బాలికల దినోత్సవం.
మేము 8వ తరగతి చదువుతున్నప్పుడని గుర్తు—బాలికల దినోత్సవం అని 3 రోజుల ముందే క్లాసుకు నోటీసు వచ్చింది. బాలికలంతా ఉత్సాహంగా పాల్గోవాలని, వచ్చే 3 రోజులు అనేక కార్యక్రమాలకు ఏర్పాట్లు, తర్ఫీదు, శిక్షణ, రిహార్సల్సు వగైరా ఉంటాయని –కానీ ఇవన్ని కేవలం బాలికలకు మాత్రమేనని మాష్టారు నొక్కి చెప్పారు. మేం మగపిల్లలం గ్రౌండ్ చదును చేసి శుభ్రం చెయ్యడం, క్లాసు రూముల్లోని బెంచీలు, బీరువాలు మోసి బయటపెడితే, ఆడపిల్లలంతా తరగతి గదులన్నీ కడిగి, వరండాలలో ముగ్గులు వెయ్యడం ఒకటే సందడి. మరోపక్క బాలికలకు మాత్రమే వక్తృత్వ, వ్యాసరచన,చిత్రలేఖనం, పాటలు వగైరా పోటీలు జరిగిపోతున్నాయి. మాకు క్లాసులు జరగకపోవడంతో మహా ఆనందంగా ఉంది. ఏవో ఒకటి ఇలాంటి దినోత్సవాలు వస్తుంటే బావుణ్ణుఅనుకుంటూ గ్రౌండుకే ఎక్కువ రోజంతా పరిమితమయ్యాము. పండగ రోజు వచ్చేసింది. మా మష్టార్లంతా హడావుడిగా కార్యక్రమ నిర్వహణలో మునిగిపోయారు. మేము ఇదే సందని గ్రౌండు మీదుగా గోదారి ఏటిగట్టు నుండి లంక వరకు మా ఆటపాటల్నిపొడిగించుకుంటూ పోయాం. మధ్యాహ్నం 3 గంటలకు డ్రిల్లు మాష్టారి ఈలతో, హుంకరింపు హెచ్చరికలతో పరిగెత్తుకుంటూ స్కూలు గ్రౌండు మధ్యకు చేరిపోయాం. ఈ బాలికల దినోత్సవానికి (బహుశా ఇప్పటి మహిళాదినోత్సవం ఇదేననుకుంటాను) ముఖ్య అతిధిగా జిల్లామొత్తం వెదికి అతికష్టం మీద ఒక ప్రభుత్వ మహిళాధికారిని ఆహ్వానించగలిగారు మా హెడ్ మాష్టారు గారు. అప్పట్లో మహిళా ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువే!
సభ ప్రారంభమయ్యింది. తెలుగు మాష్టారి ఆధ్వర్యంలో నలుగురు బాలికల ప్రార్ధనతో ప్రారంభమయి,మా సోషల్ మాష్టారి స్వాగతోపన్యాసం, హెడ్ మాష్టారి సుదీర్ఘ, ముఖ్య అతిధి పొగడ్తలతో నిండిన ఉపన్యాసం అయ్యేటప్పటికి-- మాకు సరే-- బాలికలకు కూడా విసుగు మొదలయ్యింది. అప్పడు అసలు తంతు –బాలికల ఉపన్యాసాలు మొదలు. “ప్రకృతి,పురుషులలో స్త్రీ కి గల ప్రాధాన్యము ఎంతో గలదు.సమాజంలో సగమున్న బాలికలు,మహిళలకు ఎంతో ప్రాదాన్యమున్నది. పురాణకాలము నుండి స్త్రీలకు చాలా గౌరవమిచ్చినారు. దేవుళ్ళను తలచినప్పుడు కూడా మొదట స్త్రీ పేరే పలకడం ఇందుకు తార్కాణము. ఉదాహరణకు – సీతారాములు, పార్వతి పరమేశ్వరులు”—ఇలా ఇలా ఒకరి తరువాత ఒకరు, సామాజికన్యాయ సూత్రాలననుసరించి, ప్రతి తరగతి నుండి ఒక్కొక్కరు చొప్పున ఒకే మూస ఉపన్యాసం అప్పచెప్పుకుపోతున్నారు. మాలో చాలా మందికి అర్ధం అయ్యింది- ఇదంతా మా సోషలు మాష్టారు, హనుమాన్లు గారి తర్ఫీదు/భట్టీయం అని. ఇంకా ముఖ్య అతిధి మాట్లాడాల్సి ఉంది. బహుమతుల పంపకం వగైరా ఆవిడే చెయ్యాల్సి ఉంది. ఇంతలో స్కూలు ఫైనల్ విద్యార్ధి అబ్బిరాజు లేచి, బాలికల దినోత్సవ సందర్భంగా మాకు (బాలురకు) కూడా ఒక చాన్సు ఇస్తే బావుంటుందని అభ్యర్ధించాడు. అబ్బిరాజు సంగతి తెలిసిన మాష్టార్లంతా అయోమయపడి, వాడి మాటను దాటవేయబోయారు. కాని ముఖ్య అతిధి, మహిళాధికారి స్టేజి మీదకు రమ్మని అబ్బిరాజును ఆహ్వానించారు. సభ అంతా నిశ్శబ్దం. మైకు దగ్గర గొంతు సవరించుకొని అబ్బిరాజు మొదటగా, ముఖ్య అతిధికి కృతజ్ఞతలు చెప్పి ఆవిడను ఉదాహరిస్తూ మహిళల ఔదార్యాన్ని,విశాల దృక్పధాన్ని నొక్కి చెప్పాడు. అప్పటివరకు అసహనంతో ఉన్న ఆవిడ చిరుమందహాసంతో కుర్చీలో ముందుకు వంగి శ్రద్ధగా వినసాగారు. “ఇంతవరకు బాలికలంతా ఏవరో చెప్పి భట్టీ వేయించిన పాఠాన్ని ఉపన్యాసంగాచదివారు. పేరు ముందుంటే సరిపెట్టుకునే వీరిని చూసి ఎలా చెప్పాలో అర్ధం కావడం లేడు. ఎప్పుడో పురాణకాలంనాటి ఉదాహరణలు చెప్పారు. అదే మహిళల సమాన స్థాయికి కొలబద్దగా చెప్పుకు వచ్చారు. మరి మనమున్న ఇప్పటి మాట చెప్పుకుందాం. ఇక్కడున్న విద్యార్దుల్ని మీరెవరయినా సంబోధించవలసి వస్తే—బాల బాలికలు అంటారేగాని బాలికాబాలురు అనరు కదా! అందుకే ప్రాధాన్యాలు పిలుపునిబట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలను బట్టి ఉండవని, కృషితో సాధించుకోవాల్సిన హక్కుగా మహిళా ప్రాధాన్యతను, ముఖ్యంగా బాలికలంతా గుర్తించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను”---- సభ అంతా నిశ్శబ్దం—ఎక్కడో బాలుర మధ్యలో మొదలయిన చప్పట్లు సభ అంతా ఆవరించి మార్మ్రోగి, ముఖ్య అతిధి దగ్గర ఆగాయి. ఆవిడ ఇంకాస్త కొనసాగించారు. చివరగా మహిళాధికారి మాట్లాడబోతూ “అందరికి కృతజ్ఞతలు” బహుమతులు రేపు అందరికీ అందచేయ్యండి. నేనూ చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడున్న ఆడపిల్లలకు కూడా చీకటి పడితే ఇబ్బంతౌతుంది”. అని చెప్పి స్టేజి దిగిపోతూ ఒక చుర్రు చూపు సోషల్ మాష్టారు వైపు, ఒక చిరు నవ్వు మా అబ్బిరాజు వైపు విసురుతూ విసురుగా జీపు ఎక్కేశారు. మహిళాధికారి ఎందుకు ముక్తసరిగా మాట్లాడారు? ఆడపిల్లలకు చీకటి పడితే ఇబ్బందౌతుంది అనడంలో ఆవిడ అభద్రతా భావం ఆనాటి పరిస్థితులదా? ఇప్పటికీ ఇంకా ఉందా? అబ్బిరాజు పై విసిరినా చిరునవ్వు, సోషల్ మాష్టారి పై గుర్రు చూపుకి కారణం భట్టీయం చదువులపై చిరాకా? లేక సరిగా తర్ఫీదు ఇవ్వలేదనా? ఆలోచించండి.
రాజా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి