్రాబాదులోని పేరడైజ్ దగ్గరకి వెళ్ళాలి "
"కుదరదండి ఈసమయంలో టాంక్ బండ్ మీద మంచు. రోడ్డు కనపడదు "చెప్పాడా డ్రైవర్.
"నీకు రెట్టింపు డబ్బిస్తాను కాని పద"
ఆటో డ్రైవర్ ఆలోచించి చెప్పాడు "మూడింతలు చెల్లించండి. ఓ ఆటో డ్రైవర్ ని లేపి ముందు నడవమంటాను. అతని వెనకే మన ఆటో పోనిస్తాను"
"నేనేం తెలివి తక్కువ వాడ్ననుకుంటున్నావా? అలా కుదరదు. రెట్టింపే ఇస్తాను. ముందు నేను నడుస్తాను. నువ్వు వెనక ఆటోని పోనివ్వు" చెప్పాడా తాగుబోతు.
చదవాల్సిన
శుక్రవారం, డిసెంబర్ 24, 2010
తనికెళ్ళ భరణి రచన ''పరికిణీ'' పుస్తకం లోనిది
ఒక దాన్ని మించి మరోటి గా ఉన్న పాతిక పైగా ఉన్న కవితలు ఆలోచింపచేస్తాయి, కొన్ని చిన్న నాటి గురుతులను మోసుకొస్తే మరి కొన్ని గుండెల్ని పిండేస్తాయి.
తప్పక కొని చదవాల్సిన పుస్తకం. కాని ఒకటే బాధ -- ఇది పట్టుమని పది నిముషాల్లో అయ్యిపోతుంది. ఫరవాలేదు. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఎన్నాళ్ళయినా తాజాగానె ఉంటుంది.
స్వర్గం నుంచి నాన్నకి
నాన్నా!
నేను అమ్మ కడుపులో తొమ్మిదినెల్లూ
నీ గుండెలో
పద్దెనిమిదేళ్ళు పువ్వులా పెరిగాను
నీ తలా ఇల్లూ తాకట్టు పెట్టీ
నన్నో అయ్య చేతిలో పెట్టావ్...
భర్తే దేవుడన్నావ్!
అత్తే దేవతన్నావ్!
మెట్టినిల్లే స్వర్గమన్నావ్!
నిజమే-- భర్త దేవుడే - శిల!
అత్త దేవతే-- కాళిక!!
కన్నీళ్ళ కల్లాపి చల్లడంతో
మొదలౌతుంది నా కాపరం
పగలల్లా పని చెయ్యడం
రాత్రి పందిరి మంచం మీద
అలంకరించిన శవంలా
పడుకోవడం నా సంసారం
అర చేతుల్ని అంట్లు తోమడానికి అంకితం చేశా!
కాళ్ళని వంటింట్లో
గుంజల్లా పాతేశా
వీపుని అత్తగారికెప్పుడో
అప్పగించేశా!
చెవుల్ని బూతులు వినడానికీ
కళ్ళని కన్నీళ్ళు నింపుకోడానికీ
అలవాటు చేశా!
గొంతుని మొగుడి రెండు చేతుల్లోనూ పెట్టేశా!
సరే! నోరు మీరేగా కుట్టి పంపించారు అత్తారింటికి!
అత్త నన్నెంత దుమ్మెత్తి పోస్తున్నా
ధ్వజస్థంభంలా ఉలకడు పలకడూ-మొగుడు
ఆ ధ్వజస్థంభమే నయం- గాలికన్నా గంటలల్లాడతాయ్!
గడప మీద జుట్టు విరబోసుక్కూర్చున్న
ఆడపడుచు పేలు నొక్కుకుంటూ అత్తగారికి ఉప్పందిస్తుంది!
పడక్కుర్చీలో పాతెయ్యబడ్డ మావగారు - జీర్ణం కాని భగవద్గీత శ్లోకం డోకుతాడు!!
ఆ పెరట్లో నా వంక దీనంగా చూసేవి ఆవులూ గేదెలే
రాత్రౌతోందంటే బెంగగా ఉంటోంది నాన్నా!
తెల్లారుతోందంటే దడగా ఉంటోంది నాన్నా!!
ఒక్కసారి అమ్మనీ నిన్నూ చూడాలని ఉంది
మళ్ళీ పల్లకి ఎక్కే లోపు
ఒక్కసారి రావా!
ఈ ఉత్తరం అందేసరికి నేను
మీరు కోరుకున్నట్టు స్వర్గం లోనే ఉంటానేమో!
---- మీ కన్న కూతురు.
బుధవారం, అక్టోబర్ 27, 2010
ఇ పుస్తకాలు
ఒక వ్యక్తికి చదవటమంటే విపరీతమైన ఆసక్తి. పగలనకా, రాత్రనకా చదువుతూనే ఉండేవాడు. ఇష్టాలుండచ్చు కాని, అవి వెర్రిగా ముదిరితే అందర్నీ ఇబ్బందికి గురిచేస్తాయి. ఈయన పుస్తకపఠన పిచ్చిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించి విఫలమైన కుటుంబసభ్యులూ, స్నేహితులూ ఆయనతో “నువ్విలానే చదివితే నీ కళ్ళు పాడైపోతాయి. అప్పడిక నువ్వు పుస్తకం అంటూ చదవలేవు. అందుకనే చదవటం తగ్గించు, లేకపోతే గుడ్డివాడివైపోతావు” అని భయపెట్టారు. అతను ముందు పెద్దగా పట్టించుకోకపోయినా, రాను రాను ఆ భయం అతనిలో పాతుకుపోయింది. “నిజంగా కళ్ళు పోతేనో?!” అన్న ఊహ అతణ్ణి నిలువనివ్వలేదు. దీపముండగానే ఇళ్ళు చక్కదిద్దుకోవాలన్న పద్ధతిని పాటించేసి, కళ్ళుండగానే బ్రెయిలీ లిపి అభ్యసించేసి అందులో ప్రావీణ్యం సాధించాడు. ఇహ, పగలు కళ్ళతో, రాత్రుళ్లు ముసుగు తన్ని బ్రెయిలీ లిపిలోనే యడాపెడా చదవుతూ పోయాడు. తమ ఉపాయం వికటించిందని గ్రహించిన ఇంట్లోవాళ్ళు తలలు పట్టుకున్నారు.
తమాషాకే ఈ కథ అనుకున్నా, పుస్తకాలంటే బోలెడు ఇష్టం ఉన్నా, చదవటంలో ఉన్న సాధకబాధకాలు ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సుబ్బరంగా భోంచేసి, అలా కాసేపు చల్లగాలిలో తిరిగొచ్చి, అరలో ఉన్న ఓ పుస్తకాన్ని తీసుకొని, పడకకూర్చీలో నడుం వాలుస్తూ దాన్ని చదువుకుంటూ నిద్రలోకి జారుకోవడం కోసమే పుస్తకాలనుకుంటే, కొత్త పరికరాలు అక్కరలేదు. ప్రయాణాల్లో, వెయిటింగ్ రూమ్స్ లో పుస్తకాలు ఎక్కువగా అక్కరకు వస్తాయి. జీవితాల్లో నిలకడకన్నా పరుగుపందాలే ముఖ్యమైన ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ పుస్తకాలు (ఈ-పుస్తకాలు) తప్పనిసరైపోయాయి. కాని కంప్యూటర్ స్క్రీన్ మీద చదవాలంటే కళ్ళకి కష్టం. “మీ కళ్ళను అంత శ్రమ పెట్టకోకండి."
కిండిల్ తో సమానంగా, కొన్ని విషయాలలొ కొంచెం ఎక్కువగా, పని చేసే ఇ ఫోన్ అన్ని రకాల పుస్తకాలు చదవడానికి బావుంది. పిడిఎఫ్ ఫార్మాట్ లో తెలుగు పుస్తకాలు చదవడానికి గుడ్ రీడర్ అనే అప్లికేషన్ (ఫ్రీ డౌన్ లోడ్) చక్కగా ఉంది. ఉచితంగా తెలుగు పుస్తకాల కొసం చాలా వెబ్ సైట్లే ఉన్నాయి. ఉదాహరణకు ఉదాహరణకు www.archive.org
ఈ సైట్ చాలా పురాతనమయిన మంచి పుస్తకాల్ని ఉచితంగా అందిస్తోంది. ఆస్వాదించండి.