మానవుడు-పరిణామక్రమం, కుటుంబం –సమాజం-సంఘం, ప్రభుత్వం-ప్రజాస్వామ్యం ..... ఇవన్ని చదివినదాన్నిబట్టి అర్థం అయినట్టే ఉంటుంది. మానవుడు ‘అభివృద్ది’ అన్న ఊర్ధ్వ దశవైపుకు వెళ్తున్నాడా? ఆ పేరున అధోలోకాల దారిలో ఉన్నాడా? సర్వమానవ అభివృద్ది, సమాన అవకాశాలు ఏ మాత్రం సాధించలేకపోయాం. కనిసం ఆ దిశలో అయినా పయనిస్తున్నామా అంటే అందరికి అనుమానమే! ఇంక ‘అభివృద్ధి’ అన్న మాటకు అర్థం ఏం ఉంది? వృద్ది జరుగుతూ ఉంది—జనాభా పెరుగుదలలో, కొత్త వస్తువుల ఉత్పత్తిలో, వినిమయం లో, వృధాలో వృద్ది జరుగుతోంది. ఇది కాదనలేని నిజం. దీనినే ‘అభివృద్ది’ అందామా?
ఇలాంటి అభివృద్ది మత్తులో పడి మానవుడు ప్రకృతికి, మనస్సుకి,ఆత్మకి చివరకి తనకు తనే దూరమవుతున్నసూచనలు కనిపిస్తున్నాయి. వికృత చేష్టలు,విపరీత బుద్ధులు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. ఏ మాత్రం కొంచెం విశ్లేషించుకున్నా,మన రోజువారీ పనులలో కనిపించేవి చాల మట్టుకు ఈ వికృత చేష్టలు, ఆలోచనలే!
చెట్టున వికసించి నీరెండలో పిల్లగాలులకు తలలూపే రంగు రంగుల పూలను తెంచి తుంచి గుచ్చి దేవునికి అర్పణ పేరుతో వాడబెట్టేయడం వికృతం కాదా? ఏ లోపం లేకుండా,అన్ని అవయవాలతో పుట్టి, అన్ని అవకాశాలు ఉన్నా--- స్వేచ్ఛ పేరుతో మితి మీరిన విశృంఖలత్వం వైపుకు మొగ్గుతున్న యువతకు ఎవరు బాధ్యులు? సహజసిద్ధమయిన నిర్మలత్వంతో కుసుమించిన ఆ పసిపాపలను, గొప్పదనం పేరుతో, ఎత్తుసంఘం (high society), ఎత్తుగడల సంఘంలోని పెద్దలు,తల్లిదండ్రులు అతిపోకడలతో విషపూరితం చెయ్యడం జరుగుతున్న తీరును విశ్లేషించుకుంటే—అర్ధమయ్యే ఆశ్చర్యమయిన సంగతుల్ని పరిశీలించుకుందాం.
రంగురంగుల పూలను మన స్వార్ధంకోసం గుది గుచ్చిన దండఎలా వాడిపోతోందో?-- భావి పౌరులను మన కోర్కెల కోసం గొప్పలకోసం మూర్ఖత్వంతో సమాజానికి గుది బండగా ఎలా తయారు చేస్తున్నామో?? అహాన్ని పక్కకు పెట్టి ఆలోచిద్దాం.
పెద్ద్దలు సంవత్సరానికోసారి, నల్లదో లేక పసుపుదో వేషం ధరించి చేసిన పాపం భజనలతో సరీ! అని భావించడం ఒక ఎత్తు అయితే-- పిల్లలు ఏ రంగంలో వెనుకబడ్డా, వారిని పూజలు,మొక్కులు, జాతకాల పేరుతో తిప్పి వ్వారి వ్యక్తిత్వాన్ని ఎదుగుదలను, జవాబుదారీతనాన్ని మొత్తంగా తుడిచేస్తుండడం కళ్ళకు కట్టే పచ్చి నిజం. ఆ యువకులకు తమ గురించి, తమ శక్తి సామర్ధ్యాల గురించి అవగాహన, ఆత్మవిశ్లేషణ కలుగకుండా అడ్డుపడి సామర్ధ్యం పెంపు కాకుండా, కానరాని అదృష్టంవైపుకు దృష్టి మళ్ళించడం –వారు మళ్ళి మలితరానికి ఇవే జాడ్యాలను కొనసాగించడం.. బిర్లా మందిరాలు , వీసా దేవుళ్ళు, అత్యాశ ప్రదక్షిణాలు దైవం పట్ల కనీసఅవగాహన ఉన్నవారెవరైనా ప్రోత్సహిస్తారా? మానసిక స్వేచ్ఛ, ఎదుగుదలకు, మనిషి జీవితంలో క్రమానుగత పరివర్తనకు ఇవన్ని ముమ్మాటికి అవరోధాలే. ఆధ్యాత్మికత స్థానంలో ఆడంబరాలు, అసూయా ద్వేషాలు, అల్పగుణాలు తమదైన మూర్ఖత్వంతో రుద్దడమే కాకుండా అదే అసలైన భక్తి భావమనే విపరీత పోకడలకు గురిచేస్తున్నది పెద్దవాళ్ళే. పసుపు కుంకుమ వేపరొట్టలు,జంతుబలులు,చిందులు,శివాలు—పట్టు పీతాంబరాలు, అబిషేకాలు, అగ్నిహోత్రాలు యజ్ఞాలు,యాగాలు—రోడ్డుపై కొబ్బరి కాయలు పగల గొట్టుడు(ఆకలితో ఉన్న వాడు కూడా తినలేని విధంగా), వెంట్రుకల తాళ్ళు, నిమ్మ కాయలు--- సమాజంలోని స్థాయిబేధాన్నిబట్టి పద్ధతి మారొచ్చుగాని- అంతరార్ధం,పరమార్ధం ఒక్కటే! చేసిన తప్పుల్ని పాపాల్ని కడిగేసుకోవడం – మళ్ళి మళ్ళి చేసేందుకు పర్మిట్టు, అర్హతకు కష్టానికి మించిన ఫలితంకోసం అత్యాశ.
మన మీద మనకు ఆత్మ విశ్వాసం పెంపొందించి, సమాజంలో క్రమశిక్షణతో జీవించడానికి తోడ్పడవలసిన దీక్ష,పూజ వంటి ప్రక్రియలు ఇప్పుడు సత్ప్రవర్తనకు ప్రతిబంధకాలుగాను, అన్యాయపు నడవడికలకు అధీకృతచర్యలు గాను పరిణమించాయి. మోటారు సైకిల్కి పూజ చేయించి, నిమ్మకాయ కట్టేసి, జరీ వస్త్రపు ముక్కను హాండిల్ కి కట్టేస్తే – ఇక ఏం ఫర్వా ఉండదు అనే భావనతో అతి వేగంతో వెళ్లడం, ముగ్గురు ఎక్కి నడపడం, నిబంధనల్ని అతిగా అతిక్రమించడం మనం నిత్యం చూస్తున్నాము. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! మైకులతో హోరెత్తించే భజనలు, ఒకరికి మించి మరొకరు దర్పం కోసం చేసే పోటీ దీక్షలు, పవిత్ర స్థలమని ముద్రవేసిన దగ్గరే అశ్లీల నృత్యాలు,రాజకీయుల సౌజన్యాలు, వీటన్నిటికి ప్రచారంకోసం రోడ్లకు అడ్డంగా కట్టే ప్లాస్టిక్ బానర్లు (ఫ్లెక్సీలు ఇప్పుడు బాగా చవక కదా) ఇలా చెప్పుకుంటూ పొతే అంతు దరి లేనంత అరాచకం. ఇవన్ని ఏం పేరు చెప్పిచేస్తున్నాం?.. ఒక్కసారి ఎవరికి వారే ఆలోచిద్దాం.
అందరికీ విద్య అవసరం.-- అది కూడా జ్ఞానాన్నీ, తోటి మనిషి పట్ల గౌరవభావాన్ని, సమాజం పట్ల జవాబుదారీతనాన్ని పెంపొందించగలిగేది అయి ఉండాలే గాని-- గుమాస్తాల్ని బలవంతపు/వరకట్నపు ఇంజనీర్లను గానీ తయారుచేసేది కాకూడదు.- అప్పుడే ఈ రుగ్మతలకు నివారణ సాధ్యం.
రాజా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి